Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 23

తన కనుల ముందే ఆ ఘోర దృశ్యాన్ని చూసిన వీరేష్ లో ఆవేశం పెల్లుబికింది. చట్టుక్కున రివాల్వర్ తీసి స్టెన్ గన్  తో పారిపోతూ వున్న వ్యక్తి వైపు గురిచూసి కాల్చాడు.
గురి తప్పిందో... లేక అతను తప్పించుకున్నాడో కానీ అప్పటికే అతను ఎక్కి వచ్చిన టాక్సీ మెరుపువేగంతో అతనని సమీపించడంతో చట్టుక్కున ఎక్కేశాడు.
వెంటనే తను కూడా కారుని రివర్స్ చేసి రోడ్ మీదకు దూకించాడు వీరేష్.
ఆ టాక్సీ కనిపించనట్టే కనిపించి ఆ ట్రాఫిక్ లో ఎటువైపు వెళ్ళిందో, ఏమయిందో కనిపించకుండా మాయమైపోయింది.
వెంత వెదికినా, ఎన్ని వీధులను చుట్టబెట్టినా ఆ టాక్సీ ఆచూకీ లభించలేదు.
వీరేష్ ను ఎక్కడ లేని నీరసం ఆవరించింది.
తనను ఎవరో చంపబోయారు....
వాళ్ళలో ఒక వ్యక్తిని నోరు తెరిపించి తనను ఎందుకు చంపబోయారో తెలుసుకునే ప్రయత్నాన్ని వమ్ముచేసి అతనని కూడా ప్రత్యర్దులు తెలివిగా మట్టు పెట్టారు.
అసలు ఎవరు వాళ్ళు?
తనపై వాళ్ళు ఎందుకు అంత కక్ష కట్టారు?
అసలు తను అంటే ఎవరకీ విరోధం లేదు.
బహుశా ఇన్ స్పెక్టర్ చతుర్వేదిని చంపిన వాళ్ళే తనను కూడా అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తూ వుండి వుండవచ్చు, అంటే తన దర్యాప్తు వల్ల వాళ్ళ పీకలకు ఉరి బిగుసుకుంటుందని భీతి మొదలైందన్న మాట.
తనకు కావలసింది కూడా అదే__
అప్పుడే ప్రత్యర్దులు ఎవరో తెలిసేది!
ఆవేశంలో అనాలోచితంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలే తనకు ఎప్పుడో ఒక చోట వాళ్ళ బండారాన్ని బట్టబయలు చేస్తాయి.
తనపై హత్యా ప్రేయట్నం జరిగింది కాబట్టి ఇక నుంచి చాలా జాగ్రత్తగా వుండాలి.
జరిగిన సంఘటనే కనులముందు మొదలుతుండడంతో వీరేష్ కు చాలా అనీజీగా అనిపించింది.
ఎలాగయినా తనపై హత్యాప్రయత్నం చేసిన దుండగుల ఆచూకీని సంపాదించాలనే పట్టుదల అతనిలో అధికం అయింది.
స్టీరింగ్ వీల్ చుట్టూ వున్న అతని చేతులపట్టు బిగుసుకుంది.
అంబాసిడర్ వేగంగా పరుగులు దీస్తూనే వుంది.
అంతకన్నా వేగంగా అతని ఆలోచనలు పరిపరివిధాలుగా సాగిపోతున్నాయి.
 
                                          *    *    *    *
హోటల్ అశోకా ఇంటర్ నేషనల్....
సూట్ నంబర్ వన్ నాట్ వన్ లో...
ముగ్గురు వ్యక్తులు ఎదురు చూస్తున్నారు.
వాళ్ళ ముఖాలలో అసహనం తొంగి చూస్తుంది. మాటిమాటికీ చేతివాచీలవేపు చూస్తున్నారు.
అప్పుడు సమయం సరిగ్గా ఏడుగంటలు అవుతుంది.
వాళ్ళు వున్న సూట్ థర్డ్ ప్లోర్ లో కావటంవలన చీకటి వెలుగులలో హైదారాబాదు నగరం ఎలా వుందో స్పష్టంగా కనిపిస్తూ వుంది.
అప్పుడే కాలింగ్ బెల్ మోగింది.
ఆ ముగ్గురూలోనూ టెన్షన్...
లాయర్ సత్యమోహన్ తలుపు తెరుచుకుని లోనికి వచ్చాడు.
అతనని చూడగానే ఆ ముగ్గురి ముఖాలలోనూ చిరునవ్వు చోటు చేసుకుంది.
"సారీ ఫ్రండ్స్... కొంచెం లేట్ అయింది. ఎక్స్ ట్రీమ్ లీ సారీ" సత్యమోహన్ సోఫాలో కూర్చుంటూ అన్నాడు.
"ఫర్వాలేదు సాబ్.... మేము ఈ హోటల్ లో దిగి ఇరవైనాలుగు గంటలు గడిచిపోయాయి. ఇంతవరకూ మీనుంచి ఎలాంటి రిప్లయ్ లేదు సరికదా కనీసం సరుకుకూడా సప్లయ్ కాలేదు.
ఇంకొక అరగంట చూసి వెళ్ళిపోవాలని అనుకుంటుండగా మీరు వచ్చారు" ముగ్గిరిలో ఒకడు అన్నాడు.
"మీరు పెద్ద మొత్తంలో అడిగినందువలన మీరు చెప్పిన సమయానికి రాలేకపోయాను" సత్యమోహన్ సంజాయిషీ ధోరణిలో చెప్పాడు.
"ఇట్స్ అల్ రైట్. ఇప్పుడు జరగవలసింది చూడండి" అన్నాడు రెండవ వ్యక్తి.
సత్యమోహన్ తను తెచ్చిన బ్రీఫ్ కేస్ ని  తెరచి చూపించాడు.
ఫెళఫెళలాడే ఐదువందల రూపాయలనోట్ల బండిల్స్ వరుసగా పేర్చి వున్నాయి. ఒక నోట్లకట్ట తీసి పరిశేలనగా చూసి మెచ్చుకోలుగా తల వూపారు ముగ్గురూ.
"మొత్తం ఇరవైలక్షల కరెన్సీ ఇది... ఐదు లక్షల కాష్ ఇస్తే సరిపోతుంది" అన్నాడు లాయర్ సత్యమోహన్.
ముగ్గురిలో ఒకడు ఐయిదులక్షలు వున్న సూట్ కేసును అందించాడు.
సత్యమోహన్ చెకప్ చేసుకున్నాడు.
'డియర్ ప్రెండ్స్.... ఎప్పుడు మాతో అవసరం కలిగినా ముందు మా కోడ్ నెంబర్ చెప్పి ఓకే అయినా తరువాతనే విషయం చెప్పాలి. లేదంటే మీకు రిప్లయ్ రాదు. అర్దమైందిగా?"
ముగ్గురూ తెలుసు అన్నట్టు తలలు ఊపారు.
సత్యమోహన్ వాళ్ళదగ్గర శలవు తీసుకుని వెళ్ళిపోయాడు....
వాళ్ళ లగేజీ సర్దుకుని సూట్ ఖాళీ చేసే ప్రతత్నంలో వుండగా కాలింగ్ బెల్ మోగింది.
అంతకుముందే వెళ్ళిన సత్యమోహన్ మళ్ళీ వెంటనే ఎందుకు వచ్చాడో అర్ధంకాక తలుపు తెరిచాడు ఒకడు.
మరుక్షణం ఇద్దరు నూతన వ్యక్తులు మెషిన్ గన్స్ తో కారిడార్ లో కనిపించారు.
ద్వారంలో నిలబడి వున్న వ్యక్తి నేలకు ఒరిగిపోయాడు.
అప్పటికే జరిగిన దారుణాన్ని గమనించి గదిలో వున్న ఇద్దరూ హడావిడిగా తమ దగ్గర సిద్దంగా వున్న రివాల్వర్స్ తో కాల్పులు జరిపారు.
మెషిన్ గన్స్ హీరోలలో ఒకడి కంఠంనుంచి రివాల్వర్ బుల్లెట్లు దూసుకుపోవడంతో వెర్రికేక పెట్టి విరుచుకుపడిపోయాడు.
కానీ, అప్పటికే రెండవ మెషిన్ గన్ వ్యక్తి చేతిలో గదిలోని ఇద్దరిలో ఒకడు బలయిపోయాడు. ప్రాణాలతో మిగిలిపోయిన మూడవ వ్యక్తి అక్కడేవుండి మెషిన్ గన్ కు బలయిపోయేకన్నా కలికి బుద్ది చెప్పడం మంచిది అనుకున్నాడో ఏమో నోట్లకట్టలు వున్న బ్రీఫ్ కేసుని అందుకుని బయటకు పరుగుతీశాడు.
లిప్ట్ దగ్గరకు వెళ్ళేసరికి లిప్ట్ ఆపరేషన్ లో వుంది.
ఇక తప్పదు అన్నట్టు  మెట్లవేపు పరుగుతీశాడు అతను.
బరువయిన సూట్ కేసును అలాగే మోసుకుంటూ పడుతూ లేస్తూ పారిపోతూ వున్నఅతనని గమనించి పళ్ళు కొరుక్కుంటూ లిఫ్టుముందు ఆగిపోయాడు మెషిన్ గన్ వ్యక్తి.
అప్పుడే లిప్ట్ తలుపు తెరుచుకుంది.
లోపలవున్న లిప్ట్ బోయ్ విసురుగా  బయటకులాగి అతను లోపల దూరాడు గ్రౌండ్ ప్లోర్ బటన్ ప్రెస్ చేయడం తో లిప్ట్ మీదకు దిగసాగింది.
లిప్ట్ ఆగీ ఆగడంతో మెషిన్ గన్ వ్యక్తి ఒక్క ఉదుటున బయటకు పరుగుతీశాడు. అప్పుడే మెట్ల పైనుంచి వస్తున్న వ్యక్తిని గమనించి చేతిలోని మెషిన్ గన్ అటు తిప్పాడు.
వెర్రిగా అరుచుకుంటూ మెట్లమీదనే కూలిపోయాడు అతను.
నాలుగే నాలుగు అంగలతో అతనని సమీపించిన మెషిన్ గన్ వ్యక్తి ఆశ్చర్యపోయాడు.
చనిపోయిన వ్యక్తి చేతిలో ఉండవలసిన సూట్ కేస్ లేదు. ఏమైందోనని చుట్టూ చూసినా ఎక్కడా కనిపించలేదు. ఖంగారుగా మెట్ల పైకి పరుగుదీసాడు. ఎక్కడా సూట్ కేసు కనిపించలేదు.
అంతలోనే ఆ సూట్ కేస్ ఎలా మాయమైందో అతనికి అర్ధం కాలేదు.
ఈ హోటల్ లో చనిపోయిన వాళ్ళ మనుషులు ఎవరూ లేరు. వున్న ముగ్గురిలో యిద్దరు ఎప్పుడో చచ్చిపోయారు. తన కంటి ఎదురుగా మెట్లు దిగుతున్న వ్యక్తి... కిందకు వచ్చేటప్పటికే ఒట్టి చేతులతో కనిపించాడు. అంటే ఈ మధ్యలోనే ఏదో జరిగి వుండాలి."
ఎక్కువసేపు తను మెషిన్ గన్  తో హోటల్ లో తచ్చాట్లడడం మంచిది కాదు అనుకుంటూ రాకెట్ లా మెట్లు దిగి బయటకు దూసుకుపోయాడు.
ఎవరో పోలీసులకు ఫోన్ చేసినట్టున్నారు... అతని కారు హోటల్ ఆవరణదాటి మెయిన్ రోడ్ పైకి వెళ్ళిన నిమిషంలోనే శరవేగంతో పోలీసు జీప్ హోటల్ లోకి దూసుకు వచ్చింది.
బిలబిల మంటూ లోనికి పోలేసులు వెంటనే అంబులెన్స్ ను తెప్పించి ముగ్గురునీ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే ఎవరూ ప్రాణాలతో లేరని అర్ధం అయింది.
ఏం జరిగిందో హోటల్ సిబ్బందిని, అక్కడి కస్టమర్ల ను అడిగి తెలుసుకుంటున్న ఇన్ స్పెక్టర్ దృష్టి ఆ గదిలోని టీపాయ్ కిందపడివున్న నోట్ల కట్టపై పడింది.
 ఆశ్చర్యంగా ఆ నోట్ల బండిల్ ను చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూశాడు అతను.
కొత్త నోట్లకట్ట అది. అంత నిర్లక్ష్యంగా ఎలా పారవేసుకున్నారో అనుకుంటూ నోట్లను ఫెళఫెళ లాడించడంతో ఏదో అనుమానం వచ్చింది.
ఆ నోట్లను పరిశీలనగా చూడడంతో వాటి అసలు రంగు తేలిపోయింది.
అసలు నోటుకూ, నకిలీనోటుకూ తేడా తెలియనంతగా ముద్రించిన దొంగనోట్ల బండిల్ అది. చనిపోయిన వ్యక్తులు దొంగ నోట్ల వ్యాపారస్తులు అయి వుండాలి. వాళ్ళలో వాళ్ళకు ఏవో గొడవలు వచ్చి కాల్చుకుని చనిపోయి వుండవచ్చు.
మిగిలిన ఒకే ఒకడు పారిపోయే తొందరలో కిందపడిపోయిన బండిల్ ని చూసి వుండడు .
అది దొంగనోట్ల వ్యవహారం అని తెలియడంతో జంటనగరాలలో కౌంటర్ ఫీట్ కరెన్సీ కేసులను ఇన్ వెస్ట్ గేట్ చేస్తున్న ఏసిపి వీరేష్ కు ఈ కేసుని కూడా అప్పగించారు.
తన పరిశోధనకు ఈ హత్యోదంతం ఎంతో ఉపయోగిస్తుంది. అనే నమ్మకంతో అసలు హత్యలు జరగడానికి పూర్వం ఆ గదిలో వున్న వ్యక్తులు ఎక్కడనుండి వచ్చిందీ, ఎందుకు వచ్చిందీ ఎంక్వయిరీ మొదలు పెట్టాడు ఏ.సి.పి. వీరేష్.
   
                                                     *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS