Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 22

    "అయితే ఒకసారి మా యింటిలో కాలుపెట్టి పావనం చేయండి. ప్లీజ్!" అని ఆహ్వానించాడు వాల్మీకి.

    "మీరిద్దరూ మాటలు కలిపేసుకుంటున్నారు. గుడ్ గాడ్! ఈ వంతెన అప్పుడే పాతపడిపోయిందా!?" అంది ఆమని!

    "నువ్వే మా యిద్దరికీ ప్రాణం! నిన్నెలా విడిచి పెట్టుకుంటాం. పద!" అంటూ అమనిని చెరో చెయ్యి పట్టి నడిపించారు. అక్కగారు బావగారు అలా తనను చెరోవంక వుండి నడుపుతూ వుంటే ఎంతో థ్రిల్ ఫీలయిపోయింది ఆమని!

    ఈ జీవితం ఎంత గొప్పది! ఎన్నెన్ని మధుర అనుభవాలకు ఇది నిలయం? ఇలాంటి క్షణాలు జీవితమంతా నిలిచిపోతే ఎంత గొప్ప.

    కాని జీవితం అంటే కాలం ఫ్రీజ్ అవదు.

    అది ప్రవేసించే నదిలా ముందుకుపోతూ ఉంటుంది.

    మధురమయిన క్షణాలను జ్ఞాపకాల పొరల్లో మనిషే ఫ్రీజ్ చేసుకుని నిలబెట్టుకోవాలి! వారి చేతులు గట్టిగా పట్టుకుంది ఆమని!

    మళ్ళీ యువకులు ఎవరూ ఎదురు కాకుండా ప్రక్కదారుల వెంట నడిపించి ఫాంహౌస్ కి తీసుకుపోయాడు వాల్మీకి!

    చాలా అందమయిన యిల్లు! ఊరికి దూరంగా చెట్టు చేమల మధ్య ఏకాంత ప్రదేశంలో హాయి హాయి అనిపించే చోటు.

    ఆర్ధిక విషయాల్లో తరతరాల జమీందారీపాయ కావటం నించి సుమిత్రాదేవి సంపదలతో పోల్చి చూచేందుకు వీలుకాదు. కాని అతను కూడ మంచి సంపన్న వర్గంలోనికి వచ్చేవాడే అని చెప్తోంది ఫాంహౌస్.

    రెండున్నత గంటలు దాటింది.

    పని వారంతా అతని రాకకోసం ఎదురు చూస్తున్నారు.

    వారికి యజమాని పనివారి సంబంధం కాదు.

    బంధు మర్యాదవుంది. వారెవరూ భోజనం చేయలేదు. ఎదురు చూస్తున్నారు.

    "మీరంతా ఇంకా మేలుకుని ఉన్నారేమిటి?" అన్నాడు ఆశ్చర్యంగా!

    మీరు సంవత్సరానికి ఒకసారికూడ రాత్రి యింతసేపు భోజనం చేయకుండా ఉండరు బాబుగారూ! మేము మాత్రము ఎలా తినగలమను కుంటున్నారు. మమ్మల్ని ప్రాణప్రదంగా చూచుకునే మీరు ఆకలితో ఉంటే మేము తిని తొంగోవాలా?" అని ఎదురు ప్రశ్న వేసింది ఓ పనిమనిషి.

    ఆ మాటలువిని ముగ్గురూ నిర్ఘాంత పడిపోయారు.

    వారు భోజనాలకు వెళ్ళేందుకు అనుమతి యిచ్చాడు.

    మరోసారి తాను బయటకు వెడతానని చెప్పి వారిని పంపేశాడు.

    వంటగదిలో కూర్చున్నారు ముగ్గురూ!

    "మీరు పని వారిని అంత ప్రేమగా చూచుకుంటారా?" అంది గాయత్రి!

    "వారు శ్రమిస్తేనే కదా మనం ధనవంతులు కాగలిగేది?" అన్నాడు.

    "ఎంత మంచివారు మీరు?" అందామె. పని వారిని అలా చూచుకోగలిగిన ఆ ఉన్నతుడు భార్యను ఎలా చూచుకుంటాడో ఊహించుకు తన్మయురాలు అయింది గాయత్రి! ఒక తీవ్రమయిన అనుభవాన్ని పొందే మనుషులు మాటాడేందుకు ఇష్టపడరు.

    మౌనంగా ఉండిపోయింది.

    "ఈ లెక్కన చూస్తే నవ్వు చాలా లక్కీవన్ అవుతావు" అంది ఆమని!

    వారు కొంచెం పెరుగు అన్నం కలుపుకుని తిన్నారు.

    వెండి కంచంలో పెరుగు కలిపి తెచ్చింది గాయత్రి!

    మిగిలిన ఇద్దరికీ చేతులతో ముద్దలు అందించింది.

    వెండి కంచంలో పెరుగు చిదిమిన చందమామలా కన్పించింది.

    కంచం కడిగి తెచ్చింది గాయత్రి!

    అతడు వారికి చిన్న చిన్న కానుకలు అందించాడు.మధురమయిన ఆ స్నేహమయ క్షణాలను  జీవితమంతా గుర్తు చేయగల జ్ఞాపికలు.

           
                                  8


    పారిపోయి వచ్చిన చిన్న గేటుమీద చేయి వేయగానే అది తెరుచుకుంది!

    ఇద్దరూ నిర్ఘాంతపడిపోయారు.

    లోపల ఎవరో మనిషి నిలబడి ఎదురు చూస్తున్న జాడ కూడ కన్పించింది.

    గుండెలు పీచుపీచు మన్నాయి. లోపలికి కాలుపెట్టారు.

    "వచ్చారా అమ్మయిగారూ! మీకోసమే కళ్ళు వాచిపోయే లాగ ఎదురు చూస్తూ నిలబడ్డానండి!" అంది వర్ధని.

    "ఈ సంగతి అమ్మగారికి తెలియనివ్వకేం?" అంది ఆమని గోముగా.

    "అలాగా అండి? నేను చెప్పేపని లేదండి! అమ్మగారే మేడదిగి వచ్చి నన్ను ఇక్కడ కాపలా నిలబెట్టారు. మీరు తిరిగివచ్చాక మళ్ళీ గేటు తాళం గట్టిగా బిగించి పైకి రమ్మన్నారు.

    మీరు మరో దొంగతాళంతో గేటు తెరిచారు కదండి!

    అందుకని తాళం మార్చేశారండి! ఇదిగో పెద్ద తాళం" అని వారికి చూపించి చిన్న గేటుకి దాన్ని బిగించింది వర్ధని.

    వారికి మతిపోయినంత పని అయింది.

    ఇంతగా ఈ పని చేయటానికి కారణం అమ్మగారు తొమ్మిదింటికి పడుకుంటే తిరిగి తెల్లవారుఝామున నాలుగు గంటలవరకు గది విడిచి బయటకు రారు అనే బలీయమయిన నమ్మకం ఒక్కటే.

    కాని ఆమె వచ్చేశారు. ఈ వర్ధనిగాని కనిపెట్టి ఆమెకు ఉప్పు అందించిందా? నిద్రలేపి చాడీలు చెప్పిందా? అంత ధైర్యం ఉందా వర్ధనికి.

    ఆమెవంక గుర్రుమని చూస్తోంది ఆమని.

    దిగులు పడిపోయి ఏదో ఉప్పెన ముంచుకు వస్తుందని ముందస్తుగా తెలిస్తే ఆ ప్రమాదానికి ఎదురు చూస్తున్నదానిలా నడుస్తోంది గాయత్రి.

    వారు మేడమీదికి చేరుకున్నారు.

    ఇద్దరి గదులు బయట తాళాలు బిగించి ఉన్నాయి. ఉలిక్కిపడి చూచారు."నా గదికి తాళం వేశావెందుకని?త్వరగా తియ్యి" అని గద్దించింది ఆమని.

    "తీయటం అయితే తీయాలని ఉంది కానండి అమ్మాయిగారూ! అది తీయటం నావల్ల కాదండి! ఎందుకంటే అండి అమ్మాయిగారూ! ఆ తాళం బిగించింది నేను కాదండి, అమ్మగారే! తీస్తే నా ప్రాణం తీస్తానన్నారు"

    అక్కచెల్లెలు ముఖముఖాలు చూచుకున్నారు దిగులుగా.

    చేసింది చిన్న చిలిపి పని అయినా అమ్మగారి దృష్టిలో అది క్షమించరాని నేరమే అవుతుంది అని వారికి తెలుసు. ఇంత పెద్ద తప్పుకు ఆమె విధించే శిక్ష ఏమిటో మాత్రం వారికి తెలియదు.

    "అయితే యిలాగే నిలబడమంటావా?" అని ఉరిమింది ఆమని.

    "నామీద కోపగించుకుంటారేటండి చిన్నమ్మాయిగారూ! చిన్నప్పటినించి ఈ రెండు చేతులమీద ఎత్తి పెంచాను. మీరు ఎక్కువసేపు నిలబడితే నా కాళ్ళు లాగుతాయి అన్నంత ప్రేమగా చూచాను.

    మిమ్మల్ని గదిలోకివెళ్ళి పడుకోమనాలని ఉంది. కాని అమ్మగారి అజ్ఞ మరోరకంగా ఉందండి. మీరు ఏ వేళప్పుడు వచ్చినా ఇలాగే వరండాలో నిలబడి నాలుగున్నరకి వారి గదిలోకి మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోయారండి. ఆరి మాటకు ఎదురు తిరిగితే కుతికలు తెగిపోతాయి కదండి. అందువల్ల తలుపులు తీయటం నావల్ల కాదండి.

    నాలుగున్నరకి వస్తాను, అని చెప్పేసి వెళ్ళిపోయింది వర్ధని.

    తల్లి చేసిన పని ఏమిటో విధించిన శిక్ష ఏమిటో వారు ఇద్దరికి అర్ధం అయిపోయింది కాని ఆ తరువాత ఆమె సమక్షంలో ఎదుర్కొనబోయే తుఫాన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది గాయత్రి.

    ఎవరికోసం ఆగని గడియారం ముల్లు నాలుగున్నర సూచించింది.

    వర్ధని ఎదుట ప్రత్యక్షమయింది.

    నాలుగున్నర దాటిన తరువాయి రెండు నిముషాలు అక్కచెల్లెళ్ళు దిగులు ముఖాలతో వర్ధని ముందు నడవగా తల్లి గదిలోకి ప్రవేశించారు.

    అప్పుడే నిద్రలేచిన సుమిత్ర సింక్ దగ్గర ముఖం తుడుచుకుంటున్నారు.

    అమ్మాయిగార్లు అరగంటసేపటి క్రితం వచ్చారండి అని డ్రైగా వున్న కంఠస్వరంతో నివేదిక అందించి వెళ్ళిపోయింది వర్ధని.

    సుమిత్ర వెనుదిరిగి కూతుళ్ళ వంక చూచింది.

    "మీకు దొంగలదోపిడి చూడాలని అంత కోరికగా వుంటే ముందుగా నాతో చెప్పవచ్చు కదా! బిడ్డల ముచ్చట తీర్చలేని రాక్షసినా నేను? నిన్ను అడిగి అడిగి ప్రయోజనము లేదులే.

    "ఇలా ఎందుకు చేశావమ్మా!" గాయత్రీ నువ్వు చెప్పు" అన్నదామె.

    "అమ్మగారూ నేను మీతో అబద్ధం చెప్పలేను. వాల్మీకిగారిని చూద్దామనీ అతనితో కొంతసేపు స్నేహంగా తిరుగుదామని ఆశపెట్టింది ఆమని! నాకు కూడా ఆ కోరిక వుంది కాబోలు సాహసించి వెళ్ళా క్షమించండి" అంది గాయత్రి.

    ఉలికిపడి చూసింది సుమిత్ర.

    "ఏమిటీ అతన్ని మీరు వెళ్ళి కలిశారా?"

    "అవునండి! వారి ఇంటికి కూడా తీసుకుపోయి చూపించారు. అరగంట క్రితమే జాగ్రత్తగా మన ఇంటిముందు దింపి వెళ్ళిపోయారు"

    "నా ఊహలకి అందనంత ఎత్తుగా ఎదిగావ్ ఆమనీ!" అంది సుమిత్ర.

    "అక్క కోసమే ఇదంతా చేశాను. పెళ్ళికి ముందు వారు కలుసుకుంటే ఒకరినొకరు బాగా అర్ధం చేసుకుంటారని అలా చేశాను. పెళ్ళి చూపులలో అయితే వాతావరణం కృత్రిమంగా వుంటుంది కదా! సరిగా అర్ధం చేసుకునే అవకాశం వుండదు" ముంగిలా బదులిచ్చింది ఆమని.

    సుమిత్రాదేవి గారికి చిన్న కూతురు వాలకం చూచి నవ్వాగలేదు. పకపకా నవ్వి బెడ్ అంచుమీద కూర్చుని ఆమని చేయి పట్టి లాగి ఒడిలో కూర్చోపెట్టుకుని పసిబిడ్డలా ముద్దాడింది.

    "అయితే వారు బాగా అర్ధం చేసుకున్నారా?" అంది మురిపెంగా.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS