Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 23



    "నువ్వే కాదు. ఎందరో మగాళ్లకి!  నన్ను చూడటమే అదృష్టమని నాతో మాట్లాడ్డమే అదృష్టమనీ, అనిపిస్తుంది కదూ?" అందామె.

     "అఫ్ కోర్స్. నీ అందానికి అంతటి శక్తి వుంది!"

    "నా అందానికే కాదు, నా అంతరంగానికీ అంతటి శక్తి వుంది! ఈ రోజు నిన్ను నేను ఇక్కడ ఇలా ఒంటరిగా కలుసుకున్నందుకు నీకు గర్వంగా వుంది కదూ?" అడిగిందామె.

     ఔనన్నట్లు తలూపాడు ప్రశాంత్.

     అంతే!

     మాధురి ఫకాలున నవ్వింది.

     ఒక్కసారిగా విరగబడి, పగలబడి నవ్వింది.

     ఆమె ఎందుకు నవ్వుతుందో అర్దంకాని అయోమయం కన్నా...

    అలా నవ్వుతున్నపుడు బ్రాసరీలో అందంగా కదులుతున్న ఆమె గుండెలతన్ని నిర్వీర్యుణ్ణి చేసాయి.

     చటుక్కున నవ్వు ఆపేసిందామె.

     "ఎందుకానవ్వు?" అన్నాడు ప్రశాంత్ ప్రశాంతంగా.

     "ఆడది కనిపిస్తే మగాళ్లకి ఎక్కడో ఏదో కవాటం తెరుచుకుంటుంది. కొద్దిగా నవ్వితే చాలు గుండె అంగుళం క్రిందికి జారిపోతుంది. కాస్త చనువుగా పలకరిస్తే చాలు భుజాలకి రెక్కలు మొలుస్తాయి. అందుకే నాకు మగ జాతంటే అసహ్యం!" అంది మాధురి తాపీగా.

     షాక్ కొట్టినట్లు కొయ్యబారిపోయాడు ప్రశాంత్.

     "ఇప్పుడు నేనేం చెయ్యబోతున్నానో తెలుసా?" అంది మాధురి.

    అతని నోటినుండి మాట రాలేదు.

     "గట్టిగా అరవబోతున్నాను! భయంకరంగా ఆర్తనాదం చెయయబోతున్నాను!"

     ప్రశాంత్ భృకుటి ముడిపడింది.

     ఒంట్లో నెత్తురు వేగంగా ప్రవహిస్తోంది.

    "నా నీడనైనా తాకలేని నువ్వు - నన్ను ప్రేమించేంతటి వాడివని ఎలా ఊహించుకున్నావ్ మిస్టర్!' అంటూ వ్యంగ్యంగా నవ్వింది.

     "యూ బ్లడీ ఉమెన్!" కసిగా అన్నాడు ప్రశాంత్.

     అతని కణత మీద  నరాలు ఆవేశంతో ఉప్పొంగాయి"

     కానీ ఆమె మళ్లీ గొల్లున నవ్వింది.

     "నా కేక ఎవరికీ వినిపించదని అనుకుంటున్నావలు కదూ? నీకో విషయం తెలుసా? ఈ గెస్ట్ హౌస్ వెనుకవున్న ఆడిటోరియంలో సైన్స్ ఎగ్జిబిషన్ జరుగబోతోంది! అక్కడికి మన క్లాస్ మేట్స్ అందరూ వస్తున్నారు. వాళ్లతో పాటు మన ఇంగ్లీషు లెక్చరర్, వైస్ ప్రిన్స్ పాల్, సైన్స్ లెక్చరర్ కూడా వ స్తున్నారు:-  కాబట్టి ఈ దెబ్బతో నీ చాప్టర్ క్లోజ్!" అంటూ -

    ఒక్క క్షణం ఆగి -

    రెండడుగులు ముందుకి వేసి -

     కెవ్వమని భయంకరంగా ఆర్తనాదం చేసింది మాధురి!!

    ఆమె కేక ఆ గది గోడలను తాకి ప్రతిధ్వనించాయి.

    ఒక్క ఉదుటున ఆమె మీదకి దుమికాడు ప్రశాంత్.

     ఆమె మెడ పట్టుకున్నాడు.

     ఆవేశంతో ఊగిపోతూ పళ్లబిగువున అన్నాడు -

     "ఎందుకు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావ్?" అని -

     కానీ ఆమె జవాబివ్వలేదు.

     ఈసారి మరింత భయంకరంగా, దీనంగా ఆర్ద్రంగా - ఆర్తనాదం చేసింది!!! -

    చెళ్లుమని ఆమె చెంప మీద చాచిపెట్టి కొట్టాడు ప్రశాంత్.

    బైట కలకలం మొదలయ్యింది!

    అతని గుండె ఆగినంత పనయ్యింది!

    కానీ అదే క్షణంలో ఓ విచిత్రం జరిగింది!

     అతను ఊహించలేదు - అలా జరుగుతుందని!!

                12

    హఠాత్తుగా కరెంటుపోయింది.

     అదిరిపడ్డాడు ప్రశాంత్.

     చిమ్మ చీకటి.

     మాధురి ఆయాసంతో రొప్పుతోంది.

     ఆమె మీద నుంచి చెయ్యి తీసెయ్య బోయాడు. కానీ ఆమె చటుక్కున అతని చెయ్యి గట్టిగా పట్టుకొని అరుస్తోంది...

    "ఛీ దుర్మార్గుడా! ఒదులు! నన్నొదులు!!"అని.

     వెర్రికోపం వచ్చింది ప్రశాంత్ కి.

    ఒక్క తోపు తోసాడామెను. దూరంగా పడిపోయింది. అంతలో... ఎవరో ప్రశాంత్ చెయ్యి పట్టుకున్నారు.

     "కమాన్! పద గురూ! ప్రమాదంలో చిక్కుకోబోతున్నావ్!!"అన్నాడెవరో.

     ఆ గొంతు... ఎవరిదో వెంటనే తట్టలేదు.

     యస్... సూరిబాబుది.

     ఇక ఆగలేదు ప్రశాంత్.

     అక్కడ నుంచి వేగంగా కదిలాడు... సూరిబాబు చెయ్యి పట్టుకుని.

     బైట కలకలం ఎక్కువ అయింది. కిటికీ దగ్గరికి నడిచారిద్దరూ.

    "జంప్! క్విక్!!" అన్నాడు సూరిబాబు.

     వెంటనే బైటికి దుమికారు ఇద్దరూ.

     బిల్డింగ్ వెనుకవైపు...

     మొక్కలు గుబురుగా పెరిగి వున్నాయి అక్కడ....

     మెల్లిగా క్రిందకి జారి, జాగ్రత్తగా పాక్కుంటూ... కొంత దూరం వెళ్లాక...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS