ఆ స్పృహలేని స్థితిలోకూడా ఆయన కూతురి వివాహాన్ని గురించే కలువరించసాగాడు "పారూ! ఎంత బాగున్నానమ్మా ఈ పసుపు బట్టల్లో! దగ్గరగా రా తల్లి! కళ్లారా చూచుకోనీ! నువ్వొక్కదానివే వున్నావేమ్మా? అల్లుడేడీ!" ఇలా సాగుతోంది ఆయన దోరణి.
చూడ వచ్చిన వాళ్ళంతా "బిడ్డ పెళ్ళి చేయలేదని ఆయన ఎంత కుమిలి పోతున్నాడో?" అంటూ ఒకరికి ఒకరు చెప్పుకొని నిట్టూర్పు విడవసాగారు. "చచ్చినా ఆయన ఆత్మ కూతుర్ని అంటిపెట్టుకొనే ఉండేలా ఉంది. పాపం! మంచివాడు. ఎవరిజోలికీ వచ్చినవాడు కాదు. పిల్లలకి పాఠాలు చెబితే అరటి పళ్ళు ఒలిచి చేతిలో పెట్టినట్టే ఎలాంటి మొద్దు కుర్రాడైనా ఆయన చేతికి పట్టిస్తే నెలరోజులకల్లా ఒక దారికితెచ్చి వదిలేవారు?"
రెండు రోజులనుండి తిండీ నిద్రా లేకుండా ఏడుస్తూన్న పారిజాత పిచ్చిదానిలా తయారయింది.
"లే. పారూ! ఈపూట అయినా కాస్త ఎంగిలిపడు" లలిత రెక్క పట్టి లాగసాగింది.
"నాకు పెళ్ళి చేయలేదన్న దిగులుతో ఆయన చనిపోతే. ఆయన ఆత్మకు శాంతి ఉంటుందా లలితా?" అమాయకంగా, దీనంగా అడిగింది పారిజాత.
"దానికి నువ్వేం చేస్తావు పారూ? పెళ్ళి నీ చేతిలోదా! నా చేతిలోదా? ఆ ఘడియ వస్తే ఒక్కక్షణం నిలువదు"
"కాదు, లలితా! నే నొప్పుకుంటే గిరిధర్ తో నా పెళ్ళి అయిపోయేది. కూతుర్ని ఓ అయ్య చేతిలో పెట్టానన్న తృప్తితో ఆయన వెళ్ళిపోయేవారు కదూ?"
"ఇప్పుడేం చేస్తావు!"
"నాన్న తృప్తిగా వెళ్ళిపోవడానికి నేనేమైనా చేస్తాను"
"ఏం చేస్తావు? జరిగినదానికి క్షమార్పణ చెప్పుకొని ఆ క్షణంలో గిరిధర్ ప్రక్కన పెళ్లికూతురుగా నిలబడతావా?"
"ఉహుఁ"
"మరి?"
"వెళ్ళి మనూ కాళ్ళు పట్టుకొని తీసుకువస్తాను"
"నీకేమైనా పిచ్చి పట్టిందా ఏమిటి? అతడెందుకు వస్తాడు?"
"మాట నిలుపుకొనే మనిషి అయితే వస్తాడు" పారిజాత లలిత వారిస్తున్నా వినకుండా కోమలమ్మ మేడవైపు సాగిపోయింది.
"మనూ వున్నాడా అత్తా?"
మనూ అట మనూ! వాడేం దీని మేనత్త కొడుకా? లోలోపల మండిపడింది కోమలమ్మ. "ఆఁ వున్నాడు ఎందుకు"
"పైనున్నాడా"
"అవును. అతడితో నీకేం పని?"
ఆమెకు జవాబు చెప్పకుండా మెట్లకేసి గబగబా నడిచింది.
"వాడితో దీనికేం పనో? సిగ్గు శరం లేకపోతే సరి" ఆమెమాటలు లక్ష్యపెట్టే స్థితిలోలేదు పారిజాత. మనోహర్ గదిలో ప్రవేశించి తలుపుమూసి బోల్టు బిగించింది.
వెనుతిరిగి చూచేసరికి మనోహర్ నివ్వెరపాటుతో చూస్తూండడం కనిపించింది పారిజాతకు.
"ఏమిటి, పారూ?"
"నాన్న చివరిక్షణాలలో ఉన్నాడు. నాకు పెళ్ళిచేయలేదన్న చింత ఆయన్ను ఈ మరణ సమయంలోకూడా వదలలేదు. నా పెళ్ళి గురించే కలువరిస్తున్నాడు."
మనోహర్ మౌనంగా పారిజాత ముఖంలోకి చూడసాగాడు.
"నువ్వు పెట్టుకొన్న ముద్దుకు పరిహారం చెల్లించడానికి నువ్వు ఇప్పుడు కూడా తయారుగా ఉన్నావా, మనూ?"
"ఎప్పుడూ తయారుగా ఉంటాను, పారిజాతా? నేను మాట తప్పేమనిషిని కాదు"
"అయితే నాతోరా నన్ను పెళ్ళిచేసుకొంటానని, జీవితంలో నన్ను విడువనని నాన్నతో చెప్పు. ఆయన ఆత్మ శాంతిగా వెళ్లిపోవడానికి ఈ అవకాశం కల్పించు!"
"పారూ!" మనోహర్ ముఖం కోపంతో జేవురించింది "నేను పడిన తొందరపాటుకు పరిహారం చెల్లిస్తానన్న మాట నిజమే! కాని, ఇది అవకాశంగా తీసుకొని ఇంత పెద్ద వరాన్ని కోరడం బాగాలేదు. ఇది అత్యాశ! అందని పండుకు అర్రులు చాచడం!"
