Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 22


    కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టినట్లనిపించింది.

    కెవ్వున కేక వేసి బావను కౌగలించుకుంది దేవదాసి. "పాము!"

    "ఏదీ?"

    "ఇదుగో!"

    కళ్ళు పెద్దవిచేసి చూశాడు భార్గవరామ్. పాములాగే ఏదో నల్లగా కనిపించింది, ఆ మసక వెలుగులో.

    తళుక్కున మెరుపొకటి మెరిసింది.

    "హమ్మయ్య!" బావను వాటేసిన చేతులు సడలాయి.

    "ఇదే రజ్జు సర్పభ్రాంతి!"

    "నాకైతే కదులుతున్నట్లుగా కూడా కనిపించింది. అన్నది ఇంకా కొట్టుకోవడం ఆగని గుండెమీద చేయిపెట్టుకొని.

    ప్రకృతిలో కోటి మణిప్రభలు ఒక్కసారిగా వెలిగినట్లు మరొక మెరుపు!

    ఆ మెరుపులో మరొక మెరుపులా మెరిసింది దేవదాసిమూర్తి. దేవదాసి భుజంమీద చేయివేసి "ఇక వెడదాం, దేవీ!" అన్నాడు.

    "ఉఁ. ఇప్పటికి దయకలిగింది పాపం! మంచి అనుభవమే జీవితంలో మరువను!"

    ఆ చీకటిలోనే ఆవిడ బుంగమూతి ఊహించుకొన్నాడు అతడు. లాలనగా అన్నాడు, "కోపం వచ్చిందా నామీద?"

    "................"

    ఎక్కడినుండో వచ్చి టార్చిలైట్ ఫోకస్ వారిమీద వాలింది.

    "చినబాబూ! చిన్నమ్మా!" ఆ వెంటనే గోవిందస్వామి కేక వినవచ్చింది.జారుతున్న ఒడ్డుమీద అతి జాగ్రత్తగా అడుగులు వేస్తూ వారిని సమీపించాడు. "ఇక్కడికి వచ్చి చిక్కుబడిపోయారా. దేవతమ్మా! ఇంటినుండి మీరు వెడుతున్నప్పుడే సన్న సన్న చినుకులు పడుతూ ఉంటే, బయల్దేరేప్పటికే ప్రొద్దుగ్రుంక వచ్చిందే. వద్దని వారిద్దామనుకొన్నాను. చిన్నపిల్లలు. ఏదో సరదాగా వెడుతూంటే నేనడ్డు పడటమేమిటని ఊరుకుండిపోయాను. ఈ వర్షం మిమ్మిక్కడ కట్టిపడేసిందన్నమాట! పదండమ్మా. బాబూ, ఈ గొడుగు తీసుకోండి. చిన్నమ్మను జాగ్రత్తగా నడిపించుకురండి. వడ్డు జారగలదు!

    "మేం తడిసిన వాళ్ళం ఎలాగా తడిసాం. గొడుగు మీ దగ్గరే ఉండనీండి టార్చి యిలా యివ్వండి. దేవతను నేతీసుకువస్తా, ముందుపదండి మీరు!"

    తోటవైపు ద్వారం తెరిచేఉంది. ఆ దారిలోనే లోనికి ప్రవేశించారు ముగ్గురు.

    మధ్య నడుస్తూన్న భార్గవరామ్ గులాబీపొద చెంత టక్కున ఆగిపోయాడు, టార్చీ వెలుగులో, వర్షానికి రేకులన్నీ రాలి మొండిగా నిలిచిపోయిన గులాబీ పూబొడ్డును చూస్తూ.

    "ఏం చూస్తున్నావు?"

    "సాయంత్రం ఈ పువ్వు ఎంత చక్కగా విరబూచి వున్నది. దేవతా? ఇంతలో ఇంత పతనమా?"

    "ఉఁ. నీకెప్పుడూ పూలూ, పతనాలధ్యాసే. చలేసి చస్తూంటే ఓ వైపు ముందుపద" విసుక్కొన్నది దేవదాసి.

    ఇంట్లోకి వెళ్ళి పడుతూనే తడిజుట్టు తుడుచుకొని. పొడిబట్టలు ధరించి, నుదుట కుంకుమ రాచుకొని కుర్చీలో కూర్చొంది దేవదాసి; వాన ఈ అనుభవాన్ని ఆహ్వానించడంలో ఆంతర్యమేమిటాని ఆశ్చర్యంగా ఉందామెకు.

    అర్ధగంట తరువాత భార్గవరామ్ క్రిందికి వచ్చాడు భోజనానికి.

    "తిన్నావా, దేవతా?" దేవదాసి గదిలోకి వస్తూ ప్రశ్నించాడు.

    "ఉహుఁ"

    అయస్కాంతంచేత ఆకర్షింపబడిన యినుములాగా అతడి చూపులు ఆమెను అతుక్కుపోతున్నాయి.

    సున్నగా దువ్వి జడవేస్తే అదో అందం. తడితొందరగా ఆరాలని అలాగే వదిలేసిన ఆ జుట్టు ముఖంమీదపారాడుతూంటే మరో అందం, ఆ విశాల ఫాలంపై తీర్చిదిద్దే కోలబొట్టు ఆ ముఖంలో విశిష్టమైన సొగసును ప్రోగుచేస్తే, ఉత్తముఖంతో ఉండకూడదని నిర్లక్ష్యంగా రాచుకొన్న ఆ కుంకుమ రేఖ మరోవింత ఆకర్షణను ముఖానికి ప్రసాదించింది!

    క్షణక్షణానికి మితిమీరుతున్న భార్గవరామ్ సౌందర్యారాధనను ఒక్క వ్రేటుతో భగ్నమొందిస్తూ, రెక్కలు రాలిపోతూ బోడిగా, వికృతంగా నిలిచిపోయిన గులాబీపువ్వు బొడ్డు ఆ సౌందర్యరాశి వదనంలో గోచరమైంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS