"ఎలానా?... పత్రికలు ద్వారా రోజూ న్యూస్ పేపర్లలో నీ పేరు పడాలి! అప్పుడు ప్రజలకి నువ్వేం చేసినా చెయ్యకపోయినా నీ పేరు వాళ్ళకి బాగా గుర్తుంటుంది... నీకు పాపులారిటీ పెరిగిపోయింది.
"న్యూస్ పేపర్లలో రోజూ నాపేరు పడాలంటే ఏం చెయ్యాలి?" అమాయకంగా అడిగాడు తింగరయ్య.
"అది అనుభవం మీద ముందు ముందు నీకే తెలుస్తుంది... "పొద్దున్నే సుత్తి"న్యూస్ పేపరు ఎడిటర్ దైవాదీనం నాకు బాగా తెలుసు. అతన్ని నీ దగ్గరి కొచ్చి నిన్ను ఇంటర్య్వూ చేసి నీ గురించి వాళ్ళ పత్రికలో బాగా రాసి మంచి పబ్లిసిటీ ఇవ్వడానికి ఆ పత్రికని ఉపయోగించాకో" అని చెప్పి వెళ్ళిపోయాడు శంకరయ్య.
రెండు రోజుల తరువాత "పొద్దున్నే సుత్తి" ఎడిటర్ దైవాదీనం తింగరయ్య దగ్గరికి ఇంటర్య్వూ చేయడానికి వచ్చాడు.
"మీ తింగూబ పార్టీ ఆశయం ఏమిటి?" అని అడిగాడు దైవాదనం.
"అందరికీ తిండి, గూడు, బట్ట కల్పించడం!..."చెప్పాడు తింగరయ్య.
"తస్సాదియ్యా"పార్టీపై మీ అభిప్రాయం?"
"అదా... చాలా మంచి పార్టీ కదండి... మంచి ఆశయాలున్న పార్టీ...ఆ పార్టీ ప్రెసిడెంట్ చాలా మంచోడు..."అన్నాడు తింగరయ్య.
దైవాదీనం దెబ్బతిన్నట్టుగా చూశాడు. ఆ తరువాత తింగరయ్య మూతి వాసన చూశాడు.
"ఎందుకలా నా మూతి వాసన చూస్తున్నారు?" అయోమయంగా అడిగాడు తింగరయ్య.
"మందేమైనా వేస్కున్నారేమోనని?...
"లేదే!?...ఎందుకలా అడుగుతున్నారు?!" ఆశ్చర్యంగా అడిగాడు.
"లేకపోతే ఏంటి?... మీరు ఆ మాటలు నీజంగానే అన్నారా?"
"అవునండీ... సత్య ప్రమాణకంగా అన్నాను... తస్సాదియ్యా పార్టీ ప్రెసిడెంటు చాలా మంచోడు..." అన్నాడు.
దైవాదీనం ఘొల్లుమని నవ్వాడు.
"ఊ... బానే ఉంది వర్స!మరి మన ముఖ్యమంత్రి గురించీ మీ అభిప్రాయం చెప్తారా?" అన్నాడు నవ్వుని బిగబట్టి.
"ఆయనకేంటండి...చాలా మంచి మనిషి! ఆయన మంచి ఎడ్మినిస్ట్రేటర్... ఆయనుండబట్టే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయ్..." అన్నాడు తింగరయ్య హుషారుగా.
అంతే!... దైవాదీనం ఇహ తట్టుకోలేకపోయాడు.కిందపడి పొర్లి పొర్లి నవ్వాడు.
"హ్మ... హయ్యో... హబ్బ..."అంటూ ఆయసపడ్తూ లేచాడు.
తింగరయ్యకి దైవాదీనం ఎందుకలా నవ్వడో తెలీలేదు.
"మీ తరువాతి ప్రశ్నేంటో చెప్పండి..."అన్నాడు అయోమయంగా చూస్తూ.
"ఇంకే అడుగుతాను నా బొంద.ఏదో నా ఫ్రెండు శంకరయ్య చెప్తే మీ దగ్గరికొచ్చాను. మీకు, మీ పార్టీకి బాగానే పబ్లిసిటీ ఇద్దామని అనుకున్నాను.కానీ మీ సమాధానలు చూస్తూంటే ఏమీ లాభం లేదనిపిస్తుంది...మీ గురించి మీరు చేసే వ్యాఖ్యల గురించీ మా'పొద్దున్నే సుత్తి'లో గనుక రాస్తే నేనెందుకూ పనికిరాని ఎడిటర్నని అనుకుంటారు అందరూ... మీరు రాజకీయాలకి పనికిరారు సార్.." అన్జెప్పి వెళ్ళిపోయాడు దైవాదీనం.
ఆ మర్నాడు శంకరయ్య ఫోన్ చేసి తింగరయ్యని తిట్టాడు.
"ఏంటి దైవాదీనం ఇంటర్య్వూ చేస్తే వాడ్ని వీడ్ని ఆ పార్టీనీ ఈ పార్టీని పొగిడావట!రాజకీయాల్లో ప్రవేశించినవాడికుండాల్సిన లక్షణం ఇదేనా... బాగా తిట్టడం నేర్చుకో... అప్పుడు పైకొస్తావ్...మళ్ళీ దైవదీనంని నీ దగ్గరికి పంపిస్తాను...ఈసారి వాడ్ని వీడ్ని తిట్టు,తెల్సిందా?... అని ఫోన్ పెట్టేశాడు.
రెండు మూడు రోజుల తరువాత మళ్ళీ దైవాదీనం వచ్చాడు.
"ఊ...ఇప్పుడు చెప్పండి..తస్సాదియ్యా పార్టీ గురించి మీ అభిప్రాయం?" అని అడిగాడు చిరునవ్వుతో.
"అదో దిక్కుమాలిన పార్టీ!..."అన్నాడు హుషారుగా తింగరయ్య.
"ఇది తిట్టడమా?..."నవ్వు నాపుకుంటూ అడిగాడు దైవాదీనం.
"దిక్కుమాలిన పార్టీ అంటే తిట్టడమే కదండి?..."ఆశ్చర్యంగా అడిగాడు.
"సరే... సరే... నా ఖర్మ... మరో ప్రశ్న... తస్సాదియ్యా పార్టీ ప్రెసిడెంటు గురించి మీ అభిప్రాయం?...
"ఆయన నీతి నిజాయితీ లేని మనిషండి..."
"ఇదీ తిట్టడమేనా?... నవ్వునాపుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగాడు.
"నీతి నిజాయితీ లేనివాడంటే ఘాటుగా విమర్శించడమే కదండీ... అమాయకంగా అడిగాడు.
"ఊ...ఊ... మన ముఖ్యమంత్రి ఆ పదవికి అర్హుడేనా?" దైవాదీనం చిర్నవ్వుతో ప్రశ్నించాడు.
"కాదనుకుంటానండి..."అన్నాడు.
అంతే... నవ్వు పట్టలేక గిలగిల్లాడిపోయాడు దైవాదీనం.
"మీ మొహం మండా... ఎందుకండీ ఆయన్నలా బాధపెడ్తారు... చూడండి నవ్వలేక ఎలా గిలగిల్లాడిపోతున్నాడో!!..."భర్తతో అంది శాంతమ్మ దైవాదీనం వంక జాలిగా చూస్తూ.
"హ్మ... హబ్బ... హయ్యో... హిహి... భలే... హ... హి... ఏం సమాధానాలండి... హిహి... నేనిహ వస్తా... ఇంకా బాగా తిట్టడం వచ్చాక నన్ను పిలవండి..."అని ఆయాసపడ్తూ వెళ్ళిపోయాడు దైవాదీనం.
తింగరయ్య డంగైపోయాడు.
"అయితే ఈ మాత్రం తిట్టడం చాల్దన్నమాట!..."అని ఆశ్చర్యపోయాడు.
ఆ రాత్రంతా బాగా ఆలోచించి మర్నాడు దైవాదీనానికి ఫోన్ చేసి ఈసారి నేన్రెడి అన్నాడు.
దైవాదీనం మళ్ళీ తింగరయ్య దగ్గరికి వచ్చాడు.
"ఊ... చెప్పండి..."
"మన ముఖ్యమంత్రిని పుట్ బాల్ లా తంతే అమలాపురంలో పడ్తాడు... తస్సాదియ్యా పార్టీ ప్రెసిడెంటు పంది... అద్దిరబన్నా పార్టీ కార్యకర్తలు కుక్కలు..." అని స్టేట్ మెంటిచ్చి కళ్ళెగురవేసి ఎలాగుంది నా పస అన్నట్టు దైవాదీనం వంక చూశాడు.
'ఊ... నేననుకుంటూనే ఉన్నా... ఇంతకన్నా మీకు రాదని... ఇట్టాగైతే మీరు పాపులరైనట్టే!! ఈ మాత్రం ఈ రోజుల్లో ప్రతి ఒక్కడూ తిడ్తున్నాడు"అని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు.
తింగరయ్యకి పిచ్చెక్కిపోయింది...
ఇంకెలా తిట్టాలి?!!...
ఆలోచించి ఆలోచించి అతని బుర్ర వేడెక్కిపోయింది.
అలా ఆలోచిస్తుండగా అతని గదిలోకి పనిమనిషికి సీతాలు వచ్చింది.
తింగరయ్యకి హఠాత్తుగా మాంచి ఆలోచన తట్టింది. అలా ఆలోచన తట్టడమే తరువాయి ఇలా సీతాలు పైట లటుక్కున పట్టుకుని లాగాడు.
అంతే... సీతాలు రామాయణం ఎత్తుకుంది.
"ఏంట్రోయ్... ఇన్నాళ్ళు నాయకుడివనీ పెద్ద మడిసివనీ అనుకున్నాగానీ ఇలాంటి కొవ్వెక్కినోడివని అనుకోలేదు... దొంగ లం... నీ... నీ... నీ... అని బండ బూతులు తిట్టింది.
దాని తిట్లు వింటుంటే తింగరయ్యకి చచ్చేంత సంబరం వేసింది. అది తిడ్తున్నంతసేపు హిహి... హిహి... హిహి... అని నవ్వుతూనే ఉన్నాడు.
