హెడ్ మాష్టారయితే ప్రత్యేకంగా తనను అభినందించటానికి వచ్చి అన్నారు.
"నీ నటనలో విజయశాంతి కనిపించింది. నీ అందంలో సుహాసిని కనిపించింది....సంభాషణలు చెప్పే రీతి జయసుధను గుర్తు చేసింది....యిన్ని సంవత్సరాలనుంచి మన స్కూలు యానివర్సిడేకి ఎన్నో నాటకాలు ప్రదర్శించాం గాని యింత సూపర్బ్ అయినా నాటకం ప్రదర్శించటం ఇదే మొదటిసారి! మన స్కూలుకే మంచి పేరు తెచ్చిన ప్రఖ్యాతనట శిరోమణివి!" అని భుజం తట్టి అభినందించారు.
అందరి పొగడ్తలూ విన్న సుబ్బులుకి ముఖం జేవురించినట్లయింది అందరూ వెళ్ళిపోయినా తర్వాత వంటరిగా వుండటం చూసి అమాంతం కౌగిలించుకుని గిర గిరా తిప్పేసింది. ఎంత వద్దన్నా వినలేదు.
"ఇంతమంది యిన్ని అభినందనలు వెదజల్లుతుంటే బెల్లం కొట్టినరాయిలా అలా వుండిపోతావేమిటి?" అనడిగింది.
"ఏమనాలి?..." అర్ధంకాక అడిగింది.
"మీ ఆశీస్సులుని నిజం చేస్తాను. నేను త్వరలోనే సినీ రంగం లోకి కాలూన బోతున్నాని చెప్పి వుండవలసింది."
"అమ్మో నేనిలా అన్నానని మా అమ్మ నాన్నకి తెలిస్తే?....రేపటినుంచి నన్ను "సినీతార! అని కథానాయకి" అని పేర్లు పెట్టి పిలిస్తే నా పరువు ఏమయినా వుంటుందా!"
"వుండక ఎక్కడికి పోతుంది? యింకా పెరుగుతుందే గాని తగ్గదు. నువ్వు గొప్ప సినీ తారవయిపోతావని నేను చెప్పిన జోస్యం ఫలించాలంటే ముందడుగువేసి చూడు."
కావేరీని చూడగానే తిరిగి తన తిట్ల వర్షం మొదలు పెట్టింది. అయినా ఏం మాట్లాడలేదు! పాల కోసం ఇంకాసేపు నిలబడాలనుకుంది గాని తల్లి అగ్గిమీద గుగ్గిలం అయిపోవటంతో ఇంకా అక్కడ వుండకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. అయినా తల్లి తిట్లు వినిపించుతూనే వున్నాయి....కోపం వచ్చేసింది కావేరీకి.
అర్ధం లేకుండా తిడుతున్న తల్లిని మనసులోనే అసహ్యించుకుంది. పట్టుదల కూడా పెరగజొచ్చినది.
"ఇంకా సరిపెట్టు! వినాయకం వచ్చాడు."
అన్న తండ్రిమాటలు వినిపించిన కావేరి తల ఎత్తి చూసేసరికి గది గుమ్మంలో నిలబడివున్నాడు.
"ఆ తిట్టేది ఎవరో కాదుగా? మీ అమ్మే కదా? ఊరుకో."
లోపలికి వెళ్ళి చనువుగా కావేరి చేతిలోని పమిటి చెంగుని తీసేసి కళ్ళు తను తుడిచాడు వినాయకం.
"ఇలా తిడుతుంటే ఎవరు పడతారేమిటి?" వినాయకం బ్రతిమాలే సరికి మరింత ఏడుపు ఎక్కువయింది కావేరీలో!
"నేను నాటకంలో వేషం వేస్తున్నానని యింట్లో ఎందుకున్ చెప్పలేదూ?"
"చెప్పితే వేయనిస్తుందా అమ్మ? అమ్మ వేయనీయదు. అసలు స్కూలుకే వెళ్ళనివ్వదు! నాకు యిష్టమయింది. నేను నటించాను. అదేదో తప్పయిపోయినట్లు తిడుతోంది అమ్మ" దుఃఖంతో కావేరి గుండెలు ఎగసి పడుతున్నాయి.
"కావేరీ ఎంత పని చేసిందో చూశావా వినాయకరావూ?" అంటూ వచ్చింది సుభద్రమ్మ అక్కడికి.
"కావేరి ఏదో తప్పు చేసిందని ఎందుకు అనుకోవాలి అత్తయ్యా? తనేదో సరదాపడి చేసిందనుకో. అంత మాత్రానికే తిట్టాలా?"
"నువ్వు మేనల్లుడిని కాబట్టి నీకేమీ తప్పు అనిపించక పోవచ్చును. మరొకరయితే కావేరీని చేసుకోము అని ఈ సరికే కబురు చేసి వుండే వారు....దాన్నలా వెనుక వేసుకుని వస్తున్నావు కాబట్టి ఇవ్వాళ్ళేదో మేము పడతాము బాధలు! రేపు నీ సంగతి చూసుకో వినాయకం." అంది సుభద్రమ్మా.
తల్లి అలా అనే సరికి కావేరికి బుస్సున కోపం పొంగి పొరలి పోయింది. తల్లేనా యిలా మాట్లాడేది?
"నేనెన్ని బాధలు తెచ్చిపెట్టానమ్మా? ఎంత పరువు పోగొట్టుకున్నావు?" తల్లి వైపు తీక్షణంగా చూస్తూ అడిగింది కావేరి.
"రాత్రి నువ్వు చేసినా పని చాలు! నలుగురూ హేళనగా చెప్పుకుంటే అంతకంటే పరువు తక్కువ ఏం కావాలి? అన్ని షరతులకీ వప్పుకునే నువ్వు స్కూలుకి వెళుతున్నావన్న సంగతి మర్చిపోయావు! ఇంక చదువు లేదు! చట్టుబండలూ లేదు! చదివినది చాలే! ఇంకెందుకు మా పరువు తీస్తావుగానీ! యింట్లో కూర్చో" అంతే విసురుతో వెళ్ళిపోయింది సుభద్రమ్మ. బేలగావినాయకం వైపుకి చూసింది.
"కోపంలో అత్తయ్య అలానే అంటుంది. వాటినేమీ నువ్వు పట్టించుకోవద్దు! నీకేం కావలసినా నాకు చెప్పు తెచ్చి పెడతాను...సినిమా పత్రికలు కూడా తెస్తాను...యింక ఏడవకు!" కావేరి గెడ్డం పట్టుకుని బ్రతిమాలి నచ్చచెప్పసాగాడు వినాయకం!...
అయినా కావేరీలో దుఃఖం ఆగలేదు...తల్లిమీద పీకలవరకూ కోపం వచ్చింది.
"ఏమిటీ? ఆలోచించుచున్నావు?" అనడిగాడు వినాయకరావు.
"నువ్వెంత మంచివాడివోనని!"
"నా మంచిని నువ్వు తప్ప యింకెవ్వరూ మెచ్చుకోరులే!...లే! లేచి ముఖం కడుక్కునిరా? ఏడవటం వలన ఎలా జేవురించి పోయింది" కావేరీని బలవంతంగా మంచంమీదనుంచి లేపి బైటికి తీసుకువచ్చాడు. అది చూసిన సుభద్రమ్మ అంది.
"మేనమామ కూతురని గారాబం పెట్టావంటే? యింక నీ మాట కూడా వినదు! ఆ తరువాత నన్ను అంటే ఊరుకొను వినాయకం!"
"నిన్ను గారాబంపెట్టి నెత్తిన ఎక్కించుకున్నాను...మేనమామ కూతురివేగా?...దిగమంటే దిగుతున్నావా? మీ అమ్మ నాన్నని ఏమయినా అన్నానా?..." పరంధామయ్య అన్నాడు.
సుభద్రమ్మతోపాటు అందరికీ నవ్వు వచ్చింది. అంతవరకూ విషాదంగా వున్న వాతావరణం, నిప్పులు కురిసే వాతావరణం నవ్వులుతో హాస్యోక్తులతో చల్లపడిపోయింది. అందరి మనసులూ తేలిక అయ్యాయి. కులాసా కబుర్లతో కాలక్షేపం చేశారు. కావేరితోపాటు వినాయకరావుకి పాలగ్లాసు యిచ్చింది సుభద్రమ్మ.
"ఇంత ఉదయమే వచ్చావేమిటి వినాయకం?" అనడిగాడు పరంధామయ్య తను చేస్తున్నపని ఆస్తి.
"అమ్మ పూజారిగారిని పిలుచుకుని రమ్మంటే బయలుదేరాను. అత్తయ్య కేకలు వీధిలోకి వినపడుతుంటే ఏమిటోనని వచ్చాను."
"నేనూ వెళదామనుకుంటున్నాను పూజారిగారి దగ్గరకు! లగ్నం పెట్టేటందుకు మంచిరోజు కూడా చూసుకోవాలిగా? పద! నేనూ వస్తాను!" అని బావిదగ్గిరకు వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కోసాగాడు పరంధామయ్య.
కావేరీని యింకేమీ అనవద్దని అత్తకి చెప్పి బైటికి వెళ్ళిపోయాడు వినాయకం.
లగ్నం అన్న మాట వినేసరికి కావేరీకి గుండెల్లో గుబులు కలిగింది. పెళ్ళి చేసుకుంటే మేనత్త నాలుగుగోడల మధ్యా బంధించి వుంచుతుంది? ఆఖరికి సినిమాకి కూడా వెళ్ళనివ్వదు!...ఆమెని కూర్చోబెట్టి తను యింటిపనంతా చేయాలి? ఎవరితోనూ మాట్లాడకూడదు. ఎవరింటికీ వెళ్ళకూడదు! బావతో కాపురం చేయాలి! పిల్లల్ని కనాలి!...తను పెళ్ళి అనే బంధంలో యిరుక్కుపోతే తన కోరిక తీరేది ఎప్పుడు? అసలు తీరుతుందా?...యింక ఈ మారుమూల పల్లెటూరికి అంకితం అయిపోవలసిందేనా? తనకి ఎంతమంది ప్రశంసలు అందచేశారు?
తీవ్రాలోచనలో మునిగిపోయింది!...
