"అయితే - ఆ గది అటుపక్క నున్న మరో తలుపులోంచి ఎవరో అతని గదిలోకి వెళ్లుంటారు." మనసులో అనుకుందామని బయటికే అనేశాడు రాజారామ్.
ఆఫీసు బాయ్ అతన్నే చూస్తూ ఉండిపోయాడు. రాజారామ్ ముందుకు నడిచాడు. చీఫ్ సబ్ జనార్ధన్ గుంపులోంచి బయటికి వచ్చి రాజారామ్ ని పలకరించాడు.
"ఏం జరిగింది సార్?"
"అప్పారావుని ఎవరో చంపేశారు. బ్రాస్ ప్లవర్ వేజ్ తో అతని నెత్తిమీద కొట్టారు."
జనార్ధన్ నమ్మలేనట్టు చూశాడు.
"నిజమే...నీ పని కానీ..."అంటూ తన సీటు వేపు నడిచాడు. మధ్యలో రాజేశ్వరి సీటు దగ్గర ఆగాడు. అతని మొహంలోకి చూస్తూనే ఏదో జరగకూడనిది జరిగి ఉంటుందనిపించింది ఆమెకి. ఆమె అడగకుండానే జరిగిందంతా చెప్పాడు రాజారామ్. అంతలో రమణితో కబుర్లు చెప్తున్న భవానీ ఇటు చూసింది. రమ్మని సైగ చేసింది రాజేశ్వరి. సంగతి వినగానే భవానీ అప్పారావు గది వేపు చూసింది.
"సరే...మీరు రమణిని చూస్తూ ఉండండి. నేను మహావీర్ గారి దగ్గరికి వెళ్తాను." అంటూ చక చక అటు నడిచింది.
0 0 0
సాయంత్రం అయిదు గంటలయింది. లంచ్ రూంలో రాజారామ్, రాజేశ్వరి, రమణి కూర్చున్నారు.
అప్పుడే వచ్చిన మహావీర్, భవాని మౌనంగా వాళ్ళ ముందు కూర్చున్నారు.
"మా పోలీస్ ఫోర్సంతా మీ ఆఫీసులోనే ఉంది. ఈ కేసుని కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇన్ స్పెక్టర్ దుర్గారావు చూస్తారట. విజయనగర్ కాలనీలో సుమిత్ర హత్యకీ దీనికీ సంబంధం లేదు పొమ్మంటున్నాడు....ఆయన!" అంటూ మహావీర్ నిట్టూర్చాడు.
"మరా చెవి రింగు సంగతేమిటి?"
"ఏం చెప్పినా వినడం లేదాయన ఇకపోతే మీ ఎం . డి, విరించిగారు- మీ గురించీ అప్పారావు గురించి ఏదేదో చెప్తూ దుర్గారావుని ఊదరగొట్టేస్తున్నాడు."
అంతలో భవాని లేచింది. "రమణి బాగా అలసిపోయింది. తనని తీసుకుని నేను మీ ఇంటికి వెళ్తా" అంటూ రమణిని చూసి చెయ్యి అందించింది.
లిఫ్టు వేపు వెళ్తున్న ఇద్దర్నీ చూస్తూ "రాజారామ్ గారు నేను మళ్ళీ అక్కడికి వెళ్తాను. దుర్గారావు ఆలోచన తప్పని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను" అన్నాడు మహావీర్.
"ఇంతకీ ఆయన ఆలోచన ఏమిటి?"
"ఆయన ఆలోచన ప్రకారం చూస్తే- మీరు రైలు పట్టాల మధ్య నిలబడి ఉన్నారు. ..మీకు ఫర్లాంగు దూరంలో గంటకి వెయ్యి మైళ్ళ వేగంతో వస్తున్న డీసెల్ ఇంజన్ ఉంది!" అంటూ నవ్వాడు.
"అంటే?" అంది రాజేశ్వరి.
"రాజారామ్, అప్పారావూ, ఘర్షణ పడ్డారు. ఈవేళ ఉదయం నుంచీ ఇప్పటి వరకూ అప్పారావు గదిలోకి వెళ్ళింది ఒక్క రాజారామ్ గారే! రాజారామ్ గారు తనకొస్తుందనుకున్న ప్రమోషన్ అప్పారావు కొట్టేశాడు. అప్పారావు తెలివి తేటలూ, చొరవా రాజారామ్ గారికి లేవు. ప్రమోషన్ సంపాదించనందుకు అతనంటే ఈయనకి జెలసీ!! అదీ దుర్గారావు కథ. అఫ్ కోర్స్ మీరేం వర్రీ కాకండి. ఆయన కథలో నేను మలుపులు ప్రవేశపెడ్తాను." అంటూ మహావీర్ లేచాడు. మేనేజింగ్ డైరెక్టర్ చాంబర్స్ వేపు నడిచాడు.
రాజారామ్, రాజేశ్వరి మౌనంగా ఉండిపోయారు.
అలా ఓ అయిదు నిమిషాలు.
"రమణిని నేను బేబీస్ యూనివర్స్ కి ఇవాళ తీసుకువెళ్ళకుండా ఉంటె బాగుండేదేమో....ఒక వేళ వెళ్ళినా జాగ్రత్తగా ఉంది ఉండాల్సింది...ఇదంతా నావల్లే జరిగింది." అంది రాజేశ్వరి.
"ఇందులో ఎవరి తప్పూ లేదు. జరగాల్సింది జరిగింది. అంతే!" అన్నాడు రాజారామ్. అంటూ ఆమెని చూశాడు.
రాజేశ్వరి కళ్ళలో నీళ్ళు.
దగ్గరికి వెళ్ళి ఆమె భుజంమీద చెయ్యివేశాడు. మరోచేత్తో ఆమె బుగ్గని మృదువుగా రాశాడు. ఆమెనలా చూస్తోంటే తన ఒంటరితనం పారిపోతునట్టు అన్పించింది. అండగా కొండంత శక్తి ఉన్నట్టు సంతృప్తి, ఆమెని గట్టిగా తన గుండెలకి అదుముకుని, బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు.
రాజేశ్వరి నెమ్మదిగా అతని బంధం నుంచి బయటపడింది.
"దగ్గరగా వద్దామనుకుంటూ ఉంటె-దూరంగా అయిపోతున్నావేం?"
"ఎందుకనా? నేనో పెద్ద ఫూల్ ని. అందుకు 'ఆంధ్రా టైమ్స్' అసిస్టెంట్ ఎడిటర్ గారూ, మీ కోసం పెద్ద న్యూస్ స్టోరీ వెయిట్ చేస్తుంది. వెంటనే వెళ్ళి పాపం, దాని సంగతి చూడండి!" అంది రాజేశ్వరి నవ్వుతూ.
0 0 0
డెస్క్ రూంవేపు నడిచాడు రాజారామ్. అప్పారావు గది లోపల పోలీసులు, గది ముందు పోలీసులు, ఫోటో గ్రాఫర్లు, వేలి ముద్రల నిపుణులు బిలబిలలాడ్తూ తిరుగుతున్నారు.
డెస్క్ రూంకి వెళ్ళాడో లేదో, ఒక ఆఫీస్ బాయ్ వచ్చి 'ఎండీ' గారు రమ్మన్నారని కబురు చెప్పాడు. రాజారామ్ వెళ్ళేసరికి ఎండీ విరించి తన రివాల్వింగ్ చెయిర్లో వెనక్కివాలి ఏదో దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో ఇన్ స్పెక్టలిద్దరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళకి కొంత దూరంలో ఏర్ కండిషనర్ దగ్గరగా చైర్మన్ రాజభూషణరావు ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తున్నారు.
"మనం అంతా కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందని ఇన్ స్పెక్టర్ దుర్గారావు గారూ సజెస్ట్ చేశారు. ఎందుకంటే మన పేపర్ ప్రతిష్ట ఒకటి చూసుకోవాలి!" అన్నాడు విరించి - రాజారామ్ వేపు చూడకుండా.
దుర్గారావు లేచి నిలబడ్డాడు. "ఆంధ్రా టైమ్స్ ఇమేజ్ దెబ్బతినే పని చేయడం మాకు ఇష్టంలేదు. కాని మీ పరిస్థితి....ఎన్నో అనుమానాలను ఆస్కారం కలిగించేదిగా ఉంది రాజారామ్ గారూ!" అన్నాడు రాజారామ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ. "అప్పారావుని బతికి ఉండగా ఆఖరుసారి మీరే చూశారు. మీరతన్ని కొట్టారు. మీరేమంటారు?"
"అవును కొట్టాను."
"ఆయన్ని మీరు కొట్టి, బయటికి వచ్చిన తరువాత ఎవరూ ఆయన గదిలోకి వెళ్ళలేదు!"
"ఆ గదికి వెనకనుంచి మరొక తలుపు ఉంది. దానికి ఆటోమాటిక్ లాక్ ఉంది. బయటనుంచీ లోపలనుంచీ కూడా ఆ తలుపుని తెరవ్వొచ్చు...." అన్నాడు రాజారామ్.
"మీరు ఎక్స్ పెక్ట్ చేసిన ప్రమోషన్ ఆయనకీ వచ్చింది. ఈ విషయం ఒక్కటే కాక, ఎన్నో సందర్బాల్లో మీరాయనతో గొడవపడ్డారు. అవునా? కాదా?"
