Previous Page Next Page 
దేవదాసు పేజి 22

    "ఎందుకు? ఏమిటి సంగతి?" అన్నాడు మహేంద్రుడు.
    "దాసదాసీలందరికీ తెలుసు. నీకే తెలియదన్నమాట? మామయ్య గారికి మీ కొత్త అమ్మ అంటే ప్రాణం. ఆయన ఆమెనేమీ అనడు. నీవయినా ఆమెతో చెప్పడం బాగుంటుందికదా?"
    మహేంద్రునికి విషయం అర్ధంకాలేదు. "ఎవరి సంగతి నీవు చెప్పేదీ?" అని ఉత్కంఠంతో అడిగాడు.
    జలదబాల గాంభీర్యంగా భర్తకు సలహా యిస్తూ వుంది_"నీ కొత్తమ్మకు పిల్లా జల్లా ఎవరూ లేరు. ఆమెకు కుటుంబం మీద ప్రేమ ఎందుకు వుంటుంది? చూడటంలేదా, అంతా ఎగరగొడుతూ వుంది."
    మహేంద్రుడు భ్రుకుటి ముడిచి "ఎందుకు, ఎట్లా?" అన్నాడు.
    "నీకు కళ్ళుంటే చూసేవాడివి. ఇప్పుడు ఇంటి ఖర్చు రెట్టింపు అయింది. నిత్యం వ్రతాలూ, పూజలూ, దాన-ధర్మాలూ, అతిథులూ, అభ్యాగతులూ ఖర్చు అపరిమితంగా పెరిగిపోతూ వుంది. బాగుంది, ఆమె గారేమో తన పరలోకాన్నిబాగుచేసుకుంటూ వుంది. నీకూ అబ్బాయిలూ, అమ్మాయిలూ వుంటారుగదా? అప్పుడు వాళ్ళు ఏమి తింటారు? తమ పెట్టుబడి కాస్తా ఊడగొట్టుకొని చివరకు బిచ్చం అడుక్కుంటారా యేం?"
    మంచం మీద కూర్చుని మహేంద్రుడు "నీవు చెప్పేది ఎవరి సంగతీ? అమ్మ సంగతా?" అన్నాడు.
    "నా రాత ఇలా తగలడింది. ఈ విషయాలన్నీ నేను నీకు చెప్పవలసి వస్తున్నది" అన్నది జలదబాల.
    "అందుకే నీవు అమ్మ మీద దావా వేయడానికి వచ్చావా?"
    "నాకు దావాలతో, వ్యాజ్యాలతో పనిలేదు. కేవలం లోపల జరుగుతున్న విషయాలు చెప్పాను. లేకపోతే రేపు నామీదే దోషం ఆరోపిస్తారు గదా?" అన్నది జలదబాల క్రోధంతో.
    మహేంద్రుడు చాలా సేపటివరకూ మౌనంగా కూర్చొని వున్నాడు. తరువాత అన్నాడు_"మీ తండ్రిగారింట్లో ఒక్కోరోజు పొయ్యిలో పిల్లి కూడా లేవదుగాని నీకు జమీందారు ఇంట్లోని పని ఏమి తెలుస్తుంది?"
    ఈసారి జలదబాలకు కూడా కోపం వచ్చింది. "మీ తల్లి దండ్రుల ఇంట్లో ఎన్ని అతిథిశాలలు ఉన్నాయో కొంచెం చెప్పండి వింటాను?" అన్నది.
    మహేంద్రుడు మళ్ళీ ఆమెతో వాదనకు దిగలేదు. మెదలకుండా నిద్రపోయాడు. ఉదయం లేచి పార్వతి దగ్గరకు వెళ్ళి-"ఎటువంటి పెళ్ళి చేశావమ్మా! దీన్ని పెట్టుకొని సంసారం చేయడం చాలా కష్టం. నేను కలకత్తాకు వెళ్ళిపోతాను."
    పార్వతి అవాక్కయిపోయి, "ఎందుకూ?" అన్నది.
    "మిమ్మల్ని కటువైన మాటలు అంటున్నది. ఇందువలన నేను ఆమెను వదిలేశాను."
    పార్వతి కొన్ని రోజుల నుంచి పెద్ద కోడలు ఆచరణ చూస్తూ వస్తున్నది. అయితే ఆమె ఆ విషయాన్ని దాచి నవ్వుతూ "ఛీ! ఆమె చాలా మంచి అమ్మాయి. అలా అనకు!" అన్నది. ఆ తరువాత జలదబాలను ఏకాతంగా పిలిచి "కోడలూ! పోట్లాడుకున్నారా ఏం?" అన్నది.
    ఉదయం నుంచి భర్త కలకత్తాకు వెళ్ళబోతున్న ఏర్పాటంతా చూసి జలదబాల భయపడుతూ వుంది. అత్తమాట విని ఏడుస్తూ "నా దోషం ఏమీ లేదమ్మా! కాని యీ దాసీయే "ఖర్చు-గిర్చు" అంటూ అన్ని మాటలూ చెపుతూ వుంటుంది" అన్నది.
    అప్పుడు పార్వతి అన్ని మాటలూ విన్నది. తానే సిగ్గుపడుతూ కోడలు కళ్ళు తుడిచి, "కోడలూ, నీవు నిజం చెపుతున్నావమ్మా. నేనూ అనుభవం కలిగిన గృహిణిని కాదు. అందువల్ల ఖర్చులవైపు దృష్టి వుంచలేకపోయాను" అన్నది.
    తరువాత మహేంద్రుణ్ణి పిలిచి "మహేంద్రా, అపరాధం ఏమీ లేకుండా కోప్పడకూడదు. నీవు భర్తవు, యజనానివి. నీ శుభం భార్యకు సర్వస్వం. కోడలు లక్ష్మి" అన్నది. అయితే ఆ రోజు నుంచే పార్వతి చేయి మలుపుకుంది. అనాధలు, అంధులు, ఫకీరులు మొదలైన వాళ్ళు  ఎంతోమంది వచ్చి తిరిగిపోతున్నారు. యజమాని ఇదంతా విని పార్వతిని పిలిచి "ఏం లక్ష్మీదేవి, కోశాగారం ఖాళీ అయిపోయిందా?" అన్నాడు.
    పార్వతి సాహసంతో సమాధానమిచ్చింది__"కేవలం ఇస్తూ వున్నందువల్లనే సంసారం సాగదు. కొన్నాళ్ళు కూడబెట్టాలి కూడా. ఖర్చు ఎంత పెరిగిపోయిందో కనిపించడం లేదా?"
    "ఖర్చయితే ఏమిటి? నేనింకా ఎన్నాళ్ళు వుండబోతున్నాను. పుణ్య కార్యాలు చేసే ;పరలోకాన్ని సృష్టించుకోవాలి!"
    పార్వతి నవ్వుతూ "ఇది పూర్తిగా స్వార్ధానికి సంబంధించిన విషయం. స్వవిషయమే చూసుకొని అబ్బాయిలనూ, అమ్మాయిలనూ గాలికి వదిలేస్తావా? కొన్నాళ్ళుపాటు మౌనంగా వుండండి. మళ్ళీ అంతా పూర్వం లాగే నడుస్తుంది. మనిషి చేసే పనులకు ఎప్పుడూ అంతం వుండదు" అన్నది.
    అంచేత చౌదరిగారు మౌనం వహించారు.
    పార్వతికి ఏమీ పని లేకుండా పోయింది. అంచేత చేకూ, చింతా కొంచెం పెరిగిపోయింది. దేని ఆశ వుంటుందో ఒక రకమైన దాని చింత కూడా వుంటుంది. దేని ఆశ వుండదో దానిని గురించిన చింత కూడా మరోరకంగా వుంటుంది. ముందు చెప్పిన చింతలో సజీవత్వం వుంది, సౌఖ్యం వుంది, తృప్తి వుంది, దుఃఖం వుంది. ఇంకా ఉత్కంఠ వుంది. అంచేతనే మనుష్యులు అలసిపోయి వుంటారు. ఎక్కువ కాలం చింతించలేరు. అయితే నైరాశ్యంలో సుఖం లేదు, దుఃఖం లేదు, ఉత్కంఠ లేదు.కేవలం తృప్తి వుంది. నయనాలు వర్షిస్తుంటాయి, గాంభీర్యం కూడా వుంటుంది. కాని నిత్యం నూతనమైన మార్మిక వేదన వుండదు. తేలికైన మేఘంలాగా ఇటూ,అటూ తిరుగుతూ వుంటుంది. గాలి తగలనంతవరకూ స్థిరత్వం వుంటుంది. గాలి తగలగానే అదృశ్యమైపోతుంది. నిమగ్నమై ఉన్న మనస్సు ఉద్వేగ రహితమైన చింతలో ఒక సార్ధకతను పొందుతుంది. పార్వతి స్థితి కూడా సరీగా ఇలాగే వుంది. పూజా పురస్కారాల సమయంలో మనస్సు అస్థిరంగానూ, ఉద్దేశ్యరహితంగానూ, నిరాశతోనూ వుంటున్నది. మనస్సు వెంటనే సోనాపూర్ వెదురు పొదలు, మామిడి తోటలు, పాఠశాల, ఇల్లు, ఆనకట్ట ఒడ్డు మొదలైన స్థానాలలో తిరిగి వస్తుంది. ఆ తరువాత అటువంటి రహస్య ప్రదేశంలో దాగి వుంటుంది. స్వయంగా పార్వతి కూడా తనను తాను వెతుక్కొని బయటికి తీసుకురాలేదు....మొదట పెదవులు మీద హాస్యరేఖ తొణికిసలాడుతుంది. మరల వెంటనే కంటి నుంచి ఓ కన్నీటి బిందువు రాలి పంచపాత్రలోని జలంతో కలిసిపోతుంది. అప్పుడు కూడా రోజు గడచిపోతూనే వుంటుంది. పని పాటలతో, మధురమైన సంభాషణలో, పరోపకారంలో, సేవా శుశ్రూషలలో రోజు గడచిపోతూనే వుంటుంది. ఇప్పుడు వాటి నన్నిటినీ వదిలేసి ధ్యానమగ్నమైయున్న యోగిని లాగా కూడా గడచిపోతూనే వుంది. ఒకడు లక్ష్మీ స్వరూపిణి అన్నపూర్ణ అంటాడు. ఒకడు అన్యమనస్కురాలై ఉన్మాదిని అంటాడు. అయితే నిన్న ఉదయము నుంచి మరో విధమైన మార్పు కొంచెం కనిపిస్తూ వుంది. ఆమె కొంచెం తీవ్రంగానూ, కఠోరంగానూ మారిపోయింది. ఆరోహణలో వున్న గంగలో అకస్మాత్తుగా అవరోహణ ఆరంభమయిందా అన్నట్లు వుంది. ఇంట్లోని వాళ్ళకెవరికి దాని కారణం తెలియదు. మాకు మాత్రమే తెలుసు. మనోరమ గ్రామం నుంచి ఒక ఉత్తరము వ్రాసింది. అది యిలా వుంది__
    "పార్వతీ, చాలా రోజులయ్యింది, మన ఇరువురిలో ఎవరూ ఎవరికీ ఉత్తరం వ్రాయలేదు. అంచేత దోషం ఇరువురిదీ వుంది. దీన్ని తొలగించాలని నా అభిలాష. మనం ఇరువురమూ దోషాన్ని స్వీకరించి, అభిమానం తగ్గించుకోవాలి. కాని నేను పెద్ద దాన్ని. అంచేత నేనే మన్నించమని అర్ధిస్తున్నాను. త్వరలో సమాధాన మిస్తావని ఆశిస్తున్నాను. నేను ఇక్కడకు వచ్చి దాదాపు ఒక నెల అయ్యింది. మనం గృహస్థులైన వారి ఇంటి పిల్లలం. శారీరక సుఖదుఃఖాల మీద అంత శ్రద్దచూపము. మరణించునప్పుడు కీర్తి శేషులయ్యారు అంటాము. జీవించి ఉన్నప్పుడు బాగున్నారు అంటాము. నేనూ ఆ విధంగానే బాగున్నాను. కాని ఇది నా విషయం. ఇక ఇతరుల విషయం వుంది. అదేమంత పనికి వచ్చే విషయము కాకపోయినప్పటికీ ఒక సంవాదం వినిపించాలని చాలా కోరికగా వుంది. నీకు వినిపించుదామా  లేక వద్దా అని నిన్నటినుంచి ఆలోచిస్తున్నాను. వినిపిస్తే నీకు దుఃఖం కలుగుతుంది. వినిపించకుండా నేను వుండలేను.సరీగా మారీచుని స్థితి అయ్యింది. దేవదాసు స్థితి వింటే నీకు దుఃఖమే కలుగుతుంది. కాని నేను కూడా నీ మాటలను జ్ఞాపకానికి తెచ్చుకొని ఏడవకుండా వుండలేను. భగవంతుడు చాలా మేలుచేసి రక్షించాడు. లేకపోతే నీలాంటి అభిమానం గల యువతీ ఆయన చేతిలోబడి ఈపాటికి ఏ గంగలోనైనా మునిగి చచ్చేదానివి. లేక ఏ విషమైనా పుచ్చుకునేదానివి. ఆయన విషయం ఈ రోజు వింటావా! ఇంకా నాలుగు రోజులు తరవాతైనా వినవలసిందే, ఎప్పుడైనా వినవలసిందే! దానిని అణచి పెట్టినందువల్ల లేక దాచిపెట్టినందువల్ల ప్రయోజనమేముంది?
    అయిదారు రోజుల క్రితం ఆయన ఇక్కడకు వచ్చాడు. ద్విజదాసు తల్లీ కాశీలో వుంటుందనీ, దేవదాసు కలకత్తాలో వుంటున్నాడని నీకు తెలుసు గదా! కేవలం అన్నతో కలహించడానికీ, డబ్బు తీసుకొనడానికీ ఇంటికి వస్తున్నాడు. ఇలాగే మధ్య మధ్యలో వస్తూ వుంటాడని వింటున్నాను. ఎన్ని రోజుల వరకు డబ్బు ప్రోగుగాదో అన్ని రోజులవరకు ఉండి డబ్బు అందగానే వెళ్ళిపోతూ వుంటాడు.
    ఆయన తండ్రి చనిపోయి ఇప్పటికి రెండున్నర సంవత్సరాలయింది. ఈ కొద్ది కాలంలోనే తన వాటాను వచ్చిన సంపదలో సగం ఊడ్చి పారేశాడని వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ద్విజదాసు అంతా లెక్క వ్రాసుకుంటూ వుండటం చేత ఏదో విధంగా తన తండ్రి ఆస్తిని తనవద్దే మిగుల్చుకుని వుంచాడు. లేకపోతే ఈనాడు ఇతరులు వచ్చి దోచుకుని తినేవాళ్ళు. మద్యం కోసం, వేశ్య కోసం, ధనమంతా స్వాహా అయిపోతున్నది. అతణ్ని ఎవరు రక్షించగలరు? ఒక్క యముడే ఆ పని చేయగలడు. అది కూడా త్వరలోనే జరగవచ్చు. ఆలస్యమేమీ వుండదు. అతడితో నీ వివాహం జరగనందువల్ల నీవు ఒడ్డున పడ్డావు. భగవంతుడు నిన్ను రక్షించాడు అనుకో.
    ఆహా! ఆహా! దుఃఖం కూడా కలుగుతుంది. ఇప్పుడు బంగారం లాంటి ఆ వర్ణం లేదు, ఆ రూపం లేదు, ఆ కళ లేదు. ఆ దేవదాసు కాడా, మరొకరా అన్నట్లు వుంటాడు. కళ్ళు లోపలికి పీక్కు పోయాయి. రేగిన తలమీద కేశాలు గాలికి ఎగురుతూ వుంటాయి. ముక్కు ఖడ్గంలాగా బయటికి పొడుచుకు వచ్చింది. రూపం పూర్తిగా చెడిపోయింది. నీతో ఎంతని చెప్పేది? చూస్తే అసహ్యం కలుగుతుంది. భయం వేస్తుంది. రోజంతా నది ఒడ్డున ఆనకట్టపైన తుపాకి చేత బట్టుకొని పక్షులను చంపుతూ వుంటాడు. ఎండలో తల తిరిగి ఆనకట్టపైనే వున్న రేగుచెట్టు నీడలో తలవాల్చుకుని చతికిల బడతాడు. సాయంకాలం అయిన తరువాత ఇంటివద్దకు వచ్చి మద్యం తాగుతాడు. రాత్రులందు నిద్రపోతాడో లేక తిరుగుతూ వుంటాడో ఆ భగవంతుడికే తెలియాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS