ప్రక్కలో పిడుగు పడ్డట్లు ఉలిక్కి పడ్డారంతా. ఒక్కరి నోటా మాట పెగలలేదు. క్షణం క్రితం విజయ చిహ్నాలైన వారి మొహాలు అపజయాన్ని విని క్రుంగి పోయాయి. అనవసరంగా తమ మూర్ఖత్వం వలన ఆయనను కాలేజీ కే దూరం చేశామే అని బాధపడ్డారు. అందరి కన్నా వసంత ను ఆవార్త కలచి వేసింది.
"మా స్ట్రైక్ వల్ల ఆయనకు నేను నిర్భంధించవలసి వచ్చింది. తత్పలితంగా మన కాలేజీ ఒక మంచి లెక్చరర్ గారిని పోగొట్టుకుంది. అందుకు మీతో పాటు నేను కూడా చింతిస్తున్నాను. ఈ సమయంలో ఎక్కువగా మాట్లాడలేను" అని వెళ్ళిపోయారాయన.
అయన పోగానే విద్యార్ధు లందరూ ఒకరి మొహం మరొకరు చూసుకోవడానికి భయపడ్డారు. ప్రతి ఒక్కరూ తప్పు తనదే అయినట్లు తలలు వంచుకొని తప్పుకొని పోయినారు. వసంత ఏదో ఆలోచించుకుంటూ అక్కడే కూర్చుండి పోయింది.
* * * *
సాయంకాలం అయిదు గంటలవుతుంది. ఆకాశాన్నంటు కొని ఉన్న మబ్బులు ఇక మాచేత కాదంటూ వర్ష రూపంగా భూమి పై పడ్డాయి. ఎక్కడిదా ఈ విపరీత కాలపు వర్షం అని ప్రజలంతా ఆశ్చర్య పడ్డారు. ఏ విపరీత సంఘటనకు సూచకంగా పడుతుందా అని ఆలోచించారు కొందరు. చలికి తోడు ఇదొకటా అని చీదరించు కొన్నారు మరికొందరు. పిల్లలు ఆనందంతో గంతులు వేస్తున్నారు.
ఆ వర్షం లోనే ప్రజలు తమ పనులు ముగించు కొంటున్నారు. ఆ కొద్ది సేపటికే ఏదో మునిగి పోతున్నట్లు వారిలో ఆ హడావుడి . కార్లు రేయ్ మంటూ నీళ్ళను చిమ్ముకుంటూ దూసుకు పోతున్నాయి. వసంత కారు డ్రైవ్ చేసుకుంటూ ఆలోచిస్తుంది. ఆమె దృష్టి రోడ్డు మీద ఉన్నా మెదడు ఎక్కడో ఉంది. ఎవరిని గురించో ఆలోచిస్తుంది. ఎవరితోనో ఏదో చెప్పాలని ఆత్రుత పడుతుంది. మనసు ఎవరినో కలుసుకోవాలని ఆరాట పడుతుంది. కళ్ళలో మెదిలే రూపాన్ని కళ్ళ ముందు చూడాలని వెతుకుతున్నాయా కళ్ళు.
కారు నిలిపి వర్షం లో తడుస్తూ ఒక చిన్న సందు గుండా నడిచింది. వాకిలి వేసి ఉన్న ఒక యింటి ముందాగి తలుపు తట్టబోయి దాని కున్న తాళం చూసి తల తిరిగినట్ల యి అలాగే తలుపుకు ఒరిగి నిలబడి పోయింది. అటూ యిటూ చూసింది. ప్రక్క యింట్లో నుండి రేడియో వినిపిస్తుంది. గబగబా అక్కడికి చేరింది. ఒక నడి వయస్కురాలు బయటికి వచ్చింది.
"అమ్మా, ప్రక్క గదిలో భానుమూర్తి గారని ఒక లెక్చరర్ గారున్నారు. వారెక్కడి కెళ్లారో చెప్పగలరా?' అని అడిగింది వసంత ఆత్రుతగా.
'అయన గది ఖాళీ చేసి వెళ్లి పోయారమ్మా!"
ఆ జవాబు విని క్రుంగి పోయింది వసంత. "ఖాళీ చేసి వేల్లిపోయారా?' ఆ మాటలు అప్రయత్నంగా వసంత నోటి నుండి వెలువడ్డాయి.
"ఔనమ్మా! మధ్యాహ్నమనగా వెళ్ళిపోయాడు. వాళ్ళ వూరికి పోతున్నానని గూడా మా వారితో చెప్తుండగా విన్నాను."
ఇంతలో ఎవరో ఒక మధ్య వయస్కుడు "ఎవరే" అంటూ అక్కడికి వచ్చి 'అదేమిటే వచ్చిన వారిలా వాకిట్లో వానకు తడుస్తుండగా చూస్తూ ఇంట్లో కైనా రమ్మనకుండా మాట్లాడుతున్నావు" అన్నాడు.
అతని భార్య అయిన ఆవిడ నాలిక కొరుక్కుని లోపలికి పోయింది.
"ఎవరు కావాలమ్మా?" అన్నారాయన వసంతను వరండా లోకి ఆహ్వానించిన తర్వాత.
చెప్పింది వసంత.
'ఆయన కిక్కడ మనసు బాగులేదట. ఉద్యోగానికి కూడా రాజీనామా యిచ్చి వెళ్ళిపోయాడు. ఊ అన్నట్లు మరిచాను. ఎవరైనా వస్తే ఒక కవరిమ్మని లేకుంటే రేపు పోస్టు చెయ్యమనీ చెప్పాడు" అని అయన లోపలికి వెళ్లి ఒక కవరు తెచ్చాడు.
ఆ కవరు పై తన అడ్రసు ఉండడం చూసి తీసుకొని చింపి చదువు కొంది వసంత.
"వసంతా.
నువ్వు ఇక్కడి కోస్తావని, వచ్చినా ప్రయోజనం ఉండదని నాకు తెలుసు. ఆ రాత్రి నా జీవితానికి అనుకోని వసంతాన్ని తెచ్చావు. ఇక మీదట జీవితమంతా వసంతమనే కలలు కన్న నా కలలు కలలుగానే నిలిచి పోతాయి. వసంతం ఎల్లకాలం ఉండదనే నిజం తెలుసుకొన్నాను. నీ అభిప్రాయం తెలుసుకోవాలను కొన్న నా ఆశ నిరాశైంది. నా ఆశలు నిరాశలైన చోట, నా కలలు ఫలించని చోట ఉంటూ దర్పణం లాంటి మనసు మాటి మాటికి నా నోరూరించే ఆశలను చూపిస్తుండగా నిగ్రహంతో , మనసును అదుపులో పెట్టుకొని ఉండలేను. అలా ఉండగలిగిన నాడు లేనిపోని అనర్ధాలు సంభవిస్తాయి. అందుకే నీకు నా మొహం కూడా చూపించకుండా పోతున్నాను. కొన్ని వందల మైళ్ల దూరం, కానీ ఒక్క చిన్న కోరిక. నీపై అఘాయిత్యానికి పూనుకొన్నానన్న కోపం తో కాని, ఒక అబల అమాయకంగా దరి చేరితే అక్రమాని కొడిగట్టాననే అసహ్యం తో గానీ నీతో కొన్ని అమూల్యమైన క్షణాలు గడిపాననే విషయం జ్ఞాపక ముంచుకుంటావు కదూ!
సెలవు,
ఇట్లు
భానుమూర్తి."
తగిలిన గాయాన్ని కత్తితో రేపినట్లయింది. గాయం కలిగించి వారి దగ్గరే దాన్ని మానిపించుకోవాలని, రూపు మాపుకోవాలని ఆశతో వచ్చింది. కానీ దురదృష్టం ఆ అదృష్టాన్ని తనకు చిక్క నివ్వలేదు. ఎందుకు తనపై విధి కింత పగ? వెనుతిరిగింది చేతిలోని ఉత్తరంతో.
"వాన తగ్గాక పొదువు గానీ ఉండమ్మా!" అన్నాడాయన.
"ఫరవాలేదు లెండి" అంటూ బయటికి వచ్చింది.
ఆ చిన్న సందులో నీరు పారుతుంది. ఒక చోట కాలు పెట్టగానే కాలు జారింది. పడబోయి నిలదొక్కు కుంది. చేతిలోని ఉత్తరం క్రింద పడింది. నీటి పై తెలుతుందా ఉత్తరం. టపటప మని చినుకులు దాని పై పడుతున్నాయి. అక్షరాలూ చెరిగి పోతున్నాయి. అటూ ఇటూ ఊగుతూ తనకు అందకుండా పోతుంది. అందుకో ప్రయత్నించలేదు. తనది కాని వస్తువు, వ్యక్తీ దూరమై పోయాక అందుకై ప్రయత్నిచడం తెలివి తక్కువే. వానకు పూర్తిగా తడిసి పోయింది ఆ ఉత్తరం. తన మనసులోని భావాలను కూడా కన్నీటితో తడిపింది. తను ముద్దయింది. భావాలు, ఆలోచనలు అంతే. తన బట్టలు తడిసినా అరక తప్పదు. అవీ అంతే.
16
"నువ్వెన్నయినా చెప్పు. నేను చస్తే ఒప్పుకోను" లోపలికి అడుగు పెడుతున్న రాజ్ ముకుందయ్య మాటలు విన్నాడు. రాజ్ ను చూసిన గోపీ కి కొండంత ధైర్యం వచ్చింది.
"నువ్వయినా చెప్పబ్బాయ్. వీడు దానికి వంత పాడుతున్నాడు."
"నా మాట వింటారా?"
"ఏమిటో చెప్పు."
"అయితే ఈ పెళ్లి చేయకండి."
"ఏమిటి! ఇలా నువ్విచ్చే సలహా?"
"నే చెప్పేది కాస్త ఆలోచించండి. ఇష్టం లేని పెళ్లి చేస్తే సంసారం సుఖంగా గడుస్తుందా? ఎప్పుడూ కలతలు. తీరని కోరికల కోసం అంతః కలహాలు. తాము సుఖపడక పోయేదే కాకుండా ఎదుటి వారికి గూడా శాంతి నివ్వలేరు. అప్పుడు తప్పంతా మీదేనంటారు."
"వారికిష్టం ఎందుకు ఉండదు అనే నా ప్రశ్న. చిన్నప్పటి నుండి కలిసి మెలిసి తిరిగారు. ఈనాడు ఏ కారణం లేకుండా ఇష్టం లేదంటే సరిపోతుందా?"
"చిన్నప్పటి జీవితం వేరు. ఇప్పటి జీవితం వేరు. అది నల్లని వన్నీ నీళ్ళు, తెల్లని వన్నీ పాలు అని నమ్మే జీవితం. కానీ ఇప్పుడు పెద్దవారై తమ జీవితాలను చక్క దిద్దుకో గల వారై తమ జీవితాలను చక్క దిద్దుకో గల శక్తిని, తెలివిని అలవరుచు'కొన్నారు తప్పుదారే త్రోక్కుటారో, మంచిదారే ఎన్నుకొంటారో వారిపై ఆధారపడి ఉంటుంది. వారి జీవితాన్ని వారినే పరీక్షించుకోననివ్వండి."
"ఎడిశారు! గుడ్డిగా ప్రేమ అని, నేనూ ప్రేమించాను అని అంటే సరిపోతుందా? ఏమి తెలుసు వీరికి జీవితమంటే? దాన్ని ఏనాడైనా అర్ధం చేసుకోగలరా?"
'అందుకే వారిష్టమోచ్చినట్లు నడుచుకో నివ్వండి. తాము ఎన్నుకొన్న దారి గుండా ప్రయాణించి వచ్చే కష్ట నష్టాలను ఎదుర్కొని మంచి చెడులను తెలుసుకుంటారు."
"వారి ష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే పెద్ద వారమంటూ ఏడిచే మే మెందుకు?"
"పెద్దవారైనా మీరు వారి మేలే కోరి చెప్పి ఉండవచ్చు. కానీ ఎదిరించే వయసు వారిది. చిన్నతనం లో మీ మాట వినకుంటే దండి స్తారు. కానీ ఇప్పుడు వారి దారి కడ్డు తగిలితే మీ పెద్దరికాన్ని గూడా లెక్క చెయ్యరు. అప్పుడు ఆ పెద్దరికానికున్న గౌరవం పోతుంది. దాన్ని నిలబెట్టు కోవాలంటే వారి ఇష్టాను ప్రకారమే నడుచుకోవాలి."
"అంతేనా!"
'అంతకన్నా గత్యంతరం లేదు. చెరువులకు అనాకట్ట లున్నాయి. వరద కాలంలో ఆ గట్లు అడ్డు కోలేవు."
".... .... ....."
"అతి చిన్నదైన ఒక కాలువను ప్రవహించ కుండా ఆపలేము. కాలువ చిన్నదే కావచ్చు. కానీ విపరీతంగా ప్రవహించే ఆ ప్రవాహాన్ని కొంతసేపు అపగలము. కాలం గడిచే కొద్దీ అది ఆ అడ్డును దాటి దామి మీదుగానే ప్రవహిస్తుంది. అప్పుడు మన శ్రమ వృధా అవుతుంది. వారి జీవితాలను సౌక్యవంతం చేసుకోలేని వాడు కొన్ని అనుభవాల నైనా గడించు కొంటారు."
"వేరే దారే లేదా?"
"లేదు. ఇది అణు యుగం . మనుష్యుల కోరికలను అరికట్ట గలిగే శక్తి దేవుడికే లేదని నిరూపించు కొనే మానవుడి ని మానవ మాత్రులు ఏమాత్రం అరికట్ట గలరో ఆలోచించండి. మొండిగా ప్రయత్నించినా మనస్పర్ధలకు లోనై వారిని దూరం చేసుకోవలసి వస్తుంది."
