Previous Page Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు - 2 పేజి 22


    "హఠాత్తుగా బుజ్జిగాన్ని హీరోగా పెట్టి సినిమా తీయాలని ఎందుకనుకున్నావు బావా! వాడికి చెమ్చా కండకూడా లేదూ..." చినరాయుడి మాటలకి మధ్యలోనే అడ్డు తగిలాడు పెదరాయుడు.
    "ఒళ్ళంతా పాడింగులు వేయిద్దాంలే బావా!"
    "కానీ వాడికి ఓ ఫైటింగూ రాదు"
    "భలేవోడివే! నిజం ఫైటింగులు ఎపుడు చేస్తున్నాడీమధ్య! డూపును పెడదాం!"
    "కానీ వాడికి తిన్నగా నిల్చుని స్టయిల్ గా నడవడం కూడా రాదే!"
    "అంటే సూటూ బూటూ వేసుకుని, టై కట్టుకుని, స్టయిల్ గా వుండే వాళ్ళందరూ హీరోలైపోతారా! మనిళ్ళకు రోజుకో సేల్స్ మన్ రావడంలా! బూజు దులుపుతామంటూ, కరెంటుతో అన్నం వండిపెడతామంటూ, మురికి గుడ్డలు ఉతికిపెడతామంటూ ఆళ్ళ మిషన్లు అమ్మడానికొచ్చే వాళ్ళంతా హీరోలకంటే ఏం తీసిపోయారూ? అదీగాక, ఈ రోజుల్లో వంకర టింకరగా గంతులేస్తూ నడిచేవాడే సినిమా హీరో ఎన్ని సినిమాలు చూడ్డంలా?"
    "మనాడి గొంతు పీలగా, అటు మగా, ఇటు ఆడా కాకుండా ఉంటుందే!" సందేహం వెలిబుచ్చాడు చినరాయుడు.
    "కొంత మంది హీరోల గొంతు ఇకారంగా ఉండీ, మరికొంత మందికి మన భాష రాకా, డబ్బింగులు చెప్పించుకోవటంలా? ఆళ్ళకంటే మనోడి పిస్టేజ్ ఏం తక్కువ? అదీగాక, మనోడికి తెలుగూ సరిగ్గా రాదు, ఏ భాశా రాదు. హాయిగా వులుకూపలుకూ లేకుండా డబ్బింగులు చెప్పించుకుని నేషనల్ స్టారవుతాడు!"
    "కానీ కనీసం ఓ వాన పొంగులో హీరోయిన్ తో స్టెప్పు లెయ్యాలన్నా మనోడి మొహంలో ఓ ఎక్స్ ప్రెషనూ...."
    భళ్ళున నవ్వాడు పెదరాయుడు "ఈ రోజుల్లో వానపొంగులో హీరోగాడి మొహం చూసేదెవరు బావా? బొంబాయి నుంచి మాంచి మోడల్ని పిలిపించి హీరోయిన్ని చేసేద్దాం. ఆ యమ్మాయి గుడ్డలప్పగించి డ్యాన్సు చేస్తూంటుంది. అంతా గుడ్లప్పగించి దాన్నే సూస్తూంటారు. ఇక ఎక్స్ ప్రెషనంటావా! మొన్నేంటి ఇంగ్లీషు సినిమా చూశాం? ఆ హీరో పేరూ...... ఆఁ..... అర్నాల్డు స్కావెంజర్..."
    "స్కావెంజర్ కాదు బావా! స్క్వార్జెనెగ్గెర్!"
    "ఎవరోలే కానీ, ఆడి మొహంలో ఓ ఫీలింగుగానీ, ఓ నవ్వుగానీ, ఓ ఏడుపుగానీ ఉందా? మరి ఆడు హిట్టవలా? అసలవన్నీ ఒదిలెయ్ బావా! మన బుజ్జిగాడికి అన్నిటికీ మించిన ఒకే ఒక అర్హతుంది ఆడు నాలాంటి ప్రొడ్యూసర్ కొడుకవటమే! ఆన్ని హీరోగా పెట్టి అదే పనిగా సినిమాలు తీసి వదిలితే జనం చూడక ఛస్తారా! కొన్నాళ్ళకి ఆళ్ళే అలవాటు పడిపోతారు!" తేల్చి చెప్పేశాడు పెదరాయుడు.
    చినరాయుడు నిట్టూర్చాడు. "సరే బావా! నీ ఇష్టం! కానీ నాదో చిన్న సలహా. మన బుజ్జిగాడితో స్ట్రయిట్ సినిమా తీసే ముందర ఓ డబ్బింగు సినిమా తీద్దాం. ఈమధ్య చూస్తూనే ఉన్నావు కదా, తెలుగు సినిమాలకంటే తెలుగులోకి డబ్బింగయిన సినిమాలే శతదినోత్సవాలు చేసుకుంటున్నాయి!"
    పెదరాయుడు రెండు నిమిషాలు ఆలోచించాడు "సరే బావా! నువ్వు చెప్పినట్టే సేసేద్దాం. నువ్వన్నట్టు ఈమధ్య డబ్బింగు సినిమాలు డైరెక్టు తెలుగు సినిమాలని ఏకె 47లాగా టపటపా పేల్చిపారేస్తున్నయ్యి. ఏమో, మనం తీయబోయేది ఏకె 97 అవ్వొచ్చుగా!"
    "అవును బావా! అనువాద కథాచిత్రాల 97. ఏకె 97" అన్నాడు  చినరాయుడు.
    
                                         * * *
    రైల్వే స్టేషన్ లో చినరాయుడు టిక్కెట్టు తీసుకుంటున్నాడు.
    "ఏ ఊరికి టిక్కెట్టు తీసుకుమ్తున్నావు బావా?" అడిగాడు పెదరాయుడు.
    "డబ్బింగు సినిమా తియ్యాలంటే మద్రాసే పోవాలి కదా బావా!" అన్నాడు చినరాయుడు.
    "మదరాసేమిటి? సెన్నై అనాల్ట! పొద్దున పక్కింటి రెడ్నాయుడుగారు చెప్పారు."
    "అదేలే బావా! చెన్నై. పోనీ ముంబై పోదామా? హిందీ నుంచి తెలుగులోకి, ఇంగ్లీషు నుంచి తెలుగులోకీ డబ్బింగు చెయ్యాలంటే ముంబై బెస్టు!" అప్పటికప్పుడు ఆలోచన వచ్చి చెప్పాడు చినరాయుడు.
    "ముంబై ఏంటి?" ఆశ్చర్యపోయాడు పెదరాయుడు.
    "అదే బావా! బొంబాయి!"
    పెదరాయుడు సాలోచనగా అన్నాడు.
    "మదరాసు సెన్నై, బొంబాయి ముంబై. ఆళ్ళంతా ఆలోచన సేసీ పేర్లు పెడితే మనం మాత్రం తక్కువ తిన్నామా? సికిందరాబాధుని సిక్కెయ్ అనీ, ఐదరాబాదుని బాగ్గెనగరం అంటారు గాబట్టి బొగ్గెయ్ అని పెడితే పోలా? లేదా ఐదరాబాదుని, సికిందరాబాదునీ కలిపి 'బాదెయ్' అందామా!"
    చినరాయుడు ఇబ్బందిగా "మనకెందుకులే బావా! మద్రాసులో నాకు తెలిసిన మంచి డబ్బింగు రైటరున్నాడు. అతని దగ్గరకు పోదాం!" అన్నాడు.
    
                                          * * *
    
    కోడంబాక్కంలో ఓ త్రీస్టార్ హోటల్లో దిగి, డబ్బింగ్ రైటర్ కి ఫోన్ చేస్తే, ఫలానా థియేటర్లో ఉన్నాడని తెలిసింది. ఇద్దరూ అక్కడికి వెళ్ళారు.
    డబ్బింగు రైటరు వీళ్ళని సాదరంగా ఆహ్వానించాడు. ప్రస్తుతం తమిళ్ టు తేకుగు చేస్తున్నాడట. లోపల ఎడిటింగ్ వర్క్ జరుగుతోందట. ఓ అరగంట దాకా ఫ్రీ అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS