Previous Page Next Page 
ప్రతీకారం పేజి 22


    సూర్యుడు చెట్లకొమ్మల్లో, కొండ శిఖరాల్లో ఇరుక్కున్న ఆఖరు కిరణాలను పోగు చేసుకుని వెళ్ళిపోయాడు. చీకట్లు ముసురుతున్నాయి. చెరువుగట్టు చల్లగాలికి వచ్చినవారు ఒక్కొక్కరే లేచి వెళ్ళిపోతున్నారు.
    బోటు చెరువు మధ్యలో వుంది. రజని ఆ మౌనాన్ని భరించలేకుండా వుంది. ధైర్యాన్ని కూడదీసుకుంది.
    "రవీ! నాకొక ప్రామిస్ చెయ్యాలి"
    రవి రజని కళ్ళలోకి లోతుగా చూశాడు. ఆలోచిస్తున్నాడు.
    "నిజంగా నీకు నేనంటే అభిమానం వుంటే నా కొరకు ఓ చిన్న త్యాగం చెయ్యగలవని అనుకుంటున్నాను" మళ్ళీ రజని అన్నది.
    రవి తను చెప్పదల్చుకున్న విషయాన్ని చెప్పడానికి అవకాశాన్ని కలిగించిన రజనీకి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
    "నేను ప్రామిస్ చేస్తున్నాను. నా చెల్లెలి సుఖంకోసం నేను ఎలాంటి త్యాగమైనా చెయ్యగలను చెప్పమ్మా నన్నేం చెయ్యమంటావో చెప్పు!" వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా తన మనసులోని భావాన్ని బయటకు కక్కేశాడు.
    అన్నాడేగానీ, రజని ముఖంలోకి భయం భయంగా చూశాడు. తన మాటలు ఆమెకు వజ్రఘాతంగా తగులుతాయనుకున్నాడు. రజని కళ్ళలో మెరుపు, ముఖంలో వెలుగు చూసి రవి విస్మయం చెందాడు తను చూస్తుంది కల కాదు కదా అనే సందేహం ఓ క్షణం కాలంపాటు కలిగింది.
    రవి ఏమన్నాడు? తను విన్నది నిజమేనా? తన చెవులు తనకు ద్రోహం చెయ్యడం లేదు కదా? నిజమే! తను విన్నది నిజమే!
    "చెల్లీ! ఏది రవీ! మరోసారి అను" అన్నది రజని ఆరాటంగా.
    "చెల్లీ! అవునమ్మా! నిన్నెప్పుడూ నా చెల్లిగానే అభిమానించాను. గౌరవించాను!"
    రజనీకి ఇంకా నమ్మకం కుదరడం లేదు. సందేహంగా ముఖంలోకి చూసింది.
    "ఏమిటి అలా చూస్తావ్? నా మాటమీద నమ్మకం కుదరటం లేదా? నా కళ్ళలో నిజాయితీ కన్పించడం లేదా! చిన్నతనం నుంచీ మనిద్దరం ఒకే కుటుంబంలోని పిల్లల్లా పెరిగాం! కలిసి ఆడుతూ పాడుతూ పెరిగాం! నువ్వంటే మరో రకమైన భావం ఏనాడూ కలగలేదు. ఈ వివాహం జరగటానికి వీల్లేదని నీతో చెప్పడానికే వచ్చాను."
    రజని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. "అన్నయ్యా!" అంటూ వంగి రవి పాదాలకు నమస్కరించింది.
    రవి ఆమెను లేవదీసి ఆప్యాయంగా తల నిమిరాడు.
    "అదే సరేనమ్మా! మరి నువ్వీ పెళ్ళికి ఎందుకు అంగీకరించావు! ఇంతవరకు చూస్తూ ఎందుకూరుకున్నావ్?"
    "నా అభిప్రాయం ఎవరు లక్ష్య పెడతారు? నేను ప్రకాశ్ ను ప్రేమిస్తున్నాను. నాన్నగారు ఈ వివాహం జరిగి తీరాల్సిందేనని పట్టుబట్టారు. అందుకే నీతోనే మాట్లాడి అసలు విషయం తేల్చేసుకుందామని ఇక్కడకు వచ్చాను" అన్నది రజని.
    "ఈ బోటులో తిరగాలనే బుద్ధి ఎందుకు పుట్టింది?" ఏదో సందేహం కలిగినట్టు ప్రశ్నించాడు రవి.
    "నేను మరోవిధంగా ఊహించుకున్నాను. నీ ఇష్టప్రకారమే ఈ పెళ్ళి నిర్ణయించబడింది అనుకున్నాను. నా మనసు విప్పి నీ ముందు పెట్టాలనే ఇవ్వాళ నీతో వచ్చాను. కాని నా మాటకు నువ్వు గౌరవమివ్వకపోతే ఈ నదిలో పడి ఆత్మహత్య చేసుకుందా మనుకున్నాను" అంటూ నవ్వింది రజని.
    "ఆ తరువాత నా చేతులకు బేడీలు తగిలించేవారు" రవి కూడా నవ్వుతూనే అన్నాడు.
    రజని ఒక్కసారిగా "కెవ్వున" కేక పెట్టింది. చేతితో ఒడ్డుకేసి చూపిస్తూ.
    రవి రజని చెయ్యి చూపించిన వేపుకు చూశాడు. ఒక ఐదేళ్ళ పిల్ల బంతి వెనకే పరిగెత్తుతూ చెరువు అంచువరకూ వచ్చేసింది. మరుక్షణంలో బంతితో పాటు ఆ పిల్లా చెరువులో వుంది.
    రవి బోటు అంచుమీద బలంగా కాలుమోపి, ఊపుతో నీళ్ళలోకి దిగాడు. ఆ వూపుకు బోటు అటూ ఇటూ ఊగసాగింది. దాంతోపాటు రజనీ కూడా ఈ పక్కనుంచి ఆ పక్కకు పడుతూ పట్టుకోసం వెదకసాగింది. నీళ్ళలోకి దూకిన రవి ఇదేమీ గమనించలేదు. అతని చూపు అంతా మునిగిపోతున్న పిల్లమీదే వుంది. వేగంగా ఈదుకుంటూ వెళుతున్నాడు.
    రవి రెండోసారి తేలగానే పిల్లను పట్టుకున్నాడు. భుజంమీద వేసుకొని ఒడ్డుకు చేర్చాడు. పిల్ల తల్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వుంది. తండ్రి పిల్లను రవి నుంచి అందుకున్నాడు. స్పృహ లేకుండా వున్న పిల్లను చూసి ఘొల్లుమన్నది తల్లి.
    స్థాణువులా నిలబడిపోయిన మధ్య వయస్సు స్త్రీ "నూరేళ్ళు బ్రతుకు బాబు! ఇవ్వాళ మా పిల్లను బ్రతికించావ్!" అని కృతజ్ఞత నిండిన కంఠంతో దీవించింది.
    "ఇంతమంది వుండి పిల్లను అట్లా వదిలేస్తారా? త్వరగా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళండి. ఆలస్యం చెయ్యకండి బాగా నీళ్ళు కూడా త్రాగింది" హెచ్చరించాడు.
    పిల్లను తీసుకొని అందరూ కారు ఎక్కారు. కారు స్టార్టు అయింది. రవి వెనక్కు తిరిగి రజనీ కోసం చూశాడు.
    బోటు తలక్రిందులుగా నీటిమీద తేలుతూ వుంది. రజనీ చీర పొర నీళ్ళమీదుగా కనిపిస్తోంది.
    "రజనీ!" కెవ్వున కేకపెట్టి రవి నీళ్ళలోకి దూకాడు.

                                               17

    ఉదయం కాఫీ తాగి న్యూస్ పేపరు చూస్తున్న రాధాదేవి కళ్ళు మొదటి పేజీలో పెద్ద అక్షరాలలో వున్న వార్తమీద నిలిచాయి. కుతూహలంతో చదవసాగింది. పూర్తిగా చదివి నిర్విణ్నురాలయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS