Previous Page Next Page 
ది సెల్ పేజి 22


                                          జడ్జిమెంట్

    అది సెషన్స్ కోర్టు. మమకారాలకి అతీతంగా మౌన ముద్రలో గంభీరంగా న్యాయపతి తన ఆసనంమీద ఆసీనుడై వున్నాడు.
    ఒకేవేపు నల్లకోటు వేసుకొని న్యాయాన్ని రక్షించి, ధర్మాన్ని కాపాడేది మేమేనని న్యాయపతి ఆసనం ముందున్న పొడుగుపాటి టేబుల్ కు చుట్టూవున్న కుర్చీలలో కూర్చున్నారు న్యాయవాదులు.
    న్యాయాన్ని బ్రతికించటానికే మా కృషి అన్న ధీమాతో యూనిఫారం స్టిఫ్ నెస్ తోపాటు మొహంలో ఆవేశపు ఛాయల్లో నేరస్తులకి శిక్ష పడాలన్న ఆకాంక్ష పోలీసు ఆఫీసర్ల వదనాలలో వుంది.
    సునీల సాక్షిగా ప్రమాణం చేసింది. జడ్జి ఆమె స్టేట్ మెంటు రికార్డు చేస్తున్నాడు.
    "మా కాలేజి యానివర్సరీ సాయంత్రం 6 గంటలకు ప్రోగ్రామ్స్ మొదలు పెడతారని నేను రాధ సాయంత్రం ఇంటిదగ్గరనుండి రిక్షాలో బయలుదేరాము. కాలేజికి వెనుక వైపు రిక్షా దిగాము. అక్కడవున్న చిన్న గేటుగుండా కాలేజిలోకి వెళ్ళాము.
    "నువ్వు వెళ్ళవే....నేను కాసేపు ఆగి వస్తాను" అంటూ రాధ వెయిటింగ్ రూమ్ వైపు వెళ్ళింది. తరువాత ప్రోగ్రామ్స్ అయ్యేప్పటికి రాత్రి పది గంటలు అయ్యింది. రాధ ఎంతసేపటికి రాలేదు. ఒక్కదాన్నే చీకటిలో వెళ్ళటానికి భయం వేసి ఇంటికి వచ్చేశాను. మరునాడు ఉదయం రాధను రాత్రి ఎవరో రేప్ చేసి గొంతు పిసికి చంపారని తెలిసింది."
    చీఫ్ చెప్పించటంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంత లీడ్ చేసినా తనకు తెలిసింది అంతే అన్నట్టు చెప్పింది సునీల.
    డిఫెన్స్ వారు క్రాస్ చేయటం మొదలుపెట్టారు.
    "నువ్వు, రాధ ఇంటినుండి కలసి బయలుదేరి, వెయిటింగ్ రూమ్ వైపు రాధ వెళుతుంటే నువ్వెందుకు వెళ్ళలేదు?"
    చెప్పటానికి ఇష్టంలేనట్లు తటపటాయించింది సునీల.
    డిఫెన్స్ వారు మరల అడగటంతో___
    "వెళ్ళలేదు" సమాధానంగా అంది.
    "ఎందుకు?" తిరిగి ప్రశ్న వేశాడు డిఫెన్స్ లాయర్.
    "వెళ్ళాలనిపించలా...." ముక్తసరిగా సమాధానం చెప్పింది.
    "ఎందుకు...."
    "ఆ పనులు నా కిష్టంలేదు...."
    "అంటే...."
    చెప్పటానికి సిగ్గుపడ్డట్టు తల వొంచుకుంది.
    "అంటే శారీరక సుఖానికి సంబంధించినవేకదా!"
    సమాధానంగా "ఊ" కొట్టింది.
    "వెయిటింగ్ రూమ్ లో ఎవరన్నా మగవాళ్ళు వున్నారా?"
    తడబడింది సునీల
    మళ్ళీ రెట్టించి అడిగాడు డిఫెన్స్ లాయర్.
    "ఉన్నారు...."
    "ఎంతమంది?...."
    "ఓ గుంపు. చీకట్లో నేను సరిగా చూడలేదు"
    "వాళ్ళలో ఎవరినన్నా గుర్తించగలవా ?"
    "గుర్తించలేను...."
    "ముద్దాయి అనబడే ఈ రవికుమార్ నీకు తెలుసా?...."
    "తెలుసు మా కాలేజి స్టూడెంట్"
    "ఆరోజు అతన్ని ఎక్కడ చూశావు ?"
    "స్టేజిమీద మాట్లాడుతుండగా."
    సునీల చెప్పింది విన్న హరిశ్చంద్రుడి ముఖం పాలిపోయింది. నాలుగు రోజుల నుండి దగ్గరుండి రాధ వెళ్ళింది రవికుమార్ దగ్గరకేనని అతనే రాధను రేప్ చేసి చంపాడని చెప్పమని తర్ఫీదు ఇచ్చినా తెలియనిదానిని, చూడనిదానిని చెప్పలేకపోయింది సునీల.
    తరువాత కేసు ఏమౌతుందో, జడ్జిమెంట్ ఏం వినవస్తుందో హరిశ్చంద్రుడికి బాగా తెలుసు.
    కోర్టు బయట బక్కచిక్కిన వృద్ధుని ముఖంలో ఏదో ఆశ. జడ్జిమెంటు ఎప్పుడెప్పుడా అంటూ చెవులు రిక్కించి వింటున్నాడు.
    హరిశ్చంద్రుడు, బక్కచిక్కిన వృద్ధుడి ఆలోచన ఒక్కక్షణం 16 సంవత్సరాలు వెనకకు మరలింది.

                                                                *    *    *

    అది సెషన్స్ కోర్టు. ముద్దాయి స్థానంలో వున్న వ్యక్తి మొహంలో ఏ విధమైన భావన వ్యక్తం కావటం లేదు.
    జనం ఎవరి ఊహకు తగ్గట్టు వాళ్ళు జడ్జి వేయబోయే శిక్షను అంచనా వేస్తున్నారు.
    న్యాయపతి కొన్ని క్షణాలలో జడ్జిమెంటు చెప్పనున్నారు.
    ఈ లోపు క్లుప్తంగా కేసు వివరాలు_
    అతను పేరుకు హరిశ్చంద్రుడు. అంటే అతని పేరే హరిశ్చంద్రుడు. డిగ్రీ కాలేజీలో బి.ఏ. ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. చనిపోయిన వినాయకరావు అతని క్లాస్ మేట్. వాళ్ళు ఇద్దరు కలసి రోజు సైకిళ్ళమీద కాలేజీకి వస్తారు. క్రిందటి సంవత్సరంలో కాలేజి స్టూడెంటు యూనియన్ ఎలక్షన్స్ జరిగాయి. ఇరువర్గాలవారు ఎంత బ్రతిమాలినా, భయపెట్టినా, రాజకీయాలకి దూరంగా వుంటానని ఓటు వేయలేదు. అతనితోపాటే చాలామంది విద్యార్థులు ఎలక్షన్ల జోలికి పోలేదు. సాయంత్రం రిజల్ట్సు తెలిసాయి. డబ్బు బాగా ఖర్చుపెట్టిన విద్యార్థి ఓడిపోయాడు. వినాయకరావు, హరిశ్చంద్రుడు చెరో సైకిలుమీద ఇళ్ళకు బయలుదేరారు. కాలేజి గేటుదాటి మలుపు తిరగ్గానే వినాయకరావు మీదకి బరిశ దూసుకు వచ్చింది. మరుక్షణంలో అతను నేలమీద కుప్పకూలిపోయాడు. బరిశ గుండెను చీల్చుకొని వెళ్ళింది. అతను శాశ్వతంగా వూపిరి వదిలాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS