Previous Page Next Page 
వైరం పేజి 22


    "విక్రమ్ సింగ్ నిజంగానే ఒక రాచకుటుంబానికి చెందిన వ్యక్తి! బాగా బతికి చెడ్డ కుటుంబం. అందుకే ఇప్పుడు మా దగ్గర మేనేజర్ గా పనిచేస్తున్నాడు" అన్నాడు జానీ.
    అందరూ విక్రమ్ సింగ్ వైపు కుతూహలంగా చూశారు.
    "ఇప్పుడు రాజదర్బారు ఘట్టం!" అన్నాడు జానీ.
    "ఇవాళ్టి చక్రవర్తి...ఇంకెవరూ? మన అభిరాం! అభిరాం అలియాస్ అబ్రహాం సర్!"
    అభిరాం నవ్వుతూ ముందుకు వచ్చాడు.
    "ఇకపోతే ఇవాళ్టి క్వీన్ మిస్ మేరీ ఫ్రమ్ అమెరికా! సార్థకనామధేయురాలు - ఎందుకంటే - అప్పట్లో ఢిల్లీలో జరిగిన నిజం దర్బారులోని రాణీ పేరూ మేరీనే.
    లేడీస్ అండ్ జెంటిల్మెన్!
    ఇక్కడ మనం కాస్త బ్యాక్ గ్రౌండ్ స్టోరీ చెప్పుకోవాలి" అని చెప్పడం మొదలెట్టాడు జానీ.
    "1912లో -
    అప్పటి బ్రిటిష్ రాజు అయిన అయిదవ జార్జి తన రాణీ మేరీతో కలిసి, అప్పట్లో తమ వలస దేశమైన ఇండియా రాజధాని ఢిల్లీలో ఒక దర్బారు నిర్వహించాడు. ఇండియన్ రాజాలూ, మహారాజాలూ అందరూ ఆ దర్బారుకి వచ్చి, ఎంతో వినయ విధేయతలతో తెల్ల ప్రభువు పట్ల తమకి ఉన్న రాజభక్తినీ విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు. వాళ్ళలో మా ప్రిన్స్ విక్రమ్ సింగ్ పూర్వీకుడు కూడా ఒకరు" అని చెప్పి, ఆ తర్వాత, అప్పటి దర్బారులోలానే, ఇప్పటి ఈ ఉత్తుత్తి దర్బారులో జరగవలసిన తతంగం అంతా వివరించి చెప్పాడు జానీ.
    'తమాషా' మొదలయింది.
    బాగా ఎత్తుగా ఉన్న సింహాసనం లాంటి కుర్చీల మీద దర్పాన్ని అభినయిస్తూ కూర్చున్నారు 'రాజు' అభిరాం, 'రాణి' మేరీ.
    పేరిగాడు రాజంట, పేరెలి రాణంట' అనే పాట 'ప్రతాపరుద్రీయం' నాటకంలోనిది, గుర్తు వచ్చింది విక్రమ్ సింగ్ కి.
    నేటి నాటకంలో నేటివు మహారాజా వేషంలో ఉన్న మేనేజరు విక్రమ్ సింగ్ ముందుకు వచ్చాడు. జరీ వర్కుతో మెరిసిపోతూ మోకాళ్ళదాకా వస్తున్న ముఖమల్ షేర్వాణీ, పాదాలని గట్టిగా చుట్టేసుకుని పట్టేసుకుని వున్నట్లుగా వున్న చుడీదార్ పైజమా, పాదాలకు వంకర తిరిగి వున్న ఛడావులు - మెడలో హారాలు - తలమీద పాగా - దానిమీద ఒక కుచ్చు.
    అయితే -
    ఆ వేషధారణ విక్రమ్ సింగ్ కి ఫ్యాన్సీ డ్రెస్సులాగా కనబడటం లేదు. సరిగ్గా అతికినట్లుగానే వుంది.
    నాటకం వూపందుకుంటోంది.
    ఇండియన్ 'మాహారాజా' విక్రమ్ సింగ్, సింహాసనారూఢులయిన 'చక్రవర్తి' దంపతులని భయభక్తులతో సమీపించాడు.
    శిరసు వంచి వినయంగా చేతులు జోడించి నమస్కరించాడు.
    'చక్రవర్తి' అభిరాం అనుగ్రహిస్తున్నట్లుగా ప్రసన్నవదనంతో తలపంకించాడు.
    విక్రమసింగ్ మూడుసార్లు వంగి వంగి నమస్కారాలు చేశాడు. ఆ తర్వాత మూడు అడుగులు వెనక్కి వెనక్కి నడిచి, వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
    'మహా ఘనత వహించిన మైసూరు మహారాజా, హైదరాబాదు నైజామూ లాంటి వాళ్ళు సైతం ఇట్లా ఇంగ్లీషు దొరలకి వంగి వంగి సలాములు చేస్తూ రాజ్యాలు నిలుపుకున్నవాళ్ళే!" అన్నాడు జానీ కులాసాగా.
    కానీ -
    అది పూర్తిగా నిజం కాదని విక్రమసింగ్ కి తెలుసు.
    విక్రమ్ సింగ్ పూర్తిపేరు రాజ్ బ్రిజ్ బహదూర్ వీర్ విక్రమ్ సింగ్ గయక్వాడ్.
    బరోడా సంస్థానాన్ని పాలించిన గయక్వాడ్ ల వంశస్తుడే ఈ విక్రమ్ సింహ్ గయక్వాడ్. వంశస్తుడే తప్ప వారసుడు కాడు.
    గయక్వాడ్ లు మనకి చాలామంది కనబడతారు. క్రికెట్ ప్లేయరు ఒక గయక్వాడ్ ఉన్నాడు. సినీస్టార్ రజనీకాంత్ అసలుపేరు కూడా శివాజీరావు గయక్వాడ్. ఎవరు ఎవరి తాలూకో పరిశోధిస్తేగానీ తెలియదు!
    అప్పటి బరోడా మహారాజా శాయాజీరావు చాలా అభిమానధనుడు. ఢిల్లీ దర్బారుకి వెళ్ళక తప్పింది కాదు. వెళ్ళాడు కూడా.
    కానీ ఎట్లా వెళ్ళాడూ?     
    రారాజులాగా దర్పంగా వెళ్ళాడు.
    తలవంచడానికి బదులు రొమ్ము విరుచుకు నిలబడ్డాడు. మూడుసార్లకి బదులు ఒక్కసారి మాత్రమే అభివాదం చేశాడు. మూడు అడుగులు వెనక్కి వేయకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
    బరోడా రాజు ధిక్కారాన్ని గమనించాడు వైశ్రాయి కర్జన్.
    అప్పటికే ఆంగ్లేయుల దృష్టిలో ఉన్నాడు ఆ మహారాజు. పైగా, బరోడా రాణీగారి స్వాభిమానం కూడా తెల్లదొరల దృష్టిలో నల్ల మరకలా కనబడింది.
    బరోడా దంపతులని బెదిరించడం మొదలయింది.
    తన రాజ్యానికి ఎసరు తప్పదని గ్రహించిన గయక్వాడ్ తప్పనిసరి పరిస్థితులలో రాజీ పడిపోయాడు.
    పరాయి ప్రభువుల పట్ల తనకి విశ్వాసం ఉన్నట్లుగా ప్రకటించి రాజ్యాన్ని నిలుపుకోగలిగాడు.  
    'ఆరోజు ఆ రాజు అట్లా రాజీపడకుండా ఉంటే బాగుండేది' అనుకున్నాడు విక్రమ్ సింగ్.
    మళ్ళీ అంతలోనే అతనికి అనిపించింది.
    పాపం రాజ్యమే పోయే రోజు వస్తే రాజీ పడక ఏం చేస్తాడూ?
    ఇక్కడ తను జీతం రాళ్ళకోసం ఈ తమాషాకి తాళం వేయడం లేదూ?
    తప్పదు. కనీసం-
    ప్రస్తుతానికి!
    మరోవైపున ...
    అనుకోకుండా ఈ రోజు జరిగిపోతున్న ఈ దర్బారు, నాటకంలో తనే రాజు పాత్రధారి కావడం అభిరాంకి చెప్పలేనంత ఆనందాన్ని కలిగిస్తోంది.
    ఇవాళ జరుగుతున్న ఈ ఉత్తుత్తి నాటకం రేపు నిజం కావాలి.
    తను ఒక నిజం రాజు కావాలి.
    లేదా -
    కనీసం ఒక దేశానికి ప్రెసిడెంటో, ప్రైమ్ మినిస్టరో కావాలి.
    కనీసం ఆ 'తమాషా' పూర్తి అయ్యీ అవకముందే ఇంకో సరికొత్త డ్రామా మొదలయింది.
    "దాస్ వచ్చాడు సర్!" అన్నాడు జానీ, వంగి అభిరాం చెవిలో.
    అభిరాం మొహం వికసించింది.
    దాస్ - చండీదాస్!
    ది డాన్!
    వీడికీ తనతో అవసరం పడిందా?
    వెల్ అండ్ గుడ్!

                        *    *    *    *

    వెస్ట్ బరో :
    మాసాఛూ సెట్స్ రాష్ట్రం:
    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా:
    కొంతమంది తట్టిలేపినా, అది కొట్టి లేపడం లాగే వుంటుంది.
    అట్లా ఎవరో తనని కొట్టినట్లనిపించి, ఉలిక్కిపడి లేచాడు ఆనంద్.
    "అమ్మాయి పన్నెండున్నర ఫ్లయిట్ లో వస్తుంది. మీరు ఎయిర్ పోర్టుకి వెళ్ళి పికప్ చేసుకుని రావాలి" అంటోంది సితార, ఆర్డర్ జారీ చేస్తున్నట్లుగా.
    "సరే!" అన్నాడు ఆనంద్.
    ఆ ఇంట్లో అతను ఎక్కువగా ఉపయోగించే పదం అదే - 'సరే'.
    'సరే' అని ఒప్పేసుకోవడమో లేదా అంతకంటే బెస్టు ఏమీ అనకుండా గంగిరెద్దులా తల ఆడించేయడమో - వాదోపవాదాలకి అది విరుగుడు.
    అనుభవం మీద ఆనంద్ గ్రహించిన సత్యం అది.
    "మీరు ఫోర్డు తీసుకెళ్ళండి" అంది సితార.
    ఫోర్డు తీసుకెళ్ళమని ప్రత్యేకంగా చెప్పవలసినపనే లేదనుకున్నాడు ఆనంద్ మనసులోనే.
    ఫోర్డు తీసుకెళ్ళమని ప్రత్యేకంగా చెప్పవలసినపనే లేదనుకున్నాడు ఆనంద్ మనసులోనే.
    ఫోర్డు అంటే అమెరికాలో చాలా మామూలు కారుకింద లెఖ్ఖ. సితార వాడేది ఓల్వో. ఖరీదైన కారు.
    అన్ని విషయాల్లోనూ ఆచితూచి ఖర్చుపెట్టే సితార, ఆ ఒక్క ఓల్వో విషయంలో మాత్రం పైసల దగ్గర పట్టు ఎలా వదలగలిగిందో ఆనంద్ కి ఇంకా మిస్టరీనే!
    "కారు ట్యాంకు నిండా పెట్రోలు ఉంది. క్రెడిట్ కార్డు మీ పర్సులోనే వుంది. పైన ఇంకో ఇరవై డాలర్లు వుంచాను. కార్డు వుంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసేయకండి" అంది సితార కటువుగా.
    ఇదంతా ఇంకా ఆనంద్ పక్కమీద నుంచి పూర్తిగా లేవకుండానే!
    ఒక్కసారిగా బ్లడ్ ప్రెజర్ పెరిగిపోయినట్లుగా అనిపించింది ఆనంద్ కి.
    పేరుకి అమెరికానే గానీ ఇక్కడ పైసలకూ, ప్రాణాలకీ లంకె!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS