Previous Page Next Page 
మంచివాడు పేజి 22

అందరూ "రమేశ్ అదృష్టవంతుడు" అన్నారు.
నిజమే! రమేశ్ అదృష్టవంతుడే. అందుకే అతని హృదయం కిందపడి ముక్కలైపోకుండా అపురూపంగా అందిపుచ్చుకుంది రేఖ.
ఇంకేం? సరికొత్త ప్రేమకథ మొదలైంది.
రెండు కళ్లు నాలుగైనాయి (చార్ ఆంఖేంహుయీఁ)
చూపులు ఊసులు చెప్పుకున్నాయి.
చిరునవ్వులు పలకరించేసుకున్నాయి.
పుస్తకాలు మార్పిడి జరిగింది.
ఆ పుస్తకాలు ఒకరి ప్రేమలేఖల్ని మరొకరికి రెండో కంటికి తెలియకుండా, గుప్తంగా, భద్రంగా అందించాయి.
మనసులు మార్గాన్ని అన్వేషించాయి.
అభిలాషలు ఆ మార్గంలో పూలు చల్లాయి. కాని ఆ పూల మధ్య లోకం అమర్చిన ముళ్ళు వాళ్ళ కళ్ళకు కన్పించలేదు.
ప్రేమకథ ఆ పూల బాటలో వయ్యారంగా నడక సాగించింది.
సినిమాలూ - శికార్లూ, ప్రేమ సంభాషణలూ - కథ వేగాన్ని పుంజుకుంది. ఊపుగా ముందుకు పోతూంది.
కొత్త శైలితో పాత కథ కొంత దూరం మాత్రమే ఉత్సాహంగా నడిచింది.
అంతవరకూ తారు రోడ్డు మీద సరికొత్త ఇంపాలా కారులా నడిచిన కథ, గతుకుల బాటలో ఒక ఎద్దుబండిలా నడవ సాగింది.
కొంత వరకూ అన్ని ప్రేమ కథలూ ఒకటిగానే వుంటాయి. ఆ కథల ముగింపులే వేరు వేరుగా వుంటాయ్.
రేఖ కూడా కథ ముగింపును గురించి ఆలోచనలో పడింది.
దాంతో కథ ముందుకు కదలనని మొరాయించింది.
ఒక రోజు రేఖ రమేశ్ ను అడిగేసింది __ "ఎంతకాలం ఇలా?"
రమేశ్ రేఖ ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు.
"ఏమిటి అలా చూస్తావ్? మన పెళ్లి విషయం మీ నాన్నతో చెప్పావా?" అడిగింది రేఖ.
రమేశ్ ఆలోచనలో పడ్డాడు.
"ఏమిటి మాట్లాడవే?" రెట్టించింది రేఖ.
"మా నాన్న అంటే నాకు భయం !"
రేఖ భయంభయంగా చూసింది.
"రోజూ అడగాలనుకుంటూనే అడగలేక పోతున్నాను."
"మరి ఎలా" బేలగా చూసింది రేఖ.
రమేశ్ ఓ క్షణం ఆలోచించాడు. రేఖ ఆతృతతో అతని ముఖంలోకి చూస్తోంది.
"మీ నాన్నను వచ్చి మా నాన్నతో మాట్లాడమను" అన్నాడు రమేశ్.
"నాకు సిగ్గు బాబూ! మా నాన్నతో ఎలా చెప్పడం?" బోలెడంత సిగ్గు ముంచేసింది రేఖను.
"మీ అమ్మతో చెప్పు. ఆమె మీ నాన్నతో చెబుతుంది."
రేఖకు రమేశ్ సలహా బాగానే వున్నట్టు అనిపించింది.

                                                   *    *    *    *
ఆ రాత్రి రేఖ తల్లితో చెప్పింది.
అంత గొప్పింటి పిల్లవాడు కూతుర్ని ప్రేమిస్తున్నట్టు విని ఆ తల్లి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. తన బిడ్డ అదృష్టవంతురాలు! అనుకొని మురిసిపోయింది.
మురిపెంగా కూతురి తల నిమిరింది. కూతురు తల్లి గుండెల్లో తన మొహం దాచుకుంది.
భోజనాల దగ్గిర రేఖ తల్లి తండ్రితో చెప్పేసింది.
తెల్లవారే  వెళ్లి రమేశ్ తండ్రితో మాట్లాడమని చెప్పింది మళ్ళీ ఆలస్యం ఎందుకు అన్నట్టు.
రేఖ తండ్రి కళ్లు పెద్దవి చేసుకొని తల్లీకూతుళ్ళను మార్చి మార్చి చూశాడు.
నోటి దగ్గిరకు వెళ్ళబోతున్న చెయ్యి మధ్యలోనే ఆగిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS