Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 22


    "మీ కర్తవ్యాన్ని నేను ప్రశ్నించడం లేదు మిస్టర్ రణధీర్. దోషి ఎవరో తెలిశాక కూడా ఎందుకు నిర్బంధించడం లేదు? ఎందుకు తాత్సారం చేస్తున్నారూ అని అడుగుతున్నాను.


    "బుల్ షిట్. ఇదేం రివాల్వర్ కాదు. ట్రిగ్గర్ నొక్కగానే బుల్లెట్ లా దూసుకుపోవడానికి..."


    అదిగో సరిగ్గా అక్కడే శశాంక సహనాన్ని పూర్తిగా కోల్పోయింది రణధీర్. అక్కడ పరిహాసంగా ఉదాహరించిన శశాంక కేపబులిటీని మాత్రమే కాక అతడి అహాన్ని గాయపరిచాడు.


    "అదేం అంత సులభమని మీరనుకుంటే మీ నడుంకి వేలాడే ఆ రివాల్వర్ కేవలం అలంకారప్రాయంగా మారి తుప్పు పట్టేదికాదు. నేరస్థులు ఇంత విచ్చలవిడిగా మీ ముందే మారణహోమానికి కారణమయ్యేవారూ కాదు."


    "డోంట్ డిస్టర్బ్ మి" రణధీర్ ఉద్రేకంగా లేచి "ప్లీజ్ గెటప్" అన్నాడు చాలా సమీపంగా వచ్చి.


    "నాకు జవాబు కావాలి" రెట్టించాడు.


    "చెప్పను."


    "నాకు జవాబు కావాలి."


    "చెప్పాల్సిన అగత్యం నాకు లేదు."


    "నాకు జవాబు కావాలి."


    "మిస్టర్ శశాంకా" రోషంగా రెండడుగులు ముందుకేసిన రణధీర్ ఠక్కున ఆగాడు. అప్పటికే శశాంక కూడా ఒక అడుగు ముందుకు రావడంతో.


    రణధీర్ ఊహించివుండడు అతడి ప్రవర్తన శశాంకనెంత రెచ్చగొట్టిందీ...


    ఒక్క అర క్షణంపాటు శశాంక తనను తాను మరిచిపోయి వుంటే రణధీర్ శరీరం గాలిలోకి లేచి స్టేషన్ గుమ్మంపై నిర్జీవంగా పడడంతోపాటు అడ్డొచ్చిన పోలీసు బలగాన్ని కూడా ఎదుర్కొని ఆ స్టేషన్ ని చిందరవందర చేసేవాడు.


    కాని శశాంకని పరోక్షంగానైనా కట్టిపడేసింది మామయ్యకిచ్చిన మాట.


    శశాంక ఆవేశంగా బయటికి నడిచాడు.


    ఒక నేరస్థుడికి కొమ్ము కాస్తున్న పోలీసు వర్గంపై తొలిసారి ఎంత జుగుప్స ఏర్పడిందీ అంటే అతడి పై ఆఫీసర్స్ ని కాక సరాసరి హోం మినిష్టర్ నే కలవాలని వెళ్ళాడు.  


    ప్రజాస్వామిక విధానాలపై ఇంకా చావని విశ్వాసంతో నిన్నగాక మొన్న జాతీయస్తాయి షూటింగ్ కాంపిటీషన్లో మొదటివాడిగా స్థానం సంపాదించిన తొలి తెలుగువాడిగా తన ఐడెంటిటీతో సులభంగానే హోం మినిస్టర్ సదాశివయ్యతో ఇంటర్వ్యూ సంపాదించగలిగాడు.


    గెలుపుకి అభినందన, భార్య మరణానికి సంతాపం ప్రకటించిన హోం మినిస్టర్ "మావాడు అలాంటివాడు కాదంటే కాడు" అంటూ ధనుష్కోటి గురించి తనే ఓ అద్భుతమైన సర్టిఫికెట్ ఇవ్వడంతో తొలిసారి తత్తరపడ్డాడు.


    "మా వాడు" అన్న పదంతో పరోక్షంగా తను ధనుష్కోటిని ఎంతగా షిల్డ్ చేస్తున్నదీ అర్థమైపోయింది.


    మీ వాడు 'ఎలా అయ్యాడు' అంటూ నిలదీయలేదు...


    న్యాయం జరిగే అవకాశం కోల్పోతున్న వాస్తవాన్ని గ్రహించి ఈ దేశపు రాజకీయాల అవినీతి అంచుల్ని అస్పష్టంగానైనా దర్శించే అవకాశం దక్కిన ఆ క్షణాలను ఇక జీవితంలో మరిచిపోకూడదన్నంత ఆవేశంగా బయటికి వచ్చాడు.


    ఈ వార్త పొక్కిన వెంటనే ప్రతిపక్షాలు ఎంత ముమ్మరంగా పనిచేయడం మొదలుపెట్టాయీ అంటే స్వతంత్రం వచ్చిన నలభయ్యేళ్ళుగా బంద్ లకీ, హర్తాళ్ళకీ పరిమితమైన వారి రాజకీయ చరిత్రకి మరో పేజీ అలంకార ప్రాయంగా కూర్చుకోవాలని ఉబలాటపడి శశాంకని చుట్టుముట్టారు.


    తమ అస్తిత్వాన్ని అప్పుడప్పుడూ ప్రజలకు తెలియపరిచే పద్ధతిలోనే శశాంకతో ఫోటోలు దిగి పత్రికా విలేకర్లతో "ఈ దేశం ఏమైపోతూంది... ఎక్కడ శాంతిభద్రతలు... శశాంక లాంటి గౌరవనీయుడికే న్యాయం జరగనినాడు ఇక సామాన్యుడి మాటేమిటి? త్వరలోనే రాష్ట్ర స్థాయి బంద్ నేర్పాటు చేస్తాం. ప్రభుత్వం బర్తరఫ్ కావాలని కేకలు పెడతాం_ అసెంబ్లీ దుమ్ము లేపుతాం" అనే పడికట్టు పదాల హోరుతో చాలా ఆవేశాన్ని ప్రకటించేశారు.


    ఇదంతా జరగటానికి పట్టింది కేవలం మూడు గంటలు మాత్రమే.


    అప్పుడు శశాంకని కలిసింది వినీల. బలవంతంగా ఓ రెస్టారెంట్ కి తీసుకువెళ్ళింది.


    "ఎందుకు శశాంకా... ఇంకా ఏం న్యాయం జరుగుతుందని ఆశించి ఇంత ఆవేశపడుతున్నారు?"


    "ఒకనాటి అర్ధరాత్రి స్వతంత్ర్యానికి నిదర్శనంగా అన్ని కోణాలలోనూ చీకటిని మాత్రమే దక్కించుకున్న ఈ సమాజంలో మీకు మీరై వెలుగురేఖగా మారే ప్రయత్నం చేయక అవకాశవాదుల చేతుల్లోకి ఎందుకు జారిపోతున్నారు..." బాధగా అడిగింది. "మీకు తెలీదు శశాంకా... మీరు నమ్మిన న్యాయాన్ని ఏ పోలీసాఫీసరూ, ఏ రాజకీయ నాయకుడూ' మీ కంత వేగంగా అందించలేడు..."


    "నిశ్శబ్దంగా వూరుకోమంటారా వినీలా" నిస్సహాయత ధ్వనించిందతడి గొంతులో... ఏదో చేయాలన్న ఉద్విగ్నత స్పష్టంగా వినబడింది.


    'అంటే శబ్దంతో లక్ష్యాన్ని చేరి మీకున్న గురి తప్పని ఆత్మవిశ్వాసాన్ని శబ్ద భేరి విద్యగా మార్చుకుని ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నారా? మీకు తెలీదు శశాంకా... ఈ దేశం చాలా కలుషితమై పోయింది. కరప్షన్ అనే పదం ఈ ప్రపంచాన్ని నిర్విఘ్నంగా ఏలుతూంది. మనుషుల మధ్య మానవత అనే బంధం ఏనాడో తెగిపోయి ఇప్పుడు కరప్షన్ పాశంగా మారి అదే కావాలనుకునేవాళ్ళ పబ్బం గడుపుకునే ఓ అస్త్రమైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మీకేదో ఒరగబెడతామన్న ఆ ప్రతిపక్షాలూ మిమ్మల్ని కరప్ట్ చేయడానికి ప్రయత్నించాయి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS