"ఇప్పుడు మాత్రం మించిపోయిందేమీ లేదు. ఇప్పట్నుంచి ప్రయత్నించి వచ్చే జనరల్ ఎలక్షన్స్ అధికార పార్టీటికెట్ కోసం ప్రయత్నిస్తే బాగుంటుంది" అన్నాడు లోపలికి అత్తతో నడుస్తూ సారధి.
"ఆలోచిద్దాం!" అంది లలితాంబ.
సారధి నవ్వుకున్నాడు.
లలితాంబ మేడ మెట్లు ఎక్కబోతుంటే అన్నాడు.
"రసం కాస్తానన్నావు కదత్తయ్యా!"
"అవును కదూ, ఆ సంగతే మర్చిపోయాను" అంటూ మళ్ళీ వెనక్కి తిరిగి కిచెన్ లోకి నడుస్తుంటే సారధి అనుకున్నాడు.
"నిజంగా అత్తయ్య అలాంటి స్థానంలోకి వచ్చి వుంటే ఆరు కోట్ల మంది తెలుగు వారికి డెమోక్రసీ కరువైపోయేది" అని.
సరిగ్గా అదే సమయంలో భారతి మేడమెట్లు దిగి వస్తూ......
"మేడమీద కిటికీలోంచి చూశాను. ఏమిటి అమ్మని బాగా కాకా పడుతున్నావు?" అంది.
సారధి నవ్వుతూ చెప్పాడు.
"అత్తయ్య ఎం.ఎల్.ఏ. గా పోటీ చేయబోతోంది."
లాయర్ లక్ష్మిపతి ఆఫీసు రూంలోంచి బయటకొచ్చి ఆ మాటలు విని ఉలిక్కిపడ్డాడు.
"ప్రజల్ని ఇక ఆ దేవుడే కాపాడాలి" అనుకున్నారాయన.
సారధి నవ్వుతూ లోపలికి నడిచాడు.
డైనింగ్ హాల్లో అందరూ భోజనం చేస్తున్నారు.
సారధిని లలితాంబ పదే పదే 'అది వేసుకో, ఇది వేసుకో అంటోంది. అది చూసి భారతి, లక్ష్మిపతి ముసిముసిగా నవ్వుకున్నారు.
ఆఖరికి వంట మనిషి బాలయ్య కూడా నోరెళ్ళబెట్టి విడ్డూరంగా చూస్తున్నాడు.
"ఛ.ఛ. అదేం తినడం. వయసులో తినకపోతే ముసలాడివైనాక తింటావా? నువ్వు ఇంత మొహమాటస్తుడవని నాకసలు తెలీదు. పెంచలయ్యా, ఈ అబ్బాయి రోజూ ఇంతేనా?"
"అవునమ్మగారు. బాబుగారిది పిట్టతిండేనండీ."
"ఏమిటా భాష. పిట్టతిండట. ఇంకానయం పక్షితిండన్నావు కాదు ఇదేవన్నా నీకు పరాయి ఇల్లా సారథీ. ఆ 'రసం' కాసింది నీకోసం బాగోలేదా?" లలితాంబ మాటలకి ఆనకట్ట లేకుండా ఉంది.
"అయ్యో, ఎంత మాటత్తయ్యా, ఒట్టి రసం గ్లాసులో పోసుకొని తాగాలనిపిస్తుంటే!" అన్నాడు సారధి.
ఆ మాటలు పూర్తికాలేదు.
"బాలయ్యా, బాబుకి గ్లాసులో పోసి రసం ఇవ్వు" అంది లలితాంబ.
బాలయ్య వెంటనే ఆపని చేసేశాడు.
సారధి అవస్థపడుతూ ఆ రసాన్ని తాగుతుంటే భారతి చాటుగా నవ్వుతోంది.
పొగడ్తనేది ఎలాంటి మనిషినైనా ఎంత స్థాయికి తీసుకెళ్తుందో లలితాంబ విషయంలో చూసిన లక్ష్మిపతి నవ్వుతున్నాడు.
"సారధీ"
"ఏమిటత్తయ్యా!"
"నీ ఉధ్యోగం విషయంలో రేపు డి.పి.ఐ గారితో, అయ్ మీన్ ఆయనగారి భార్యతో మాట్లాడతాను. ఆ తర్వాత నువ్వెళ్ళి ఆయన్ని కలుసుకొందువుగానీ"
"అలాగే అత్తయ్య" అన్నాడు.
ఇన్ని రోజులుగా లేనిది, ఈ రోజు హఠాత్తుగా ఆమెకెందుకు అనుగ్రహం కలిగిందో సారధికి ఇట్టే అర్థం అయింది.
"అలాగే అని బుద్ధావతారం తలూపకు. నీలాంటి కుర్రాళ్ళకి కాస్త ముందు చూపు వుండాలి. ఉద్యోగం, సద్యోగం లేకుండా పెళ్ళిచేసుకొన్నావు. ఎవర్ని ఉద్దరించడానికి? పెళ్ళాన్ని ఇంట్లో పెట్టి, ఉద్యోగం కోసం దేశాలు పట్టి తిరుగుతన్నావు. అసలు నీలాంటి వాళ్ళవల్లే ఈ దేశం ఇలా అయిపోతోంది."
ఆమె థోరణి పూర్తిగా మారిపోయింది.
"మా అమ్మ ఆఖరి కోరికగా పెళ్ళిచేసుకోక తప్పలేదు అత్తయ్య"
"స్టోరీస్ చెప్పకు. ఆ సంగతి నాకూ తెలుసు. అమ్మాయికి నెలగిలా తప్పలేదుగా?"
"ఇంకా అదేం లేదు."
"సంతోషం. అందులోనన్నా జాగ్రత్తపడ్డావు. చచ్చిపోయే మనిషి తృప్తికోసం నీ భవిష్యత్తుని పాడు చేసుకుంటావా? అందుకే ఈ దేశం ఇలా అయిపోయింది. నన్నడిగితే ఆడపిల్లకి పాతికేళ్ళు, మగాడికి ముప్పై ఏళ్ళు వచ్చేవరకు పెళ్ళి చేయకూడదు. నేను ముఖ్యమంత్రినైతే ఈ విషయంపై వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసేదాన్ని."
"ఇప్పటికే వస్తున్న ఆర్డినెన్స్ లన్నీ కోర్టులకెక్కుతున్నాయి లలితా. ఇంకా కొత్త ఆర్డినెన్స్ ఎందుకు?" అన్నాడు లక్ష్మిపతి.
"అంటే?" తీక్షణంగా అడిగింది.
"అంటే ఏం లేదు. మరచిపోయాను. నువ్వు చెప్పినట్టు చెయ్యకపోతే దేశం వెనక్కి పోతుంది."
"పరిహాసంగా ఉందా?"
"అదికాదు లలితా!"
"అదీలేదు, ఇదీలేదు. నావళ్ళు మండేలా మాట్లాడకండి. వారంలోనే ఢిల్లీ వెళుతున్నాను."
"ఎలక్షన్స్ ఇంకా చాలా దూరంలో వున్నాయత్తయ్య" చెప్పాడు సారధి.
"అవెప్పుడుంటే మనకేం. ఇప్పట్నించీ మనదారిలో మనం ఉందాం మధ్య మధ్య ఢిల్లీ వెళ్ళిరావడం మంచిది" అంది.
"అవును. అదీ నిజమే!" అన్నాడు సారధి.
లక్ష్మిపతి లోపలికి వెళ్ళిపోయాడు.
"వాష్ బేసిన్ దగ్గర సారధి చేతులు కడుక్కుంటుంటే వెనుకగా వచ్చి అంది భారతి.
"పులిమీద సవారీ చేయడానికి ప్రయత్నించకు బావా, మమ్మీ సంగతి నీకు తెలీదు. చెంబుడు రసం తాగించింది. అది గుర్తుపెట్టుకో.
