అద్వైతం
ఆనందం అర్ణవమైతే,
అనురాగం అంబరమైతే
అనురాగపు టంచులు చూస్తాం,
ఆనందపు లోతులు తీస్తాం.
నీ కంకణ నిక్వాణంలో,
నా జీవన నిర్వాణంలో-
నీ మదిలో డోలలు తూగీ,
నా హృదిలో జ్వాలలు రేగీ-
నీ తలపున రేకులు పూస్తే,
నా వలపున బాకులు దూస్తే-
మరణానికి ప్రాణం పోస్తాం,
స్వర్గానికి నిచ్చెన వేస్తాం.
హసనానికి రాణివి నీవై,
వ్యసనానికి బానిస నేనై-
విషమించిన మదీయ ఖేదం,
కుసుమించిన త్వదీయ మోదం-
విషవాయువులై ప్రసరిస్తే,
విరితేనియలై ప్రవహిస్తే-
ప్రపంచమును పరిహాసిస్తాం,
భవిష్యమును పరిపాలిస్తాం
వాసంత సమీరం నీవై,
హేమంత తుషారం నేనై-
నీ ఎగిరిన జీవవిహంగం
నా పగిలిన మరణమృదంగం-
చిగురించిన తోటలలోనో,
చితులుంచిన చోటులలోనో-
వలయములై చలించినపుడే,
విలయములై జ్వలించినపుడే-
కాలానికి కళ్ళెం వేస్తాం,
ప్రేమానికి గొళ్ళెం తీస్తాం.
నీ మోవికి కావిని నేనై,
నా భావికి దేవివి నీవై-
నీ కంకణ నిక్వాణంలో,
నా జీవన నిర్వాణంలో-
ఆనందం అర్ణవమైతే,
అనురాగం అంబరమైతే -
ప్రపంచమును పరిహాసిస్తాం,
భవిష్యమును పరిపాలిస్తాం.
(A.C. Swinburne తన రచనలలో, ముఖ్యంగా A Match అనే గీతంలో చూపిన మార్గానికి కృతజ్ఞతతో)
- 1936(?)
* * *
