Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 22

రవితేజ మెల్లగా చెప్పాడు.
ధీరజ అప్పుడు అతనిని పరిశీలనగా చూసింది.
అప్రయత్నంగానే ఆమె కను కొలకులలో అశ్రు బిందువులు ఊరాయి.
ఈ జైళ్ళు ఇంకా ఎంతమంది గొప్పవాళ్ళను తమలో ఇముడ్చుకుంటాయో... ఈ జైళ్ళలో ఎందరి బ్రతుకులు అంతరించిపోతున్నాయేమో... ఈ నాలుగు గోడల మధ్య ఇంకా ఎందరి మహానుభావుల జీవితాలు మగ్గిపోతున్నాయో... ఎందరు మహనీయుల మనసులు నలిగిపోతున్నాయో... తనలో తనే మధనపడింది ఆమె!
ఆఖరుగా ఆ ఇద్దరినీ అప్యాయంగా పలకరించి.... జైలర్ తో బయటకు వచ్చింది ధీరజ.
"రణధీర్ తో మాట్లాడవలసిన అవసరం మీకు లేదు... అయినా మాట్లాడారు" అన్నాడు జైలర్.
"రవితేజను విజిటర్స్ గాలరీకి తీసుకుని రాకుండా నన్ను సెల్ వద్దకు తీసుకెళ్ళారు. ఊహించని అవకాశం వచ్చింది. కాబట్టి సద్వినియోగం చేసుకున్నాను" అన్నది ధీరజ భుజాలు ఎగురవేస్తూ.
జైలర్ నిరుత్తరుడయ్యాడు.
ధీరజ ఆయనకు కృతఙ్ఞతలు చెప్పి హోండాను స్టార్ట్ చేసింది.
ఇప్పుడు ఆమె చెవులతో రణధీర్ మాటలే హెచ్చరికగా మారు మోగుతున్నాయి.
తనకు శత్రువులు పెరుగుతున్నారు....
వాళ్ళు ఎవరో కాదు రాజకీయ శత్రువులు....
ఇకనుంచి ప్రతిక్షణం ఎంతో జాగ్రత్తగా వుండాలి.
ఎదురుగా వచేవారిని తన కరాటే ప్రావీణ్యంతోనో.... మనో నిబ్బరంతోనో ఎదుర్కొనగలదు.
కానీ, చాటున పొంచి ఉండి దొంగ దెబ్బ తీసేవారి విషయంలో తను ఆశక్తురాలే!
ధీరజ ఆలోచనలు పరి పరి విధాల సాగిపోతున్నాయి.....
 
                                                       *    *    *    *
వీరేష్ జీప్ ఆపి కిందకు దిగాడు.
ఆ వీధిలోనే వుంటూ కుప్ప తొట్టిల్లో చెత్తా చెదారాన్ని ఆనందముగా ఆరగించే వీధి కుక ఒకటి ప్రహరీ పక్కనే వున్న కుప్పతొట్టి వైపు నడిచింది.
తలను పైకి ఎత్తి ఆ కుప్పతొట్టిలోకి  దృష్టి సారించిందో లేదో మరుక్షణమే ఎవరో తరుము తున్నట్టు 'కుయ్' మంటూ దూరంగా పరుగుదీసింది
యాధాలాపంగా అది గమనించిన వీరేష్ భృకటి ముడిపడింది.
దూరంగా నిలుచుని మూలుగుతున్న ఊర కుక్క చూపులన్నీ అ కుప్పతొట్టి వైపే వున్నాయి దాని  తోక పైకీ కిందకూ ఊగుతుంది. దాని కన్నులలో ఏదో భీతి.... ఎప్పుడూ తను తినే చోట  మరి ఒక శత్రువు వచ్చి తినడానికి సిద్దపడినప్పుడు అసహాయ  స్థితిలా వుంది దాని ప్రవర్తన!
ఆ కుప్ప తొట్టివైపు చూసిన  వీరేష్ కు  మరి ఒక కుక్క కనిపించలేదు.
గేటు తీసుకుని లోపలకు వెళ్ళే ఉద్దేశాన్ని విరమించుకుని అందులో ఏం వుందో చూడడానికి ముందుకు నడిచాడు. సరిగ్గా దాన్ని సమీపించేసరికి ఆకాశంలో నుంచి ప్రత్యక్షమయినట్టు ఆ కుప్పతొట్టిలో నుండి ఒక వ్యక్తి ఎగిరి వీరేష్ పైకి లంఘించాడు.
ఆ అదటుకు తూలి ఇద్దరూ రోడ్ పై పడ్డారు.
అప్పుడే గేటు లోపల అక్కడక్కడా పొంచి వున్న మరో నలుగురు రోడ్ పైకి వచ్చారు.
ఆ కుక్క ఎందుకు మొరాయించిందో వీరేష్ కు అప్పుడు అర్ధం అయింది. పొంచి వున్న మృత్యుదేవత అనుచరులు అప్పటి వరకు తన కోసం ఎదురు చూస్తూ వున్నారు. తన లోపలకు అడుగు పెట్టేవరకూ ఆగాలని వాళ్ళ ఆలోచన కావచ్చు. ఊర కుక్క పుణ్యమా అని వారి ప్రయత్నం ఆదిలోనే బట్టబయలు అయింది.
కింద పడిన వెంటనే వీరేష్ లేచి నిలుచున్నాడు.
పౌచ్ లో నుంచి రివాల్వర్ తీసేలోపలే ఆ వ్యక్తి  విసిరిన కాలు పొట్టలో తగిలింది.
లుంగలు చుట్టుకు పోతున్నంత బాధ కడుపులో సన్నగా మొదలైంది. దాంతో రివాల్వర్ తీసే ప్రయత్నం వాయిదా పడింది. వెంటనే సెల్ఫ్ డిఫెన్స్ కోసం అతనితో చేయి కలపవలసి వచ్చింది.
ఇద్దరూ సమ ఉజ్జీలేమో బాహీబాహీ ముష్టి యుద్ధం చాలాసేపు జరిగింది.
ఆ ఇద్దరి ఫైట్ ను వినోదంగా చూస్తున్నారే తప్ప మిగిలిన నలుగురూ ముందుకు రాలేదు.
బహుశా ఆ నలుగురి నాయుకుడే తనతో తలపడిన వ్యక్తి అయి వుంటాడని వీరేష్ వూహించాడు.
ఉన్నట్టుండి అతని కిక్ నుంచి పక్కకు తప్పుకుని మెరుపులా ప్రత్యర్ది రెండవ కాలుని వీరేష్ బలంగా మోదాడు.
ఊహించని అదటుకు బాలెన్స్ నిలదొక్కుకొనలేక ముందుకు తూలిపడ్డాడు అతను.
వీరేష్ అది అవకాశంగా చేసుకుని మరి ఒక కిక్ ఇచ్చాడు. నిమిషాల మీద ప్రత్యర్ది శరీరం రక్తపు ముద్దలా మారిపోయింది.
ఇక, అతనికి ఊపిరి సలుపుకునే వ్యవధిని వీరేష్ ఇవ్వలేదు.
అందిన చోటల్లా పవర్ ఫుల్ పంచెస్ అతనిని ముద్దాడుతున్నాయి: చివరకు నిస్సత్తువగా పైకి లేచే ఓపిక కూడా లేకుండా నేలపైకి జారి పోయాడు అతను.
తమ నాయుకునికి పట్టినగతి చూడడంతో మిగిలిన వారు అందరూ ఆవేశంగా రివాల్వర్లు తీసి ఏసిపి వీరేష్ ఘాట్ చేయబోయారు.
కానీ వాళ్ళకన్నా వేగంగా వీరేష్ చేతిలో సర్వీస్ రివాల్వర్ ప్రత్యక్షం అయింది. కనురెప్ప మూసి తెరిచేటంతలో నిప్పు కణికల్లా వాళ్ళ భుజాలలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. బాధతో వెర్రికేకలు వేస్తూ పరుగులు దీశారు.
వాళ్ళను వదలకుండా వెన్నంటి పరుగుదీశాడు ఏసిపి వీరేష్!
వాళ్ళు పక్క వీధిలో ఆపి వున్న తమ వెహికల్ లో ఎక్కి పారిపోయారు.
రోడ్డు మీద స్పృహ లేకుండా పడి వున్న వాళ్ళ నాయుకుడి దగ్గరకు తిరిగి వచ్చాడు వీరేష్!
ఎంత తట్టి పిలిచినా అతను పలకడం లేదు. సర్వ్ సెంటర్స్ లో  పంచ్ లు తగలడం వల్ల కాబోలు కనులు తెరచి చూడలేకపోతున్నాడు. నోటిలో నుండి చారెడు రక్తం కక్కుకుని వున్నాడు. అతని స్థితి చూడగానే వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్ళకపోతే ప్రాణాలు దక్కవు అని వీరేష్ అర్ధం అయింది.
అతనని కారులో పడుకోబెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ వైపు పోనిచ్చాడు.
మధ్య మద్యలో వీరేష్ అతనని గమనిస్తూనే వున్నాడు.
హాస్పిటల్  కు వచ్చిన తరువాత అక్కడి వార్డ్ బాయ్స్ తో స్ట్రెచ్చర్ తెప్పించి స్పృహలో లేని అతనని వీరేష్ స్ట్రెచ్చర్ పైకి ఎక్కించాడు.
వార్డ్ బాయిస్ హాస్పిటల్ మెట్లు ఎక్కుతున్నారు.
సరిగ్గా అప్పుడే ఎదురుగా వున్న ప్రహరీగోడ పక్కన పొంచి వున్న వ్యక్తి తన చేతిలోని స్టీన్ గన్ ను దడదడలాడించాడు.
బుల్లెట్ల వర్షం కురిసింది అక్కడ...
స్ట్రెచ్చర్ మీద వున్న వ్యక్తి శరీరం అంతా నెత్తుటి మయం అయింది.
స్ప్రుహలోలేని వాడు లేనట్టే తుదిశ్వాస వదిలేశాడు.
వార్డ్ బాయిస్ ఖంగారుగా స్ట్రెర్చర్ ను వదిలేసి లోపలకు పరుగు దీశారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS