"ఇలాంటి కక్కుర్తి మొగుడుతో కాపురం చేయటం కన్నా జైలులో పడి ఉండటమే నయం? ఏడీ ఎటుపోయాడు?" అని భర్తని వెదికే నెపం కల్పించుకుని కుటుంబం అంతటికి తలవంపులు అయ్యే ఆ దృశ్యంలోంచి అదృశ్యమై వెళ్ళిపోయింది భర్త వెళ్ళిన దిక్కుగా.
మంచం దుప్పటి అన్ని అలాగే వదిలేసి గజలక్ష్మి అవమాన భారముతో కృంగిపోతూ తన యింటి దిక్కుకి వెళ్ళింది.
ఈ సంవత్సరం దొంగల దోపిడి భలే మజాగా వుంది అని చెప్పుకుంటూ అర్ధాంతరంగా నిద్రలు చాలించి వచ్చిన జనం తిరుగు ముఖం పట్టి వెళ్ళిపోతున్నారు.
పందిరిలో దూరంగా ఓ మూలకి ఒదిగిపోయి నిలచిన గాయత్రి భయం తగ్గి రెండు అడుగులు ముందుకు వేసింది.
ఇంతసేపూ జనంలో కలిసిపోయి తమాషా చూస్తున్న ఆమని తన చేయి వాల్మీకి చేతిలో వుండడం గమనించింది.
ఆమె ఎవరో అందరికీ తెలుసు. అర్ధరాత్రి సమయం! కొంటె పనులు చేయటానికి పర్మిషన్ ఉన్న సమయం. అందువల్ల ఆమెను వేయికళ్ళతో గమనిస్తూ మధ్య మధ్య దూరంగా నిలిచిపోయిన గాయత్రి మనసుని కొలుస్తూ ఉన్నాడు వాల్మీకి! అందరూ తిరుగు ముఖాలు పట్టారు.
గజలక్ష్మి పంపించిన పనిమనిషి వచ్చి మంచం దిండు దుప్పటి తీసుకుపోయింది. అంతటితో ప్రదర్శన పూర్తి అయినట్లు భావించారు అందరూ.
"చెల్లీ! ఇంటికి వెళ్ళిపోదాం. ఒంటి గంట కావస్తోంది" అంది గాయత్రి.
"పిరికిదాన్లా మాటాడకు! ఇలాంటి చిత్రమయిన తమాషా దృశ్యాలు మళ్ళా జీవితంలో ఎప్పుడయినా చూడగలమంటావా?
"మీరే చెప్పండి బావగారూ?" అని అడిగింది ఆమని!
ఆమె అలా వరుస కలిపేయటంతో గాయత్రి సిగ్గుతో కుంచించుకు పోయింది. వాల్మీకి అది గమనించాడు. కాని గమనించనట్లే ఉండిపోయాడు.
"ఇంక ఈ బెటాలియన్ తో కలియటం మంచిదికాదు. దూరంగా వుండిపోవటమే మంచిది" అన్నాడు గాయత్రి మాటలకు సపోర్టు ఇస్తూ!
కాని ఆమని గట్టిగా పట్టుపట్టింది. ఆ ముగ్గురూ కలిసి మరికొన్ని గంటలు ఎక్కడయినా గడపాలి అని! నిద్ర ఎప్పుడయినా పోవచ్చు! కాని ఇటువంటి ఆనంద కోలాహలం నిండిన మధుర జ్ఞాపకాలు ఎక్కడని ఏరి తెచ్చుకోగలరు మనుషులు?
వాల్మీకి బాగా ఆలోచించాడు? ఆలయం లోపల స్వామి అర్చనాది కార్యక్రమాల కోసం పెంచుతున్న గార్డెన్ లో కూర్చుందాం అని ప్రతిపాదించాడు. అది క్షేమకరమయిన చోటుగానే అందరూ భావించారు.
గాయత్రిని గుర్తించిన నైట్ వాచర్ గేటు తీశాడు.
వారు వెళ్ళి బాగా ఎదిగిపోయిన పారిజాతం చెట్టు క్రింద తడిసిన పచ్చికలో కూర్చున్నారు. వైశాఖ మాసపు రాత్రి సమయం అది!
పైరగాలి శరీరం తేలిక అయిపోయినట్లు అనిపించే లాగ వేస్తోంది.
"బావగారూ చాలా డైరెక్ట్ గా ఒక్క విషయం మీకు చెప్పాలను కుంటున్నాను."
"చెప్తే వినేందుకేమీ అభ్యంతరం లేదు కాని ఆమనీ, ఆ పిలుపు మానేసి వాల్మీకిగారూ అని పిలిస్తే బాగుంటుందేమో ఆలోచించు"
"మీ మనసు కనిపెట్టేశానండి! అక్కగారి ఆంతర్యమూ తెలుసు నాకు. ప్రస్తుతం నేను మీకు మధ్య వంతెన లాంటిదాన్ని! నా మీదుగా దాటి వెళ్ళిపోయాక మీకు నాతో పనిలేదు. దాటిపోయిన వంతెన కూల్చేస్తారు తెలివిగల సైనికులు! అలా మీరు నన్ను అప్పుడు మర్చిపోవచ్చు. కాని ఇప్పుడు మీరు భార్యాభర్తలుగా కలుసుకునేంత వరకూ ఈ ఆమని అనే బ్రిడ్జి మీకు అవసరం. నా నిర్ణయం ఏమిటి అంటే మీరు మాకు ఇక నుంచి మిత్రులు కారు."
"మిత్రుడు కాక శత్రువును ఎలా అవుతాను?"
"శత్రువులూ కాదు, మిత్రులూ కాదు. బంధువులు! ఆప్తబంధువులు, ఆత్మ బంధువులు! ఇంకా మన మధ్య అరమరికలు ఏమిటి?
అక్కా చెప్పవే! బావగారిని బావగారూ అని పిలిస్తే తప్పా?" అంది.
గాయత్రి భూమిలోకి దిగిపోయేంత సిగ్గుతో తల దించుకుంది.
"కాకముందు నించే పిలుస్తుంటే వారికి కోపం వస్తుందేమో?" అంది.
చాలా నెమ్మది స్వభావం కలిగిన మనిషి అయినా గాయత్రి చాలా తెలివి కలిగిన యువతి! అవకాశం దొరికినప్పుడు చప్పున మనసుని బయట పెట్టేసింది. మీరంటే నాకిష్టం. మన పెళ్ళి జరుగుతుందని నేను కూడా కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను అనే మాటను చెల్లిని మందలించే నెపంతో చెప్పకుండానే చెప్పేసిందామె!
వాల్మీకి అర్ధవంతమయిన ఆ మాట తీరుకు ముచ్చట పడిపోయాడు.
"నేనేమీ అనుకోను గాయత్రి! ఆమని చిన్నపిల్ల! ఆమె మనసు స్వచ్ఛమయిన వెన్నెల జల్లు కురిసే జాబిల్లి వంటిది?
అటువంటివారు మనసులో అనుకుంటే ఏ పనులు అయినా నిర్విఘ్నంగా నెరవేరుతాయట?" అన్నాడు వాల్మీకి!
నిన్ను పెళ్ళి చేసుకోవటం నాకూ ఇష్టమే అనే విషయాన్ని అతను కూడా అన్యాపదేశంగా చెప్పకుండానే చెప్పేశాడు!
గాయత్రి మనసులో మబ్బులు అన్నీ విచ్చిపోయినాయి.
"హుర్రే! హుర్రే! బావగారి సపోర్టు నాకే!" అంటూ చిన్నపిల్లలాగా సంబర పడిపోయింది ఆమని! అప్పటికప్పుడే వారిద్దరూ దంపతులు అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయినట్లు ఊహించేసుకున్నారు.
ఆమని పిచ్చిపిల్లలా చిన్నపిల్లలా వారికి అనిపించింది.
"అవునూ మీరు నగరంలో ఉండాలన్నారట?"
"నగరంలో కాదు, పట్నంలో"
"డామ్! నగరంలో అయితే నాకు తోడుగా ఉంటారనుకున్నా! పట్నంలో అయితే మా యిల్లు ఉంది. అక్కడే ఉండొచ్చు. మా ఇంటిలో వారసుడు పుట్టాలనే మమ్మీ కోరిక తీరుతుంది.
పట్నంలో ఉండాలనే మీ పంతం నెగ్గుతుంది."
"చాల చక్కని సలహా ఇచ్చావు ఆమనీ!" అని కామెంట్ చేశాడు వాల్మీకి.
"నేనెప్పుడూ అలాగే మీకు చక్క చక్కటి సలహాలు ఇస్తుంటాను. నన్ను మాత్రం మరీ ఎక్కువగా పొగిడేయకండి?" అంటూ అక్కగారి వంక గర్వంగా చూచింది ఆమని.
"నిన్ను పొగుడుతూ కూర్చోవటానికి ఇక్కడ ఎవరూ తీరికగా కూర్చోలేదు. కాని ఇంటి దగ్గర లేకపోవటం అమ్మగారు గమనిస్తే తంటాలొస్తాయి పద" అంది గాయత్రి. నిజానికి ఆమె ఒక మంచి మిత్రుడులా కన్పించే వాల్మీకితో మరి కాస్సేపు కలిసి కూర్చోవాలని మనసులో కోరుకొంటోంది.
కాని ఆడపిల్ల ఇల్లు మర్చిపోయి అవకాశం దొరికిందే చాలని వీర విహారం చేస్తున్నారు అని ఆయన అనుకుంటారేమో అని మనసులో సందేహిస్తోంది.
ఒద్దిక, వినయం, భయం ప్రదర్శించటం పెళ్ళి కావలసిన ఆడపిల్లలకు ఉత్తమయిన లక్షణాలు. అలాంటి ప్రతిపాదన చేసింది.
"నువ్వెన్నయినా చెప్పు వింటాను కాని అక్కా! నాలుగు గంటలు అవకుండా ఇంటికి వెళ్ళిపోదామంటే మాత్రం ఒప్పుకోను. ఈ మధురమయిన రాత్రి మన స్వంతం. ఇంకా ఎంత అద్భుతమయిన అనుభవాలను జ్ఞాపకాలనూ ఇస్తుందో ఈ రాత్రి! పిరికివాళ్ళు ప్రేమించటానికి అనర్హులు.
అంతేకాదు. ఆనందించటానికి కూడ వాళ్ళకి వాళ్ళే అడ్డం కొట్టుకుంటారు. రుక్మిణీదేవి కధ చదివి కూడ ఇంకా అలా మాటాడతావేం?" అంది ఆమని.
వాల్మీకి నవ్వుతూ గాయత్రి వంక చూచాడు.
"మీ అక్కగారు రుక్మిణీదేవి కధ చదివారా?" అని ప్రశ్నించాడు.
తన మనసులోని మారుమూల ఆయనకి అర్ధమయి పోయినందుకు సిగ్గుపడి తలను పూర్తిగా భూమికి తాకించింది గాయత్రి.
"ఆ కాస్తంత అయినా చదివింది కాబట్టే ఈ మాత్రం సాహసం చేయగలిగింది. రుక్మిణీదేవి శ్రీకృష్ణపరమాత్ముని మనసులో నిలిపి ఎలా ఆరాధించిందో అక్క మిమ్మల్ని అలా ఆరాధిస్తోంది వాల్మీకి బావగారూ!"
"అలా అయితే రుక్మిణీదేవి యిల్లు విడిచి వచ్చాక మళ్ళీ పుట్టినిల్లు అయిన విదిర్భ భూమిలో కాలు పెట్టలేదు. మీ అక్కనుకూడా అలా ఉండిపోతారా?" అన్నాడు.
"మీరు చాలా అల్లరిగా అంటున్నారు. ఇలాంటి పోకిరీ వారనుకోలేదు" అంటూ వాల్మీకితో ముచ్చటగా మాట కలిపింది గాయత్రి.
"కధలో జరిగిన విషయమే కదా నేను అన్నాను?" ఆమెకు మరింత దగ్గరయ్యాడు.
"ఐడియా! బావగారూ! సూపర్ సుప్రీం ఫాంటాస్టిక్ ఐడియా! రుక్మిణి విదర్భ విడిచి ద్వారకా నగరం వచ్చింది.
అక్కగారు కూడ అలాగే యిప్పుడు మీ ఫాం హౌస్ కి వస్తున్నారు.
మెట్టినిల్లు ఎలా ఉంటుందో ముందుగానే చూచుకుంటారు. నాలుగు గంటల వరకూ మంచి కాలక్షేపం కావాలంటే ఇంతకన్నా మంచి ఐడియా ఉందంటారా?" అని అడిగింది ఆమని.
"ఐడియా సుపర్బ్ సింప్లీ! కాని మీ అక్కగారు అందుకు ఒప్పుకోవాలి కదా!" అంటూ ఆమె వంక చూచాడు ఆశగా!
తలఎత్తి అతని కన్నులలో కన్నులు కలిపింది గాయత్రి!
"మీరు రమ్మంటే అది ఆజ్ఞగా భావించి వస్తాను. ఆడపిల్లను! నేనే వస్తానని మీతో ఎలా చెప్పగలుగుతాను?" అంది గాయత్రి.
