ఆ రోజు సాయంత్రం తనకి తెలిసిన నలుగుర్ని కలుసుకొని నాలుగు ట్యూషన్లు సంపాదించుకోవాలని నిశ్చయించుకొని బయల్దేరింది పారిజాత. తండ్రి దగ్గర ఇదివరలో చదువుకొన్న పిల్లల ఇంటికే వెళ్ళింది. వాళ్ళ తలిదండ్రులతో తన పరిస్థితి చెప్పుకొంది. క్రొత్తగా కుదిరిన మాస్టారు అంతబాగా చెప్పడంలేదని, ఆ పిల్లల్ని పారిజాత దగ్గరికి పంపడానికి సంతోషంగా అంగీకరించారు. అడ్వాన్సుగా కొంతడబ్బు వాళ్ళదగ్గర తీసుకొని ఇంటికి వచ్చేసరికి చీకటి పడింది.
ఇంట్లో ఎక్కడపని అక్కడ ఉంది! ఇంట్లో నీళ్ళు ఒక్కచుక్క కూడా లేవు. కొళాయిలో నీళ్ళు బందయి పోయి ఉంటాయి.
కోమలమ్మ మేడ వెనుక భాగంలో చేదుడుబావి ఉంది. కొళాయిలో నీళ్ళు కట్టేస్తే ఆ కాంపౌండ్ లో కాపురాలుండేవాళ్ళు ఈ బావి నీళ్ళే తీసుకొంటారు.
చిన్న సందుగుండా పారిజాత బిందె తీసుకొని బావి దగ్గరికి వచ్చి మేడపైకి చూచింది. మనోహర్ గదిలో లైట్ వెలుగుతోంది.
"ప్రొద్దున తల్లి తనను అంత అవమానిస్తే తల్లిని ఒక్క మాట కూడా మందలించలేదు మనూ!" అభిమానంగా ముఖం త్రిప్పుకుని ఒక బిందె తోడుకొని ఇంట్లో పోసి రెండో బిందెకు వచ్చింది. పెరటివైపు ఇంతదాకా వెలుగుతున్న లైటు ఆరిపోయి అక్కడంతా చీకటి వ్యాపించింది. మెల్లగా తడుముకొంటున్నట్టుగా బావిని సమీపించింది.
"పారూ!" సమీపంలో మనోహర్ కంఠం వినిపించింది.
"నువ్వా మనూ? ఈ చీకట్లో ఏమిటి?" కంగారుపడి పోయింది.
"ప్రొద్దున అమ్మ అన్న మాటలకు నేను ఇప్పుడు క్షమార్పణ కోరుదామని వచ్చాను, పారూ! కిటికీ దగ్గర నిలబడితే నువ్వు కనిపించావు"
"ఈ చీకట్లో క్షమార్పణ లేమిటి మనూ! మా ఇంటికి రాకూడదా? మాట్లాడేదేదో మాట్లాడకూడదా?" సంకోచంతో అడిగింది.
"మా అమ్మకు కబుర్లు చేరవేయడానికి సి.ఐ.డి. లు. రిపోర్టర్లు చాలా మంది ఉన్నట్టున్నారు. ఆవిడ కేవేవో లేనిపోనివి చెప్పి నీ మీద మనస్సు విరిచారు. నువ్వు ఉదయం సంఘటన మనసులో పెట్టుకొని బాధపడొద్దని చెప్పాలని వచ్చాను. మరో సంగతి ఉదయం మీ ఇంట్లో సామాను తీయించి బయట పారేయిస్తుందట. అద్దె క్టటేస్తే ఆవిడ మీ జోలికి రాలేదు ఈ డబ్బు నీ దగ్గరుంచు" ఆ మసక చీకటిలో తడుముతూ పారిజాత చేయందుకొని కొన్ని నోట్లు పెట్టి గుప్పిట మూశాడు.
చేతిలో విషపురుగు పెట్టి మూసినట్టుగా భయకంపితురాలై పోయింది పారిజాత. "ఏమిటిది, మనూ? ఎందుకు డబ్బు! నువ్వు ఎందుకిస్తున్నావు డబ్బు?"
"ఒక దుర్ముహూర్తంలో నేను చేసిన పిచ్చి పనికి ఇది పరిహారం పారూ!"
"ఏ సంగతి గురించి మాట్లాడుతున్నావో నాకు గుర్తుకు రావడంలేదు?"
"ఆ రోజు ఒంటరిగా........అది తలచుకొన్నప్పుడల్లా సిగ్గుతో కుమిలిపోతుంటాను పారూ! బుద్దిమంతురాలివి గనుక ఆ సంగతి ఎక్కడా బయట పెట్టలేదు. మరొకరైతే ఎంత అల్లరి పెట్టేవారో?"
"అల్లరి పెడితే నా కేం వస్తుంది? నా పరువే పోతుంది"
"నీ పరువుతో పాటు నా పరువు పోయేది! నన్ను రక్షించావు పారిజాతా నువ్వు!"
"నువ్వు నా పెదవులమీద పెట్టుకొన్న ముద్దుకు ఖరీదు కట్టి ఈడబ్బు పరిహారంగా ఇస్తున్నావా, మనూ? అదే కదా దీని అర్ధం? ఎంత డబ్బు ముట్టజెప్పావు పరిహారం క్రింద? కనీసం ఏ రెండు వందలైనా ఉంటాయి కదూ ఈ నోట్లు? ఒక ముద్దుకు నేనింత సంపాదిస్తే, శరీరాన్ని అర్పిస్తే ఇంకెంత సంపాదిస్తానంటావు? సంవత్సరం తిరగకుండానే మీ అమ్మనూ, నిన్నూ కొనేయగలను కదూ?"
"పారూ!" దెబ్బ తిన్నట్టుగా పిలిచాడు. అపార్ధం చేసుకోకు నన్ను! ఇంతకంటే నేనేం చేయగలనో నాకు తోచలేదు!"
"నిజంగా నువ్వు దానికి పరిహారం చెల్లించి ఆ బాధనుండి విముక్తి పొందాలనే అనుకొంటే ఈ డబ్బు నీ దగ్గరే ఉంచు. అవసరం పడినరోజు నేనేన అడుగుతాను. డబ్బు కాదు! ఏది అడిగినా నువ్వు ఇవ్వడానికి తయారుగా ఉండాలి!"
"మంచిది, పారూ!"
నోట్లు అతడి చేతిలో ఉంచేసి గబగబా నీళ్ళు తోడుకొని వచ్చేసింది పారిజాత.
8
కృష్ణారావు మూడు రోజులుగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆహారం ఏదీ కడుపులో పడడం లేదు. పాలు పోసినా పండ్లరసం పోసినా గొంతు దిగడం లేదు.
