Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 21


    "ఎక్కడికి?"

    చే సైగ చేశాడు.  "అటు."

    ఆ మేడకు రెండు మూడు ఇళ్ళ అవతలనుండే పంటపొలాలు ప్రారంభమైనాయి. ఎంతదూరం చూచినా పచ్చని తీవాసీ పరచినట్లు నేత్రానందం గొల్పుతున్నది.

    "ఇప్పుడా? ఎందుకు? ప్రొద్దుగుంక వచ్చిందే!"

    "పరవాలేదు.త్వరగా పద. ఆ పచ్చని ప్రకృతి మధ్య భాస్కరుని బంగరు కిరణాలలో నిన్ను నిల్చోబెట్టి చూసుకోవాలని ఉంది!" సన్నని నవ్వొకటి అతడి పెదవులమీద మెరిసింది!

    "ఈ వింత కోరిక ఎందుకు కలిగినట్టు?" విస్మయంగా చూచింది అతనితో కదలుతూనే.

    "నువ్వు చెప్పిన చిట్కావంటిదే ఇది!" అతడేదో సాధించబోతున్నట్లు కొంచెం ధీమాగా నవ్వాడు' వివేకానందులు ఒకచోట చెప్పారు -  "మనసు ఒక విషయం గురించి ఆలోచింప మొదలుపెడితే దానిని ఆ సాంతం సాగనివ్వాలి. బలవంతాన ఆలోచనలు అంతమొందించకు! ఆలోచించి ఆలోచించి మనసుకే విసుగుపుట్టి నిశ్చలంగా నిలిచిపోతుంది" అని."

    "ఆ సూత్రానికి, ఈ ఆచరణకూ ఎక్కడా పొత్తు కుదరడం లేదే?"

    "అదంతేలే, పద,"

    ఇళ్ళు దాటి వరి పైరుల మధ్య నడుస్తున్నారు బావ, మరదలు.

    చల్లగాలి అలలకు సయ్యాటలాడుతున్నది, నిలువెత్తు పెరిగిన వరిపైరు. అక్కడక్కడా వుండే ఈతచెట్ల గుంపుల్లో పిచ్చుకలు కిచ కిచలాడుతున్నాయి. ఇందాక దేవదాసి చెప్పిన పిచ్చుకమ్మ పెళ్ళికి వచ్చిన బంధుమిత్రుల సందడియేమో అది?

    వాతావరణం అత్యంతాహ్లాదకరంగా ఉంది. కసిపట్టిన దానివలె ఓ నల్లని మేఘం పసిడిముద్దలా వెలుగుతున్నసూర్యబింబాన్ని కప్పివేసింది.

    వర్షం ఉధృతమయ్యే సూచన కనిపించి "వెళదాం పద ఈదురుగాలికి ఒంటిమీద రోమాలు ెలా నిక్కబొడుచుకొంటున్నాయో చూడు?" అన్నది దేవదాసి.

    "నిన్నిప్పుడే వదలాలని లేదు, దేవదాసీ! వర్షం హెచ్చుతుందా? హెచ్చనీ; స్వేచ్ఛగా ప్రకృతి మధ్య కొన్నిక్షణాలు గడుపుదాం. ఆ నాలుగుగోడల మధ్య వెచ్చగా కూర్చోవడం కంటే అరుదైన ఈ అనుభవానికి స్వాగతమివ్వడం ఎన్నోరెట్లు హాయికదూ?"

    "ఏమో బాబూ! నీకేమిటో ఈవేళ విచ్చి పట్టినట్లుగా ఉంది. ఏమిటో ఇది? నాకు భయంగా ఉంది." అమాయకంగా, భయంగా అంది.

    దెబ్బతిన్నట్టుగా చూశాడు భార్గవరామ్. జాలిగా అన్నాడు : "ఏం చేయను. నిన్నేం చేయను. అటువంటి సందేహానికి తావీయకు. నమ్మకం లేకపోతే ఇంటికి పద!"

    "నీ యిష్టం బావా!" ఎటో చూస్తూ హీనస్వరంతో అన్నది దేవదాసి. ఇటువంటి సందర్భం వచ్చిందేమిటా అని లోలోన సిగ్గుపడుతున్నదామె.

    చూస్తుండగానే ఆకాశమంతా కాలమేఘాచ్ఛాదితమైపోయింది. పడమటి కొండల్లో తళుక్కున మెరుపుతీగ అల్లుకొని క్షణంలో అదృశ్యమైంది. ఆ వెంటనే మేఘగర్జన భీకరంగా వినబడింది.

    మెరుపు, మెరుపు వెంటనే ఉరుము! మెరుపు ఉరుము, పరమ సుందరాకృతి దాల్చి శాంతి సంతోషాలు ప్రసాదించిన ప్రకృతే క్షణాలలో మహా భయంకర రూపం దాల్చింది.

    సూదులతో పొడుస్తున్నట్లు వాలుగావచ్చి కొడుతున్న వానచినుకుల ధాటికి తట్టుకోలేక ఓ ఈతచెట్టు వారగా నిల్చున్నది దేవదాసి, అప్పటికే ఆమె పూర్తిగా తడిసిపోయింది. ముందు చలిచలి అనిపించినా తడవగా తడవగా ఒంట్లో వెచ్చదనం కలుగసాగింది. ఈ వర్షంలో ఎలా నిలబడ్డావంటూ అప్పుడప్పుడూ పరామర్శించి వెళ్ళే ఈదురుగాలికి ఒళ్ళు గగుర్పొడుస్తున్నది కూడా!

    "భయంగా ఉందా?" మరదలి భుజం తట్టాడు భార్గవరామ్.

     "ఉఁ. ఇకనైనా ఇంటికిపోయే ప్రయత్నముందా?"

    "వర్షం తగ్గనీ మరి"

    "శీతోష్ణాదులు జయించిన యోగి ఉన్నట్లున్నావు, నువ్వు! నేనైతే గడ్డకట్టిపోతున్నాను, బాబోయ్!" నవ్వబోతే పళ్ళు టక టక కొట్టుకున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS