Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 22

    
    ఈరోజు శంకరివాళ్లు దేవాలయం దగ్గర కలిశారని, పట్టుబట్టి ఆచారిని ఇంటికి తీసికెళ్లారని తెలిసి జయలక్ష్మి చిందులు వేసింది.

    "మీరు మీరంతా ఒకటే! నేనూ నా పిల్లలే చెడ్డ వాళ్లం!"

    "నువ్వూ వెళ్లు! నేను వద్దన్నానా?"

    "ఈరోజు దానికి ఎంత వైభవం వుంటేనేం? ఒకనాడు లేచిపోయిన మనిషే కదా?" అక్కసు పట్టలేనట్టుగా అంది జయలక్ష్మి.

    "లేచిపోకుండా ఇక్కడే వుంటే "అయ్యో! ఇంత చిన్న వయసులో భర్తపోయాడు కదా! మళ్లీ పెళ్లి చేయాలని నువ్వనుకునే దానివా?"

    "నేను సంప్రదాయం గల ఇంటి నుండి వచ్చాను! ముండలను ముత్తయిదువులను చేసే ఆలోచనలు నాకు రావు!"

    "ఒక స్త్రీకి మరో స్త్రీపట్ల ఇంత దారుణమైన ఆలోచనలు రావచ్చు! ఆహా! సంప్రదాయం! మీ విధవ మేనత్త ఒకామె కడుపు పోవడానికి నాటు మందు మింగి ప్రాణం పోగొట్టుకున్న సంగతి నాకు తెలీదనుకోకు! మీ చిన్నాన్న భార్య భర్తవల్ల సౌఖ్యం లేక తురకవాడిని తీసుకొని లేచిపోతే గుట్టుగా ఆమెను మళ్లీ ఇంట్లో తెచ్చి పెట్టుకున్న సంగతి నాకు తెలీదనుకోకు. ఇవన్నీ సంప్రదాయాలు కాబోలు! విధవ చచ్చేవరకు విధవగానే వుండిపోవాలనేదే సంప్రదాయమా?మనిషి జీవితాన్ని బలితీసుకునేది సంప్రదాయం ఎలా అవుతుంది. దుష్టాచారం గాని."

    "ఇవాళ మీ ఆలోచనలు ఇలా తలక్రిందులుగా సాగుతున్నాయేమిటి? చెల్లెలి ఐశ్వర్యం చూసివచ్చిన ప్రభావమా?"

    "ముచ్చటైన దాని సంసారం, ముత్యాల్లాంటి పిల్లలు - శంకరి అన్నట్టు నిజంగా ఒక చిన్న స్వర్గమే! ఆ స్వర్గాన్ని అన్నగా నేను కల్పించాల్సింది. సంప్రదాయం ఛాందసాలలో మునిగిన నాకు అంత మంచి ఆలోచన రాలేదు! చెల్లెలు సౌబాగ్యం కోల్పోయిందని దుఃఖపడ్డానేగాని తిరిగి ఆమెకుి సౌబాగ్యం  కల్పించాలనుకోలేదు.  నేను గనుక  కొంచెం విశాలత్వం కల్పించాలనుకోలేదు.  నేను గనుక  కొంచెం విశాలత్వం కనబరిచి వుంటే శంకరి లేచిపోవాల్సిన ఆగత్యం ఎందుకేర్పడేది?" నేనిలా మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను" అని శంకరి చెబితే మనం ఒప్పుకొనేవాళ్లమా? చావగొట్టి చెవులుమూసేవాళ్లం.  మనకూ మన పిల్లలకూ చాకిరి చేస్తూ నిస్సారంగా గడిచిపోయేది దాని జీవితం!"



                       *    *    *    *   


   
    కాత్యాయని జ్వరం వచ్చి పడకవేసింది. ఒకరోజంతా తిండి లేదు. ఏం లేదు. ముఖం దివాళా తీసినట్లుగా అయింది.

    "ఇలా పడుకుంటే జ్వరం ఎలా తగ్గుతుంది!బ్రహ్మం డాక్టరు దగ్గరికి వెడదాంలే!" అంది తల్లి.
 
    "బ్రహ్మం డాక్టరు! పెద్ద ఎం. బి. బి. ఎస్. చదివినట్టు! ఏదో సర్టిఫికెట్  తీసుకొని బోర్డ్ పెట్టుకున్నంత మాత్రాన మీ ప్రాణానికి ఆయనొక డాక్టరయ్యాడు!"

    "ఇన్నాళ్లూ ఆయనే కదా మనకే మొచ్చినా ఇచ్చేవాడు!"

    "ఇచ్చాడు! ఏవో చక్కెర గోలీలిస్తాడు ఆయన మందులకు జ్వరం తగ్గదు! ఏం తగ్గదు!"

    "ఎవరిస్తే తగ్గుతుందే నీకు?"తల్లి స్వరంలో కోపం చోటుచేసుకొంది.
 
    "కన్నాకి బావ మందిస్తున్నాడుగా? నాకిప్పిస్తే  ఏం""

    "కన్నా ఆరుమంది పిల్లల తరువాత జయలక్ష్మి కలిగిన మన సంతానం! ఇప్పుడు వాడికి ఏడేళ్లవయసున్నా మానసికంగా నాలుగేళ్లు కూడా ఎదగలేదు! నోట్టో వేలుపెట్టుకొని బుద్దావతారంలా ఎక్కడపడితే అక్కడ కూర్చుంటాడు!  సరిగా మాటలు కూడా రావు! ఆరుమంది ఆడపిల్లలు ఆరోగ్యంగా పుడితే  పుట్టిన ఒక్క మగ నలుసూ ఇలా పుట్టాడు. ఎలా వాడిని బాగుచేయడం అన్న చింత. బ్రహ్మం డాక్టర్ మందులిచ్చి ఇచ్చి విసిగి ఊరుకొన్నాడు.

    ఆచారి చెల్లెలింటికి రాకపోకలు సాగిస్తుండడం మొదలుపెట్టాక కన్నాని తీసికెళ్లి నవీన్ కి చూపెట్టాడు! ఒకటి రెండు నెలలు తన మందులు వాడి చూసి,  తరువాత సిటీ తీసికెళ్లి స్పెషలిస్ట్ తో చూపిస్తానన్నాడు నవీన్. పిల్లాడి విషయంలో భయం ఏమి పెట్టుకోవద్దని మామకి భరోసా ఇచ్చాడు!

      "అందరూ కలిసిపోతున్నారమ్మా!నాన్న వెళ్ళి వస్తున్నాడు! "మామయ్యా!  మామయ్యా!" అంటూ అత్తపిల్లలు ప్రాణం పెడుతున్నారు. మొన్న సుభద్రక్కనీ,  జానకక్కని అత్త తీసుకొచ్చి చీరెలు సారెలు ఘనంగా పెట్టి సాగనంపింది. ఇక మనకేనా అత్త పనికిరానిది?" అడిగింది కాత్యాయని సూటిగా.

    "అవును! మొన్న సుభద్రనీ, జానకిని తీసుకువచ్చి చీరెలు సారెలు పెట్టింది! కన్న తల్లిదండ్రులై వుండీ కూడా వాళ్ళకొక్కనాడూ అంత ఖరీదైన బట్టలు పెట్టలేదు! వాళ్ళని కారులో తీసుకొచ్చి రెండు రోజులుంచుకొని మళ్లీ కారులో సాగనంపింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS