Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 21


    ఊరంచున  చిన్న గట్టుమీద వెలసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మెట్లుదిగి వస్తున్నాడు ఆచారి.
 
    స్వామి దర్శనంకోసం భార్యాపిల్లలతో వచ్చిన అచ్యుతం కారుదిగి మెట్లు ఎక్కబోతున్నాడు.

    ఆచారి వీళ్లను చూసీ చూడనట్టుగా వెళ్ళబోయాడు.

    అచ్యుతం ఆయన దారికి అడ్డుగావెళ్లి నిలబడి "బావా!" అని పిలిచాడు.
 
    "ఇంతకాలానికి కూడా మీరు మమ్మల్ని క్షమించలేరా?"

    ఆచారి ముఖం త్రిప్పుకొని మరోవైపు చూడసాగాడు.

    "తిండిపెట్టి చదువు చెప్పడానికి వుంచుకొంటే బాగా చేశానని తిట్టొచ్చు. నిజానికి నాకేం తెలియదు బావా! తోడుగా వెంట రమ్మంటే వెళ్లాను. భర్త అన్న అర్హత ఆమే కల్పించింది. ముగ్గురు ముత్యాలవంటి పిల్లలకు తండ్రిని చేసింది. ఈరోజు ఇంతవాడిని ఆమే చేసింది!నిజానికి నాకేం తెలియదు. నన్ను నమ్ముబావా"  శంకరి ముఖంలోకి ఓరగా చూస్తూ అమాయకత్వం నటిస్తున్న అచ్యుతాన్ని గుర్రుగా చూసింది శంకరి.

    "ఇడ్లీలు అమ్మించాననికూడా చెప్పండి" కోపంగా అంది.

    "మరి అమ్మించలేదా ఇడ్లీలు నాతో?"

    "ఆరోజు ఎలా ఏడిచారో కూడా చెప్పండి?"

    "మరి చెబుతాను! మా బావగారితో ఫిర్యాదు చేయకపోతే ఇంకెవరితో చేస్తాను?"

    "మీకు అంతోటి బావున్నాడు! నాకెవరూ లేరనే కదా!"

    "అంతే కదా! బావా!"

    అప్రయత్నంగా ఆచారి చూపు శంకరి మీదపడింది. అటు భర్తా, కూతురు, ఇటు ఇద్దరు కొడుకులు! మధ్యన నిండు పట్టుచీర కట్టుకొని తలనిండా పువ్వులు పెట్టుకొని, నుదుట ఎర్రటిబొట్టు పెట్టుకొని....
 
    ఒకరోజు ఆమె ఈ సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నదనే తను గుండెలవిసేలా ఏడ్చాడు!  పోగొట్టుకొని నిస్సహాయంగా కూర్చోలేదు శంకరి. సాహసంతో ఆ సౌభాగ్యాన్ని తిరిగి సాధించుకుంది! ఇవాళ భర్తా, పిల్లలు - ఆమె కోరుకొన్న చిన్న స్వర్గాన్ని నిర్మించుకొంది.

    ఆ స్వర్గం ఎదురుగా కళ్ళముందు నిలబడ్డట్టనిపించింది ఆచారికి. ఈ స్వర్గం ముందు చెల్లెలు ఒకనాడు చేసిన తప్పు పని గుర్తుచేసుకోవాలనిపించలేదు ఆచారికి.

    తడి కళ్లతో బేలగా చూస్తున్న చెల్లెలికి. 'నేనున్నాను చెల్లీ నీకు!' అని చెప్పాలనిపించింది. కాని నరాలు బిగుసుకుపోయినట్టుగా గొంతు పెగల్లేదు!

    "అరే! మరిచాను, బావా! వీళ్లను పరిచం చేయలేదు కదూ? వీడు నా పెద్దకొడుకు నవీన్ ఎం. బి.బి. ఎస్. వీడు వసంత్ బి. ఇ. ఫైనల్. ఇది చందన ఎం. బి. బి. ఎస్.
 
    ఇక ...ఈమె... పాతికేళ్ళుగా  మీరు కలలోకి కూడా రానివ్వని మీ చెల్లెలు శంకరి, నా భార్య!" నా బార్య అని చెబుతున్నప్పుడు అచ్యుతం ముఖంలో గర్వరేఖ తొంగి చూసింది.

    అచ్యుతం ఇంత మాటకారి ఎప్పుడయ్యాడు? ప్రశ్నకు జవాబు చెప్పడానికే మహా ఇబ్బంది పడేవాడు! సూటిగా కళ్లలోకి చూసి మాట్లాడేవాడు కాదు!

     మనిషిలో ఇంత మార్పు సాధ్యమా?

    ఆచారి దిగ్ర్బమ నుండి తేరుకోలేకపోతున్నాడు.

    "మీరు వెళ్లి దైవదర్శనం చేసుకురండి! నేను బావ గారి మౌనం సంగతేమిటో తేల్చుకోనిదే కదలను!" అన్నాడు అచ్యుతం.

    చందన ముందుకు వచ్చి "ఎక్స్ క్యూజ్ మీ! ఒకసారి మిమ్మల్ని 'మామయ్యా' అని పిలవొచ్చా?" అంది.

    ఆ పిల్ల అంటున్న తీరుకూ, ఆ కళ్లలో మెరిసిన కొంటెతనానికి నవ్వకుండా వుండలేకపోయాడు ఆచారి. "పిలువమ్మా! ఇంత చక్కటి కోడలు, ఇంత తీయటి స్వరంతో 'మామయ్యా' అని పిలుస్తానంటే పాషాణం సైతం పలుకుతుందమ్మా!"

    "అమ్మ సాధించలేదు! నాన్నగారు సాధించలేదు. నేను సాధించానహో" చందన చిన్నపిల్లలా గంతులు వేయసాగింది. "పిలువండిరా! అన్నయ్యలూ! నోరారా "మామయ్యా" అని పిలవండి! ఎన్నాళ్ళకి మనకు మామయ్య దొరికాడు!"

    "ఇంత కష్టపడ్డ ఈ చెల్లెలికి ఒక బహుమతి" నవీన్ చెల్లెలి బుగ్గమీద ముద్దు పెట్టుకొన్నాడు.

    తన పిల్లల్ని మురిపెంగా చూసుకొంటున్న శంకరి భుజంమీద ఆచారి చెయ్యి ఆప్యాయంగా వాలింది.

 
                      *    *    *    *   
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS