అందరికీ శంకరి పనికి వస్తుంది! తనకీ, తన పెళ్లికాని ఆడపిల్లలకేనా ఆమె పనికిరానిది!
అతి కష్టంగా ఇద్దరాడపిల్లకి గంతకి తగ్గ బొంతలన్నట్టుగా చూసి పెళ్లిళ్లు చేసి పంపగలిగారు! ఇప్పుడు కాత్యాయనికే వచ్చాయి ఇరవై నాలుగేళ్లు! ఆ తరువాత రెండేళ్ల రెండేళ్ల తేడాతో వున్న ముగ్గురాడపిల్లలూ సమరలైపోయారు. వీళ్ళ పెళ్ళిళ్లు తలుచుకొంటే ఒక్కోరోజు నిద్రపట్టదు!
రుక్మిణి పిన్ని అన్నట్టు తను అంత ఇదిగా విర్రవీగకుండా వుండి వుంటే ఇప్పుడొక ఆడపిల్ల సమస్య తప్పేది కదూ? తను కొంచెం బింకం సడలించుకొంటే ఆ ఇంటికీ ఈ ఇంటికీ దారి ఏర్పడుతుంది. తన కూతురు ఆ ఇంటి కోడలు అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది!
జయలక్ష్మికీ చాల రోజుల నుండి కుతూహలంగా వుంది. ఊరందరూ గొప్పగా చెప్పుకొంటున్న శంకరి ఐశ్వర్యం కళ్లారా చూడాలని! ఊరికే వెళ్లడానికి ఇబ్బంది అనిపిస్తుంది గాని ఇప్పుడీ కాత్యాయని జ్వరం సాకుతో వెళ్లవచ్చు.
"అందరికీ అత్త కావాలి! అత్తపిల్లలు కావాలి! నేనొక్క దాన్నే చెడ్డదాన్ని కావాలా? నీకు డాక్టరు బావ చేతిమందే పని చేస్తుందనుకొంటే పద, తీసుకెడతాను!"
"నిజమా, అమ్మా? తీసికెడతావా?" సంతోషంతో సుస్తీ తగ్గిపోయింది కాత్యాయనికి.
"తలంతా పీచుకట్టినట్టుగా అయిపోయింది. నూనె రాచి జడ వేస్తాను లే! ఉన్న బట్టల్లో కాస్త మంచిని చూసి వేసుకో!"
"నేనేం పెళ్లి చూపులకు వెళ్లడం లేదు!"
"మొదటి సారిగా ఆ ఇంటికి వెడుతున్నాం!మన దరిద్రమంతా ఇప్పుడే చూపుకోవాలా ఏం?"
* * * *
రావుగారు మంచి అభిరుచులతో డబ్బుకి లెక్కచేయకుండా కట్టించిన బంగళా అది! దురదృష్టవశాత్తు గుర్రపు పందాలు, త్రాగుడు, ముండలు లాంటి వ్యసనాల్లో పడి ఇల్లు పొలాలు అమ్ముకుపోవాల్సి వచ్చింది ఆయన!
ఒక్క బిజినెస్ మీద మాత్రమే ఆధారపడకుండా వ్యవసాయం కూడా ప్రారంభిస్తే బాగుంటుందని అచ్యుతం ఆలోచిస్తున్న తరుణంలో రావుగారి బంగళా, పొలాలు అమ్మకానికి రావడం జరిగింది.
కొన్న పొలాల్లో ప్రస్తుతం ద్రాక్షతోట వేయించే పనిలో మునిగిపోయి వున్నాడు అచ్యుతం.
జయలక్ష్మి కూతుర్ని వెంటబెట్టుకు వచ్చేసరికి సాయంత్రం నాలుగవుతున్నది. బాగా ఎండలో నడిచి వచ్చి బంగళాలో ప్రవేశించే సరికి హఠాత్తుగా శరీరం చల్లబడి పోయినట్టుగా అనిపించింది.
"ఎవరు కావాలమ్మా?' అక్కడున్న నౌకరు అడిగాడు.
"డాక్టరుగారు!" జయలక్ష్మి అంది. హాలునంతా రెండు కళ్లని వెయ్యి కళ్లుగా మార్చుకొని చూస్తున్నట్టుగా చూస్తూ. హాలులో ఆ ఇంటి వాళ్ళ స్థాయికి తగ్గట్టున్న అలంకరణ. ఎయిర్ కూలర్, టి. వి క్రింద చక్కటి తివాసీ, ఫ్లవర్ వాజులూ, అద్దాల కిటికీలకు నైలాను తెరలు! గది గోడలకి చక్కటి చిత్రపటాలు....
ఒకనాడు తను దరిద్రపు ముండా అని తిట్టినశంకరేనా ఈ ఇంటి యజమానురాలు?
"ఓ! అ... అ... .అత్తగారా? ఏ...ఏ.... ఏమిటింత దయ?" లుంగీ బనీను మీదున్న నవీన్ భుజాలమీద టవల్ కప్పుకొని వచ్చాడు.
"పిల్లకి మొన్నటినుండి ఒకటే జ్వరం!"
"ఈ ...ఈ.... ఈ మరదలు పిల్లకేనా? జ్వ... జ్వ.... జ్వరంవస్తే డా.... డా.... డాక్టరు దగ్గరికెళ్లాలి! బ....బ ...... బపూన్ ల దగ్గరికి వెడితే జో.... జో.... జోకులిస్తారు తప్ప మందులీయరు!"
"జ్వరం వచ్చిన పిల్లతో హాస్యమేమిటిబాబూ? చెయ్యి చూసి త్వరగా జ్వరం తగ్గిపోయే మందేదయినా ఇవ్వు! పిల్లది మొన్నటినుండి నోట్లో మంచినీళ్లు కూడా పోయకుండా పడుంది."
"ఒరే! నవీన్!" అంటూ ఏదో చెబుదామని వచ్చిన శంకరి వదినగారిని చూసి టక్కున ఆగిపోయింది.
రెండు నిమిషాల నిశ్శబ్దం తరువాత జయలక్ష్మి ముఖంలో నవ్వు పులుముకొని "బాగున్నావా శంకరీ?" అని పలుకరించింది.
గుణపాఠం చెప్పాలంటే, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇది ఎంతో చక్కటి అదను. కాని శత్రువులను మిత్రులుగా చేసుకోవడం గొప్పగాని, శత్రువును యింకా శత్రువును చేసుకోవడం విజ్ఞతకాదు అనుకొనే మనిషి శంకరి.
శంకరి వెంటనే తెప్పరిల్లి నవ్వు తెచ్చుకొని "ఆ మీరు బాగున్నారా వదినా?" అంది.
