అలా అనుకుంటుంటే సుబ్బులు విజయగర్వంతో తొణికిసలాడిపోయింది. ఉత్సాహంతో కొత్తఊపిరి పోసుకున్నది! కావేరి బుజం మీద ఆప్యాయంగా చెయ్యివేసి చిరునవ్వుతో అంది.
"దీని కిన్తగా ఆలోచించాలా? నీకు సినిమా తారలాగా అవ్వాలని వుంటే మద్రయు వెళ్ళిపో! నలుగురినీ పరిచయం చేసుకుంటే యిట్టే వేషాలు యిస్తారు. పెద్ద సినిమా తారవయిపోతావు!"
"చెప్పకుండానా!"
"చెప్పితే వెళ్ళనిస్తారా? మన కోరికలు తీరాలంటే చెప్పకుండాచేసి తీర్చుకోవటమే! నువ్వు పెద్దహీరోయిన్ వి అయిపోయావనుకో! అప్పుడు ఈ కామాక్షమ్మ, వినాయకరావు, మీ అమ్మ నాన్నా అక్కా బావా! అందరూ నీ దగ్గరికే! నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తారు. నీ అడుగులకి మడుగులు వత్తుతారు! నీకు బ్రహ్మరధం పడతారు. నిన్ను ఆకాశంలో కూర్చుండపెడతారు. పెళ్ళి అయిందంటే కనీసం ఒక్క సినిమా కూడా చూడటానికి వీలులేదంటుంది మీఅత్త! యిప్పుడున్న ఈ స్వేచ్ఛ కాస్తా హరించుకుపోతుంది. తల్లికి వంత పాడీ పాడీగాని నీకు అనుకూలంగా నడవడు ఆ నల్లరాతి విగ్రహం! నువ్వు ఏ సినీతారకంటే తీసిపోయావు? నీకంటే అందంగా వునారా వాళ్ళంతాను? ఎంతగొప్ప తారాపధంలో వున్నారిప్పుడు? ఎన్ని రకాల ఫోటోలు? ఎన్ని సినిమాల్లో నటించుతున్నారో సినిమా పత్రికల్లో చూడటంలేదా? రేపు నువ్వూ అంతే! అసలు సినిమా తారలకి పెళ్ళిళ్ళు అవవట! కాదు! కాదు చేసుకోరట! చేసుకున్న వాళ్ళందరూ పిల్లల్నికంటూ యింటిలోనే వుండిపోతుంటారుట! వాళ్ళ ఆకర్షణ తగ్గిపోతుందట! వాళ్ళని ఏ హీరో తన పక్కన యాక్షన్ చేయనివ్వడట! యివన్నీ మనం "సినీడిటెక్టివ్" అను పత్రికలో చదవలేదా? నువ్వు ధైర్యం చేయాలేగాని సినిమాల్లో అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. యిక్కడ వుంటేకాదు! మద్రాసు వెళ్ళాలి!"
కావేరి ఆలోచనలలో పడేసరికి సుబ్బులు యింక ఆపింది తన ఉపన్యాసాన్ని! బండి గాడిలో పడుతున్నదని గ్రహించి నవ్వుకున్నది. తన మాటలు కావేరి మీద ఎంతప్రభావం చూపించుతున్నాయో జాగ్రత్తగా పరిశీలించసాగింది.
యిద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతోంది! ఎడ్లబండి వస్తుండటం చూసింది సుబ్బులు!
"మనఊరివాళ్ళదే! ఎవరిదో ఎడ్లబండి వస్తోంది. మన మిలా ఈ కాలువ గట్టుమీద కూర్చున్నామని చూస్తే లేనిపోనివన్నీ కల్పించి చెప్పుతారు. లే!లే! స్కూలుకి బయలుదేరుదాము!" అంది.
కావేరికి లేవకతప్పలేదు!పుస్తకాలకు మధ్య వాల్ పోస్టర్సు పెట్టుకుని, మరో పుస్తకం మధ్యలో సినిమా పాటల పుస్తకాలు పెట్టుకుని నెమ్మదిగా నడవసాగింది.
"అవి ఎక్కడివి?" కావాలనే అడిగంది సుబ్బులు! అంతకుముందే వాటిని నాగులు యివ్వటం, చాలాసేపు మాట్లాడు కోవటం దూరంనుంచే చూసింది సుబ్బులు!
"నాగులు నా కోసమని తెచ్చాడు. దారిలో ఎదురయ్యేసరికి ఇచ్చిపోయాడు!" అంది కావేరి.
"దూరం నుంచి చూసి ఎవరో అనుకున్నాను! నాగులన్నమాట! రంగురంగుల చొక్కాలు, తిరగటానికి స్కూటర్. ఇంత వైభోగం ఎలా వచ్చింది?...మీదగ్గిర నౌఖరుగా చేసేవాడు?"
"అది నాగులు స్వయంకృషి. అన్నీ నేర్చుకుని యింతటి వాడయ్యాడు!"
"నిజం?"
"అవునే సుబ్బులూ! చెప్పుతుంటే ఆశ్చర్యం కలిగింది. ఎంత కష్టపడ్డాడో! అంత గొప్పవాడయి పోయాడు ఒక్కొక్క విషయం వింటుంటే నాకు మతిపోయిందనుకో!"
'ఏదయినా అంతే! రేపు నువ్వయినా అంతే! పెద్ద సినిమా హీరోయిన్ అవ్వాలనుకున్నావు. ఈ మారుమూల పల్లెటూరిలో వుంటే సాధ్య పడుతుందా? ధైర్యం చేసి మద్రాసు వెళ్ళావనుకో! గొప్ప హీరోయిన్వి అవగలవు__ఆఁ ...మనము మాటల్లో పడి స్కూలు సంగతి మరచిపోయాం. నీకీవేళ నాటకం రిహార్సల్ వుందనుకుంటాను. త్వరగానడువు! ఎలాగూ నీకూ నాటకానుభవం వుంది కాబట్టి త్వరగా పైకి రాగలవు!" అంది సుబ్బులు.
ఈసారి మరింత ఆలోచనలో పడిపోయింది కావేరీ! నాగులూ సుబ్బులూ చెప్పిన మాటలు క్రమేపే పని చేయసాగినవి. వాటిని గురించే తనలో తను తర్కించుకోసాగింది...
9
కావేరి నిద్రనుంచి లేచేసరికి తల్లి తిట్లు తారాస్థాయికి చేరుకున్నాయి. ముందు అర్ధం కాలేదు. తల్లి తిట్టే తిట్లలోని సారాంశం అర్ధం చేసుకున్న కావేరి ఉలిక్కిపడలేదు. బాధపడలేదు!
రాత్రి తమ స్కూలు యానివర్సిడే నాటకంలో ప్రధాన పాత్ర వేసినందుకు ఆ శాపనార్ధాలు గ్రహించింది. రాత్రి తెలియనిది యిప్పుడెలా తెలిసింది? ఉదయమే పని గట్టుకుని వచ్చి చెప్పింది ఎవరయి వుంటారు? రాత్రే అమ్మకి తెలిసివుంటే ఆలస్యంగా వచ్చిన కారణం అప్పుడే అడిగి తిట్టే వుండేది...మరి యిప్పుడేమిటి? అనుకుని బైటికి వచ్చింది.
పరంధామయ్య అరుగుమీద కూర్చుని గడ్డి తాళ్ళు ముడి వేస్తున్నాడు. కూతురు రావటం చూసి అన్నాడు.
"ఇంక చాల్లేద్దూ? అయిపోయిన దానికెందుకు యింకా రభసచేసుకోవటం?"
"మీకు రభసగానే వుటుంది...అది చేసినా పని ఏమన్నా బాగున్నదా? రేపోమాపో పెళ్ళి అవబోయే పిల్ల! అలా నాటకాలు ఆడవచ్చునా? వినాయకం ఎంతో మంచివాడు కాబట్టి సరిపోతోంది. మనతో ఒక్కసారయినా చెప్పిందా? నాటకం అయిపోయేవరకూ దాచి పెట్టింది...! నలుగురూ ఏమనుకుంటారు? నవ్విపోరూ? మీ చెల్లెలు కామాక్షి ఎంత బాధ పడుతుంది? నా అన్నకూతురయితే మాత్రం నాటకాలు ఆడేదాన్ని నా కోడలిగా చేసుకోనూ? అంటే మన పరువేం కావాలి? అన్నీ అనుకుని రేపోమాపో లగ్నం పెట్టుకోవాలనుకుంటున్నాము. ఆవిడెంత బాధ పడుతుంది? దీనికీ మధ్య నాటకాల పిచ్చి, సినిమాలపిచ్చీ ఎక్కువయిపోయింది. పెళ్ళయితేనే గాని దీన్ని కట్టిపడయలేము."
సుభద్రమ్మ అంటూనే వుంది. మధ్య మధ్యలో పరంధామయ్య వారిన్చుతూనే వున్నాడు. కాని కావేరికి చీమ కుట్టినట్లయినా లేదు. పళ్ళు తోముకుంటున్నది బావి దగ్గిర! రాత్రి తను నాటకం ముగించుకుని మేకప్ రూంలోకి వచ్చేసరికి టీచర్సు విద్యార్ధినీ విద్యార్ధులు తనను అభినందించుతూ ఉక్కిరిబిక్కిరి చేసేశారు. ఊపిరి పీల్చుకోనివ్వలేదు. ఒక రయితే "అచ్చు జయప్రదలాగానే వుండి నటించావన్నారు. మరి కొందరయితే జయసుధలా ఆ పాత్రకి ప్రాణం పోసావన్నారు."
"నా పేరు నిలబెట్టిన శిష్యురాలి వనిపించుకున్నావు." అన్నారు డ్రాయింగ్ మాష్టారు.
