32వ. సర్గ
1. పవన కుమారుని - భీమ రూపమును
జానకి జూచి - భీతి జెందెను |
హా రామా యని - లక్ష్మణా యని
భ్రమ జెంది తూలి - మూర్ఛనొందెను |
తేరుకొని సీత - తిరిగి చూచెను
వినమ్రుడై ఆ | ట మారుతి దోచెను |
ఇది కలయో నిజ | మో తెలుపుడని
బ్రహ్మాదులను - జానకి వేడెను ..... ||శ్రీ||
__: 32 వ. స. సంపూర్ణము :__
33 వ. సర్గ
మారుతి సీతతో :-
1. "తల్లీ! తెల్పుము - నీవు ఎవరవో
దేవ గంధర్వ - కిన్నరాంగనవో ?
కాంతులు మెరసే - బంగరు మేన
మలినాంబర మేల - దాల్చితివో ?
ఓ కమలాక్షి - నీ కనుదోయి
నీలాలేల - నింపితివో ?"
అని హనుమంతుడు - తరువు నుండి దిగి
అంజలి ఘటించి | చెంతన నిలిచె .... ||శ్రీ||
2. "రావణాసురుడు - అపహరించిన
రాముని సతివో - నీవు సీతవో ?
రామలక్ష్మణులు - వనమున వెదకెడు
అవనీ జాతవో - నీవు సీతవో ?
సర్వ సులక్షణ - లక్షిత జాతవు
తల్లీ తెల్పుము - నీవు ఎవరవో ?"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి | చెంతన నిలిచె .... ||శ్రీ||
సీత మారుతితో :
3. "జనక మహీపతి - ప్రియపుత్రికను
దశరధ మహీపతి - పెద్ద కోడలను |
శ్రీరఘురాముని - ప్రియసతి నేను
సీత యను పేర - వరలు దానను |
పరిణయమైన - పది రెండేడులు
అనుభవించితిమి - భోగ వానరేంద్రునితో
అని పల్కె సీత - వానరేంద్రునితో
రామ కధను కీ | ర్తించిన వానితో .... ||శ్రీ||
4. "శ్రీరాముని ప | ట్టాభిషేకమును
తండ్రి దశరధుడు - చేయనెంచెను |
చిన్న భార్య కై | క కోరే దశరధుని
వెనుకటి వరములు - రెండు తీర్పుమని |
భరతునకు ప | ట్టాభిషేకము
శ్రీరామునకు - వనవాసము | "
అని పల్కె సీత - వానరేంద్రునితో
రామకధను కీ | ర్తించిన వానితో .... ||శ్రీ||
5. "పితృవాక్య పరి | పాలుడు రాముడు
అడవుల కేగె | పడు నాలుగేండ్లు |
రామునితో సౌ | మిత్రియు నేను
వనవాసమునే - కోరుకున్నాము |
ఆశ్రమమున ఒం | టిగనున్న నన్ను
రావణాసురుడు - అపహరించెను |"
అని పల్కె సీత - వానరేంద్రునితో
రామకధను కీ | ర్తించిన వానితో .... ||శ్రీ||
6. "రావణుడోసగిన - ఏడాది గడువు
రెండు నెలలలో - ఇక తీరిపోవు |
రాముడు నన్ను - కాపాడునని
వేచి వేచి వే | సారి పోతిని |
అసురులు నన్ను - చంపక మున్నె
నాకై నేను - పోనెంచితిని |"
అని పల్కె సీత - వానరేంద్రునితో
రామకధను కీ | ర్తించిన వానితో .... ||శ్రీ||
__: 33 వ. స. సంపూర్ణము :__
34 వ. సర్గ
మారుతి సీతతో :
1. "అమ్మా సీతా ! - నమ్ముము నన్ను
రాముని దూతగ - వచ్చినాడను |
రామలక్ష్మణులు - క్షేమమన్నారు
నీ క్షేమమరసి - రమ్మన్నారు |
రాముడు నీకు - దీవెనలంపె
సౌమిత్రి నీకు - వందనములిడే | "
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి | చెంతన నిలిచె .... ||శ్రీ||
2. మారుతి ఎంతగ - ముందుకు జరిగెనో
జానకి అంతగ - అనుమానించెను |
రావణాసురుడే - ఈ వానరుడని
కామరూపుడై - వచ్చియుండునని |
ఆశ్రమమున ఒం | టిగనున్న తనను
వంచించిన స | న్యాసి ఈతడని |
తలవాల్చుకొని - భయకంపితయై
కటిక నేలపై జానకి తూలె .... ||శ్రీ||
