30 వ సర్గ
హనుమంతుడు రామకధను పాడుట :-
1. "సీతకెంత దుర | వస్త ఘటిల్లె
నా తల్లి నెటుల - ఊరడించవలె |
నన్ను నే నెటుల - తెల్పుకోవలె
తల్లి నెటుల కా | పాడుకోవలె
ఏ మాత్రము నే - ఆలసించినా
సీతామాత - ప్రాణములుండునా?"
అని హనుమంతుడు - శాఖల మాటున
తహతహలాడుచు - మెదల సాగెను ..... ||శ్రీ||
2. "ననుగని జానకి - బెదరక ముందే
పలికెద సీతా | రామకధ |
సత్యమైనది - వ్యర్ధముగానిది
పావనమైనది - శుభకరమైనది |
సీతామాతకు - కడు ప్రియమైనది
పలుకు పలుకున - తేనెలోలుకునది |"
అని హనుమంతుడు - మృదు మధురముగ
పలికెను సీతా | రామకధ .... ||శ్రీ||
__: 30 వ. స. సంపూర్ణము :__
31. వ. సర్గ
1. "దశరధ విభుడు - రాజోత్తముడు
పుణ్యశీలుడు - కీర్తిమంతుడు |
రాజర్షులలో - ఉత్తమోత్తముడు
యశము గొన్న ఇ | క్ష్వాకు వంశజుడు |
అయోధ్యాపురి - రాజధానిగ
కోసల రాజ్యము - ఏలుచుండేగ |"
అని హనుమంతుడు - మృదు మధురముగ
పలికెను సీతా | రామకధ .... ||శ్రీ||
2. "దశరధునకు కడు - ప్రియమైనవాడు
జ్యేష్ట కుమారుడు - శ్రీరఘురాముడు |
సత్యవంతుడు - జ్ఞాన శ్రేష్ఠుడు
ధనుర్ధరులలో - అగ్రగణ్యుడు |
ధర్మరక్షకుడు - శ్రితజనపాలుడు
పితృవాక్య పరి | పాలన శీలుడు |"
అని హనుమంతుడు - మృదుమధురముగ
పలికెను సీతా | రామకధ .... ||శ్రీ||
3. "శ్రీరాముని ప | ట్టాభిషేకము
నిర్ణయమైన - శుభసమయమున |
చిన్నభార్య కై | క దశరధుజేరి
తనకోనగిన రెం | డు వరములు కోరె |
భరతునకు ప | ట్టాభిషేకము
పదునాలుగేండ్లు రా - మ వనవాసము |"
అని హనుమంతుడు - మృదుమధురముగ
పలికెను సీతా | రామకధ .... ||శ్రీ||
4. "తండ్రిమాట నిలు | ప రామచంద్రుడు
వల్కల ధారియై - రాజ్యము వీడె |
సీతా లక్ష్మణులు - తనతో రాగ
పదునాల్గేండ్లు | వనవాసమేగె
ఖరదూషణాది - పదునాల్గువేల
అసురుల జంపె | జనస్థానమున"
అని హనుమంతుడు - మృదుమధురముగ
పలికెను సీతా | రామకధ .... ||శ్రీ||
5. "రాముడు వెడలె - సీత కోర్కెపై
మాయలేడిని - కొని తెచ్చుట కై |
రామలక్ష్మణులు - లేని సమయమున
అపహరించె లం | కేశుడు సీతను |
సీతను గానక - రామచంద్రుడు
అడవులపాలై - వెదకుచుండెను |"
అని హనుమంతుడు - మృదుమధురముగ
పలికెను సీతా | రామకధ .... ||శ్రీ||
6. "రామ సుగ్రీవులు - వనమున గలిసిరి
మిత్రులైరి ప్ర | తిజ్ఞల బూనిరి |
శ్రీరఘురాముడు - వాలిని గూల్చెను
సుగ్రీవుని కపి | రాజుగ జేసెను |
కదలె కపిసేన - సుగ్రీవునాన
నలుదిశలు వెదకి - సీతను కనుగొన |"
అని హనుమంతుడు - మృదు మధురముగ
పలికెను సీతా | రామకధ .... ||శ్రీ||
7. "లంకాపురిలో - సీతయుండునని
పక్షిరాజు సం | పాతి మాట విని |
శతయోజనముల - వారిధి దాటి
సీతజాడ గన - లంక జేరితి |
రాముడు దెలిపిన - గురుతులు గలిగిన
సీతామాతను - కనుగొన గలిగితి |"
అని హనుమంతుడు - మృదుమధురముగ
పలికెను సతా | రామకధ .... ||శ్రీ||
8. వానరోత్తముడు - పలుకుట మానెను
జానకి కెంతో - విస్మయ మాయెను |
భయము భయముగ - నలువంకల గని
మెల్లగ మోమెత్తి - పైకి జూచెను |
శోభిల్లుశింశుపా - శాఖలందున
బాలార్కుని వలె - మారుతి దోచెను |
మారుతి రూపము - చిన్నదైనను
తేజో మయమై - భీతి గొల్పెను | .... ||శ్రీ||
__: 31 వ. స. సంపూర్ణము :__
