Previous Page Next Page 
దేవదాసు పేజి 21

    ఈ మాట అని ఆమె మౌనం వహించింది. దేవదాసు కొన్ని క్షణాలు మౌనంగా వుండి అన్యమనస్కుడై అన్నాడు. "కాని కర్తవ్యం వుండి, ధర్మం అధర్మం అనేది వుంది గదా?" చంద్రముఖి అన్నది "అవును, అదైతే వుంది. అంచేతనే దేవదాసును ఆమె నిజంగా ప్రేమిస్తున్నది. అతణ్ణి సహిస్తున్నది కూడా. హృదయపూర్వకమయిన ప్రేమతో లభించే సుఖాన్నీ, తృప్తినీ పెంపొందించుకొనడం కోసం ఆమె ఇంట్లో అశాంతిని తీసికొని రాదలచుకోలేదు. కాని దేవదాస్, నేను నిజం చెపుతున్నాను. పార్వతి నిన్నేమీ మోసగించలేదు. నిన్ను నీవే మోసగించుకొన్నావు. ఈ రోజు ఈ విషయం తెలుసుకొనే శక్తి నీలో లేదు. ఈ విషయం నాకు కూడా తెలుసు. ఒకవేళ ఎప్పుడైనా సమయం వస్తే నేను నిజం చెప్పానని నీవు గ్రహించగలవు" దేవదాసు రెండు కళ్ళూ అశ్రువులతో నిండిపోయాయి. ఆయన దుఃఖిస్తూ చంద్రముఖి మాటలు నిజమేనా అని ఆలోచిస్తూ వున్నాడు. అతడి కళ్ళల్లోని అశ్రువులను చంద్రముఖి చూసింది. కాని తుడవడానికి ప్రయత్నించలేదు. లోలోపల అనుకొంటూ వుంది_"నిన్ను నేను అనేకసార్లు అనేక రూపాల్లో చూశాను. అంచేత నీ మనస్సు యొక్క గతి నాకు బాగా తెలిసే వుంది. సామాన్య పురుషుల మాదిరిగా నీవు కోరి ప్రేమను వెల్లడించలేవు. అప్పుడు మరి రూపం విషయమో_ రూపాన్ని ఎవరు కోరుకోరు? కాని ఇందుకోసం నీవు నీ యింత తేజస్సును రూపం పాదాలకు సమర్పించుకుంటావా? ఈ మాట విశ్వసించలేము. పార్వతి కావడానికి మంచి రూపవతి. కాని అయినా కూడా మొదట ఆమె ప్రేమ ద్వారాన్ని తెరిచిందనీ, మొదట ఆమెయే ప్రేమాలాపం ప్రారంభించిందనీ విశ్వాసం కలుగుతున్నది.
    లోలోపల అనుకొంటూ వుండగా హఠాత్తుగా ఆమె నోటి నుంచి అస్పుటమయిన స్వరంలో బయటపడింది_"నన్ను చూసుకొని ఆమె నిన్ను ఎంతగా ప్రేమిస్తూ వుండవచ్చునో తెలుసుకుంటున్నాను.
    దేవదాసు గభాలున లేచి కూర్చొని "ఏమంటున్నావూ?" అన్నాడు.
    "ఏమీలేదు, ఆమె నీ రూపం చూసి మరచిపోలేకుండా వుంది అని చెపుతున్నాను. నీకు రూపం వుంది. కాని ఆమెలో పొరపాటు వుండదు. ఈ తీవ్రమయిన శుష్కరూపం మీద అందరి దృష్టి పడదు. అయితే ఎవరి దృష్టి పడుతుందో అది మళ్ళీ తొలగలేదు.
    ఇలా అని ఒక దీర్ఘమయిన నిట్టూర్పు విడిచి మళ్ళీ అన్నది-"నీలో ఏమి ఆకర్షణ వుందో తెలియదు కాని దాన్ని నిన్ను ఎప్పుడైనా ప్రేమించినవాళ్ళే తెలుసుకోగలరు. ఈ స్వర్గాన్ని పొందాలని అభిలషించి మరలా ఎవరు మరలగలరు. అలా మరలిపోగల స్త్రీ యీ భూమిమీద ఎవరున్నారు?"
    మరికొన్ని క్షణాలు నిశ్శబ్దంగా వున్న తరువాత ఆమె ముఖం వైపు చూసి నెమ్మదిగా అన్నది_"ఈ రూపం కేవలం మూడునాళ్ళ ముచ్చట. అలా చూస్తూ చూస్తూ వుండగానే ఇది అంతమయిపోతుంది. చితితోపాటు అగ్నిలో భస్మమై బూడిదయిపోతుంది."
    దేవదాసు వ్యాకులంగా చంద్రముఖి ముఖం వైపు చూసి "ఈ రోజు నీవు ఇదంతా ఏమిటి వాగుతున్నావు?" అన్నాడు.
    చంద్రముఖి మధురమైన నవ్వు నవ్వి "ఇంతకన్న మించి మరేదీ మనస్సును ఉడికించే మాట వుండదు దేవదాస్_అదేమిటంటే ఎవరినయితే మనం ప్రేమించమో ఆమె బలవంతంగా ప్రేమ విషయాలు వినిపించడం. కాని నేను అది కేవలం పార్వతి కోసమే వకాల్తా తీసుకుంటున్నాను. నా కోసం మాత్రం కాదు" అన్నది.
    దేవదాసు వెళ్ళడానికి సిద్దపడి "ఇక నేను ఇక్కడ నుంచి వెళ్తాను" అన్నాడు.
    "ఇంకొంచెం సేపు కూర్చో. ఎన్నడూ నిన్ను జ్ఞానంతో వుండగా నేను చూడలేదు. ఎన్నడూ ఈ విధంగా రెండు చేతులు పట్టుకొని మాట్లాడగలిగేదాన్ని కాలేకపోయాను" ఈ మాట అని ఆమె హఠాత్తుగా నవ్వింది.
    "నవ్వావు ఎందుకూ?" అడిగాడు దేవదాసు ఆశ్చర్యంగా.
    "ఏమీలేదు. కేవలం పూర్వపు సంగతి ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఇప్పటికి పది సంవత్సరాలనాటి సంగతి. అప్పుడు నేను ప్రేమావేశంలో ఇల్లు వదిలిపెట్టి వచ్చేశాను. అప్పుడు ఎంతో ప్రేమించాలని మనసులో వుండేది. బహుశా అప్పుడు ప్రాణాలు గూడా ఇవ్వటానికి సిద్దంగా వుండేదాన్ని. తరువాత ఒకరోజు ఒక తుచ్ఛమయిన ఆభరణం కోసం పోట్లాట వచ్చింది. ఇక ఎవరి ముఖమూ చూడలేదు. ఈయన నన్ను బాగా ప్రేమించడం లేదనీ లేకపోతే ఒక్క ఆభరణం ఇచ్చేవాడు కాదా అని మనస్సును సంతృప్తిపరచుకున్నాను."
    చంద్రముఖి మళ్ళీ ఓసారి తన మనస్సులో నవ్వుకుంది. మరుక్షమే శాంతంగా, గాంభీర్యంగా, నెమ్మదిగా అన్నది_"ఆభరణం ఊడ్చుకుపోను. అప్పుడు ఒక మామూలు తలనొప్పిని నయం చేసుకొనడానికి ప్రాణాలే పోగొట్టుకోవలసి వస్తుందని ఏం తెలుసు? అప్పుడు నేను సీత బాధనుగానీ, దమయంతి వ్యధనుగానీ అర్ధం చేసుకొనేదాన్ని కాదు. మాధవుని కథను విశ్వసించేదాన్ని కాదు. సరేగాని దేవదాస్, ఈ ప్రపంచంలో ఏదయినా సంభవమే కదూ?"
    దేవదాసు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. నిశ్చేష్టుడై కొంచెం సేపు చూసి "నేను వెళుతున్నాను" అన్నాడు.
    "భయమేముంది, ఇంకొంచెం సేపు కూర్చో. నేను నిన్ను ఇంకా భ్రమలో వుండదలచుకోలేదు. నా ఆ రోజులన్నీ గడిచిపోయాయి. ఇప్పుడు నీవు నన్ను ఎంతగా ఏవగించుకుంటున్నావో  అంతగా నన్ను నేనే ఏవగించుకుంటున్నాను. కాని దేవదాస్, నీవు పెళ్ళి యెందుకు చేసుకోవు?"
    కొంచెం నవ్వి "ఉచితమైన పనే, కాని ఇష్టం లేదు" అన్నాడు.
    "ఇష్టం లేకపోయినా చేసుకో. స్త్రీ ముఖం చూసి చాలా శాంతిని పొందగలవు. ఇది నాకు కూడా ఒక దారి ఏర్పడుతుంది. నీ సంసారంలో దాసిగా పడివుండి స్వచ్చంద భావంతో జీవితం గడుపుతాను."
    దేవదాసు నవ్వి "అప్పుడు నేను నిన్ను పిలిపించుకుంటాను" అన్నాడు.
    చంద్రముఖి అతడి నవ్వును గమనించక "దేవదాస్, మరో విషయం అడగాలని అభిలాష కలుగుతున్నది" అన్నది.
    "ఏమిటీ?"
    "నీవు ఇంత సేపటివరకూ నాతో ఎందుకు మాట్లాడావు?"
    "అనుచితమా?"
    "ఆ విషయం నాకు తెలియదు. కాని కొత్త సంగతి. మద్యం త్రాగి చైతన్యాన్ని కోల్పోక పూర్వం నీవు ఎప్పుడూ నాతో మాట్లాడేవాడివి కాదు."
    దేవదాసు ఆ ప్రశ్నకు ఏమీ జవాబు ఇవ్వకుండా విషణ్ణ వదనంతో "ఇప్పుడు నేను మద్యాన్ని తాగడం లేదు. మా నాన్నగారు చనిపోయారు."
    చంద్రముఖి చాలాసేపటి వరకు అతడి ముఖంవైపు జాలిగా చూస్తూ "ఇక ముందు మళ్ళీ త్రాగుతావా?" అన్నది.
    "చెప్పలేను."
    చంద్రముఖి అతడి రెండు చేతులను కొంచెం లాగుకొని అశ్రుపూరిత నేత్రాలతో వ్యాకులంగా "ఒకవేళ సాధ్యమయితే వదిలేసెయ్! అటువంటి అమూల్యమయిన జీవిత రత్నాన్ని నష్టపరచవద్దు" అన్నది.
    దేవదాసు హటాత్తుగా లేచి నిలబడ్డాడు. "నేను వెళుతున్నాను. నీవు ఎక్కడికి వెళతావో అక్కడనుంచి తెలియజేస్తావుకదూ? మరేదయినా పని వుంటే వ్రాయి. నా ముందు సిగ్గు పడవద్దు" అన్నాడు.
    చంద్రముఖి నమస్కారం చేసి పాదధూళి అందుకొని "నేను సుఖంగా వుండాలని ఆశీర్వదించు. మరో భిక్ష కోరుతున్నాను. భగవంతుడు అలా చేయకూడదు. కాని ఒకవేళ ఎప్పుడయినా దాసీ అవసరమయితే నన్ను జ్ఞాపకం వుంచుకోండి" అన్నది.
    "సరే మంచిది" అని చెప్పి దేవదాసు వెళ్ళిపోయాడు. చంద్రముఖి రెండు చేతులతో ముఖం కప్పుకొని రోధిస్తూ "మరోసారి దర్శనం లభించేటట్లు చేయి భగవంతుడా!" అన్నది.
                                  14
    రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. పార్వతి, మహేంద్రుడి వివాహం చేసి నిశ్చింతగా వుంది. జలదబాల చాలా తెలివిగలది, కార్య కౌశలం గలది. ఇప్పుడు పార్వతికి బదులు సంసారంలోని కార్యకలాపాలన్నీ చాలావరకు ఆమె చేస్తున్నది. పార్వతి ఇప్పుడు తన మనస్సును మరోవైపుకు మరల్చింది. ఆమె పెళ్ళయి ఇప్పటికి అయిదు సంవత్సరాలు అయింది. కాని ఇంతవరకు ఆమెకు సంతాపం కలగలేదు. తనకు బిడ్డా పాపా లేని కారణంగా ఆమె ఇతరుల పిల్లలను ఎక్కువగా ప్రమిస్తున్నది. బీద సాదలను చూడడమే కాకుండా కొద్దిగా డబ్బుగల వాళ్ళ పిల్లల భారాన్ని కూడా ఎక్కువగా ఆమె మోస్తున్నది. ఇంతేగాకుండా దేవాలయ కార్యకలాపాలూ, సాధువుల, సన్యాసుల సేవలు, కుంటి, గ్రుడ్డివాళ్ళ శుశ్రూష మొదలయిన వాటితో రోజంతా గడుపుతూ వుంటున్నది. భర్తకు కూడా ఇటువంటి ఆసక్తిని కలిగించి పార్వతి మరో అతిథిశాల కూడా కట్టించింది. అందులో నిస్సహాయులు, నిరాశ్రితులు స్వేచ్చగా ఉండవచ్చు. జమీందారు ఇంటి నుంచే వాళ్ళందరికీ భోజనం లభిస్తుంది. ఒక పని మాత్రం పార్వతి చాలా రహస్యంగా చేస్తున్నది. భర్తకు కూడా తెలియనిచ్చేది కాదు. ఉన్నంత వంశానికి చెందిన దరిద్రులకు రహస్యంగా ధన సహాయం చేస్తుంది. ఇదే ఆమె రహస్యంగా చేస్తున్న పని. ఇదే ఆమె సొంత ఖర్చు. భర్త దగ్గరనుంచే ప్రతినెలా తనకు లభించే సొమ్ము అంతా ఇందులోనే ఖర్చు చేస్తుంది. ఏ విధంగా ఖర్చు చేసినా, ఎంత ఖర్చు చేసినా కచేరీ ఉద్యోగులకు తెలియకుండా ఉండేదికాదు. ఈ విషయాన్ని గురించి వాళ్ళు పరస్పరం చర్చలు జరుపుకునేవాళ్ళు. కుటుంబం ఖర్చు పూర్వంకన్నా రెట్టింపు అయిందన్న సంగతిని దాసీలు చాటుగా వుండి విని వచ్చేవాళ్ళు. బొక్కసం ఖాళీగా పడివుందనీ, ఏమీ మిగలలేదనీ వినేవాళ్ళు. కుటుంబం ఖర్చు అనుచితంగా పెరిగినందువలన దాసదాసీలకు అమితమైన వేదన కలుగుతుంది. వాళ్ళు ఆ మాటలన్నీ జలదబాలకు తెలియజేసి వచ్చేవాళ్ళు. ఒకరోజు రాత్రి ఆమె భర్తతో "నీవు ఈ యింటికి ఏమీ కావా?" అన్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS