Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 21

             
                               15
    "ఏమిటే, ఈ మధ్య అలాగున్నావు?' అడిగింది అరుణ.
    "ఏమీ లేదు" ముక్తసరిగా సమాధాన మిచ్చింది రజియా.
    "నా దగ్గర దాస్తా వెందుకే? రాజా దూరంయ్యాడని కదూ ఈ బాధ?"
    'అరుణా!'
    'నిజం చెప్పు. అంతే కదూ?"
    తల ఊపింది రజియా మెల్లిగా.
    'అయితే అన్నంత పనీ చేస్తున్నాడన్నమాట" అంది అరుణ , కోపంగా.
    "ఏమిటరుణా , నువ్వంటున్నది?"
    "మా అన్నయ్య స్వార్ధమూ, రాజ్ త్యాగమూ నీపై దెబ్బ తీస్తున్నాయన్న మాట."
    "నువ్వు చెప్పేదేదో సరిగా చెప్పకూడదూ?"
    అరుణ తమ యింట్లో ఆనంద్ కు, రాజ్ కు జరిగిన సంభాషణ వివరంగా చెప్పింది.
    'అదన్నమాట విషయం. మీ అన్నయ్య నన్ను అనవసరంగా అపార్ధం చేసుకొన్నాడు."
    'అన్నయ్య వట్టి మూర్క్దుడై పోయాడు, రజియా! అతని తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను."
    "ఛ , ఏం మాటలే అవి?"
    'అయినా రాజ్ కూడా అంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తాడను కోలేదు. నేను కలుసుకొని చెప్తా నుండు."
    "అంత అవసరం లేదులే, అరుణా!' అంది రజియా , ఏదో ఆలోచించుకుంటూ.
    అప్పుడే బయటికి వస్తున్న రాజ్ వాకిట్లో నిలబడి ఉన్న రజియా ను చూసి తల వంచుకున్నాడు.
    "నా ఎదుట పడ్డందుకు బాధపడుతున్నావా , రాజ్?"
    "నీ మాటలు అదోరకంగా ఉన్నాయేమిటి , రజీ?"
    'అలాగే ఉంటాయిలే కానీ ఒక విషయం అడుగుతాను. చెప్తావా?"
    "ఏమిటీ రజీ? నీ మాటలు వింతగా ఉన్నాయి. నీ మొహంలో ఆ దీనత్వమేమిటి? నీ మాటల్లో నిరాశా నిస్పృహలేమిటి?"
    "అదంతా తర్వాత చెబుతాను గానీ, నాతొ తిరగడానికి కానీ, నాతొ మాట్లాడడానికి గానీ, కనీసం నా మొహం చూడడానికి కూడా నీ కిష్టం లేదు కదూ?"
    "నీ మనసు నెవరో చెడగొట్టారు. తీరికగా మాట్లాడు కుందాం పద."
    "చెడగొట్టింది నా మనసును కాదు, రాజ్! నీ మనసునే. ఆనంద్ కు నువ్విచ్చిన మాట నిజం కాదా?"    
    "రజీ" అని బాధగా తలను చేతపట్టుకొని వెనుతిరిగాడు రాజ్.
    రజియా కళ్ళనుండి కన్నీరు ఏకదాటిగా ప్రవహిస్తుంది. ఆమె హృదయం రోదిస్తుంది. గుండె దిటవు పరుచుకొంది.
    "రాజ్, నిన్ను మొదటి సారిగా చూసి నప్పుడు, నీ చూపులు నాలో ఒక జ్యోతిని వెలిగించాయి. నీ స్నేహం లభ్యమైననాడు నాలో ఆనంద సాగరమే పొంగి పొరలింది. పులకరించి పోయాను. నీ రూపాన్ని మనసులో ప్రతిష్టించుకొని ఆరాధించాను. నా పూజల ఫలితంగా నా కోరిక తీరుతుందనే వరాన్ని ప్రసాదించావు. ఆనాడు ఈ ప్రపంచాన్నే జయించానన్న తృప్తి, ఆనందం నాలో కలిగాయి. ఈనాడు ఎవరో మూర్ఖంగా పలికిన పలుకులకు విలువనిచ్చి నా కేడబాటు కలిగిస్తావా? అతడు నీకు మిత్రుడే కావచ్చు. అతని ఆనందం కోసం నువ్వు అర్ధం లేని త్యాగానికి సిద్దపద్దావు. కానీ, ఈ విషయం విను. అతని దగ్గర నేను ఒక చెల్లెలి చనువునే తీసుకొన్నాను."
    "రజీ!"
    "నమ్మలేవు కదూ! అతడు అపార్ధం చేసుకొన్నాడు. ఈనాడు అతని అర్ధం లేని కోరిక తీర్చడం కోసం నీ జీవితాన్నందాన్నే కాక నా ఈ అమూల్యమైన ఆరాధ్య దైవాన్ని దోచుకొని దూరంగా విసిరి వేస్తున్నావు. అందువలన ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. మిగిలేది జీవితాలను నాశనం చేయగల బాధ మాత్రమే. వరాన్ని ఇవ్వగలిగినవారికి శపించే అధికారం కూడా ఉంది. మొక్కలను పెంచే వారికి వాటిని పెరికి వేసే అధికారం ఉంది. నీ యిష్ట ప్రకారమే కానివ్వు. కానీ ఈ నిర్భాగ్యురాలివి. జ్ఞాపక ముంచుకో. నీ కోరిక ప్రకారం ఇక నీకెప్పుడూ కనిపించి నిన్ను కష్ట పెట్టను. వస్తాను." అని వెనుదిరిగింది రజియా.
    "రజీ" బాధగా అరుస్తూ తిరిగాడు రాజ్. ఆమె ఒక్కొక్క మాటా అతన్ని శిరాఘాతానికి గురి చేసింది. ఆ కంఠం రజియా కాళ్ళకు బంధమై పోయింది. ఎంత ప్రయత్నించినా కాళ్ళు భూమికి అంటుకు పోయినట్లు ఆమె ప్రయత్నాన్ని కొనసాగనియ్యలేదు. వెను తిరిగింది. రాజ్ కన్నీరు చూసి కలవరపడింది. అతని చూపుల్లో అర్ధింపూ, దీనత్వమూ గుండెల్ని చలింప జేస్తున్నాయి. "రాజ్" అంటూ ఒక్క ఊపులో అతని చేతుల్లో వాలిపోయింది.
    "రజీ , నువ్వు కూడా నన్ను ఏడిపిస్తావా? జీవితంలో అందరికీ దూరమవుతున్నాను. నువ్వు కూడా నన్ను వదిలి పెడతావా! నన్నునిస్సహాయుడుగా, నిరాధారంగా చేయడం నీకు న్యాయమా? ఎవరే మైనా అనుకొన్నా, దూర మైనా ఫరవాలేదు. కానీ, నిన్ను దూరం చేసుకోలేను. అజ్ఞానంతో నీమనసు కు కష్టం కలిగించాను. నాకు దూరం కావద్దు. నన్ను మళ్లీ అంధకారకూపం లోకి త్రోసివెయ్యకు. నాలోని నిస్సహాయాతకు జాలిపదకుండా నీ దారిన నువ్వు వెళ్ళిపోవడం నీకు ధర్మమా! నాకు ధైర్యాన్నిస్తూ నా సరసనే ఉండడం నీ విధి కాదా?"
    "రాజ్! క్షమించు. నిన్ను వదిలి ఎక్కడికీ పోలేను. పోయి సుఖంగా బ్రతకలేను."
    బయటి నుండి అంతా చూస్తున్న సుగుణ నిట్టూర్చి లోపలికి పోయింది.

                              *    *    *    *
    కాలేజీ ఆవరణంతా బి.ఏ సెకండియర్ విద్యార్ధులతో కోలాహాలంగా నిండి ఉంది. ఒక్కరూ క్లాసుకు వెళ్ళడం లేదు. తమ వినతిని ఇంగ్లీషు హెడ్ ఆఫ్ డి డిపార్టుమెంటు లెక్చరర్ నారాయణరావు గారికి తెలుపుకొన్నారు. అయన భానుమూర్తి గారిని పిలిపించాడు.
    "పిలిపించారట" అన్నాడు భానుమూర్తి ఆయన గదిలోకి వెళ్లి.
    'అలా కూర్చోండి. మిస్టర్ భానుమూర్తీ!"
    భానుమూర్హి మౌనంగా అయన కెదురుగా నున్న కుర్చీలో కూర్చున్నాడు.
    "చూడండీ! సెకండ్ బి.ఎ. విద్యార్ధుల స్ట్రైక్ చూస్తున్నారుగా? మీ ఒక్కరి కోసం క్లాసులు జరుగక పోవడం , కాలేజీ అంతా అల్లరి కావడం ఏమీ బాగుండడం లేదు."
    "నన్నేం చేయమంటారు?"
    "వారి క్లాసు తీసుకోండి."
    "క్షమించండి. ఆ పని నా చేత కాదు."
    "మీరిలా ఎందుకు మొండి కేస్తున్నారో అర్ధం కావడం లేదు. మీకేమైనా అవమానం జరిగి వుంటే చెప్పండి. తగిన చర్య తీసుకుంటాం."
    "అలాంటిదేమీ లేదు కానీ నేనా క్లాసు తీసుకోలేను."
    "మిస్టర్ భానుమూర్తి! మీ మధ్య వారి మధ్య మేం సతమతమయిపోతున్నాం. ఇంత వరకూ మీకు నచ్చ చెప్పాలని ప్రయత్నించాను. ఇక మా అధికారాన్ని వినియోగించదలుచుకొన్నాను. మీరా క్లాసు తీసుకొని తీరాలి."
    భానుమూర్తి వారి మోహంలో కాఠిన్యాన్ని చూశాడు. "ఆలోచించడానికి నాకు కొంత వ్యవధి ఇవ్వండి."
    "ఓ అలాగే. మీ యిష్టం వచ్చినంత వ్యవధి తీసుకోవచ్చు."
    భానుమూర్తి అక్కడి నుండి లేచి స్టాప్ రూమ్ కు బయలుదేరాడు. వరండా లో ఉన్న విద్యార్ధులు అతన్ని చూసి నిశ్శబ్దంగా ప్రక్కకు జరిగారు. తలవంచుకొని వెళ్ళిపోయాడు భానుమూర్తి.
    ఆయనలా పోగానే నారాయణ రావు గారు వచ్చి "నేను ఆయనకు చెప్పాను. అంగీకరించారు. ఇక మీరు వెళ్ళి క్లాసులో కూర్చోండి" అన్నారు.
    విద్యార్ధులు విజయంతో, ఆనందంతో క్లాసు లోపలికి పోయి కూర్చున్నారు. విద్యార్ధులంతా అయన ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఏ చప్పుడు వినబడినా వారి హృదయాలు జాగ్రత్తగా వింటున్నాయి.
    భానుమూర్తి ప్రిన్సిపాల్ గారి ముందు ఒక కాగితాన్ని ఉంచాడు. అది చదివిన ప్రిన్సిపాల్ గారు ఆశ్చర్యంతో "ఏమిటిది, మిస్టర్ భానుమూర్తి?" అన్నారు.
    "నా రాజీనామా."
    "చాలా తొందర పడుతున్నావు."
    'ఆలోచించే ఈ నిర్ణయాని కొచ్చాను, సార్!"
    "చూడు యువకుడివి. నీలో పట్టుదల సాధించాలనే అభిలాష ఉండవచ్చు. కానీ దాని కోసం అనవసరంగా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడం లో అర్ధం లేదు. ఇంకోసారి ఆలోచించు కొని నీ నిర్ణయాన్ని మార్చు కొంటావని ఆశిస్తున్నాను."
    "క్షమించండి. ఇదే నా ఆఖరు నిశ్చయం. దాన్ని మార్చుకొనే ఉద్దేశ్యం కానీ, అలవాటు కానీ నాకు లేదు."
    క్లాసులో నిశ్శబ్దం తాండ వీస్తుంది. విద్యార్ధులు ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. అడుగుల చప్పుడయింది. వారి ఆత్రుత హెచ్చింది. అందరి కళ్ళు ఎవరి కోసమో ఏ రూపం కోసమో చిరునవ్వుతో చూచాయి. కానీ ఆ వచ్చిన వ్యక్తీ వారి ఉత్సాహాన్ని , ఆనందాన్ని చంపేశాడు. వారి చిరునవ్వు మాయమైంది. ఆ వ్యక్తీ నారాయణరావు గారు.
    జాలిగొలిపే చూపులతో అందరినీ కలయ చూశాడు అయన. "మీకందరికీ ఒక బాధాకరమైన వార్త చెప్పబోతున్నందుకు విచారిస్తున్నాను. భానుమూర్తి గారు రాజీనామా యిచ్చి వెళ్ళిపోయారు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS