Previous Page Next Page 
తప్పు పేజి 22

 

                                     11
    పల్లెటూళ్ళు కానవసరం లేదు అద్భుతం అయిన వార్తల వంటివి యిట్టే పాకిపోయేందుకు . 'మనం అనుకున్నట్లే అయింది. కొంచెం తల క్రిందులుగా చటర్జీ పెద్ద కొడుకు ఈ పని చేస్తాడనుకునే వాళ్ళం. చిన్నవాడే చేసాడు. ఉపేంద్ర మద్దతు కూడా లేకుండా పోయింది పాపం.' ఉపేంద్రా, చటర్జీ కుటుంబాలు తెలిసిన వాళ్ళందరూ యీ మాటే అనుకోసాగారు.
    చటర్జీయే కాదు ఉపేంద్ర కూడా బయటికి వచ్చేందుకు సాహసం చేయలేక పోతున్నాడు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు నట్టనడి వీధి లో యిద్దరి కుటుంబాల గురించీ అపహాస్యంగా చెప్పుకునే వారే యెక్కడ చూసినా. వంశ ప్రతిష్టల గురించీ, కుటుంబాల తీరు తెన్నుల గురించీ, వ్యాఖ్యానాలు చేసేవారే . ఉపేంద్ర ని యెప్పుడో బ్రహ్మణ్యం లోంచి వదిలేశారు. చటర్జీ ని వెలి వేసేందుకు ఋజు సాక్ష్యాలు తగినవి లేని కారణంగా యిన్నాళ్ళూ నోరు మూత వేసుకున్నారు. కానీ యిప్పుడు వుమేష్ చేసిన పని అద్దంలో ప్రతిబింబం మాదిరి స్పష్టం చేయగానే భుజాలు చరుచు కున్నారు.
    చటర్జీ యింటికి వెళ్ళి యిదంతా ఉపేంద్రా పన్నాగం అని నూరి పోసేవారు. కొందరూ, ఉపేంద్రా యింటికి వెళ్ళి కొడుకుని చటర్జీ యే పురికొల్పి తండ్రిని , కూతుర్నీ వేరు చేయించాడ ని కొందరూ అర్ధం లేని మాటల్ని అందంగా చేర్చి కరటక దమనకుల వలె పని చేయసాగారు.
    ఉప్పురవ్వ పడి పాలు విరిగినట్లు యివే మాటల వల్ల కాకపోయినా ఆ సంఘటన వల్లనే చటర్జీ, ఉపేంద్రల మైత్రి లో అగాధం యేర్పడి పోయింది. యిద్దరూ ఎదురెదురుగా తటస్థ పడినా ముందు చూసిన వాళ్ళు పక్క గల్లిలోంచి వెళ్ళిపోవటం జరుగుతుంది. తలెత్తి యెప్పుడూ సూటిగా చూసుకొని వారి మాదిరి గా అయిపోయారు. కన్న బిడ్డల్ని దూరం చేసుకున్న చిత్త క్షోభ వజ్రం మాదిరి కోత కోస్తున్నా అభిమానం , అభిజాత్యం అడ్డు రాగా యెవరికి వారే మౌనం వహించి వూరుకోసాగారు.
    కోర్టు నుంచి వస్తున్నప్పుడూ కోర్టులో యేకాంతం గా కూర్చున్నప్పుడు దూరంగా చటర్జీ ని వుద్దేశించి వినిపించే మాటల కరుకు కత్తుల్లా అతన్ని చీల్చి చెండాడుతున్నాయి. తెలుగు వాళ్ళు చటర్జీ ఉపేంద్ర లే కాదు. చాలామందే వున్నారు కలకత్తా లో.
    'విడో మారేజ్ ...దానికి మొదలేమిటిరా' ఒకడు రెండోవాడిని అర్ధం కాని వాడిలా అడుగుతే రెండోవాడు కాలరు సవరించుకుంటూ, 'రామవరం చలో....అనుకుంటాను.' అంటాడు.
    మూడోవాడు ప్రతాపంగా 'నాటే రాంవరం, హైదరాబాద్ చలో విడో మేరేజ్ కరో' అంటాడు.
    చటర్జీ తలెత్తి చూసేలోగా అక్కడ యెవరూ వుండరు.
    యిప్పుడతను పూర్తిగా యేకాకి మాదిరి అయిపోయాడు. రోజూ సాయంత్రం పూట వచ్చి బాతాఖానీ కొట్టి అతన్ని యింద్రుడనీ, మరేదో అనీ పొగిడే స్నేహ బృందం ఒక్కసారిగా రావడం మానేసింది. కాఫీలూ, టిఫిన్ లూ తినేసి కడుపు నిండా 'బ్రేవ్' మని త్రేన్చుతూ అతన్ని కొని యాడిన ఆత్మీయులు తుపాకీ దెబ్బకు పక్షులన్నీ యెగిరి పోయినట్లు చెల్లా చెదరై పోయారు.   పొరబాటున మార్కెట్ లో గానీ, బజార్లో గానీ , లైబ్రరీ లో గాని కనిపిస్తే అతన్ని అదివరకు యెన్నడూ చూడనట్లే, పరిచయం లేని మనిషిని చూసి తప్పుకున్నట్లు తప్పుకుంటారు.
    చటర్జీ పిరికి గుండె రోరోజుకి మరింత పిరికితనాన్ని కౌగలించు కుంటూ బలహీనం కాసాగింది.
    అతను రాత్రి అక్కడా అక్కడా తిరిగి యింటికి చాలా ప్రొద్దు పోయి వస్తాడు. వచ్చే ముందు చేపల కూర తిని కొద్దిగా మందు సేవించి మరీ వస్తాడు. తాత్కాలిక మనశ్శాంతి ని పొందుతూన్నాననుకుని, ఒక్కోరోజు అతను విదేశీ పానీయాల్నీ రుచి చూసి వుప శాంతి పొంది తడబడే అడుగులతో మెట్లెక్కి వచ్చి పక్క మీద వ్రాలిపోతాడు. గోవింద పలకరించినా అతనీ ప్రపంచం లో ఉండడు. చటర్జీ ముప్పై ఏళ్ళ ప్రాయంలో గోవింద అందానికి ముగ్ధుడై , ఆ పిల్ల దౌర్భాగ్యానికి సానుభూతి చూపిస్తూ , ఒక ప్రాణిని సంతోష పెడుతున్నాననే తృప్తితో పెళ్లి చేసుకున్నాడు. ఏళ్ళు పైన బడి అతనికి అరవై యేళ్ళు రాకమునుపే తను చేసిన తప్పిదానికి అనుక్షణం దురసిల్లుతూనే వున్నాడు.

                                      
    ఆదర్శాలు వుపన్యాసాలు గానూ, ప్రతికల్లో వ్యాసాలు గానూ వచ్చినప్పుడూ, పొందిన ఆనందాన్ని జీవితంలో అనుభవించేప్పుడు పొందలెం అని గ్రహించాడు. అప్పటికే ఆలశ్యం అయిపొయింది. ఇన్నేళ్ళ సహధర్మ చారిణి ని యిప్పుడు వదులుకోలేడు? ఆవిడ కన్నబిడ్డ ని ఆవిడ కన్నా ముందు ప్రేమించి దూరం చేసుకోలేదు. యిద్దరూ తను చేసిన తప్పిదాన్ని యెత్తి చూపిస్తున్నట్లు యెవరు లేకుండానే అతను త్రుళ్ళి పడతాడు. తనలో తనే చిరాకు పడతాడు. లోకం మాటలకి చెవి గూబలు పగిలి పోతుంటే ఒంటరిగా యెన్నో చోట్ల కి వెడతాడు. యెక్కడా అతనికి శాంతి లభించదు. 'మనసు లో లేని శాంతి బజార్లో దొరుకుతుందా కొనుక్కునెందుకు?' అంటుంది అతని అంతరాత్మ.'    
    శ్రీకాంత్ చదువు గురించి తండ్రి యెదుట రెండు సార్లు యెత్తాడు. అతను మాట్లాడలేదు.
    పేపర్లో అడ్వర్టైజ్ మెంట్ చూసి శ్రీకాంత్ మెకానికల్ యింజనీరు గా ప్రైవేటు కంపెనీ లో చేరాడు. తెలిసి కూడా చటర్జీ యెందుకని ప్రశ్న వేయలేదు. యింకా చదవాలనుందని మానేశావెం? అనలేదు. చూసీ చూడనట్లు వూరుకున్నాడు.
    గోవింద పూర్తిగా మూగదై పోయింది. కన్న కొడుకు యెక్కడికి వెళ్ళాడో అంతు తెలియదు ఆవిడకి. శ్రీకాంత్ పట్ల చటర్జీ నిర్లక్ష్యం మరీ బాధిస్తుంది ఆవిడని. అయినా ఆబల అయిన గోవింద చేయగల్గేది యేమీ లేదు.    
     శ్రీకాంత్ యింటికి వచ్చేసరికి తండ్రి మైకం లో వుంటాడు. తల్లి సోఫా లో రెండు చేతుల మధ్యా తలని ' వుంచుకుని వెనక్కు వాలి నిద్రపోతూ వుంటుంది. కాళ్ళూ చేతులు కడుక్కుని ఒక్కోరోజు అతను మంచం మీద వాలిపోతాడు. పని చేసిన కారణంగా అతనికి నిద్ర ముంచుకు వస్తుంది. తల్లి ఏ మధ్య రాత్రి వేళో లేపినా అతనికి మెలుకువ రాదు.
    రోజులు భారంగా గడుస్తున్నాయి. చటర్జీ ని త్రాగడం మానేయమని చెప్పే ధైర్యం యిటు భార్యకి, అటు కొడుక్కి కూడా లేదు.
    శ్రీకాంత్ కనిపించగానే చటర్జీ గట్టిగా శక్తి నంతా కూడదీసుకుని 'దౌర్భాగ్యుడా నువ్వు వెళ్ళిపో. నువ్వే లేకపోతె గోవింద గురించి యెవరికి తెలిసేదికాదు. నా పరువు గంగలో కలిపి నేను నవ్వులపాలయ్యే వాడిని కాను. నీ వల్లనే నా కొడుకు నాకు దూరం అయిపోయాడు. వాడిని చూడకుండా బ్రతుకుతున్నా నంటే నీ వల్లే.' అనాలను కుంటాడు.
    'నాన్నగారూ! డాక్టరు మిమ్మల్ని సాయంత్రం తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పాడు. మీ ఆరోగ్యం గురించి మీరు చూసుకోకపోతే యెలాగండి. తమ్ముడు క్షేమంగా అత్త దగ్గర వున్నాడు. మీరు బెంగ పెట్టుకోవద్దు. మీరోసారి అద్దంలో చూసుకోండి, యెంత చిక్కిపోయారో . యెందుకిలా అయిపోతున్నారు?' అని ప్రశ్నల పరంపర కురిపిస్తూ ప్రేమగా శ్రీకాంత్ అడుగు తుంటే గొంతులో కదిలే మాటల్ని అతను గరళం లా దిగ మ్రింగుతాడు. అతను కొడుకు అమాయకత్వాన్నీ స్త్రీ లాలిత్యాన్ని గుర్తుకు తీసుకు వచ్చే ఆ మొహాన్ని చూస్తూ కరిగిపోతాడు అప్పటికి మటుకు.
    ఆ వీధిలో పూర్వం సోమేంద్ర నాద్ వున్నప్పటి నుంచీ ఉమేష్ పెళ్లి చేసుకో పోయేంత వరకూ ఏ శుభకార్యాలు జరిగినా మొట్టమొదట చటర్జీ కుటుంబానికి ఆహ్వానం వెళ్ళేది. కానీ యిప్పుడంతా తలక్రిందు లై పోయింది.
    నేడో రేపో జడ్జీ పదవిని స్వీకరించబోతున్న నవీన చంద్రుడు. పదేళ్ళ కొడుకు ఉపనయనాన్ని బాహాటంగా భూనభొంతరాలు దద్దరిల్లి మారు మ్రోగి పోయేట్లు చేశాడు. పది గంటలకి ముహూర్తం అనగా కోర్టు లో పని చేసేవాళ్ళు కాపలా మనిషి దగ్గర్నుంచి జడ్జీ వరకూ ఆ యింటి కి ఆహ్వానింపబడ్డారు. చటర్జీ , ఉపేంద్ర లు మాత్రం రాలేదు. రాకపోవడం కాదు అతడు వీళ్ళని పిలవలేదు. ఉపేంద్ర ని యెప్పటి నుంచో పిలవడం మానుకున్నారు. కానీ చటర్జీ నే మొదటి సారిగా వెలివేసి నట్లు నులుగురి కీ తెలియ పరచడం లాగా జరిగింది. ఆ పిల్లాడి ఉపనయన మహోత్సవం.
    మేడ మీద అలవాటు ప్రకారం ఈజీ చైర్లో పడుకొని ఆరోజు పేపరు తిరగేస్తున్న చటర్జీ వూరేగింపు కి తొంగి చూశాడు క్రిందికి. అందరి కళ్ళూ ఆ క్షణం లోనే పైకి మేడ మీదున్న చటర్జీ వైపు మళ్ళాయి. మళ్లడం కాదు అవి హేళన పూర్వకమైన నవ్వుని పులుముకుని చీత్కారంగా చూడసాగాయి. చటర్జీ దృష్టి ని గబుక్కున పేపర్లో కి మార్చేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS