Previous Page Next Page 
తప్పు పేజి 21

 

    'నా కడుపున చెడ బుట్టావు. యిడియట్. నీకు వాడే నూరి పోశాడు. తగుదునమ్మా అని మొహం చూపించేందుకు వచ్చావా? యందు కొచ్చావు. వెళ్లు తక్షణం నా గడప లోంచి వెళ్లిపో. ఈ పెళ్లి చేసుకునే ముందే నువ్వు ఆలోచించాల్సింది ఈ యింటికీ నీకూ ఋణం యేమాత్రం లేదని' చటర్జీ చివట్లన్నిటిని ఉమేష్ తాపీగా భరించాడు.
    అతను శాస్త్రయుక్తంగా తను అనుకున్న మాదిరిగానే నలుగురు పెద్దల సమక్షంలో కృష్ణ మోహిని ని పెళ్లి చేసుకున్నాడు. శ్రీకాంత్ ఉమేష్ లు రెండు కళ్ళు గోవింద కి. ఉమేష్ స్వతహాగా పిరికి వాడు. అతను యింతపని చేస్తాడని గోవింద అనుకోలేదు. అతన్ని వూరడించేందుకు ఆనాడు 'దేవుడు మేలు చేయాలి నీకు.' అన్నది కానీ ఆ పిల్లాడే తండ్రిని యెదిరించి నిలబడతాడని గ్రహించ లేకపోయింది.
    తండ్రీ కొడుకుల మధ్య శిలా ప్రతిమలా నిలుచుంది. తండ్రితో కొడుకుని తిట్టద్దనే సాహసం లేదు. ఆ తండ్రి ఎదుటే కొడుకుని దూషించి అగ్ని లో ఆజ్యం పోయానూ లేదు. బ్రతుకంతా వ్యధల తోటీ, కన్నీటి తోటీ గోవింద తీపి జీవితంలోని మాధుర్యాన్ని యేనాడూ తనివితీరా గ్రోల లేకపోయింది.
    చటర్జీ కళ్లల్లో నిప్పులు యేక ధాటిగా కురుస్తున్నాయి. అతను మాట్లాడుతుంటే రెండు పిడుగులు పోటా పోటీగా వుమేష్ మీద పడుతున్నట్లున్నాయి. చటర్జీ నిలువెల్లా కోపాద్రేకంతో వోనికి పోతున్నాడు. శ్రీకాంత్ నోట మాటరాని వాడి మాదిరిగా గది గుమ్మం లోనే ఆగిపోయాడు.
    ఉమేష్ తలయెత్తి చుట్టూ చూశాడు. గోవింద యేడుస్తున్నది. అతని హృదయానికి యెవరో గురి చూసి బలంగా యినప గుండుని విసిరినట్లయింది. క్షణికం ఆలోచించాడు. అడుగు ముందుకు వేసి తల్లి మెడ చుట్టూ చేతులు వేసి ఆవిడ వక్ష స్థలం లోకి వాలిపోయాడు. అతనికి దుఃఖ పుతెరలు తన్నుకు వస్తున్నాయి. ఆ తల్లి యేమీ చేయలేని దానివల్లే బిడ్డ  శిరస్సు పైన చేతిని వుంచి మరింత గుండె ల్లోకి తీసుకున్నది. తన నుండి  తండ్రి , సమాజం బిడ్డని వేరు చేస్తున్నారు . ఈ సమాజాన్ని, తాను ఎదుర్కో లేదు ఒంటరిగా. భర్తకి వ్యతిరేకంగా బ్రతకలేదు.
    'వెళ్ళు ఉమేష్.' కొండ రాళ్ళని ఫిరంగి బ్రద్దలు చేసినట్లుంది చటర్జీ కంఠం. అతను తలెత్తి తల్లి వైపు వోసారి చూసి తల దించుకుని, అన్న చేతిని ప్రేమగా ఒక్కసారి పట్టుకుని వదిలేసి అసుర సంధ్యలు ప్రపంచాన్ని అలుముకుంటున్న సమయంలో గడప దాటి గేటు తెరుచుకుని వెళ్లిపోయాడు.
    చటర్జీ కుప్పలా కూలిపోయాడు. కొడుకు శాశ్వతంగా దూరం అయిపోయాడు. అతని అంతర్గాతపు కుమిలింపునీ ఉమేష్ అర్ధం చేసుకోలేక పోయాడు. అతన్ని బ్రతిమిలాడి, భంగపడితే రాజీకి వచ్చేవాడు. కానీ ఉమేష్ ఆవిధంగా చేయలేదు. వెళ్లిపోతున్న యింట్లో కి వచ్చేందుకు అతనికి మనస్కరించ లేదు.
    శ్రీకాంత్ బాల్కనీ లోకి వచ్చి కళ్ళు తుడుచుకున్నాడు. వెళ్ళిపోతున్న తమ్ముడు ఆశగా బాల్కనీ వైపు అదే సమయంలో చూశాడు. తమ్ముడికి అన్న కనిపించాడు. ఆ కనిపించీ కనిపించని అసుర సంధ్య లోనే చేయెత్తి అన్నని గమనించినట్లు సైగ చేశాడు. అన్న కూడా అదే సమయంలో తమ్ముడ్ని ఆశీర్వదించే విధంగా చేయి కదిపాడు.
    
                             *    *    *    *
    ఉమేష్ నార్కెల్ డాంగా లో ఉపేంద్ర యింటికి చేరుకునేసరికి బాగా చీకటి పడి పోయింది. కృష్ణమోహిని వీధి వాకిలి లో నిలుచుని ఉమేష్ కోసం యెదురు చూస్తున్నది. అతను రాగానే యిద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు. ఉపేంద్ర పలకరింపు గా ఉమేష్ ని చూసి నవ్వాడు. అతనికి ఉమేష్ నమస్కారం చేశాడు.
    'యేమిటి విశేషం ?' అని ప్రశ్నించాడు ఉపేంద్ర.
    కృష్ణ మోహిని ఉమేష్ కి వెనుక నిలుచుంది.
    'ఇవాళ మేము పెళ్ళి చేసుకున్నాం. మీ ఆశీర్వాదం కోసం వచ్చాను మామయ్యా.'
    ఉపేంద్ర డంగై పోయాడు . అతనీ హతర్పరిణామానికి వ్రేటు తిన్న విహంగం వలె అయిపోయాడు. తల వాలిపోతుండగా బలవంతంగా అధీనం లోకి తెచ్చుకుని కుడిచేతి చూపుడు వ్రేలితో ఉమేష్ ని చూస్తూ "యేవిటి నువ్వు అంటున్నది ఉమా! నాకసలు అర్ధం కాలేదు." అన్నాడు.
    'నేనూ కృష్ణా యివాళ పెళ్లి చేసుకున్నాం. ఆ సంగతి చెప్పేందుకు వచ్చాను.'
    'బొత్ ఆఫ్ యూ గేటేట్ ఆఫ్ మై హౌవుస్ ' ఉపేంద్ర గొంతు ఉరుములా ప్రతిధ్వనించింది.
    ఉమేష్ ఆశ్చర్య పోలేదు. తిరస్కారాన్ని అలవాటు చేసుకునే గుండె ధైర్యాన్ని ఆ ఉదయం పది గంటలలో గానే కొని తెచ్చుకున్నాడు. కృష్ణ మోహిని తెల్లబోయింది. ఉమేష్ ని వెనక్కి లాగి తను ముందుకు వచ్చి నిలుచున్న తండ్రి గుండెల్లోకి జారిపోయింది. మనోమోహిని ద్వారం దగ్గర చిత్తరువు లా నిలుచుంది.
    'నాన్నగారూ! ఉమని చేసుకుని తప్పేం చేశాను? మీకు అతనంటే వున్న అభిమానం యిప్పటిదా? మీరెందుకిలా మారిపోయారు. నేనెక్కడికి వెళ్ళను? ఉమేష్ ని వాళ్ళ నాన్న వెళ్ళ గోడితే మీరు ఆశ్రయం యిస్తారను కున్నాను.' కృష్ణ మోహిని కి దుఃఖం ఆగలేదు.
    ఉపేంద్ర పిచ్చివాడి లా ఘొల్లున నవ్వాడు. వెంటనే గంబీరంగా మారిపోయాడు. అతని కళ్లల్లో కాఠిన్యం మాటల్లో వ్యక్త పరుస్తోంది.' అతను వెళ్ళ గోడితే నేను ఆశ్రయం యిస్తానను కున్నారా? గుడ్ . ప్రపంచం లో యేది జరిగినా ఒప్పుకుంటాను. కానీ మిత్ర ద్రోహానికి నేను చస్తే ఒప్పుకోను. నువ్వు నా బిడ్డవి. అతన్ని చిన్నప్పటి నుంచీ నీకు చేయాలనుకున్నాను. యిద్దరూ చేసుకుంటే అభినందిస్తా ననుకున్నారా.'
    'రేపు ప్రొద్దుట చటర్జీ వూరు వాడా తన కొడుక్కి మత్తు మందు జల్లి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్నానని నా పైన అనవసరంగా నింద వేస్తాడు. అతను 'కా'ధన్నా ఈ సంబంధాన్ని ఉమేష్ చేసుకున్నందు కు నేనేమీ గర్వ పదను. పెద్దల ఆశ్వీర్వద బలం లేనిదే ఏ మంచి పనీ గణన కేక్కదు. అతను తండ్రి యెదుట తన యిష్టాన్ని స్పష్టంగా చెప్పి వుండ వలసింది. తండ్రికి చెప్పి మరీ చేసుకో వలసినది.'
    'తండ్రిని యెదిరించి చాటుగా చేసుకుని రావడాన్ని నేను ప్రోత్సహించను. అనుభవం లేని వాళ్ల మాట యెలా వున్నా జీవితాన్ని వయసులోనూ, క్రియా రూపం లోనూ మీ కన్నా యెక్కువగా చవి చూసిన వాడిని నేను. యింటు వంటి పెళ్లిళ్లు తాత్కాలికానందాన్ని యిస్తాయే తప్ప శాశ్వతంగా మనశ్శాంతి ని యివ్వలేవు.'
    'ఇటు నేనూ అటు చటర్జీ ఇద్దరమూ వెళ్ళి పొమ్మంటున్నాం. భవిష్యత్తు యిప్పుడు మీరు అనుకునేంత తీయగా వుండదు. చటర్జీ యింట నేను నమ్మకమైన మిత్రుడి లా మెలిగాను యిన్నాళ్ళూ. నీకు పెళ్లి కాకపోయినా నేను విచార పడే వాడిని కాను. కానీ అతనే మనుకుంటాడు.
    యిప్పటికే నేను చాలా మాట్లాడాను వెళ్ళిపొండి యిద్దరూ.' ఉపేంద్ర ఆపైన మాట్లాడలేదు. భార్య భుజం మీద చేయి వేసి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు.
    కృష్ణ మోహిని బెంగ గా భర్త వైపు చూసింది. అతను శాంతంగా నవ్వాడు. వోదార్పు గా ఆ పిల్ల చుట్టూ చేతులు వేసి వీధి తలుపు తెరుచుకుని బయటికి వచ్చాడు. అతనికి కలకత్తా నగరం లో శ్రేయోభిలాషులు, మిత్రులు , ఒకరాత్రి ఆశ్రయం యిచ్చే వారు లేకపోలేదు.
    దారిలో అతను నవ్వాడు . 'ఈ వాచీ నాన్నగారు కొన్నారు. ఈ పులి గోరు గొలుసు, వుంగరం తాతగారు ఉపనయనం సమయంలో అన్నకీ నాకూ చేయించారు. సర్టిఫికెట్లు సిద్దంగా వున్నాయి వచ్చి తీసుకు వెళ్ళమని జోషి చెప్పాడు. రేపు తీసుకుంటాను యిద్దరివీ. హైదరాబాదు వెడదాం. అత్త కేకలు వేసినా ఆదరిస్తుంది.'
    'వీళ్ళ మాదిరిగా ఆదరించ లేకపోయినా నిర్దాక్షిణ్యం గా వెళ్ళ గొట్టదు. మనం బ్రతకలేక పోము భవిష్యత్త్ ని మీ నాన్న భయంకరంగా సృష్టించి నిన్ను మరీ భయభీతురాల్ని చేయాలనుకున్నాడు. అన్నీ మన చేతుల్లో వున్నాయి. మనం నవ్వితే అద్దంలో ప్రతిబింబం నవ్వు తుంది. యేడిస్తే యేడుస్తుంది. మనం నవ్వుతే ఈ సమాజం నవ్వక పోదు. యెదురు ఏడవాలి మనం? నువ్వు ధైర్యంగా వుండు.'
    'నువ్వు కొండంత ధైర్యం యిచ్చి ఆశ్రయం యిస్తుంటే నేను పిరికి దాన్నయి పోయేందుకు పాపాయినా ఉమేష్. నువ్వు నా కెప్పటికి ఈ ధైర్యాన్ని యిస్తే అంతే చాలు.' అన్నది కన్నీరు తుడుచుకుని అతని వెనకే నడుస్తూ కృష్ణ మోహిని.
    ఆ రాత్రి అతను తాతగారి స్నేహితుడు గౌరీ మోహన చటర్జీ యింట్లో గడిపాడు -- తాతగారు యిచ్చిన వుంగరం కృష్ణ మోహిని చేతి కంకణాల్లో ఒకటి అమ్మేసి ఆ సాయంత్రమే హైదరాబాదు వైపు ప్రయాణం అయారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS