Previous Page Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు - 2 పేజి 21


                                  
    
    టెలిఫోను మోగింది. ఆపరేటర్ ఫోనెత్తి, "ఎస్ సార్! మే ఐ హెల్ప్ యు? ప్లీజ్ టెల్ ద మెసేజ్!" అంది.
    అవతల ఫోన్లో "సూడమ్మాయ్! నాకు ఇంగిలీసు బొత్తిగా రాదు. నా బామ్మర్ది చినరాయుడికి ఓ వార్త పంపించాల. మీదేదో కంపెనీ, ఈ మధ్య తెలుగులో కూడా కబురులందిస్తున్నారని విని, ఇది కొన్నాం."
    "సారీ సార్! అయామ్ ఎక్స్ ట్రీ మ్ లీ సారీ!"
    "అదుగో... మళ్ళీ అదే ఇంగ్లీషు.....!"
    "ఓ....సార్.....రీ....క్షమించండి! మీ మెసేజ్ చెప్పండి!"
    "అలా అన్నావు, బాగుంది. రాసుకో! శ్రీరాములు అని పైన హెడ్డింగు పెట్టి, ప్రియమైన బామ్మర్ది చినరాయుడికి, ఉభయ కుశలోపరి.."
    "క్షమించండి సార్! ప్రస్తుతానికి మాది తెలుగులో సింగిల్ లైన్ పేజరే సార్! లైన్లు కూడా కదలవు. కొంచెం బ్రీఫ్ గా.... అంటే క్లుప్తంగా చెప్పండి!"
    "సూడు పేజరమ్మాయ్! ఒక్కో లైనుకీ ఒక్కో ఫోను చేసి చెప్పడం కుదర్దు. కావాలంటే ఎక్కువ డబ్బులుచ్చుకో! వర్తమానం పంపేటప్పుడు కాస్త మంచీ మర్యాదా ఉండాల!"
    ఆపరేటర్ నీరసంగా "సరే చెప్పండి సార్!" అంది.
    "ఆఁ .... ఉభయ కుశలోపరి మన పెద్దాడితో 'కాలం జరిగిపోతోంది' అనే సినిమా తియ్యాలనుకుంటున్నాను. వెంటనే బయల్దేరి రా! రాసుకున్నావా?"
    "ఎస్ సార్! వెంటనే పంపిస్తాను. నంబర్ చెప్పండి!" అని నోట్ చేసుకొని ఫోన్ పెట్టేసింది.
    పేజర్ డిస్ ప్లేలో పట్టినంతమేరకు ఆ మెసేజ్ ఆరు భాగాలుగా తయారయింది. మెసేజ్ పంపించి, తర్వాత ఆ మెసేజ్ రికార్డు బుక్కులో లైన్ బై లైన్ రాసి, పెన్ను అవతల పడేసి వెక్కి వెక్కి ఏడ్చింది. చుట్టూ ఉన్న స్టాఫ్, మిగతా ఆపరేటర్లు "ఏమైంది సుగుణా?" అంటూ దగ్గరకొచ్చారు.
    సుగుణ ఏం మాట్లాడకుండా లేచి ఓ దృఢ నిశ్చయానికి వచ్చినదానిలా కళ్ళు తుడుచుకుని, పరిగెత్తుకుంటూ వెళ్ళి అయిదవ అంతస్తులో ఉన్న ఆ ఆఫీసు బాల్కనీలోంచి దూకబోయింది. ఆమె ప్రయత్నాన్ని ముందుగానే పసిగట్టిన ఇద్దరు కొలీగ్స్ వేగంగా వెళ్ళి ఆమెను ఆపారు.
    "నీకేమైనా మతిపోయిందా? రిటైరైన తండ్రి, జబ్బుతో ఉన్న తల్లి, పెళ్ళి కావాల్సిన అక్కలూ ఉండి నువ్వీ అఘాయిత్యానికి పాల్పడితే వాళ్ళేమైపోతారు?" అంటూ బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టి మంచి నీళ్ళు తాగించారు.
    పది నిమిషాల తరువాత ఎం.డి. కాబిన్ లో ఉంది సుగుణ.
    "ఏమమ్మా? ఏమైంది?" అడిగాడాయన అనునయంగా.
    సుగుణ కళ్ళొత్తుకుంటూ "నేనీ ఉద్యోగం చెయ్యలేను సార్!" అంది తలొంచుకొని.
    "ఏమ్మా? జీతం చాలటం లేదా? ఇంక్రిమెంటు కావాలా?"
    "అదేం కాదు సార్! పేజర్ మెసేజ్ లు రిసీవ్ చేసుకోవటం, వాటిని రికార్డుల్లో రాయటం ఇబ్బందిగా ఉంది...."
    ఎం.డి. "ఇబ్బందా? కాస్త వివరంగా చెప్పు!" అన్నాడు ఆశ్చర్యంగా.
    సుగుణ ఏదో చెప్పబోయి, "చెప్పటం కష్టం సార్! రికార్డు చేసిన మెసేజ్ లు మీరే చూడండి!" అని వెళ్ళి రికార్డు బుక్కు తెచ్చిచ్చింది.
    ఎం.డి. పేజీలు  తిరగేశాడు. ఇందాక సుగుణ రాసిన మెసేజ్ ఇది.
    'శ్రీరాములు ప్రియమైన బామ్మ/ రిదిచినరాయుడికి ఉభయ / కుశలోపరి మన పెద్దాడితోకా/ లంజరిగిపోతోంది అనేసి/ నిమాతియ్యాలను కుంటున్నాను / వెంటనే బయల్దేరి రా / పెదరాయుడు.
    ఎం.డి. ఇబ్బందిగా కదిలాడు. గత పది రోజులుగా వచ్చిన మెసేజ్ లు చకచకా పరిశీలించాడు. రాజకీయప్రత్యర్ధులకీ, కుటుంబ తగాదాలకూ తమ తెలుగు పేజర్ బాగా ఉపయోగపడుతోంది తిట్టుకోవడానికి. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సివస్తుందని తను ఊహించ;లేదు. అక్కడికీ చైర్మన్ గారు చెప్పాడు. తెలుగువాడికి సంతోషమొచ్చినా, కోపం వచ్చినా ఎదుటివాడి తల్లిని ముందర స్మరించుకునే మాట్లాడటమో, పోట్లాడటమో మొదలెడతాడని. ఆ పరభాషాచైర్మన్ గారు అలా అంటే తను పొంగిపోయాడు మన తెలుగువాళ్ళంటే ఎంత అదీ....ఎంత ఇదీ.... అని.
    నిట్టూర్చి "సరేలేమ్మా నిన్ను వేరే సెక్షన్ లో వేస్తాలే! మెసేజ్ లు తీసుకోవడానికి మగవాళ్ళనే పెడతాను. నువ్వింటికెళ్ళి విశ్రాంతి  తీసుకుని రేపు రా!" అన్నాడు.
    సుగుణ థాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది.
    
                                           * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS