పందొమ్మిది
డిసెంబరు 27వ తేదీ చైనాలో నేనున్న ఆఖరిరోజు. పీకింగ్ మేథావులు వెళ్ళిపోయిన తర్వాత నా రూమ్ లోనికి వచ్చి మూటా, ముల్లె సవరించుకున్నాను. ఇందుకు నాకెంతోసేపు పట్టలేదు. సర్దుకోవడానికెక్కువ సామానులుంటే కదా ! 20 సిజర్ సిగరెట్ ప్యాకట్లను మాత్రం వదిలేసి మిగిలినవన్నీ మూడు బ్యాగ్ లలో సర్దివేశాను. ప్లాస్టిక్ పుష్పగుచ్చాన్ని (రెడ్ గార్డులు బహుమతి చేసింది) మాత్రం చేతితోనే పట్టుకోవాలనుకున్నాను.
కత్తెర మార్కు ప్యాకట్లను వదలిపెట్టడానికొక కారణం వుంది. హోటళ్ళలో సిగరెట్లూ, సబ్బులూ, స్టేషనరీ, విమానాలలో చాకలెట్లూ ఉచితంగా తీసుకోవచ్చు. కాబట్టి ఇవి నా బ్యాగ్ లో ఉన్నందుకు నాకేమీ అనిపించలేదు. కాని, నాంకింగ్ హోటల్ లో ఉన్నప్పుడు సబ్బు బిళ్ళతో బాటు వొక ప్లాస్టిక్ సబ్బు పెట్టెను కూడా, నా సీతా ట్రావెల్స్ బ్యాగ్ లో పడవేశాను. కున్మింగ్ లో ఉన్నన్నాళ్ళూ నేనేదో దొంగతనం చేసినట్లే అనిపించింది. తిరుగు ప్రయాణం నాన్ కింగ్ మీదుగా జరిగితే బాగుండుననిపించింది. ఏ స్టోరులో కొన్నా ఈ సబ్బు పెట్టె ఖరీదు మహా అయితే రెండు రూపాయలుంటుంది. ఏమయినా, వస్తువు విలువ ఎంతయినా దొంగతనం దొంగతనమే! (చైనాలో దొంగతనానికి పది నుంచి పదిహేను సంవత్సరాల దాకా కఠిన శిక్ష వుంటుంది) అందుచేత మన దేశంలో 20 రూపాయల ఖరీదు చేసే సిగరెట్ ప్యాకెట్లు పీకింగ్ లో వదిలివేశాను.
రూంబాయ్ వచ్చి సిగరెట్లు మరచిపోయానని నాకు జ్ఞాపకం చేశాడు. వాటినక్కడనే వదిలేస్తున్నానని సంజ్ఞ చేశాను. నా సంచీలోని పది పదిహేను చైనీస్ సిగరెట్ ప్యాకెట్లను అతనికి చూపించాను. ఇదో సుహృద్భావ సూచన అనుకున్నాడో ఏమో ఆ మిత్రుడు చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయాడు.
సాయంత్రం అవుతుండగా వొక కారు వచ్చింది. నాకు వీడ్కోలు చెప్పడానికి కొందరు వచ్చారు. అందరం పీకింగ్ విమానాశ్రయానికి వెళ్ళాము.
నా ప్రయాణం ఏర్పాట్లు చేసే బాధ్యతగల కామ్రేడ్ నా ప్యాస్ పోర్టూ, పీకింగ్ నుంచి బొంబాయి దాకా టికెట్టూ నా చేతికిచ్చాడు. విమానాశ్రయంలో నా ఓవరుకోటును చైనావారి కిచ్చేశాను. దానికి తగిలించిన కనెడియన్ బాడ్జిని తీసుకోవడం మరచిపోయాను.
రాత్రి భోజనం విమానాశ్రయంలోనే ముగించాము.
బొంబాయి నుంచి మద్రాసు వెళ్ళడం ఎలాగనుకొన్నాను. ఈ ఆఖరి క్షణంలో మరి చెయ్యగలిగిందేమీ లేదు. డెలిగేషన్ అందరితో గాక వొక్కణ్నే ప్రయాణం చేస్తున్నందువల్ల ఏర్పడ్డ చిక్కు ఇది. సరే నా దగ్గర 20 అమెరికన్ డాలర్లూ కొద్దిగా మన కరెన్సీనోట్లు ఉన్నాయి. బొంబాయి నుంచి రైలు బండిలో ప్రయాణం చెయ్యవచ్చు ననుకున్నాను.
నేను వెళ్ళవలసింది మద్రాసు అని చైనీస్ కామ్రేడ్ తో అన్నాను. అతను కొంచెం గాభరాపడ్డాడు. నేనే అతనికి ధైర్యం చెప్పి, "ఫర్వాలేదు ఇండియాలో నన్నెక్కడ వదిలి పెట్టినా మద్రాసు చేరుకోగల"నని అన్నాను.
రాత్రి 11 గంటలకు ఎథియోపియన్ ఎయిర్ లైన్స్ విమానంలో బయలుదేరి కాలమానం తేడాలవల్ల తెల్లవారకముందే బొంబాయి శాంతాక్రుజ్ విమానాశ్రయం చేరుకున్నాను.
ఈ విధంగా నా చైనా పర్యటన ముగిసింది. కాని 28-12-76వ తేదీని బొంబాయిలో జరిగిన కొన్ని సంఘటనలిక్కడ చెప్పవలసి ఉంది.
ఇరవై
విమానం నుండి నేను దిగబోతుండగా ఒకాయన తాను ఎయిర్ ఇండియా ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. నేను బొంబాయిలో ఆగిపోతున్నాననీ, నేనో మహారాష్ట్రీయుడననీ అనుకున్నాడతను. నేను తెలుగువాడిననీ, మద్రాసు వెళ్ళాలనీ చెప్పాను. "నేనూ తెలుగువాడినే! నా పేరు కనకమేడల కృష్ణారావు" అన్నాడాయన. "మీరు మద్రాసు చేరేదాకా సహాయపడడం నా వుద్యోగ ధర్మం" అని తెలియజేశాడాయన.
నాకు బొంబాయిదాకానే టిక్కెట్టు వుందని టిక్కెట్టూ, ప్యాస్ పోర్టూ చూపించాను.
నేనెవరినో తెలుసుకోగానే అతనికి కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. 'మహాకవి శ్రీశ్రీని ఇంత ఆకస్మికంగా చూస్తానని అనుకోలేదు. మిమ్మల్ని మద్రాసు పంపించే పూచీ నాది. ఒకటి రెండు రోజులు మా అతిథిగా ఇక్కడ వుండం"డన్నాడు. "లేదు నేను సాధ్యమైనంత త్వరలో మద్రాసు చేరుకోవా"లన్నాను.
"ముందు మా ఇంటికి వెళదాం పదం"డన్నాడాయన. విమానాశ్రయం వద్ద కస్టమ్స్, మొదలయిన లాంఛనాలన్నీ ఆయనే జరిపించాడు. కస్టమ్స్ అధికార్లకి నేనేవరయినదీ చెప్పాడు. అధికారులు నా సంచీలను సరిగా తనిఖీ చేయకుండానే వదిలేశారు. నేను స్మర్లర్ని కానని వాళ్లకి నమ్మకం కుదిరించుకుంటాను.
అమెరికన్ డాలర్లను రూపాయల్లోకి మార్చడానికి కొంత టైం పట్టింది.
కృష్ణారావు గారు వొక టాక్సీలో నన్ను వాళ్ళ యింటికి తీసుకువెళ్ళారు. పీకింగ్ నుంచి మద్రాసుదాకా టిక్కెట్టు వుంటే ఎథియోపియన్ ఎయిర్ లైన్స్ అతిథిగా ఏదో వొక పెద్ద హోటల్ లో బస చెయ్యగల అవకాశం వుండేది. కాని ఇప్పుడది లేదు. కృష్ణారావుగారిని ఇబ్బంది పెడుతున్నానేమో అని నాకనిపించింది. "లేదు. ఈ రోజంతా నాకు సెలవు. మిమ్మల్ని సాయంత్రం విమానం ఎక్కిస్తాను. మీ దగ్గర అంత డబ్బు లేదని నాకు తెలుసు. టిక్కెట్టు నేను కొని యిస్తాను. మద్రాసు వెళ్ళిన తర్వాత నాకు తిరిగి ఆ డబ్బు పంపించవచ్చు" నన్నాడాయన.
వారింట్లో కాలకృత్యాదులు ముగించుకుని ఇద్దరమూ సీతాట్రావెల్స్ బుకింగ్ ఆఫీసుకు వెళ్ళాము. అప్పుడు నాకొకటి తోచింది. న్యూ ఢిల్లీలోని సీతా ట్రావెల్స్ హెడ్డాఫీసు వారు చైనీస్ రాయబార కార్యాలయంలతో సంప్రదిస్తే మద్రాసుకు నాకు టిక్కెట్టు దొరకవచ్చునని. "అలాగే ట్రావెల్స్ తో మాట్లాడుదాము. కాని ఇప్పుడే మీరు డబ్బిచ్చి తీసుకోకపోతే సీటు దొరకక పోవచ్చును. ఢిల్లీ నుంచి క్లియరెన్స్ వస్తే మీ డబ్బు వాపస్ ఇచ్చేస్తాము. కాని ముందుగా మీరు టిక్కెట్ తీసుకోవడం మంచిది" అన్నాడు బుకింగ్ ఆఫీసరు.
వెంటనే కృష్ణారావు గారు డబ్బిచ్చేశారు. నాలుగు వందల రూపాయల పై చిల్లర. "ఇప్పుడు 10.30 గం|| అవుతోంది. ఒంటిగంటలోపుగా రండి. టిక్కెట్టు రెడీగా వుంటుంది. టెలెక్స్ వర్తమానం కూడా ఆ లోగానే వచ్చేస్తుంది" అన్నాడు బుకింగ్ ఆఫీసరు.
12 గంటల దాకా నేనూ కృష్ణారావుగారూ అక్కడా యిక్కడా తిరిగేము. కృష్ణారావు గారికి తెలిసిన వొక సినిమా ప్రొడ్యూసరు ఆఫీసు నుంచి శ్యామ్ బెనిగాల్ ఇంటికి ఫోన్ చేశాను. బెనిగాల్ మద్రాసులో వుండవచ్చునని నా వుద్దేశ్యం. కాని బెనిగాల్ శ్రీమతి నా గొంతు గుర్తించి "ఆయన ఇంట్లో లేరు. ఫలానా స్టూడియోలో వున్నారు" అని నాకు తెలియజేసింది.
మేమున్న చోటికి ఆ స్టూడియో చాలా దగ్గర. అక్కడ బెనిగాల్ వొక కొత్త చిత్రం డైరెక్టు చేస్తూండగా కలుసుకున్నాను. ఆప్యాయంగా పలుకరించాడు.
"రవిరాజ్ ఇంటర్నేషనల్ వారి చిత్రం ఏ దశలో వుం"దని అడిగాను.
"ఆరుద్ర డైలాగులు రాస్తున్నా"డన్నాడు శ్యాం.
"ఓహో అలాగా" అన్నట్లు తల వూపి అతని దగ్గర సెలవు తీసుకున్నాను.
కృష్ణారావు గారు బయట నాకోసం టాక్సీలో వెయిట్ చేస్తున్నారు. అప్పటికి 12 కావస్తోంది.
సీతా ట్రావెల్స్ కార్యాలయంలో నా టిక్కెట్టు సిద్ధంగా వుంది. అంతేకాదు చైనా రాయబార కార్యాలయం నుంచీ సీతా ట్రావెల్స్ ద్వారా ఢిల్లీ నుంచి క్లియరెన్సు కూడా వచ్చింది. ఇందుకు నేను పీకింగ్ లో నాకు వీడ్కోలిచ్చిన చైనీస్ కామ్రేడ్ ను మనసులోనే అభినందించుకున్నాను. టిక్కెట్టు నేనూ, డబ్బు కృష్ణారావుగారూ తీసుకున్నాము.
మధ్యాహ్నం భోజనం వారింట్లోనే చేశాను. ఆయనే నన్ను విమానం ఎక్కించాడు.
మద్రాసు చేరుకున్నాక తెలుసుకున్నాను. కృష్ణారావు గారింట్లో ప్లాస్టిక్ పుష్పగుచ్చం మరిచిపోయానని! కానీ నేనేమీ విచారపడలేదు. ఆయనింట్లో కూడా పిల్లలున్నారు. చైనా బాలబాలికలిచ్చిన బహుమతి భారతీయ బాలబాలికల కందింది.
