పద్దెనిమిది
సాధారణంగా నాకు పగటిపూట నిద్రపోయే అలవాటు లేదు. ఇవాళ మాత్రం మధ్యాహ్నం భోజనం అయిపోగానే నిశ్చింతగా నిద్రపోయాను. కారణం, రేపు పీకింగ్ కు బయల్దేరుతున్నాను. అక్కడ నుంచి సరాసరి బొంబాయికి ప్రయాణం. ఒక చైనాలో మరేమీ కార్యక్రమాలుంటాయనుకోలేదు.
కాని, సాయంత్రం నాలుగ్గంటలయే సరికి ఉదయం నన్ను అల్పసంఖ్యాక జాతుల భవనానికి తీసుకువెళ్ళిన కామ్రేడ్, కారు బయట సిద్ధంగా ఉందని నన్ను మేలుకొల్పాడు. నిన్న చూడలేకపోయిన పడమటి కొండలను ఇవాళ చూడబోతున్నామని చెప్పాడు. చైనా మిత్రులు చూపించేవన్నీ చూడడానికి సిద్ధంగా ఉన్న నేను తక్షణమే బయల్దేరాను.
ఈసారి ప్రయాణం సాఫీగా సాగిపోయింది. ఘాట్ రోడ్డుమీద పడమటి కొండలెక్కి పోతున్నాము. దిగువన కున్మింగ్ సరస్సును చూస్తుంటే కళ్ళు తిరిగిపోయాయి. ఈ సరస్సు పేరు Tienchih Lake (టియోన్ చీ సరస్సు). ఇది అనేక చదరపు మైళ్ళ వైశాల్యంగల అద్దంలా మెరిసిపోతూ ఉంటుంది. కున్మింగ్ నగరం చుట్టూ ఇటువంటి సరస్సులూ, కొండలూ, సమున్నత పర్వతాలూ చాలా ఉన్నాయి. వీటన్నింటిలో ముఖ్యమైనవి పడమటి కొండలు. చీనాదేశపు తిరుపతి కొండలని వీటిని పేర్కొనవచ్చు. అయితే ఒక భేదం ఏమిటంటే ఈ కొండల మీద ఒకప్పుడు మూడు మతాల దేవుళ్ళుండేవారు. బౌద్ధ, టావోఇజం, (మూడో మతం పేరేమిటో మరిచిపోయాను.) తిరుపతి దేవుడికన్నా వీళ్ళు అత్యంత ప్రాచీనులు. ప్రస్తుతం పూజా పునస్కారాలు లేకుండా నామమాత్రా వశిష్టంగా మిగిలిపోయారు. వాళ్ళుండే దేవాలయాలు మాత్రం ఇప్పటికీ చూడముచ్చటగా నా బోటి టూరిస్టులను ఆకర్షిస్తూనే ఉన్నాయి.
కొండలన్నీ ఎక్కిన తర్వాత ఘాట్ రోడ్డు ముగిసి, మెట్లు ప్రారంభమవుతాయి. ఇక ప్రయాణమంతా కాలి నడకనే. కొన్నిచోట్ల కొండలు తొలిచి మెట్లు వేశారు. ఒక్కొక్కసారి తల వంచుకుని దూరుతూ మెట్లెక్కాలి. (మరి దేవుడి దర్శనమంటే మాటలా?) ఇక్కడ నుంచి దేవాలయాలు ప్రారంభమవుతాయి. ఐశ్వర్యం ఇచ్చే దేవుడొకడూ, సౌభాగ్యం చేకూర్చే దేవుడొకడూ. సంతానం ప్రసాదించే దేవుడొకడూ, ఇవన్నీ చెబుతూ, ఆయనా దేవుళ్ళని చూపిస్తూ నా మిత్రుడు ఒక గుడి ముందు ఆగాడు. ఆ గుళ్ళో దేవుడు మరీ భీకరంగా ఉన్నాడు. "మరో వందమెట్లు మాత్రమే ఉంటాయి. ఇంకా మీదికి వెళ్దామా?" అని నా మిత్రుడడిగాడు. నాకయితే వెళ్ళాలని లేదుగాని, ఎలాగూ ఇంతదూరం వచ్చాం, ఈ కాస్త దూరానికే అలసిపోతానా అని సరే పదమన్నాను. అక్కడ ఒకరిద్దరు దేవుళ్ళని, అర్చనలు లేని దేవుడి గుళ్లనీ చూసి తిరుగుముఖం అయినాము.
దిగి వస్తున్న దారిలో, మరీ భీకరంగా ఉన్న దేవుడి గుడిముందు మళ్ళీ నా మిత్రుడాగేడు. "ఇప్పుడే వస్తా" అని ఒంటివేలు చూపిస్తూ గుడి వెనక్కి వెళ్ళాడు. అతడు వచ్చిన తర్వాత నేనూ వెళ్దామనుకున్నాను గానీ "చచ్చిపోయిన దేవుళ్ళవద్ద మూత్ర విసర్జన చెయ్యడం ఏమంత మర్యాద" అని అతనితో కలసి గేట్లు దిగేను.
కారులో ప్రయాణం చేస్తున్నంతసేపూ, చీనాలో మతాల గురించీ, దేవుళ్ళను గురించీ నా మిత్రుణ్ణి ఏమైనా ప్రశ్నిద్దామనుకున్నాను గాని అది అనవసరం అనిపించింది. చైనా ప్రజలకు దేవుడి అవసరం లేదు! అందుచేత అతగాడికి చల్లగా ఉద్వాసన చెప్పారు. ఈ విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇంకా ప్రశ్నలెందుకు?
కున్మింగ్ శివార్లలో ఒక పల్లెటూరి రోడ్డు మీదుగా మా కారు పోతోంది. అడ్డుగా కొన్ని పశువులు నడవడం వల్ల మా డ్రైవరు కారు స్పీడు తగ్గించాడు. వెనక సీటులో నా ప్రక్కనున్న కామ్రేడ్ తో నేను, "మా దేశంలో ఇలాంటి పశువుల్ని బ్రేక్ ఇన్ స్పెక్టర్లంటారు" అన్నాను. ఈ మాట అతను చైనీస్ భాషలో డ్రైవరుకు చెప్పాడు. డ్రైవరు గొల్లుమని నవ్వాడు.
కున్మింగ్ హోటల్ కు మరలివచ్చి, రాత్రి 8 గంటలకు భోజనం చేసిన తర్వాత మర్నాటి ప్రయాణం గురించి ఆలోచించుకుంటూ నిద్రపోయాను.
26-12-76
ఉదయం 9 గంటలకు వీబియాన్ యావో అనే సినీ రచయితను కలుసుకున్నాను. అతడు మాట్లాడే చైనీస్ భాషను ఇంగ్లీషులోనికి అనువదించడానికి నా మిత్రునికంతగా సాధ్యం కాలేదు. అందుచేత నీహా అంటే నీహా అనుకోవడం టీ తాగడం అంతే జరిగింది. 1.45 గంటలకు కున్మింగ్ విమానాశ్రయం.
2.30కి విమానం బయలుదేరింది.
4 గంటలకు ఒక చోటా, 6 గంటలకు ఇంకొక చోటా విమానం ఆగి 7.30 గంటలకు పీకింగ్ చేరింది. దక్షిణపు కొసనుంచి ఇంచుమించు ఉత్తరపు కొసదాకా సుదీర్ఘ ప్రయాణం, అయినా ప్రయాణంలో ఏమీ బడలిక అనిపించలేదు. నేను ప్రయాణించింది సివిల్ విమానమే, అయినా అందులో చాలామంది మిలిటరీ సర్వీస్ కు చెందినవాళ్ళు కూడా ఉన్నారు. ఖరీదయిన మింక్ ఓవర్ కోట్లు ధరించారన్న మాటేగాని మిలిటరీ వారికి తతిమ్మా సామాన్య పౌరులకి మధ్య అరమరికలేవీ లేవు. వెయిటింగ్ రూములో కూడా మిలిటరీ వారు అందరితోనూ కలిసిమెలిసి తిరుగుతూనే వున్నారు.
పీకింగ్ హోటల్ లో నా రూం. నెంబరు 3016
రాత్రి 9 గంటలకు భోజనం చేసి పడుకున్నాను.
27-12-76
ఉదయం 9 గంటలకు పీకింగ్ యూనివర్శిటీకి చెందినా ఇద్దరు సంస్కృత పండితులూ నలుగురు హిందీ పండితులూ నన్ను చూడడానికి వచ్చారు. వారు భారతదేశంలోని అభ్యుదయ రచనలను గురించి నాతో ఎక్కువగా ముచ్చటించారు. ఒకాయన మాత్రం ఎమ్.టి.ఖాన్ ప్రసక్తి తీసుకువచ్చాడు. గుజరాతీ దళిత్ పాంథర్లను గురించి ఇంకొకయాన నన్ను ప్రశ్నించాడు. ఇండియా అంతట్లోకి సాహిత్య రంగంలో ఒక్క తెలుగు భాష మాత్రమే అగ్రశ్రేణిలో నిలిచివుందని నేను సోదాహరణంగా ఉద్ఘాటించాను. ఇతర కళాప్రక్రియలతో సాహిత్యం చాలా సన్నిహిత సంబంధం కలిగి ఉందనడానికి నిదర్శనంగా జన నాట్యమండలి కార్యకలాపాలను వివరించాను.
ఏమైనా ఒక కొన్ని మంచి సాహిత్య పత్రికల చిరునామాలిమ్మని వారు నన్ను కోరారు. "ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదుగాని మీ ఉత్తరం అందేసరికి ఆ పత్రికలు ఆగిపోయే ప్రమాదం మా దేశంలో సర్వసాధారణం" అన్నాన్నేను.
"ప్రస్తుతం మన ఉభయదేశాల మధ్యా సత్సంబంధాలు నెలకొంటున్నాయి. కాబట్టి మీరు మా సాహిత్య అకాడమీ (ఢిల్లీ)తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం మంచి"దని సలహా యిచ్చాను. "కాని మా అకాడమీకి వెనుక చూపే తప్ప ముందు చూపులేదన్న సంగతి మీరు గుర్తుంచుకోవా"లని హెచ్చరించాను.
సుమారు మూడు గంటలసేపు మా ఇష్టాగోష్టి సాగింది. "పెచియాన్" (మళ్ళీ కలుసుకుందాం) అని వాళ్ళు లేచారు. వారితోబాటు నేను బయటికి వచ్చి కొంతదూరం సాగనంపేను. "స్నేహానికి ఏడడుగులు కలసి నడిస్తే చాలు" నన్న సాప్తపదినమైత్రి గురించి నేనన్నదాని కనుబంధ ప్రాయంగా ఒకాయన "మా చైనీస్ సామెత ఒకటి ఉంది. ఒక కవి ఏడడుగులు వేసేసరికి ఒక కావ్యం పూర్తి చేస్తాడని!" అన్నాడు నాతో.
