Previous Page Next Page 
ది సెల్ పేజి 21


                                       ఆ ఏటి పండగ

    ఏటా వచ్చే పండుగ రానే వచ్చింది.

    "అమ్మా! అమ్మా" పరుగెత్తుతూ వచ్చింది చిట్టిపాప. వస్తూ వస్తూనే చిట్టి చేతులతో తల్లి మెడను వాటేసుకుంది.
    నిర్లిప్తంగా ఆకాశంలోకి చూస్తున్న కాంతం ఈలోకంలోకి వచ్చి "ఏమ్మా" అంటూ చంటిదానివేపు చూసింది.
    "అందరూ ఎంచక్కా కొత్త గౌన్లు వేసుకొని పప్పలు తింటున్నారమ్మా....మనం కూడా పండుగ చేసుకుందాం...." వచ్చీరాని మాటలతో అడిగింది చంటిది.
    "మనం పండుగ చేసుకోకూడదమ్మా" కూతురికి నచ్చచెప్పబోయింది కాంతం.
    "ఏం? ఎందుకు చేసుకోకూడదు. ప్రక్కింటివాళ్ళు కూడా పండుగ చేసుకున్నారమ్మా- మనం కూడా చేసుకుందామమ్మా" గోముగా అడిగింది పసిది.
    కూతురికి ఎలా చెప్పాలో అర్థంకాలేదు కాంతానికి.
    "అమ్మా! చేసుకుందాం అమ్మా" దీనంగా అడిగింది చిట్టి చేతులతో తల్లిని కుదుపుతూ చిట్టిపాప.
    విధవతల్లి మనసు మూగగా రోదించింది.
    "మీ నాన్న దేముడి దగ్గరకు వెళ్లాడుకదమ్మా మనం ఈ ఏడు పండుగ చేయకూడదు" కళ్ల నీళ్లు నిండుతుండగా అంది కాంతం.
    "నాన్న లేకపోతేనేం మనం యిద్దరం పండుగ చేసుకుందాం అమ్మా" మారం చేసింది పాప.
    పసిదాని మంకుపట్టుదలకి విసుగొచ్చి రెండు వడ్డించింది వీపుమీద కాంతం.
    తల్లి మూగవేదన పాపకేం తెలుసు. సౌభాగ్యం పోయిన తరువాత జీవితంలో వసంతం ఎలా వుంటుంది? ఇంక పండగేమి చేస్తుంది? ఇది చిన్నారి వయసుకు అందని ఆలోచనే "నాన్న రాని....పండుగ చేయలేదని చెప్తా,... నన్ను కొట్టావని చెప్తా" అంటూ ఎక్కి ఎక్కి ఏడ్చింది చిట్టిపాప.
    "ఇంకెక్కడి నాన్నమ్మా! ఇంక రాడు" అంటూ పాపను కౌగిలించుకుంది కాంతం.
    "పో. పండగ మానాన్న నేను చేసుకుంటాము" అంటూ తల్లిని విదిలించుకుంది.
    పాప బయటకు వచ్చింది. ఎదురింటి గుమ్మానికి మామిడి తోరణాలు వ్రేలాడుతున్నాయి. అవి చూస్తూ అరుగుమీద కూర్చుంది పాప.
    కాంతం బయటకు వచ్చింది. కూతురి దృష్టి ఎదురింటి తోరణాలమీదే వుంది.
    "ఇంట్లోకి పదవే" అంటూ కోపంతో కూతుర్ని ఇంట్లోకి తీసుకు వెళ్లింది. పాప ఏడుపు మొదలుపెట్టింది.
    కాంతం మనసు చివుక్కుమంది. పండుగపూట పసిదాని కోరిక తీర్చడానికి బదులు తను ఆచారం పాటించాలి. పండుగ చేయటం మైల అది అపచారం అన్న మీమాంసలో పడింది.
    భర్త వుంటే ఈ సంవత్సరం పండగ మానాల్సి వచ్చేదికాదు. సౌభాగ్యం పోయినదని తలచుకాగానే దుఃఖం ఆగలేదు కాంతానికి.
    పాప గదిలో చాపమీద ముసుగుతన్ని పడుకుంది. చిన్నదాని కోరిక తీర్చలేకపోయినందుకు బాధగా వున్నా దాని పట్టుదలకి కాంతానికి కోపం వచ్చింది.
    "ఏయ్ పాపా! పట్టపగలే ఏంటా ముసుగు?" కాంతం కేకలు వేయటంతో బెదిరిపోయి లేచి, బిక్కముఖంతో కూర్చుంది చిట్టిపాప.
    "పాపా నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా నేను వచ్చేదాకా ఇంట్లోనే వుండు." అంటూ చేతిసంచి తీసుకుని బజారుకు బయలుదేరింది కాంతం.    
    "నేనూ నీతోనే వస్తాను." ఆశతో అడిగింది పాప.
    "చాలా దూరం వెళ్లాలి, నువ్వు రావద్దు" అని బయలుదేరింది కాంతం. తల్లివెంట పాప బయలుదేరింది గారంగా!
    "ఏయ్ నీకే చెప్పేది, నోరు మూసుకుని ఇంటిలో పడివుండు", కళ్లు ఎర్రచేసి విస విస వెళ్లిపోయింది కాంతం.
    పాప దృష్టి పండగమీదే వుంది. ఎదురింటి గుమ్మానికి తోరణాలు వ్రేలాడుతున్నాయి.
    "అమ్మ ఎప్పుడు ఇంతే, ప్రతిదానికి కసురుకుంటుంది. అమ్మకన్నా నాన్నే మంచోడు, నాన్న వస్తే, బాగుండు. కొత్తబట్టలు కొనుక్కోవచ్చు, బొమ్మలు కొనుక్కోవచ్చు, మిఠాయి తయారుచేసుకోవచ్చు. ఎంచక్కా పండుగ చేసుకునేదాన్ని. నాన్న ఎప్పుడు వస్తాడో! చాలా రోజులుగా రావటం లేదు. ఇవాళన్నా వస్తాడా? పండుగ అయిపోతుంది. అసలు ఇవాళ వస్తాడా? వెళ్లి నాన్నను పిలుచుకు వస్తే, పండుగ చేసుకోవచ్చు." అనుకొని తండ్రిని వెతుక్కుంటూ చిట్టిపాప బయలుదేరింది.
    కాంతం వచ్చేసరికి యింటి తలుపులు బార్లా తెరచి వున్నాయి. అక్కడ కూతురు జాడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్లిందో అర్థం కాలేదు. చేతిలోని బట్టల ప్యాకెట్టు, మిఠాయి పొట్లాలు వున్న చేతిసంచి జారి క్రింద పడింది. పండగపూట పసిదాన్ని కసిరింది తను. పాపని బుజ్జగించి తీసుకురావాలి. పిచ్చిపిల్ల ఎక్కడుందో ఏమో? అనుకుంటూ బజారుకేసి బయలుదేరింది కూతురిని వెతుకుతూ కాంతం.
    దూరంగా గుంపుగా మూగివున్న జనాన్ని చూసింది కాంతం.
    కంగారుగా గుంపు దగ్గరికి పరుగెత్తింది. కారు క్రింద కట్టెలా నిర్జీవంగా వుంది పాప శవం.
    "పండుగ చేద్దువుగాని రామ్మా" అంటూ భోరున ఏడ్చింది శవంమీద పడి కాంతం.
    "పండుగ మా నాన్న, నేను చేసుకుంటాం"-
    అన్న చిట్టిపాప మాటలు ఆచారం-అపచారం అన్న పద శృతుల మధ్య శృతో, అపశృతో ప్రతిధ్వనిస్తున్నాయి.

                                *    *    *    *   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS