Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 22

 

    కొద్ది క్షణాల తర్వాత, బోటులోనుంచి దూకేశాడు అతను.
    ఒడ్డుకు తిరిగి వచ్చాడు. అతని మొహం వివర్ణమై ఉంది.
    "ఏమయింది ?" అంది సృష్టి.
    పెదిమలు తడి చేసుకుంటూ చిన్నగొంతుతో అన్నాడు రాజు.
    బోటులో నలుగురు ఉన్నారు.
    "అయితే ?"
    "వాళ్ళలో ఒక్కరూ ప్రాణాలతో లేరు "
    "గాడ్!"
    "శవాలతో కొట్టుకుని వెళ్ళి పోతుంది ఆ బోటు.
    "ఏం జరిగి వుంటుంది ?"
    "ఎలా చెప్పగలం?"
    "ఏమయింది నాయనా? ఎమయిందీ?" అంటున్నారు వృద్ద దంపతులు.
    "ఏం లేదు అవ్వా -- రాముడి మడుగుకి దారి కోసం వెదుకుతున్నాం " అని సృష్టి వైపు తిరిగాడు రాజు.
    "ముందు ఆ షూటింగు జరుగుతున్న చోటికి వెళ్దాం. ఆ వృద్ధులకి తినడానికి కేదయినా పెట్టించవచ్చును " అన్నాడు రాజు.
    అంటూనే , కావడి భుజం మీద వేసుకున్నాడు. ఇందాక ఆ రాక్షసుడు పరిగెత్తి వెళ్ళిన వైపు నడవడం మొదలెట్టారు ఇద్దరూ.
    ముసలాయన ఏదో గొణుగుతున్నాడు.
    ముసలామె అధ్యాత్మీక రామాయణం కీర్తన ఒకటి వణుకుతున్న గొంతుతో పాడుతోంది.
    సృష్టితో నెమ్మదిగా అన్నాడు రాజు.
    "సృష్టి! కుంభమేళలో కూడా అంతే! ముసలి తల్లిదండ్రులతో స్నానానికని చెప్పి వస్తారు. తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ముసలి వాళ్ళని మేళాలోనే చెప్పా పెట్టకుండా వదిలేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ వృద్దులు అడుక్కుని తింటూనో, అగచాట్లు పడుతూనో అక్కడే తమ శేష జీవితం గడపాలి. తమని తమ పిల్లలు దుక్కులేని వాళ్ళని చేసి వదిలి వెళ్లి పోయారని తేలినప్పుడు భయంతో వాళ్ళు ఏడ్చే ఏడుపులు హృదయ విదారకంగా వుంటాయి !"
    "వీళ్ళ ఏడుపు పాపం అట్లాగే ఉంది కదా!" అంది సృష్టి దిగులుగా.
    అవుననట్లుగా తల పంకించాడు రాజు.
    ఇద్ద్దరు మనుషులని మోస్తున్నావు . కష్టంగా లేదూ ?" అంది సృష్టి.
    "కష్టమే ముంది -- మరి కండలు పెంచింది ఎందుకూ ?" అన్నాడు రాజు నవ్వుతూ.
    కాసేపటి తర్వాత వాళ్ళు షూటింగ్ స్పాట్ ని సమీపించారు.
    ఇంతలో
    అక్కడే -- పొదల చాటునుంచి మాటలు వినబడ్డాయి.
    ఓల మొగ గొంతు - ఒక ఆడగొంతు.
    "నిన్ను హీరోయిన్ ని చేయడం ఖాయం౧ అది నా భాద్యత అంటోంది మొగగొంతు.
    "అన్నీ వదులుకొని నీతో లేచి  వచ్చేశాను - నీట ముంచినా, పాల ముంచినా నీదే భారం!" అంటోంది ఆడగొంతు. ఆమె మాటల మీద సినిమా ప్రభావం బాగా గాడంగా కనబడుతోంది.
    "నీ పాదధూళి తప్ప ఈ ప్రపంచంలో ఇంకేమీ అక్కర్లేదనుకున్నాను సుభా- నేను నీ చరణదాసిని!" అంది మళ్ళీ.
    కావిట్లో కూర్చుని వున్న ముసలామె చెవులు రిక్కించింది.
    "మన కోడలు పిల్ల గొంతులాగా ఉందే!" అంది అనుమానంగా.
    "లాగా ఉండడమేమిటి? అది మన కోడలుపిల్ల గొంతే!" అన్నాడు ముసలాయన కఠినంగా.
    "ఎంత బరితెగించింది -- ఊరికే వుంటారేం! వురికి వెళ్ళి దానికి వురి వెయ్యండి " అంది ముసలామె అఘాయిత్యంగా.
    వీళ్ళ మాటలు విని పొదల్లో వున్న అడా మొగా ఇద్దరూ కంగారుగా బయటికి వచ్చారు.
    వాళ్ళ మొహాలు పాలిపోయి ఉన్నాయి.
    "అత్తా! నువ్వా!" అంది ముసలామెని చూడగానే.
    ఆమె పక్కనే "రాక్షసుడు " అనే ఆ యాక్టర్ నిలబడి వున్నాడు.
    అంతలోనే -
    పరుగుపరుగున అక్కడికి చేరుకున్నాడు ఆ ముసలి దంపతులని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు యువకుడు.
    "ఎంత తెగించావే! నన్ను వదిలేసి వచ్చి సినిమాల్లో చేరిపోతావా?" అన్నాడు పళ్ళు కొరుకుతూ.
    అపహాస్యంగా మూతి ముడిచింది అతని భార్య.
    "అబ్బా! ఇంతోటి మొగాడు ఇంకెవ్వడూ దొరకడనీ - జన్మ జన్మలకూ నిన్నే అంటి పెట్టుకుని ఉండాల్న ఏం?"
    "అంటిపెట్టుకుని ఉంటానని గంట గంటకూ చెప్పేదానివి గదే!
    మనిద్దరం రాజా రాణీల్లాగా ఉండటానికీ ఈ మూసలోళ్ళు అడ్డమని వాళ్ళని అడవిలో వదిలేసి రమ్మన్నావు గదా!"
    "అంటానా అంటానా! ఈ ముసలాళ్లిద్దరూ నన్ను రాచి రంపాన పెట్టలేదూ! వీళ్ళ హయం నడుస్తున్నప్పుడు ఎంత జులుం చేశారూ? ఒక్కనాడయినా నన్ను కడుపు నిండా అన్నం తిననిచ్చారా? కంటిమీదికి కునుకు రానిచ్చారా- చివరికి చిన్న బిడ్డకి పాలు ఇస్తున్న రోజుల్లో, రోజుకి ఒక్క అరగ్లాసుడు పాలు తాగమని నాకు ఇచ్చారా . ఆడపిల్లని ఎద్దులాగా చూస్తూ నా చేత అరక దున్నించలేదూ - ఇంటి పనీ , వంట పనీ , చాకిరేవూ , పొలం పనీ అన్నీ నా నెత్తిన రుద్ది నా నడుం విరగ్గొట్టలేదూ."
    "సరే ! నీ హయాం వచ్చాక నువ్వేం చేశావ్? కళ్ళు లేని కబోదులుగా మారిన మమ్మల్ని డొక్క మాడ్చలేదూ. పురుగుల కంటే కనాకష్టంగా చూడలేదూ? మావాడు వైద్యం చేయిస్తానంటే వీధంతా వినబడేటట్లు గొడవ చేయలేదూ?"
    "నోరు చవి చచ్చిపోయింది. ఒక్క బీడీ కట్ట కొనుక్కురమ్మంటే ఒక్కనాడయినా తెచ్చావా?" అన్నాడు ముసలాయన అక్కసుగా.
    "మింగ మెతుకులేదు , మీసాలకు సంపెంగ నూనేట! బియ్యానికి గతిలేదు గానీ బీడీల కట్టలు తెచ్చి పేర్చలేదని తగువు."
    "అయినా ఇంత కట్టు తెగిన దానివని కలలో కూడా అనులోలేదే!" అన్నాడు కొడుకు.
    "కట్టుకున్నవాడు కొరగాని వాడయితే కట్లు తెంపుకు వచ్చేస్తే తప్పేముంది? అన్నది కోడలు.   
    "నువ్వు కోరినట్లుగానే మా అమ్మనీ, నాయన్నీ అడవులు పాలు చేసి వచ్చాగా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS