Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 21

 

    విస్తుబోతూ చూశాడు రాజు.
    అయితే ఈ రాక్షసుడి వేషం సినిమా షూటింగు బాపతా!
    అడవుల్లో అవుట్ డోర్ షూటింగ్ పెట్టుకున్నారన్నమాట ఎవరో యూనిట్ వాళ్ళు.
    "ఐయామ్ సారీ! లే!" అన్నాడు రాజు , ఆసరాగా చెయ్యి అందిస్తూ.
    "ఇంగ్లీషోడు వెళ్ళిపోతూ ఈ రెండు ముక్కలూ మనకి అంటగట్టి వెళ్ళాడు -- మక్కెలిరిగేలా తన్ని సారీ చెప్పడమూనూ!" అన్నాడు 'రాక్షసుడు ' నిక్కుతూ నీలుగుతూ లేచి నిలబడి.
    అతని పర్సనాలిటీ మాత్రం నిజంగా జెయింట్ సైజే -- నిశ్చయంగా ఏడడుగుల పైనే పొడుగు వుంటాడు. పెద్ద పొట్ట. అంత పర్సనాలిటీ వున్నా కూడా అతని శరీరం రాజు బాదీలాగా స్ట్రాంగ్ గా లేదు. లూజుగా లబలబలాడుతోంది.
    "జానెడు పొట్ట పోషించుకోవదానికే అష్టకష్టాలు పడాలి - ఇంక ఇంతటి బాన పొట్టని పోషించడానికి నేను ఎంత కష్టపడాలి, అందుకే సినిమాల్లో చేరి రాక్షసుడు వేషాలు వేస్తుండా. కూటి కోసం కోటి వేశాలని సినీ సామెత. మా వూళ్ళో నాకు పోడుగోడు అని పేరు. ఇండియాలో కెల్లా నేనే పోడుగుపాటి మనిషినిట -- అది ఇప్పుడు ఈ రాక్షసుడి వేషాలకి పనికి వస్తోంది " ఆన్నాడు రాక్షసుడు.
    "ఐ యామ్ రియల్లీ సారీ బ్రదర్!" అన్నాడు రాజు సిన్సియర్ గా.
    ఇంకా ఏదో గొణుగుతూనే లేచి నిలబడి , ఒళ్ళు దులుపుకుని , వృద్దుల వైపు తిరిగి , వస్తాను పెద్దమ్మోయ్ - వస్తాను పెద్దయ్యోయ్ -- అన్నాడు రాక్షసుడు పాత్రదారి.
    "ఓర్నీ అఘాయిత్యం కూలా. అప్పుడే వెళ్ళిపోతావుట్రా" అంది ముసలమ్మ ఏడుపు గొంతుతో. మా ముసలాళ్ళని కన్న కొడుకే నిర్ధాక్షిణ్యంగా ఇట్లా అడవుల పాలు చేసి వదిలి పెట్టి వెళ్ళిపోయాడు నువ్వు కూడా వెళ్ళిపోతే ఇంక ఎట్లారా నాయనా?" అంది ఆమె దీనంగా.  
    ఉలిక్కిపడ్డాడు రాజు.
    ఈ ముసలివాళ్ళని తీర్ధస్నానం చేయిస్తానని కదా తీసుకువచ్చాడు ఆ కొడుకు ?
    మరి ఈవిడ అతను తమల్ని వదిలేసి వెళ్ళి పోయాడన్నట్లు చెబుతుందేమిటి?
    మిస్టరీ సాల్వ్ చేస్తున్నట్లుగా చెప్పాడు "రాక్షసుడి వేషంలో ఉన్న సినీ ఆర్టిస్టు '
    'నిజమే బ్రదర్! కలికాలం వచ్చేసింది. పాపం పండిపోతోంది. ప్రపంచం పుచ్చిపోతోంది.
    వీళ్ళిద్దరూ ముసలాళ్ళయిపోయారు. ముసలివాళ్ళ వల్ల ఎవరికి మాత్రం ఏం లాభం చెప్పు -- పాత రోజులు కావు గదా ఇవి! పెద్దాళ్ళని పెట్టుకొని పోషించడానికి -- తిండి దండగా చాకిరీ వెస్ట్ అనుకుంటారు జనం -- వాళ్ళ అబ్బాయీ అంతే! తీర్ధంలో స్నానాలు చేయిస్తానని చెప్పి, వాళ్ళని ఇక్కడ కావిట్లో నుంచి దింపి , గుట్టు చప్పుడు కాకుండా తన మానాన తను తప్పించుకు వెళ్ళాడు ."
    "కావిట్లో తీసుకొచ్చినవాడు కాట్లోకే తీసుకెళ్ళి మా ఇద్దరికీ అగ్గి అంటించినా బావుండేది నాయనా! మా బతుకులు ఈ అడవిలో ఇట్లా బుగ్గి అయిపోయినాయి. గొంతు దాహంతో పిడచగట్టుకుపోతుంటే ఈ మంచివాడెవరో కాసిని మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి పుణ్యం కట్టుకున్నాడు. ఇప్పుడీ అడవిలో గుడ్డివాళ్ళం ఎట్లా బతకడం నాయినా!" అంటోంది పాపం ఆ ముసలావిడ ఏడుస్తూ.
    "పులో పుట్రో మన మీద పడి ప్రాణాలు తీసేస్తుంది లేవే! చావడానికి రెడీగా వుంటే బతుకు భయం వుండదు. రక్త మాంసాలు ధారపోసి పిల్లాణ్ణి పెంచి పెద్ద చేసి ఓ పిల్లని తెచ్చి పెళ్ళి చేశాం. పాపం వాడెం చేస్తాడు-- మనల్ని అడవిలో వదిలేదాకా కోడలు పిల్ల నిలవనిచ్చి ఉండదు ." అన్నాడు ముసలాయన దీనంగా.
    "ఇంతదూరం వచ్చి రాముడి మడుగులో స్నానం చేయకుండా పొతే పుణ్యం కాదు -- పాపం చుట్టుకుంటుంది ." అంది ముసలమ్మ.
    తర్వాత మళ్ళీ అంది. "ఇదిగో నాయనా! నువ్వే తల్లి కన్నా బిడ్డవో గానీ, గొంతులో ఇన్ని నీళ్ళు పోసి ప్రాణాలు నిలబెట్టావ్ -- అట్లాగే రాముడి మడుగు లో స్నానాలు కూడా చేయించి ఆతర్వాత నీ దారిన నువ్వు పో బాబు! అంది ఆర్తిగా.
    నానుస్తూ అన్నాడు రాక్షసుడు గెటప్పులో ఉన్న ఆర్టిస్టు. "అయితే ఇక్కడ మడుగేమీ లేదే. నా వాటరు వ=బాటిలు మీకు ఇచ్చేస్తిని. ఇక్కడ నీళ్ళ జాడే లేదు. పైగా నాకు షూటింగు టైం అవుతోంది తల్లో -- వెంటనే వెళ్ళకపోతే వేషం ఊడిపోతుంది. ఇదిగో -- మిమ్మల్ని ఈ హీరో కి అప్పచెప్పి వెళ్తున్నా -- ఈ హీరో మీకు కావాల్సినవన్నీ చూస్తాడు.
    "నేను హీరోని కాదు బ్రదర్ " అనబోయాడు రాజు.
    "పక్కన హీరోయిన్ ఉన్నప్పుడు నువ్వు హీరోవి కాకుండా పోతావా ......అన్నా .......ఈ ముసలోళ్ళకి ఓ దారి చూపించి పుణ్యం కట్టుకో -- వీలుగా వుంటే మా షూటింగ్ కి రా -- మా హీరో హీరోయిన్లతో అటో గ్రాఫులు , ఫోటో గ్రాఫులు ఇప్పిస్తా .....నే వస్తా!" అని పరుగెత్తి పోయాడు రాక్షసుడు. పోతూ పోతూ వెనక్కు తిరిగి "న పెరు సుభాష్ - పోడుగాడు అంటే ఎవరైనా చెప్తారు " అని కేక పెట్టాడు.  
    "నాయనా! మమ్మల్ని రాముడి మడుగులో దింపి నీదారిన నువ్వు వెళ్ళు తండ్రీ ! మడుగులో నుంచి మళ్ళీ బయటికి రాములే ! అక్కడే ప్రాయోపవేశం చేసి జలసమాధి అయిపోతాం -- ఇట్లాంటి కొడుకుని కన్నందుకు ఇదే ప్రాయశ్చిత్తం ! అన్నాడు తండ్రి - అతని గుడ్డి కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నాయి.
    "మిమ్మల్ని రాముడు మడుగులో స్నానం చేయించే బాధ్యత నాదీ -- ఆ తర్వాత మిమ్మల్ని ఇల్లు చేర్చే పూచీ కూడా నాదే-- కానీ ఇక్కడెక్కడా ఏ మడుగూ లేదే!" అన్నాడు రాజు.
    "పెట్రెయిలంక దగ్గరలోనే మడుగు వుంది నాయనా........దాని కనుక్కుని తీసుకెళ్ళు బాబూ! అంది ముసలామె ప్రాధేయపడుతూ.
    వాళ్ళని కావడిలో కూర్చోబెట్టి , కావడిని భుజానికెత్తుకున్నాడు రాజు.
    వాళ్ళ బరువు మోయడం తనకి కష్టం కాదు. కష్టంలో ఉన్న వాళ్ళ బాధ్యత వహించడమూ తనకి ఇష్టమైన పనే.
    కానీ -- ముందర తప్పిపోయిన తన చెల్లెలి సంగతి చూడాలి గదా! అది చాలా ముఖ్యం! ఈ తాజా సంఘటనతో "రాక్షసుడు" అనేది ఉత్త హంబగ్ అని తేలిపోయింది కదా!
    చెల్లెలు యువ కోసం వెదుకుతూనే ఈ వృద్దులని రాముడి మడుగుకి తీసుకెళ్ళగలడా?
    అసలు రాముడి మడుగు అనేది నిజమా? ఉత్త పుక్కిటి పురాణామా?
    అది పెట్రాయిలంకకి దగ్గరట.
    లంక ఎక్కడ వుంటుంది. నీళ్ళ మధ్య కదా-
    ఈ పక్కనుంచే ఒక ఏరు ప్రవహిస్తోంది . అది బాగా లోతుగా ఉన్నట్లుగా కనబడుతోంది. ఈ ఎటిలోనే ఎక్కడన్నా ఉంటుందా ఆ లంక?
    ఏటి వైపే సాలోచనగా చూస్తూ ఉండిపోయాడు రాజు.
    దూరంగా -- ఏటి ఎగువున ఒక చోటు కనబడింది.
    తెల్లటి బోటు -- అందంగా రాయచంలా వుంది. నీటి వాలుతో బాటు నెమ్మదిగా  కదులుతూ వస్తోంది.
    "ఆ బోటులో ఉన్నవాళ్ళని అడిగితే చెబుతారేమో !" అంది సృష్టి.
    ఇంతలోనే --
    వాళ్ళకి బాగా దగ్గరగా వచ్చింది బోటు.
    "ఆగండి ప్లీజ్! హెల్ప్ ప్లీజ్! ఆగండి !" అని అరిచాడు రాజు.
    కానీ బోటు ఆగలేదు. వెళ్ళిపోతూనే ఉంది.
    చటుక్కున నీళ్ళలోకి దిగి, నడుం లోతుకి వెళ్ళి , బోటు వెంట నడిచి , దానిలోకి ఎక్కాడు రాజు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS