"అవన్నీ ముందు చేశాను"
"కొంతవరకూ సహించటమనేది చెయ్యలేదు."
"అవసరం లేదనుకున్నాను."
"ఆడది ఒక్కోసారి కొట్టటం కూడా శృంగారమే."
తర్వాత ఇంకేమనేవాడో. హాల్లోంచి కొంత అసహజమైన గలభా విన్పిస్తోంది. పెద్ద పెట్టునే."
"ఏదో గొడవ జరుగుతోంది." అంటూ హాల్లోకి వెళ్ళాడు. నేను కూడా వెనకనే వెళ్ళాను.
ఓ ముప్ఫయి ఏళ్ళ స్త్రీ, బహుశ ఆమె భర్త అనుకుంటాను.... చాలా తీవ్రస్థాయిలో ఘర్షణ పడుతున్నారు. అతను కూడా పెద్ద బిజినెస్ మేన్ గా ఇందాక పరిచయం చెయ్యబడ్డాడు.
"నో! నేను కరాఖండిగా చెప్పేస్తున్నాను. నీకు నాకూ కుదరదు" అంటోంది ఆ స్త్రీ.
"కాని నిన్ను నేను విడిచిపెట్టను. నీ అవసరం నాకు ఎంతయినా ఉంది."
"అది నాకు తెలుసు. నీ అవసరాల కోసం నన్ననేక రకాలుగా ఉపయోగించుకుని, చాలా కామ్ గా నన్ను చిత్రవధ చేస్తున్నావు. నువ్వు సైలెంట్ రోగ్ వి. ఇంక ఒక్క నిమిషం కూడా నిన్ను భరించలేను."
"నిన్ను నేను భరించటం లేదా?"
"ఒదిలేయ్"
"ఒదల్ను"
"ఎలా ఒదలవో చూస్తాను. డైవోర్స్ చేస్తాను."
"డైవోర్సు వల్ల చట్టం ఓ కాగితమిస్తుంది. అంతమాత్రం చేత నన్ను తప్పించుకోలేవుగా"
"ఇదిగో ఇలాగే కొన్ని సంవత్సరాల నుంచి నన్ను పీల్చి పిప్పి చేస్తున్నావు. నిన్ను సాధించాలంటే ఒకటే మార్గం" అంటూ చేతిలో ఉన్న బ్యాగ్ లోంచి ఓ కత్తి లాంటిది తీసింది.
నేను చిత్తరువులా నిలబడి కళ్ళప్పగించి చూస్తున్నాను. అక్కడున్న వాళ్ళంతా చాలా యధాలాపంగా తీసుకుంటున్నట్లు ఆ దృశ్యాన్ని తిలకిస్తున్నారు. కొంతమంది వాళ్ళలో వాళ్ళు చిన్నగా మాట్లాడుకుంటూ సినిమా చూసినట్లుగా.... మాట్లాడుకుంటూ సినిమాలోని సీరియస్ ఘట్టాలని చూస్తామే.... అలా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది డ్రింక్ చేస్తూనే, మధ్య మధ్య తింటూ చూస్తున్నారు. నాగరికతకూ, అనాగరికతకూ వేషభాషల్లో తప్ప, మనస్తత్వాలలో తేడా ఏమీలేదని అర్థమవుతోంది.
"ఏం? పొడుస్తావా?"
"పొడవను. నే పొడుచుకుంటాను."
తర్వాత సంఘటన కనురెప్ప పాటులో జరిగిపోయింది. ఆమె విసురుగా చెయ్యెత్తి కత్తితో గుండెల్లో పొడిచేసుకుంది. రక్తం రివ్వుమని బయటకు చిమ్మటం కనిపించింది.
అప్పుడు మొదలయింది కలకలం. కొందరు వెళ్ళి క్రిందపడి పోతున్న ఆమెను పట్టుకుంటున్నారు. కొందరు "డాక్టర్ డాక్టర్" అని అరుస్తున్నారు.
అంతవరకూ ధైర్యంగా ఉన్న నాక్కూడా కాళ్ళు ఒణికాయి. ఏం చెయ్యాలో పాలుపోక అటూ ఇటూ చూస్తున్నాను.
శమంతకమణి నా దగ్గర కొచ్చింది. ఆమె ముఖంలో కంగారు కనపడుతోంది. "ఇలా జరుగుతుందనుకోలేదు. రాక్షసి, ఎంత అఘాయిత్యం చేసిందో చూశావా? ముందు నిన్నిక్కణ్నుంచి పంపిస్తాను." అంటూ "సుకుమార్" అని కేకేసింది.
సుకుమార్ మా దగ్గర కొచ్చాడు "మేడమ్"
"సతీని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. త్వరగా వచ్చెయ్."
సుకుమార్ వెంట బయటి కొచ్చేశాను.
అతనే కారు డ్రైవ్ చేస్తోంటే ఫ్రంట్ సీట్లో ప్రక్కన కూర్చున్నాను.
"భయపడ్డారా?" అన్నాడు కొంతదూరం పోయాక.
"చావులు చూడ్డం జరిగింది. కాని హత్యలూ, ఆత్మహత్యలూ ఎలా వుంటాయో తెలీదు. చాలా భయమేసింది" అన్నాను.
"నాకూ ఆశ్చర్యంగా వుంది. డ్రింక్ ఎక్కువై అప్పుడప్పుడూ కొంతమంది బరెస్ట్ అవటం జరిగేది కాని, ఇంత తీవ్రస్థాయి ఎప్పుడూ చేరుకోలేదు."
"ఆవిడ చచ్చిపోతుందా?"
"తెలీదు. అవకాశముంది."
"పోలీసులు వ్యవహారం. శమంతకమణిగారేదన్నా చిక్కుల్లో పడుతుందా?"
"అలాంటివన్నీ చిటికలో పరిష్కరించుకోగలదు. ఇవేళ మీరు చూసింది ఆమెకున్న సర్కిల్ లో కొంతభాగమే. పోలీసు యంత్రాంగమంతా ఆవిడ చేతుల్లో వుంది."
బహుశా అప్పుడు రాత్రి ఒంటిగంట దాటిపోయి వుంటుంది. కారులో చీకటిగా వుండటంవల్ల తెలీటం లేదు.
అలాంటి స్థితిలో కూడా, నిశ్శబ్దరాత్రిలో, అతన్తో కారులో కూర్చుని ప్రయాణించటంలో నా మనసు కొంత సంతోషాన్ని అనుభవిస్తూ అనుభూతిని పొందుతోంది. అంటే.... పరిసరాల్ని విస్మరించేంతటి మానసిక ఒత్తిడిలో కూడా మనసు సహజ చాపల్యాన్ని మరిచిపోలేదన్నమాట.
మధ్య మధ్య ఇంటికి దారి చెబుతూ ఉండటం మినహా మా మధ్య ఇంకే సంభాషణా జరగలేదు.
ఇల్లు చేరుకున్నాక కారు దిగి "థాంక్స్" చెప్పాను.
అలాంటి ఏకాంత సమయంలో కూడా మనం ఒంటరిగా ఉన్నామనుకోవటం భ్రమ అనుకుంటాను. ఏ తరహాకి చెందిన మనుషులు ఆ తరహాకి అనువుగా కాచుకు కూర్చుంటారు.
ప్రక్కింట్లోంచెవరో కావాలని గట్టిగా 'హాచ్' అని తుమ్మటం వినిపించింది....
"మేము చాలా గమనిస్తున్నాం" అన్న సంకేతంలా.
