అంత డిసిప్లేన్ భరించడం మనిషిగా పుట్టనవాడికి చాలా కష్టమే. అత్తయ్య సంఘసేవ పేరుతో తిరుగుతోంది. ఎన్నో వ్యవహారాలు చేస్తూ ఉంటుంది. అదే ధోరణిలో మిగిలిన వాళ్ళనెందుకు సాగిపోనివ్వదో అథనికి అంతు చిక్కని ప్రశ్న.
సారధి మెల్లగా బయటకొచ్చాడు అత్తని చూసి తలొంచుకొని నడవబోయాడు.
"సారథీ!" పిలిచింది లలితాంబ. ఆ కంఠంలో మిలటరీ ఆఫీసర్ కమాండ్ వుంది. సారథికి అడుగు ముందుకి పడలేదు.
"ఏంటి అత్తయ్యా?" అన్నాడు మెల్లగా.
"ఎక్కడికి బయలుదేరావు?" అడిగింది.
"కాస్త చల్లగాలికి తిరిగొద్దామని....." అన్నాడు.
"చల్లగాలి కోసమే అయితే నువ్వు పని కట్టుకొని బయటకెళ్ళనవసరంలేదు. మన తోటలో గాలి కంటే నీకు హైదరాబాదులో ఇంకెక్కడా మంచి గాలి దొరకదు..... టాంక్ బండ్ పైనగానీ, పబ్లిక్ గార్డెన్ లోగానీ, గండిపేటలోగానీ..... ఇంతకంటే బాగుంటుందంటావా?" అంది లలితాంబ.
ఆమె మాటల్లోని వ్యంగ్య ధోరణిని సారథి గ్రహించాడు.
"అవునత్తయ్యా ఆ సంగతి నేను మరచిపోయాను. అసలు చల్లగాలి మనతోటలోంచే హైదరాబాదులోని అన్ని ప్రాంతాలకీ పోతుందని ఇప్పుడే గుర్తుకొచ్చింది."
"ఏం..... ఎగతాళిగా ఉందా? కోపంగా అంది లలితాంబ.
"అబ్బే అదేం కాదత్తయ్యా, నేను ఖచ్చితంగా నా అభిప్రాయాన్ని చెప్పాను. ఇంత శ్రద్ధగా చెట్లని పెంచి చుట్టూ వున్న కాలుష్యాన్ని తొలగించడంలో నువ్వు కనపరిచే ఆసక్తిని చూసి నేనెలా అన్నాను" అన్నాడు అక్కడే కూర్చోబోతూ.
లలితాంబకి అతని మాటలు నచ్చాయి.
"వూరికే అలా కూర్చోకపోతే ఆ చెట్లకి నీళ్ళు పోయ్యి సాయంత్రం వేళ గార్డినింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది" అంది లలితాంబ.
సారధితి కోపంగా ఉంది. కానీ ఆమెతో గెలవడం కష్టం.
పెద్దపెద్ద జడ్జీల ముందు బల్ల విరిగేలా కొట్టి వాదించే క్రిమినల్ లాయర్ లక్ష్మిపతి తనమేనమామ.
అలాంటివాడు అత్తయ్యనిచూడగానే నోరుపడిపోయిన పేషంటులా మొహం పెడతాడు.
చెంగు చెంగున ఎగిరే లేడిపిల్లలాంటి భారతి అత్తయ్య కనబడగానే మూగబోయిన వీణలా అయిపోతుంది.
అరడజను మేకపోతుల్ని ఒక్కవేటుతో తెగేసి డేగిసాల్లో పలావు చేయగల వంటమనిషిని బాలయ్యకి ఆమెను చూస్తే గరిట వణికిపోతుంది.
పెనుతుఫానుకి కూలిపోయే మరో వృక్షాన్ని ఒకచేత్తో ఆపగల తోటమాలి తిరపతి ఆమె తోటలోకొచ్చి నిలబడితే నీటి గొట్టాన్ని చేత్తో పట్టుకోలేడు.
అలాంటిది..... ఇక తనెంత?
ఓ పక్క తిరపతి చెట్లకి నీళ్ళు పోస్తూనే ఉన్నాడు. అయినా తనని కూడా నీళ్ళు పోయమని చెబుతోంది. పెత్తనం చెలాయించడమూ, ఆర్డర్లు జారీ చేయడమన్నా ఆమెకి చాలా ఇష్టం సారథి మేనత్త కేసి అదోలా చూశాడు.
లలితాంబకి ఆ చూపు నచ్చలేదు.
చూడు "మనపనులు మనం చేసుకోవడం తప్పుకాదు. నామోషీ అంతకంటేకాదు. మా నాన్నగారు రావుబహదూర్ జగన్నాధరావునాయుడు గారు, రోజూ తోటపని చేసేవారు. ఆదివారం వచ్చిందంటే ఆయన గదిని గదిలో సామానుని శుభ్రంగా దులిపేవారు. అంతేకాదు, ఆఖరికి వంట గదిలోకి పోయి వంట చేసే విధానాన్ని గురించి కూడా వంట వాడికి విడమరిచి చెప్పేవారు. అవసరం అనుకుంటే ఆయనచేసి చూపించేవారు. నీకు తెలుసో లేదో గాని 'రసం' కాయడంలో మా నాన్నగారికున్న ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఆసలీ ఆంధ్రదేశంలోనే ఆయన కెవరూ సరిపోరనే చెప్పగలను" అంది లలితాంబ.
"అందుకే తాతయ్యగారికి రావు బహదూర్ టైటిల్ ఇచ్చారు. నిజంగా వారు మేధావి. ఆయన కాచిన రసం తాగలేకపోయిన దురదృష్టవంతుడ్ని నేను" అన్నాడు బాధ పడుతూన్నట్టు సారథి.
"నువ్వేం బాధపడకు. ఆ రసం కాయడం ఆయన నాకు నేర్పారు నీకోసం నేను ఈ రోజు స్వయంగా చేస్తాను" అంది.
"చాలా థాంక్సత్తయ్యా, తాతయ్యగారి గురించి వినడమేగానీ చూడలేకపోయిన అభాగ్యుడ్ని" అన్నాడు.
ఆ మాటల్ని వెటకారంగా అన్నాడు సారధి. కానీ ఆమె ధోరణీ వేరుగా ఉంది.
"గుడ్ నాకు తెలుసు నిజానికి ఆయనతో పోటీమనిషి మన రాష్ట్రంలోనే లేరని నేననుకునే దాన్ని" అంది.
సారథికి ఆమె వీక్ పాయింట్ దొరికింది. కాస్త ఏడిపించాలన్న ఉధ్దేశ్యంతో అన్నాడు.
"నిజమేనట. మా వూళ్ళోనూ అనే వాళ్ళట, తాతయ్యగారికి ముఖ్యమంత్రికాగల అర్హతలుండేవని"
సారధిని లలితాంబ మెచ్చుకోలుగా చూసింది.
"చాలా కరెక్టుగా చెప్పావయ్యా! నిజంగానే ఆయన్ని ఎలక్షన్స్ లో నించోబెట్టాలని చాలామంది ప్రయత్నం చేశారు. కానీ నాన్నగారికే ఇష్టం లేక వూరుకొన్నారు."
"నన్నడిగితే నువ్వు దురదృష్టవంతురాలివి అత్తయ్యా" అన్నాడు.
"అదేంమాట. నాకంటే అదృష్టవంతురాలెవ్వరయ్యా!" అంది తీవ్రంగా లలితాంబ.
"అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు. తాతయ్యగారు చేసిన పొరపాటు మీ పాలిట దురదృష్టంగా నేను భావిస్తున్నాడు."
"అంటే?"
"నువ్వు నిజంగా అమాయకురాలివి అత్తయ్యా! ఆనాడు తాతయ్య గారు ముఖ్యమంత్రి చేసివుంటే ఈ రోజు ఆస్థానంలో నువ్వు ఉండేదానివి" అన్నాడు.
లలితాంబ ఆఫ్యాయంగా సారధి భుజంపైన తట్టింది. కానీ అంతలోనే ఆమెకు దిగులు కలిగింది.
"నిజమే, నువ్వు చెబుతూంటే అనిపిస్తోంది. మా నాన్న చాలా తప్పు చేశారు. ఆయన చేసిన ఆ పొరపాటువల్ల నేనేం పోగొట్టుకొన్నానో బాగా గుర్తుచేశావు" అంది దిగులుగా.
"ఇప్పుడు మాత్రం నీకు తక్కువేమిటి అత్తయ్యా! సంఘ సేవకురాలిగా నీకున్న పేరు జంటనగరాల్లో ఎవరికీ లేదు" అన్నాడు.
"ఈ అత్తయ్య విలువేమిటో కనీసం నువ్వు తెలుసుకున్నావు. చాలా సంతోషం. పద, లోపలకెళదాం" అంది లలితాంబ అతని భుజం పైన చెయ్యివేసి.
