Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 22


    ఎవరో మనిషే - అందులోనూ ఆడమనిషే.

 

    ఆ ఒంపులు, గాలికి ఎగురుతున్న పైట - సందేహంలేదు. ఎవరో స్త్రీనే.

 

    "ఎవరక్కడ?" ఈసారి మరింత బొగ్గరగా అరిచాడు.

 

    ఆ ఆకారం పలకలేదు సరికదా అతని ముందుకే దూసుకొస్తోంది. అది నడవడం కూడా కాదు - గాల్లో తేలుతూ వస్తున్నట్లుగా వుంది. అతను భయంతో గజగజా వణుకుతున్నాడు.

 

    గాలికి బదులు భయాన్ని లోపలికి పీలుస్తూ బయటికి వదులుతున్నట్లు అదిరిపడుతున్నాడు.

 

    ఆ ఆకారం మరింత దగ్గరైంది.

 

    అది తనకు పదడుగుల దూరాన వుందో, ఇరవై అడుగుల దూరాన వుందో లెక్క గట్టే స్థితిలో లేడతను.

 

    అలా గుడ్లప్పగించి చూస్తున్నాడు.

 

    ఏం చేయాలో పాలుపోవడం లేదతనికి. దెయ్యం దగ్గరగా వచ్చేస్తుంటే ఏం చేయాలో ఎవరి దగ్గరా విన్లేదు.

 

    అందుకే అక్కడినుండి పారిపోవడం ఉత్తమం అనుకున్నాడు.

 

    కానీ ఆ ఆకారం ఖచ్చితంగా తను వూర్లోకి వెళ్ళాల్సిన గట్టుమీదనే నడిచి వస్తోంది. మరెలా పారిపోవడం?

 

    అతను అటూ ఇటూ చూశాడు.

 

    విచిత్రం - స్విచ్ బోర్డుకున్న కరెంట్ బల్బు వెలుగుతోంది. అంటే కరెంటు వచ్చిందన్న మాట.

 

    అతను మోటారు విషయం మరిచిపోయాడు. తన ఎదురుగ్గా వస్తున్న ఆకారం కేసి చూశాడు.

 

    ఒక్కసారిగా వెన్నుపూస కదిలినట్లు భయం ఒళ్ళంతా పాకింది.

 

    ఆ ఆకారం కళ్ళు నీలంగా, కళ్ళే రెండు పాణుల్లాగా మెరుస్తున్నాయి. ఆ కళ్ళను ఎక్కడో చూసినట్లు అతనికి అనిపించింది. వాటిని ఎక్కడ చూసిందీ అంత భయంలోనూ అతనికి గుర్తొచ్చింది.

 

    రోడ్డుమీద వాహనాల లైట్లు వెలుగుపడితే ఎద్దు కళ్ళు అచ్చం అలానే మెరుస్తాయి. సందేహం లేదు. అవి ఎద్దుకళ్ళే. కానీ ఓ మనిషికి అలా కళ్ళు నీలంగా మెరవడం అంటే అది దెయ్యమే.

 

    విరబోసుకున్న తల వెంట్రుకలు -

 

    గాల్లో తన అదిరే గుండెను ఆరబెట్టినట్లు ఎగురుతున్న పైట -

 

    లయబద్ధంగా విన్పిస్తున్న కాలిగజ్జెలు -

 

    తరువాత ఆ ఆకారాన్ని చూడలేకపోయాడు అతను.

 

    బావి వెనకనున్న మడిలోకి దూకి ఊరివైపు పరుగెత్తాడు. కిలోమీటరు దూరాన్ని పదినిముషాల్లో పూర్తి చేశాడు.

 

    ఊర్లో మొదట్లోకి వచ్చి రచ్చబండ మీద కూర్చుండిపోయాడు.

 

    నీలం అద్దాల్లాగా మెరిసిన ఆ కళ్ళు తప్ప మరేం కనిపించడం లేదు.

 

    అప్పుడు కలిగిన ఆయాసం తగ్గడానికి పది నిముషాలు పట్టింది.

 

    ఊరు నిద్రపోవడానికి దుప్పటిని సర్దుతున్నట్లు చిన్న చిన్న శబ్దాలు తప్ప మరేం విన్పించడం లేదు.

 

    సేద తీర్చుకున్న ఆనందరావు లేచి మెల్లగా ఇంటివైపు నడిచాడు.

 

    అతను వెళ్ళేసరికి సరస్వతమ్మ - "నీకోసమే చూస్తున్నారా? కాళ్ళూ చేతులూ కడుక్కుని రా - వడ్డిస్తాను. యేనాదిపాళెంలో గవర్నమెంటోళ్ళు ఏదో సినిమా చూపిస్తున్నారట. వెళతాను" అంది.

 

    "అది సినిమా కాదు. పిల్లలు పుట్టకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పేదట అది. ఈ వయసులో నీకేం అవసరముంది?" అని ఇంట్లో మంచం మీద వాలిపోయాడు అతను.

 

    "ఏదో ఒకటి! వెళ్ళి చూసొస్తాను. పక్కింటి రామయ్య కూడా బయల్దేరాడు"

 

    "అయితే వెళ్ళు. ఆకలిగా లేదు. ఒకవేళ ఆకలిగా అనిపిస్తే నేనే వేసుకుతింటాలే"   

 

    సరస్వతమ్మ వెళ్ళిపోయింది.

 

    యానాదిపాళెంలో సినిమా హడావుడి తప్ప మరేం విన్పించడం లేదు. అక్కడికి వెళ్ళేవాళ్ళు వెళ్ళగా, మిగిలినవాళ్ళు నిద్రలోకి జారిపోతున్నారు.

 

    అతనికి ఇంకా బెదురు తగ్గలేదు. రేపో ఎల్లుండో తాయెత్తు కట్టుకోవాలనుకున్నాడు. ఆడదెయ్యాలు యిలా తన వెంటపడడం తలుచుకుంటేనే వెన్నపూస భయంతో చిట్లుతోంది. అలా కళ్ళు మూసుకున్నాడు.

 

    ఇందాక కనిపించిన కళ్ళే కళ్ళముందు కదలాడుతున్నాయి. అంతలో తలుపు దగ్గర చప్పుడైతే మెల్లగా కళ్ళు విప్పాడు. ఎదురుగ్గా రమణి.

 

    ఆ వేళప్పుడు ఆమె రావడం ఆశ్చర్యంగా అనిపించింది అతనికి. పడుకున్న వాడల్లా లేచి కూర్చున్నాడు.

 

    "సరస్వతత్త లేదా?" అని అడుగుతూ తలుపు పట్టుకుని నిలబడింది రమణి.

 

    "లేదు. యానాదిపాళెం వెళ్ళింది"

 

    "మా మామ కూడా అక్కడికే వెళ్ళాడు. ముసలాళ్ళు చూసే షో కాదది. అలాంటి షోలకి మనలాంటి పడుచువాళ్ళు వెళ్ళాలి. అది ఉపయోగపడేది మనకు. మరి ఈ ముసలాళ్ళు ఎందుకెళ్ళినట్లు?" అని నవ్వుతోంది.

 

    బావిలోంచి ఏతంతో నీళ్లు చేది కాలువలోకి అవి జారుతున్నప్పుడు అయ్యే చప్పుడుకూడా ఆ నవ్వులాగే వుంటుందనిపించింది అతనికి.

 

    ఆ రాత్రి దుప్పట్ల వేలంపాట రాత్రి వచ్చింది రమణేనా అని కుర్రకారంతా గుచ్చి గుచ్చి ఒకటికి పదిసార్లు అడగడంతో అతనికీ ఆమెపై ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చింది. అప్పట్నుంచీ ఆమెను దొంగచాటుగా చూస్తున్నాడు. చూసినకొద్దీ చూడాలనిపించే శరీర పొంకం ఆమెది అని చూసిన ప్రతిసారీ అనుకున్నాడు.

 

    "ముసలాళ్లు షోకి వెళ్ళారు. మరి మనిద్దరం ఏం చేద్దాం?" అంటూ కళ్ళతోనే నవ్వింది.

 

    ఆమె తొట్రుపాటునంతా చెప్పడానికన్నట్లు ఆమె పైట జారిపోయింది. ఎదలో కోరిక సెగలేస్తున్నట్లు చాటి చెప్పడానికన్నట్లు కళ్ళు ఎర్రెర్రగా మెరుస్తున్నాయి. ఇన్ని రోజులూ ఆమె పడ్డ ఒంటరితనాన్ని తెలియజేస్తున్నట్లు నడుం మరింత సన్నబడింది. ఒకప్పటి ఆమె అనుభవాలను ఏకరువు పెడుతున్నట్లు నడుం మడతలు మరింతగా వచ్చాయి.

 

    చూస్తున్న కొద్దీ అతనిలో రక్తం చిక్కనౌతోంది. ఆమెకు తన చాలడన్నట్లు ఆమె భారీ విగ్రహాన్ని చూస్తే ఏదో జంకుగా వుంది. ముఖ్యంగా ఆమె ఎద క్షణ క్షణానికీ అది కోరికను కూరుకుని పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఒక నడుం తప్ప మిగిలినవన్నీ భయపెడుతున్నాయి. చివరికి బొడ్డు కూడా రతీదేవి నుదుటున పెట్టుకున్న బొట్టులా వుంది.

 

    ఆమె మెల్లగా కదిలి "తిన్నావా?" అంది.

 

    "లేదు"

 

    "ఏం? ఆడవాళ్ళు వడ్డించకపోతే ముద్ద దిగదంటే చెప్పు - ఈ పూట నేను వడ్డిస్తాను"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS