Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 21


    "సరే! అయితే కాసేపు రెస్ట్ తీసుకోండి." అని చిన్నగదిలోకి వచ్చింది. చాప పరుచుకుని పడుకుంది. మిగిలిన కథ వినాలని కుతూహలంగా వుంది. కానీ చెప్పమని అడగటానికి నోరు పెగలడం లేదు.

 

    ఇదంతా కనిపెట్టినట్టు అతనన్నాడు "రమణి ఏం చేసిందని అడగరేం?"

 

    "చెప్పండి" అంది ముక్తసరిగా.

 

    "ఇప్పటికయినా అడిగారు -అదే సంతోషం" అని అతను చెప్పటం ప్రారంభించాడు.

 

    "ఆనందరావు వలన తను నలుగురి నోళ్ళల్లో నానాక రమణి రెండు రోజుల వరకూ నిద్రలేకపోయింది. అప్పటికే ఊరు ఊరంతా ఈ సంఘటనకు కావాల్సిన మసాలా అద్ది ఎంజాయ్ చేస్తోంది.

 

    ఆమె అదృష్టమంతా ఏమిటంటే యిది ఆమె మామ రామయ్య చెవికి చేరకపోవడమే.

 

    తను వేసుకున్న పథకాన్ని అమలు చేయడానికి రమణి తగిన అవకాశం కోసం చూస్తోంది.

 

    ఆనందరావు మాత్రం మామూలుగానే వున్నాడు. సాయంకాలం భజన మందిరానికి వెళితే కుర్రకారంతా ఈ విషయమై ఎగతాళి చేస్తోంది.

 

    "అదేమిట్రా వెర్రిముఖమా! రమణిలాంటి పిల్ల పక్కన చేరితే దెయ్యమని అరిచేశావట!"

 

    "నిజంగానే ఆడదెయ్యం మోహించేంత బలిష్టంగా వున్నావ్."   

 

    "ఇంతకీ ఆ రాత్రి వచ్చింది అడదెయ్యమా? లేక రమణా?"

 

    స్నేహితులంతా ఇలా అంటున్నా ఆనందరావు మాత్రం నోరుతెరిచేవాడు కాడు. ఆ రాత్రి వచ్చింది ఆడదెయ్యమేనని అతని ప్రగాఢ విశ్వాసం. ఇంతకంటే మరోవిధంగా అతను వూహించుకోలేకపోతున్నాడు.

 

    దెయ్యాలు తనమీద మనసుపడ్డాయన్న అనుమానం ఇంకా అతన్లో పోలేదు. అందుకే జాగ్రత్తగా వుండాలని నిర్ణయించుకున్నాడు.

 

    అతని పొలాలు ఊరుకి దక్షిణంగా వున్నాయి. కిలోమీటర్ దూరం నడవాలి. అక్కడతనికి అయిదెకరాల పొలమూ, బావి, మోటారు వున్నాయి. పొలం దాటాక యిక దట్టమయిన అడవి ప్రారంభమవుతుంది. ఈ సంఘటన జరిగాక చీకటిపడ్డాక పొలం దగ్గర వుండాలంటే భయంగా వుందతనికి. అందుకే వీలయినంత త్వరగా ఇంటికి వచ్చేస్తున్నాడు.

 

    బావికింద మొలగొలుకులు నారు పోశారు. మరో పదిరోజులకు నాటాలి. వర్షం కురవక చాలారోజులే అవుతోంది. నారు ఎండిపోతోంది. దానికి నీళ్ళు కట్టాలని ఓ రోజు మధ్యాహ్నం ఆనందరావు బయల్దేరాడు.

 

    పొలం చేరుకునేసరికి మూడయింది. బావులకు వచ్చే త్రీ ఫేస్ కరెంట్ రోజూ మూడుగంటలకు వదులుతారు. రాత్రి ఎనిమిది గంటల వరకూ వుంటుంది.

 

    అందుకే మూడు గంటలకల్లా పొలం చేరుకున్నాడతను. మిషన్ వేస్తే పోవడం లేదు.

 

    స్విచ్ బోర్డుకున్న లైటు వేశాడు. వెలగటం లేదు. అంటే యింకా కరంటు రాలేదనుకుని నారు పాదిలో వున్న చెత్తాచెదారం ఏరడం ప్రారంభించాడు.

 

    నాలుగయింది. కానీ లైటు వెలగడం లేదు.

 

    చెత్తంతా ఏరిపారేశాక ఇక ఏం చేయాలో తోచక బావి దగ్గరున్న బండరాయి మీద కూర్చున్నాడు.

 

    బావి చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచాయనిపించింది. చేతిలో నున్న కత్తితో వాటినన్నీ నరికాడు.

 

    అయిదయింది. కరెంట్ బల్బు మాత్రం వెలగలేదు.

 

    చలికాలం కావడం వలన రాత్రి ఛాయలు అప్పుడే కొంచెంగా మొదలయ్యాయి.

 

    ఇక ఈ పూటకి కరెంట్ రాదని, వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ నారు చూస్తే ఎండిపోతోంది. ఇప్పుడు నీళ్ళు కట్టకపోతే నారు నాటడానికి పనికిరాదు. అందుకే మనసు మార్చుకున్నాడు. బావి చుట్టూ వున్న ప్రాంతాన్ని చదును చేయడం ప్రారంభించాడు.    

 

    టైమ్ ఆరయ్యింది. చీకట్లు లోకంమీదకి వాలిపోతున్నాయి. చలికాలమింతే. అరయితేనే రాత్రి ప్రారంభమవుతుంది. అతను ఇక పనిచేసే ఓపిక లేక రాయిమీద కూర్చున్నాడు. మాటిమాటికీ కరెంటు బల్బ్ వంక చూస్తున్నాడు గానీ అది వెలగటం లేదు.

 

    టౌన్ లో మీటింగ్ పెట్టిన ప్రతి రాజకీయ నాయకుడూ పల్లెటూళ్ళ సేవ చేయడానికే తను పుట్టినట్లు మాట్లాడతాడు. కానీ కరెంటు వుండదు. స్కూళ్ళు సరిగా వుండవు. అనారోగ్యం వస్తే మందులిచ్చే దిక్కుండదు. ఈ దేశంలోని పల్లెటూళ్ళలో బతకడంకంటే మరో నరకం వుండదు.  

 

    దేశాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రవేశపెడతామని రాజకీయ నాయకులంతా మూకుమ్మడిగా అరుస్తుంటారు. ఇప్పటికే కరెంట్ కోతతో దేశం - ముఖ్యంగా రాష్ట్రం విజయనగర సామ్రాజ్యపు రోజుల్లోకి వెళ్ళిపోయింది. రాత్రయితే ఎక్కడయినా - అది టౌనైనా, పల్లెటూరైనా కిరసనాయిల్ దీపాలు దర్శనమిస్తున్నాయి.   

   

    ఇలానే కొన్నిరోజులు పోతే కరెంట్ తయారయ్యే విధానం, బల్బుకుండే ప్రక్రియను మ్యూజియంలో చూపిస్తారేమో అనుకున్నాడు అతను.

 

    కరెంట్ రాకపోవడం వల్ల అతనికి అసహనం పెరిగిపోతోంది. చీకటి బాగా కమ్ముకుంటోంది.

 

    చెట్లూ చేమలు మసగ్గా కనిపిస్తున్నాయి తప్ప స్పష్టంగా తెలిసిరావడం లేదు.

 

    చుట్టూ చూశాడు. తను తప్ప ఎవరూ లేరు. భయం పొగలా మెల్లగా గుండెల్లో లేస్తోంది.

 

    అప్పుడే - ఇందాక వేసిన చెత్తాచెదారంలో చిన్న అలికిడి ప్రారంభమైంది. ఏదో దేన్నో కొరుకుతున్న శబ్దం. అటువైపు చూడడానిక్కూడా అతను భయపడ్డాడు. దూరంగా ఎవరో మనిషి మోకాళ్ళమీద కూర్చుని నల్లటి కంబళీని ముసుగేసుకున్నట్టు అనిపించింది.

 

    కళ్ళు చిట్లించి చూశాడు.

 

    అది మనిషి కాదు - జిల్లేడు చెట్టు.

 

    తన భ్రమకి తనకే నవ్వొచ్చింది అతనికి.

 

    ఎందుకైనా మంచిదని మరోసారి చూశాడు.

 

    జిల్లేడు చెట్టు పెరుగుతోంది. క్షణక్షణానికి జానెడు చొప్పున ఎత్తవుతోంది.

 

    అతనికి ఒళ్ళంతా ఒక్కసారి జలదరించింది.

 

    తను అనుకున్నట్టు చెట్టు కాదేమో - మనిషేమో! మనిషి కూర్చున్న వాడల్లా మెల్లగా పైకి లేస్తున్నాడేమో!

 

    "ఎవరూ?" అని గట్టిగా అరిచాడు.

 

    ఎవరూ పలకడం లేదు. దిగి వెళ్ళి చెట్టా, మనిషా అక్కడున్నది చూడాలనుకున్నాడు. కానీ భయం కాళ్ళకు తిమ్మిర్లెక్కించినట్లు బరువుగా తోస్తున్నాయి.

 

    ఈసారి కళ్ళు నులుముకుని చూశాడు. అది తన దగ్గరకే వస్తోంది. అతనికి వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి. భయం తన శరీరాన్ని తాకి వెళ్ళిపోయినట్లు చర్మం మీద బొడిపలు లేచాయి. గుండె కొట్టుకోవడం అతనికే స్పష్టంగా వినిపిస్తోంది.     


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS