Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 22


    "అసలు...!"
    
    "బాబాయ్!" అర్దోక్తిగా ఖండించింది. "ఎందుకిలా చేశారో నాకు తెలుసు కాబట్టి, అలాంటి చచ్చు ప్రశ్నవేసి నా ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం లేదు నేను. ఎందుకిలాంటి ఇంట్లో వుండాలని నన్ను నేను ప్రశ్నించుకుకున్నాను. నాకేం తక్కువ అని నా గురించి నేను ఆలోచించుకున్నాక ఇక్కడినుంచి వెళ్ళిపోతున్నాను. బై!"
    
    అప్పటికే ద్వారం దాటి వెళ్ళిపోయింది.
    
    ఆ క్షణంలో ప్రొఫెసర్ రాధాకృష్ణ ఆలోచిస్తున్నది ప్రణయ వెళ్ళడం గురించి కాదు, అన్నయ్య చంద్రశేఖర్రావుకి ఏం చెప్పాలో తెలియక.
    
    సాయంకాలానికల్లా వాల్తేర్ అప్ లాండ్స్ లో ఓ పెద్ద ఇంటిని అద్దెకు తీసుకోగలిగినది ప్రణయ. ఆ వార్త మరుసటిరోజు సాయంత్రంకల్లా యూనివర్శిటీలో తెలిసిపోయింది.
    
    రాత్రి ఏడుగంటల సమయంలో వచ్చాడు ఆదిత్య.
    
    ముందు అవాక్కయింది ప్రణయే. ఇంట్రావర్డ్ లా వుండే ఆదిత్య అలా చనువుతీసుకోగలిగే మనిషికాదని ఆమెకు ఎప్పుడో బోధపడిపోయింది. అయితే అతను మోహమాటస్తుడే తప్ప అమాయకుడు కాదు.
    
    "ఇట్సె సర్ ప్రయిజ్!" అంది సాదరంగా ఆహ్వానిస్తూ "ఏం తీసుకుంటారు? పనిమనిషి కోసం దిక్కులు చూడకండి. ప్రస్తుతానికింకా ఒంటరిగానే వున్నాను కాబట్టి రేపో, మాపో వంటమనిషిని ఏర్పాటు చేసుకోవాలి."
    
    లేవబోతున్న ప్రణయని వారించాడు- "ఇప్పుడు నాకేం వద్దు" అని.
    
    కూర్చుండిపోయింది మృదువుగా నవ్వుతూ "అడిగితే తప్ప ఏదీ ఇవ్వటం నాకు అలవాటు లేదు."
    
    "మీరు చాలా దాచారు."
    
    "ఆడపిల్లనిగా!"
    
    "దాచటానికీ, ఆడపిల్ల కావటానికీ సంబంధం లేదు."
    
    "చాలావుంది కాబట్టే బాల్యం నుంచి ఒళ్ళంతా దాచుకునేట్లు ఆడపిల్లలకి గౌన్లు తొడుగుతుంటారు అదే మగపిల్లలకయితే అలాంటి నిర్భంధము లేకుండా నిక్కరుంటే చాలనే పద్దతిలో వుంటారు."
    
    ఆమె కళ్ళల్లోకి చూడలేనట్లు తల వంచుకున్నాడు.
    
    తను దాచడం అనే పదం వాడగానే ఆడతనాన్ని దాచుకోవడం గురించి ఆమె గుంభనంగా చెబుతోంది. కాని ఆ చెప్పడంలో ఆకతాయితనం లేదు.
    
    "నేను అడిగింది ఆ దాచడం గురించి కాదు."
    
    "మరి?"
    
    "మీరు ప్రముఖ పత్రికాధిపతి చంద్రశేఖర్రావుగారి కూతురని నాకీ రోజుదాకా తెలియదు."
    
    "తెలిస్తే ఏం చేసేవారు?"
    
    జవాబు లేదు ఆదిత్య దగ్గర.
    
    "అది మీకు తెలియాలీ అంటే మన మధ్య అంత పరిచయం పెరగాలనా? ఎందుకంటే అడిగితే తప్ప ఏదీ ఇవ్వడంగానీ, చెప్పడంగానీ అలవాటు లేనిదాన్ని కాబట్టి."
    
    అది అందమో లేక ఆమె మాటల్లోని ఆకర్షణో ఆదిత్యకి తోచడం లేదు.
    
    "సరే! ఇకనుంచి అడుగుతాను."
    
    "ఏమిటి?" టక్కున అడిగింది.
    
    క్షణం కంగారుపడి వెంటనే అన్నాడు- "మీరు ఉన్నట్టుండి మీ బాబాయ్ ఇంటినుంచి ఎందుకు వచ్చేసినట్లు?"
    
    "విడిగా ఉండాలనిపించింది."
    
    "ఇబ్బంది కాదూ?"
    
    "ఏ విషయంలో?"
    
    "ఒంటరిగా వుండటంలో."
    
    "కంపెనీకి మీరు సిద్దపడుతున్నారుగా?"
    
    "నో నో!" మరెటో చూస్తూ అన్నాడు. "నేను వచ్చింది క్విజ్ కాంపిటీషనులో మీరు హర్టయ్యాక మీ బాబాయ్ తో గొడవపడి వచ్చేశారని తెలిసి."
    
    "గుడ్! చాలా విషయాలు తెలుసుకోగలిగారు."
    
    "చెప్పుకుంటుంటే విన్నాను."
    
    "విన్నవాళ్ళంతా నా దగ్గరకు రాలేదుగా?"
    
    "మరేం?" నెలలు నమిలేశాడు.
    
    "అంటే అందరిలో మీరొకరు కాదు, అందరికన్నా మీకు నామీద ఆసక్తి వుంది కదూ?"
    
    ఆదిత్య నుదుట స్వేదం పేరుకుపోయింది ఏమిటీ అమ్మాయి? ఇంత దూకుడుగా మాట్లాడి ఇబ్బందిపెడుతోందేమిటి?
    
    "మీరు జవాబు చెప్పకపోయినా నేను అర్ధంచేసుకోగలను మిస్టర్ ఆదిత్యా! యూ లవ్ టు మీట్ మీ అవునా?"
    
    గొంతు దిగని స్థితి. "మరేం-ఉట్టిగా కలుసుకుని...."
    
    "అంతకన్నా మీరు అడుగు ముందుకువేయలేరని నాకు తెలుసు."
    
    ఉద్విగ్నంగా చూశాడు. ఆమె ప్రస్తుత మానసిక స్థితి అలా మాట్లాడిస్తోందో, అసలు ఆమె తత్వమే అంతో ఆదిత్యకి తోచడంలేదు.
    
    అతడలా దిక్కులు చూస్తూండగానే పకాలున నవ్వేసింది. "మీరు వట్టి పిరికిగొడ్డు కదా!"
    
    ఈ స్టేట్ మెంటుకి కోపం వచ్చిందేమో "ఎందుకలా అనుకుంటున్నారు?" అన్నాడు.
    
    "ఒక అందమయిన అమ్మాయిని ముద్దుపెట్టుకునే అవకాశాన్నిచేజార్చుకున్న మీరు ధైర్యవంతులని ఎలా అనుకోను?"
    
    అసంకల్పితంగా అనేశాడు-"కొన్ని గోప్యంగా జరగాలి ప్రణయా!"
    
    "అంటే ఇలా నాలుగు గోడల మధ్యనా?"
    
    తల వంచుకున్నాడు ఆదిత్య.
    
    "నాట్ బాడ్ మిస్టర్ ఆదిత్యా! మీరు నేననుకున్నంత అమాయకులేం కాదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS