Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 21


    శౌరిలో చలనం లేదు. ఆదిత్య ప్రణయల మేధకు కాదు. ప్రొఫెసరు రాధాకృష్ణ తెలివితక్కువ ప్రశ్నలకి ఆశ్చర్యపోతున్నాడు.
    
    ఎంత మేధావినైనా 'తెలీదు' అనిపించే ప్రశ్నలు చాలా వుండగా ఎందుకిలా అవివేకాన్ని ప్రదర్శిస్తున్నాడా అని అతడు ఆలోచిస్తుండగానే చివరి ప్రశ్న అడిగాడు ప్రొఫెసర్ రాధాకృష్ణ.
    
    "నన్ను బాబాయ్ అనవసరంగా లండను పంపించాడు" అప్రతిభురాలైన ప్రణయని చూస్తూ అన్నాడు క్విజ్ మాస్టర్.... "ఇది ఓ ప్రముఖ ఇంగ్లీషు నవలలోని వాక్యం... అ అవాక్యం ఏ నవలలోది? అలా అన్నపాత్ర పేరేది?"
    
    అవాక్కయి చూస్తున్నారు ఆదిత్య, ప్రణయ.
    
    "బాస్టర్డ్!" ముందు అరిచింది సూరి.
    
    "కావాలని అర్ధంలేని ప్రశ్నలతో ఆదిత్య ప్రణయల్ని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్న నీలాంటి స్టుపిడ్ క్విజ్ మాస్టర్ గా నిలబడటం..."
    
    "షటప్!" ఆవేశంగా పైకి లేచాడు శౌరి.
    
    రెండు వర్గాల మధ్య పోరాటం ప్రారంభం కావడానికి సూచనగా పోటీ ముగిసినట్టు బెల్ రింగయింది.
    
    "కంగ్రాట్స్ మిస్ ప్రబంధా! మీరు గెలిచారు"
    
    అభినందిస్తున్నట్టుగా చూశాడు ప్రొఫెసర్ రాధాకృష్ణ.
    
    నెమ్మదిగా పైకి లేచింది ప్రణయ... "అర్దిస్తున్నట్టుగా విద్యార్ధులకేసి, చూసింది "ఒక్క అరనిముషం"
    
    కేకలు, కేరింతలతో అంతసేపూ హోరెత్తిపోయిన ఆడిటోరియంలో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది.
    
    ప్రణయ మైక్ ముందుకు వచ్చింది.
    
    "ప్లీజ్! దీన్ని ఓ రాజకీయ సమస్యగా మార్చకండి" అభ్యర్ధనలా అంది ప్రణయ. "మేధనిబట్టి ఫలితాలు నిర్ణయిస్తారు కాబట్టి ముందుగా ఈ పోటీలో నెగ్గిన మిస్ ప్రబంధని, మిస్టర్ సుధీర్ ని అభినందించండి."
    
    అప్పుడు చూసింది మిస్ ప్రబంధ వైపు.
    
    "ఇంచుమించు ఒంటరిగా పోరాటాన్ని సాగించి ఈ ఐక్యూ టెస్టులో నెగ్గిన మీ శక్తికి నా జోహార్లు మిస్ ప్రబంధా! యూ డిజర్వ్ టు బి విన్నరాఫ్ దిస్ కాంపిటీషన్." ముందు తనే చప్పట్లు కొట్టింది ప్రణయ.
    
    ఆడిటోరియమంతా ఆమెను అనుసరించింది.
    
    మైక్ ముందుకు ప్రణయ రాగానే చాలా హడావుడిని, అలజడిని ఎక్స్ పెక్ట్ చేసిన ప్రొఫెసర్ రాధాకృష్ణ గుండె చిక్కబట్టుకున్నాడు "ఈ టెస్ట్ ని విజయవంతంగా నిర్వహించగలిగిన క్విజ్ మాస్టర్ శ్రీ రాధాకృష్ణగారికి నమస్సులు తెలియచేస్తున్నాను."
    
    'విజయవంతంగా' అంటూ ప్రణయ ఒత్తిపలకడంలో ఏదో ఐరనీ ధ్వనించినా పట్టించుకోలేదు రాధాకృష్ణ.
    
    అందరూ చూస్తుండగానే డయాస్ దిగిన ప్రణయకి అభిముఖంగా నిలబడ్డాడు సూరి "మిస్ ప్రణయా! స్పాంటేనిటీ టెస్ట్ లో క్విజ్ మాస్టర్ ఎంత పక్షపాత వైఖరిని అవలంబించిందీ మీకు..."
    
    "తెలుసు"
    
    క్షణం తెల్లబోయారు సమీపంలో నిలబడ్డ విద్యార్ధులంతా.
    
    "ఎస్ మిస్టర్ సూరీ!" అప్రతిభుడై నిలబడ్డ బాబాయ్ ని చూస్తూ అంది. "కానీ ఎలాంటివారన్నా కానీ రిఫరీ నిర్ణయాన్ని అంగీకరించడం రియల్ స్పోర్టివ్ నెస్. ఓకె!" క్లుప్తంగా చెప్పి వెళ్ళిపోయింది. కాని అది రాధాకృష్ణని చాలా బాధపెట్టింది.
    
    అదృష్టవశాత్తూ ఇలాంటి స్టేట్ మెంట్ మైక్ లో ఇవ్వనందుకు కాస్త సంతృప్తి చెందిన ప్రొఫెసర్ రాధాకృష్ణ సమీపంలో ప్రబంధ వుందేమో చూశాడు. అప్పటికే ఆమె కూడా వెళ్ళిపోవడంతో తేరుకుని సరాసరి ఇంటికి వచ్చాడు. వెంటనే కనిపించలేదు ప్రణయ.
    
    అందరు విద్యార్ధుల మధ్య తన పరువు తీసిన ప్రణయ విషయంలో ఉపేక్షించటం ఇష్టంలేనట్లు ఆమె గదిలోకి నడిచారు.
    
    "నువ్వు చేసింది సవ్యంగా లేదు ప్రణయా!"
    
    "నాకూ అనిపించింది బాబాయ్!" సర్దుకున్న సూట్ కేస్ చేతిలోకి తీసుకుంది. "అందుకే ఇల్లువదిలి వెళ్ళిపోతున్నాను."
    
    ముచ్చెమటలు పోశాయి రాధాకృష్ణకి.
    
    "ఎస్ అంకుల్! మీరేమిటో తెలిశాక ఈ ఇంట్లో వుండడం నాకు ఇష్టంలేని విషయంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను."
    
    "ఆగమ్మా! ఇప్పుడేమైందని?" ప్రణయ ఆవేశానికి తత్తరపడుతూ "కాంపిటేషన్ అన్నాక ఓటమి వుంటుంది."
    
    "ఎస్! ఉంటుంది కాదనను. కాని మనిషన్నాక కొన్ని నైతిక విలువలూ ఉంటాయి."
    
    "ఇప్పుడు నేనేం చేశానని?"
    
    "అది మీకు మీరుగా ప్రశ్నించుకోవాల్సింది అంకుల్! ఎస్. నిజమే. మీకు రేపు వైస్ ఛాన్సలర్ కావాలన్న కోరిక వుంది కాబట్టి మిస్ ప్రబంధ గెలవడం ముఖ్యమే. అందుకే మీరు కొన్ని అస్త్రాల్ని మీ అమ్ములపొదిలో సిద్దంచేసుకువచ్చారనీ తెలుసు. కాని ఇంత హీనంగా మీరు పొరపాటు చేస్తారని ఆలోచించలేకపోయాను."
    
    తన వ్యక్తిత్వం ఆమె సులభంగా గుర్తించినందుకు గిల్టీగా ఫీలయ్యాడు.
    
    "ప్రణయా!"
    
    "ఎస్ బాబాయ్! నేనే! చాలా నిక్కచ్చిగా మాట్లాడుతున్నందుకు కంగారు పడకండి. స్పాంటేనిటీ టెస్ట్ లో మిస్ ప్రబంధని టెన్త్ స్టాండర్ద్ స్థాయిలో ప్రశ్నలు వేసినా నేను పట్టించుకోలేదు. కాని బిట్స్ లా వుండాల్సిన ఆ టెస్ట్ లో అర్ధంలేని ఓ వాక్యం చెప్పి కాండెక్ట్స్ ఏమిటో, పాత్రల పేరేమిటో తెలియకుండా దాచి 'మా బాబాయ్ నన్ను లండను పంపించాడు' అనే వాక్యం ఏ గ్రంథంలోదీ అని అడగటం రోజూ ఉదయం టాయిలెట్ లోకెళ్ళిన షేక్ స్పియర్ ముందేం చేశాడూ అని ప్రశ్నించటం లాంటిది..."
    
    "అది నేను సృష్టించిన వాక్యం కాదు. డేవిడ్ కాపర్ ఫీల్డులాంటి క్లాసిక్ లోనిది."
    
    క్షణంపాటు నివ్వెరపోతున్నట్లుగా చూసింది. "అలాంటప్పుడు అడగాల్సింది అలా కాదు- MY CRUEL STEP FATHER MR MURDSTONE SENT ME TO LONDON TO MAKE MY LIVING అంటూ కనీసం ఓ పాత్ర పేరైనా వాక్యంలో స్పష్టం చేయాలి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS