"బీ కేర్ పుల్ డియర్... రాజకీయ హత్యలు తిరగతోడడం అంటే ముందు మన ప్రాణాలను తీయాలని ప్రయత్నిస్తారు. ఎప్పుడు ఎలాంటి అవసరం కలిగినా నాకు చెప్పు_ ప్రతిసారీ మూర్ఖంగా వెళ్ళకు. నువ్వు అసలే మొండిదానివి... అన్ని సందర్బాలూ మనకు అనుకూలముగా ఉండవు"
"ఇట్స్ ఓకే వీరూ.. చాలా రోజులకు కలిశాం... ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానికే అంటావా" అతని బుగ్గపై చితికే వేస్తూ అన్నది ఆమె.
"దేవిగారికి సరసం కూడా తెలుసు అని నాకు ఇప్పుడే అర్ధం అయింది.
"నీకు అంత డౌటా... నీ సందేహం తీర్చటానికి నీ బుగ్గ కొరికి వేయనా లేక నీ పెదవులకు విశ్రాంతి ఇవ్వకుండా నిమిషానికి వంద ముద్దులు నీ పెదవులపై పెట్టమంటావా?" అన్నది ధీరజ.
"ఓరి నాయనో.... నువ్వు అన్నంతపని చేయగలవు అని నాకు తెలుసు కానీ... హత్యలు ఇన్వెస్టిగేషన్లు ఆపి కాసేపు ఇంకేమయినా కబుర్లు చెప్పు డియర్" అన్నాడు ఏ.సి.పి వీరేష్.
"అదీ__ అలా దారికిరా"
సర్వర్ రావడంతో రెండు ఐస్ క్రీమ్ లకు ఆర్డర్ ఇచ్చింది ధీరజ.
అల్లరి మాటలతో ఎంతసేపు గడిచిపోయిందో కూడా తెలియకుండా గడిపారు ఇద్దరూ.
ఆహ్లాదకరమైనా వాతావరణం కాకపోయినప్పటికీ ఆ హోటల్ కు అసలు కస్టమర్లు ఎవరూ వచ్చిన పాపానపోలేదు.
చల్లని ప్రదేశంలో అలాంటి ఒంటరి వాతావరణం ఎన్నివేలు ఖర్చుచేస్తే మాత్రం అంత బిజీసిటీలో దొరకదు అనిపించింది ఆ లవర్స్ ఇద్దరికీ!
ధీరజలోని డాషింగ్ నేచర్ అంటే వీరేష్ కు చాలా ఇష్టం. కళ్ళ ఎదురుగా అన్యాయం జరుగుతుంది అంటే సహించలేదు. ఘోరాన్ని చూస్తూ ముడుచుకుని కూర్చొనలేదు. జర్నలిస్టుగా తన కలానికి ఉన్న శక్తి ఎలాంటిదో, తను ఏం చేయగలదో చేసి చూపించేవరకూ నిద్రపోదు!
వీరేష్ కు ఉన్న డ్యూటీ పట్ల సిన్సియారిటీ. హానెస్ట్ ధీరజ కు నచ్చిన అంశాలు....
వీలయినప్పుడల్లా కలుసుకని కబర్లు చెప్పుకునేవాళ్ళు.... అలా పెరిగిన వారి అనుబంధం ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేమేమో అన్న స్థితికి వచ్చి మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు.
తీయని స్మృతులను నెమరు వేసుకుంటూ ఇద్దరూ బయటకు వచ్చారు.
ధీరజ కైనెటిక్ హోండా ఎక్కి వెళ్ళిపోయాక తన కారులోకి చేరుకున్నాడు ఏసిపి వీరేష్.
వాళ్ళిద్దరూ వెళ్ళిన ఒక నిమిషానికి ఆ హోటల్ లో నుంచి బయటకు వచ్చిన గుబురు మీసాల వ్యక్తి దాపులనే వున్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ లోకి వెళ్ళి అ ఇద్దరి సంభాషణను పూసగుచ్చినట్టు అవతల వ్యక్తికి వివరించాడు.
* * * *
ధీరజ ముషీరాబాద్ జైలు ముందు మోపెడ్ ను ఆపింది.
జైలర్ కు తనను తను పరిచయం చేసుకుని వచ్చిన పనిని వివరించింది.
మెజిస్ట్రేట్ అనుమతి పొంది ఉండడం వలన జైలర్ అభ్యంతరం పెట్టకుండానే రవితేజ దగ్గరకు స్వయంగా తీసుకెళ్ళాడు.
సెల్ లో ఒక మూల రవితేజ మోకాళ్ళ మీద తల పెట్టుకుని కూర్చుని వున్నాడు.
జైలర్ హండ్ స్టిక్ తో కటకటాల మీద శబ్దం చేశాడు.
రవితేజ తల పైకెత్తాడు.
ఆమెతో మాట్లాడడం తనకు ఇష్టంలేదు అన్నట్టు రవితేజ నిరాకరించాడు.
"మిష్టర్... రజని కోసం అయినా నాతో మాట్లాడవచ్చుగా..."
ఆ మాటలు అమృతంలా పనిచేశాయి అతని మీద.
"రజని... రజని మీకు తెలిసా?"
"తెలుసు... నా స్నేహితురాలు..."
"చూశారా... ఒక్కసారి కూడా ఆమె రాలేదు.... నిజంగానే నేను హత్య చేశానని నన్ను అసహ్యించుకుంటుందనుకుంటాను...."
అతని కనులలో నీటి తడి ప్రత్యక్ష్యం అయింది.
"అలాంటిది ఏమీలేదు....రజని మిమ్మల్ని ఇంకా మనస్పూర్తిగా ప్రేమిస్తూనే వుంది. ఇక్కడ మీరు ఎంతగా కుమిలిపోతున్నారో అక్కడ తను అంతకు రెట్టింపుగా బాధ పడుతుంది"
"మీ స్నేహితురాలి తరపున వకాల్తా పుచ్చుకున్నారా ఏమిటి?"
"అదేమిటి...?"
ధీరజ బిత్తరపోయింది.
'మరి, తను ఎందుకు రాలేదు?"
"వాళ్ళ నాన్న బయటకు రానీయకుండా కట్టడి చేశాడు. ఎలాగయినా అభినయ్ ను తన యింటి అల్లునిగా చేసుకోవాలని అతని తాపత్రయం"
"అది అసంభవం.... నా కంఠంలో ప్రాణం వుండగా అది జరగని పని..."
"భలేవారే.... ముందు మీరు ఎక్కడ ఉన్నారో అది మరచిపోయి ఆవేశపడుతున్నారు. ముందు నిర్దోషిగా బయటకు వచ్చే మార్గం చూడండి. తరువాత అది సంభవమో అసంభవమో ఆలోచిద్దురు కానీ."
ధీరజ మాటలకూ అతనిలో బేలతనం తొంగి చూసింది.
"అసలు జరిగిందేమిటో నాకు చెప్పండి.... మీరు నిర్దోషి అని నాకు తెలుసు. ఒక నిర్దోషికి శిక్ష పడడం ఎంత తప్పో.... ఒక దోషి నిర్దోషిగా చలామణీ కావడం కూడా అంటే అపరాధం అవుతుంది. అదే జరిగితే న్యాయ వ్యవస్థ కుప్పకూలినట్టు అవుతుంది. న్యాయాన్ని కాపాడడానికి నల్లకోటు ధరించిన లాయర్లు తలదించుకొనవలసి వస్తుంది. మన రాజ్యంగం తగలబడినట్టు అవుతుంది" అన్నది ధీరజ.
తను ఆవేశంతో అభినయ్ చంపడానికి వెళ్ళింది మొదలు తను అరెస్ట్ కావడం వరకూ వివరంగా చెప్పాడు రవితేజ.
మరొక విశేషం ఏమిటంటే తనను అనుమానిస్తున్నారు అని తెలిసి, తను నిరపరాధిని అనే నమ్మకంతో తనంతట తను పోలీసుల వద్దకు వెళ్ళి లొంగిపోతే... తాము అనుమానించి అరెస్ట్ చేసినట్టు చెప్పింది పోలీస్ డిపార్ట్ మెంట్!
స్వచ్ఛందంగా లొంగిపోయిన వ్యక్తిని ముద్దాయిగా ట్రీట్ చేయడం జరుగుతుంది!
దానికి సూత్రదారి....
సబ్ ఇన్ స్పెక్టర్ శక్తి...
అతను జయచంద్రకు అమ్ముడుపోయిన పబ్లిక్ సర్వెంట్.
రవితేజతో మాట్లాడినందువల్ల ధీరజకు మరికొన్ని విషయాలు తెలిశాయి.
అంతవరకూ అదే సెల్ లో ఒక వైపు నిలబడి వున్న వ్యక్తి ధీరజను సమీపించాడు.
"క్రూరమృగాలవంటి జనారణ్యంలో న్యాయ దేవతలా ఉన్నావు. ఈ పోరాటంలో విజయం అందినట్టే అంది చేజారిపోకుండా చూసుకో. రాజీకీయ నాయుకులు గోముఖ వ్యాఘ్రాల వంటివాళ్ళు. వాళ్ళు మాట్లాడేది... చేసేది ఎప్పుడూ ఒకటిగా వుండదు. వాళ్ళ విషయంలో ఏమరిపాటుగా వున్నావంటే నువ్వూ చిక్కులపాలు అవుతావు. నీ పట్టుదలకు నీ సాహాసానికి లాల్ సలాం" అన్నాడతను.
అంతవరకూ రవితేజతో ఆమె మాట్లాడినదంతా విని ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నాడు అతను.
"ఎవరు మీరు?"
"రణధీర్...విప్లవకారుల నాయుకుడు. జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు"
