Previous Page Next Page 
రామాయణము పేజి 21

                         సీతాపహరణము

  
    రాముడు: లక్ష్మణా మీ వదినెకు కాలక్షేపము అవసరము. ఆమె ఈ చిన్న కోరికను తీర్చెదను. ఏణి (లేడి)ని తెచ్చి జానకికి కానుకగా ఇచ్చెదను. ఇది హరిణము కాక హాని తలపెట్టి వచ్చిన అసురుడు ఐనచో, వానిని హతమార్చెదను.....నేను తిరిగి వచ్చువరకును మీ వదినెను కాపాడుచుండుము.   
    రావణుడు "సీతను తెచ్చుకొనుటకు నాకు సాయపడగల సమర్ధుడెవడు?" అని యోచించినాడు. పూర్వము తన మంత్రులలో ఒకడుగా ఉన్న మారీచుడు జ్ఞప్తికి వచ్చి వానివద్దకు పోయినాడు. శూర్పనఖ తెలిపిన సీత సంగతిని మారీచునకు వచించి "మిత్రమా నీవిప్పుడు నాతో పంచవటిలోని పర్ణశాలకు రావలెను. మాయోపాయమున ఆ రామలక్ష్మణులను నీవు వారి కుటీరమునకు దూరము చేయవలెను. ఆశ్రమమున ఒంటరిగా మిగిలియున్న సీతను నేను లంకాపురికి కొనిపోయెదను. నన్ను క్రుతార్ధుని జేయుము. నా సామ్రాజ్యములో కొంతమేర నీకు బహుమానముగా ఇచ్చెదను" అన్నాడు.   
    మారీచుడు "రాక్షసేంద్రా రాముడు సామాన్య మానవుడు కాడు. తన కౌమారముననే 'నా తల్లియూ అపూర్వ బలశాలినియునైన తాటకను వధించినాడు. విశ్వామిత్ర బ్రహ్మర్షి యాగమును ధ్వంసము జేయబోయిన నా అనుజుడు సుబాహువును సంహరించినాడు; నన్ను తన బలమైన బాణముతో పయోధిని పడునట్లు కొట్టినాడు.... అది అటుంచుము. నీకు మండోదరి వంటి మహా పతివ్రతలును సౌందర్యవతులును అగు రావణులున్నారు. విశాల సామ్రాజ్యమునకు అధిపతివి. నీ ప్రశాంత జీవితమున అశాంతిని ఏల ప్రవేశపెట్టుకొందువు? సీతను మరచిపొమ్ము" అన్నాడు.   
    రావణునకు కోపము వచ్చినది. "నేనింత దూరము నీ బోధలు వినుటకు రాలేదు. నేను చెప్పినట్లు చేయనిచో నిన్ను అంతమొందించెదను!" అని లేచినాడు. మారీచుడు తనలో "పైత్యరోగికి పంచదార హితవుగా నుండదు!....వీనిచేత చచ్చుటకన్నా రాముని వలన మరణము మేలు" అన్న నిశ్చయమునకు వచ్చినాడు. "అసురేంద్రా పంచవటికి పోవుదము, రండు" అని రావణుడు అనుసరించి వెళ్ళినాడు.   
    రావణుడు రెక్కలు గల గుఱ్ఱములచే లాగబడుచూ ఆకాశ మార్గమును విమానము వలె పోవు తన రథమును మారీచునితో ప్రవేశించినాడు. స్యందనము ఉత్తరదిశగా పోయి పంచవటి వద్ద ధరణికి దిగినది. వారిరువురునూ పాదచారులై పర్ణశాలణు సమీపించినారు. రావణుడొక వృక్షము మాటున అదృశ్యుడై పొంచి యుండగా కామరూపియగు మారీచుడు ఒక లేడిపిల్లగా మారినాడు.   
    ఆ కురంగ శాబకము మేను స్వర్ణమయము; ఆ మేనిపై గల మచ్చలు నక్షత్రములు వలె మెరయుచున్నవి; కొమ్ముల కొనలు ఇంద్ర నీలమణుల వలెనూ కాలి గిట్టలు వైఢూర్యముల వలెనూ, పైకి ఎత్తియున్న తోక ఇంద్రధనువు వలెనూ ప్రకాశించుచున్నవి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS