Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 20


    ఈ పీనుగు వాళ్ళు అడిగింది ఏదో ఇచ్చి పంపేయక బేరాలు చేస్తోంది ఎందుకో! కాపీనం ఈ స్థితిలో కూడానా! పరువుపోయాక కట్టుకు పోతుందా? అని శతవిధాలా ఆమెను తిట్టిపోసుకుంటున్నాడు!

    ఏదైనా హెచ్చరిక చేద్దామంటే కంఠస్వరం గుర్తు పట్టేస్తారని భయం.

    అందువల్ల టెన్షన్ భరించలేక లోలోపల మెలికలు తిరిగిపోతున్నాడు.

    ఒక యువకుడు మంచం క్రింద పడి వున్న చీర మడతల్ని చీపురు పుల్లలతో ఎత్తి ఆమెకు అందించాడు! తన భారీ శరీరం చుట్టూ చుట్టబెట్టు కుందామె.

    "బాబూ! మీ అందరికి తినేందుకు కొబ్బరికాయలు, పటికబెల్లం, తల వొక పది రూపాయలు బహుమానం ఇస్తాను. వెళ్ళి జల్సా చేసుకోండి! కాని ఇక్కడ చూచింది అంతా ఇక్కడే మర్చిపోండి!

    అందరికి తెలిస్తే తన్ని తగలేస్తారు. సుమిత్రగారికి తెలిస్తే నాకు గతులుండవు" అని బ్రతిమాలుకుంది గజలక్ష్మి!

    ఆమె మెడ కండలు పేరుకుపోయి ఏనుగు కుంభస్థలంలా ఉంది. చేతి రెక్కలు ఏనుగు తొండాల్లా లావుగా ఉన్నాయి!

    చెంపలమీదినించి కండరాలు మెడక్రిందిజారి గడ్డంక్రింద ముడతలు పడి ఉన్నాయి. యువకులకి అలా చూడటం గొప్ప వినోదం అయింది.

    కేవలం కొబ్బరి పటికబెల్లం పదిరూపాయిలకి ఆశించి అంత అద్భుతమయిన దర్శనోత్సవాన్ని వదులుకోవటం వారికి ఇష్టం లేదు.

    "పది రూపాయలు మాకు చాలవు" అన్నాడు ఓ యువకుడు!

    "ఆ దుప్పటిలో మెలికలు తిరుగుతున్న శాల్తీ ఎవరో మాకు చూపిస్తే ఏమీ యివ్వకపోయినా వెళ్ళిపోతాం" అన్నాడు మరో యువకుడు.

    "ఆ ఒక్కటి మాత్రం అడక్కండి బాబూ! అని చేతులు జోడించింది. యువకులు కావలసినంత వినోదాన్ని తిలకించారు.

    ఆమెమీద వారికి కక్ష్య ద్వేషంలాంటివి ఏమీలేవు.

    తమాషా చేయటం అయిపొయింది. ఆ వినోదానికి తృప్తిపడి తినేందుకు ఏదైనా తీసుకుని డబ్బు కూడా అడగకుండా వెళ్ళిపోదాం అని ఆలోచిస్తున్నారు కొందరు యువకులు!

    వినోదం కోసమే బుద్ధి చెప్పినట్లు చేయాలి!

    కాని ఆమె వ్యక్తిగత రహస్యాలు బజార్న పడేసి మరీ సీరియస్ గా ఎందుకు బాధపెట్టాలి? అని సహృదయంతోనే ఆలోచించారు. ఎప్పుడయితే దుప్పటి తొలగించాలనే మాట విన్నాడో లోపలివ్యక్తి మండిపడ్డాడు. అధికంగా నోరు చేసుకున్నాడు!

    "డబ్బు తిండికోసం వచ్చిన కుంకలు మీరు! ఇచ్చింది ఏదో తీసుకుని వెళ్ళిపొండి! అంతేకాని అడుక్కుతినటంలో కూడ అరవై షరతులా?" అన్నాడు! ఎప్పుడయితే తమను బెగ్గర్స్ క్రింద జమకట్టి అతడు మాట్లాడాడో తిరిగి వెళ్ళిపోదామనుకుంటున్న వారుకూడ తమ ప్రయత్నాలు మానుకున్నారు.

    "అయితే మేం అడుక్కుతినేందుకు వచ్చామంటావా?" ఒక యువకుడు బాగా గద్దించి అడిగాడు కోపం ధ్వనించే స్వరంతో!

    "కాకపోతే ఏమిటోయ్!? ఇచ్చింది తీసుకుపోవాలికాని బేరం పెడతారా మీరు? మీకు బాకీ ఉన్నామా?" అని దుప్పటిలోంచి ముఖం బయట పెట్టకుండానే దబాయించాడు ఆ వ్యక్తి.

    "గీర చాలా వున్నట్లుందే!?" అన్నాడు ఓ యువకుడు.

    "తిరిగి వెళ్ళిపోదా మనుకున్నాం కదా! అందువల్ల తేలిగ్గా కన్పించాం"

    "ఇలా వదిలేయకూడదు. గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే."

    "ఎత్తండి మంచాన్ని ఊరేగించి నడివీధిలో పదిమంది ముందు పెడదాం" అని మరో యువకుడు ప్రతిపాదించాడు.

    చీకటి తప్పులు ఎవరికీ దొరక్కుండా చేసే మొండి ఘటాల్ని దొంగల దోపిడి పండగ నెపంతో వీధికి లాగటం పదుగురు ఎదుట తప్పు ఒప్పించటం అలవాటే. అలా సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఒక యువకుడు ఆ మాట అనగానే పదిరెండ్లు ఇరవై చేతులు ఒక్కసారిగా వట్టి మంచాన్ని పైకి లేపాయి.

    భయంతో మంచందిగి పారిపోవాలని వారు అనుకున్నారు.

    కాని అప్పటికే అది భూమిమీద ఆరు అడుగుల ఎత్తులో ఉంది. అక్కడినించి క్రిందపడితే నడ్డి విరుగుతుందనే భయంతో బిగుసుకు పోయారు. బొమ్మలా అయిపోయిన వారిని తెచ్చి పందిరి క్రింద ప్రదర్శనకు పెట్టారు యువకులు.

    ముందు ఈ కోలాహలానికి చుట్టుపక్కల వారు మేల్కొన్నారు.

    ఆ తరువాత ఈ తమాషా గురించి ఇళ్ళకు వెళ్ళి నిద్రలేపి మరీ చెప్పుకున్నారు. గ్రామంలో ఒక్కయిల్లు అయినా విడిచిపెట్టకుండా ఈ వినోదం తిలకించేందుకు యావన్మంది నిద్రలు చాలించి వచ్చారు.

    అంతసేపూ యువకులు ఆ మంచాన్ని చేతులమీద మోశారు.

    గజలక్ష్మి ఏనుగుపిల్లంత బరువు వున్నా వారు క్రిందికి మాత్రం దింపలేదు. మంచంక్రిందికి వస్తే దూకి పారిపోటానికి సిద్ధంగానే ఉన్నారు.

    కాని ఆరడుగుల ఎత్తునించి దూకితే నడ్డి విరగటం ఖాయం.

    భయపడి బిగుసుకుపోయారు ఇద్దరూ.

    వీధుల్లో నిలబడి వినోదం చూసేవారికి ముఖాలు కన్పించకుండా దుప్పటి పైకి లాగేసుకున్నారు. ఊరేగింపు పూర్తి అయిం తరువాత పదిమందిచేరి ఉన్న ఆలయంముందు వీధిలో వారిని మంచంతో సహా క్రిందికి దింపారు యువకులు. చూడవచ్చిన వారిలో ఉత్సాహవంతులు పెద్దగా నవ్వడం వీలలు వేసి గోలచెయ్యటం చప్పట్లు చరవటం మొదలెట్టారు.

    చాలా సంవత్సరాల తరువాత వీరి దొంగల దోపిడి పండుగ బ్రహ్మాండంగా రక్తి కట్టించారు యువకులు అని అభినందిస్తున్నారు.

    క్రిందికి దిగిన తరువాత పారిపోవాలనే ఉబలాటంతో దుప్పటి లోపలి వ్యక్తి కాస్తంత ముఖం బయటకు పెట్టి చూచాడు.

    చుట్టూ వందమంది దడికట్టేశారు.

    పారిపోవడం సాధ్యపడదు.

    అతడలా ముఖం బయటకు పెట్టి చూడగానే అందరూ గుర్తించారు.

    అతడు కరణం లింగమూర్తి? ఇక కోలాహం మిన్ను ముట్టింది.

    అతని భార్య కూడా వుందా జనంలో.

    ఆమె ఒకచేత్తో చీపురూ, మరో చేత్తో అప్పడాల కర్రా పట్టుకుని భద్రకాళిలాగ జనం మధ్యకు వచ్చింది.

    "చచ్చినాడా! ఇంతవయసు వచ్చాక ఇప్పుడు శృంగారం కావలసి వచ్చిందా నీకు? దానికి సిగ్గులేదనుకో? నీకు బుద్ధి ఉండాలా అక్కరలేదా? పెళ్ళీడు కొచ్చిన పిల్లలున్నారు.

    చెట్టంత పెళ్ళాన్ని నేనున్నాను. మేమంతా చచ్చిపోయాం అనుకుంటున్నావా?

    ఊరి అందరిముందు ఇంత అవమానం జరిగాక ఇంక నేను ఎలా బ్రతికి ఉంటాను. పురుగుల మందిస్తావో, ఉరిపోసుకు చావమంటావో, బావిలో దూకి చావమంటావో నువ్వే చెప్పు.

    చెప్పి చావు అంటూ చీపురుకట్టతో భర్తని ప్రహరించటం మొదలు పెట్టిందామె, శివమెత్తినదాన్లా అయిపోయింది.

    ఇంక ఎలాగూ జరగవలసిన పూర్తి అవమానం జరిగిపోయింది కాబట్టి కరణం లింగమూర్తి ధోవతి కాళ్ళకి అడ్డం పడకుండా పైకి ఎగపట్టుకుని పరుగు తీయటం ప్రారంభించాడు.

    జనం జాలిపడి తొలగి దారి యిచ్చారు.

    అతడు పారిపోగానే గజలక్ష్మి కేశపాశాలను చేతికి మెలికలు వేసి పారిపోకుండా పట్టుకుంది కరణంగారి భార్య.

    "ఏమే! నా మొగుడే కావాల్సి వచ్చాడటే నీకు? అంత ఉండలేనిది ఏ కుంటి వాడినో గుడ్డివాడినో కట్టబెట్టుకు చావరాదూ! కడుపు చేత్తో పట్టుకు వచ్చావని కళ్ళలో పెట్టుకు చూస్తే మా కాపరాలకే ఎసరు పెడతావా! ఇహ నించి ఆ మొదనష్టపు మగాడికి కాపరం చేయాల్సింది నువ్వా? నేనా? ఈ క్షణంలోనే తేలిపోవాలి.

    వీళ్ళందరి ముందు నీ రంకు బయట పడిందని ముంగి ముఖం పెట్టావా? ముచ్చుదానా! మన ఇద్దరిలో ఒకరే బ్రతికి ఉండాలి" అంటూ అప్పడాల కర్రతో బాదటం మొదలెట్టింది.

    ఆమెను ఎదిరించేందుకు శారీరక బలం అయితే ఉంది. కాని గజలక్ష్మి మానసికంగా కృంగిపోయి ఉంది. పదుగురు సమక్షంలో నేరం నిరూపణ అయిపోవడంతో నైతికంగా దివాళా తీసింది.

    ఆమెను ఎదిరించలేక దెబ్బలకు తాళలేక వెర్రికేకలు పెట్టడం మొదలుపెట్టింది. చివరకు ఆమె డబ్బు అహంకారం చిద్రమయింది. ఊరి జనం అందరికి చేతులెత్తి మ్రొక్కింది.

    "బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను బాబూ. ఈమె నన్ను చంపేస్తుంది. నా ప్రాణాలు కాపాడండి బాబూ!" అని ప్రార్ధించింది దీనంగా!

    అందరికి జాలి కలిగింది. వింత చూడవచ్చిన వారిలో ఒక వృద్ధురాలు వెంటనే కల్పించుకుంది.

    "అవునమ్మా! నీ భర్తని అదుపులో పెట్టుకోవాలి కాని ఆమె మీదికి ఎందుకు వస్తావు? మొగుడు మొద్దులు లేని మొండి ఘటం కాబట్టి కాస్తంత కక్కుర్తి పడిందేమో!? నీ భర్త మంచివాడా?

    వెళ్ళి అతన్ని దండించుకోవాలి కాని అలా చంపేస్తావా?

    చిన్న తప్పు కావచ్చు పెద్ద తప్పు కావచ్చు. ప్రాణాలుపోతే వెళ్ళి జైల్లో కూర్చుంటావా?" అని మందలించింది వృద్ధురాలు.

    ఇక ఆమెను కొడితే జనం ఊరుకోరు అని గ్రహించింది కరణం భార్య.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS