Previous Page Next Page 
పరిహారం పేజి 20


    పారిజాత కళ్ళనీళ్ళ పర్యంతమై "మా పరిస్థితులు చూస్తున్నావుగా, అత్తా? ఈ పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళగలం? నాన్నకి ట్యూషనులు నడిచినన్ని రోజులు నీ చేత అద్దె ఎప్పుడైనా అడిగించుకొన్నామా? ఇంట్లో తిండికి జరుగడమే కష్టంగా ఉంది!" అంది.
     "అయితే నన్నేం చేయమంటావు? అద్దె మునగమంటావా నన్ను?"
    "కొద్ది రోజులు ఆగత్తా!"
    "ఆగడానికి వీల్లేదు, తక్షణం మీరు ఇల్లు ఖాళీ చేయాల్సిందే, పది పన్నెండేళ్ళనుండి ఉంటున్నారు కాబట్టి ఈ మూడునెల్ల అద్దె వదిలి పెడుతున్నాను, మీరా ఇల్లు ఖాళీ చేస్తే నా కంతే చాలు."
    అక్కడే మరో కుర్చీలో కూర్చుని పేపరు ముఖానికి అడ్డం పెట్టుకొని శ్రోతగా కూర్చున్న మనోహర్ తల్లి వ్యవహారంలో ఇక కల్పించుకో కుండా ఉండలేకపోయాడు. "ఇప్పుడు హఠాత్తుగా ఎక్కడకి వెళ్ళిపోతుందమ్మా పారు? తండ్రి మంచాన పడ్డాడు. ఎక్కడా దిక్కులేదు. పది పన్నెండేళ్ళ నుండి అద్దె కడుతూ వున్నారు సరిగా అటూ ఇటూ నాలుగు అడుగులైనా లేని ఇరుకుగదిలాటి ఆ ఇంటికి?"
    కొడుకు జోక్యానికి మండిపడింది కోమలమ్మ "సంవత్సరాల తరబడీ ఉన్నారని ఇల్లు వాళ్ళ స్వంతమైపోయిందా ఏమిటి?"
    "స్వంతమైపోలేదు. కాని వాళ్ళ పరిస్థితులు కాస్త గమనించమంటున్నాను"
    "గమనిస్తూనే ఉన్నానురా!" కొడుకు వంక కొరకొరా చూచింది. "గమనించాను కాబట్టే తక్షణం సాగనంపాలనుకుంటున్నాను"
    "తక్షణం సాగనంపేందుకు నేనేం తప్పు చేశానత్తా? ఎందుకు నన్ను చూస్తూనే మండిపడుతున్నావీ మధ్య?"
    ఈ మధ్య పారిజాత గురించీ, తన కొడుకు గురించీ చాలానేవింది కోమలమ్మ. ఆ కాంపౌండ్ లో అద్దెకుంటున్న కామాక్షమ్మ అనే ఆవిడ ఆ యిద్దరి గురించి చాలా సంగతులు చేరవేసింది కోలమ్మకి. ఆ యిద్దరు కలిసి సినిమా లకి వెడతారని, మనోహర్ పారిజాతతో యెప్పుడూ సరసాలాడుతూ ఉంటాడని, మనోహర్ తన స్కూటర్ మీద ఆ పిల్లను ఎక్కించుకు రాగా ఎన్నోసార్లు చూశాకన...... ఎన్నో ఎన్నో. అవి కేవలం పుకార్లని ఊహించలేక పోయింది కోమలమ్మ. పారిజాతమీద గొంతుదాకా నింపి పెట్టుకుంది! కొడుకు అక్కడ లేకపోతే అంతా కక్కి వేసేదే.
    "ఎందుకో, ఏమిటో ఆ మాటలన్నీ అనవసరం పారిజాతమ్మా! మీరిన్నాళ్లు ఈ కాంపౌండులో అద్దెకున్న వాళ్ళే గాని నా చుట్టాలు కాదు. అద్దె కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయక ఏం చేస్తారు!"
    "ఎప్పటికీ ఇలాగే ఉండిపోను అత్తా! కొద్ది రోజులు ఆగమని వేడు కొంటున్నాను."
    "అత్త! అత్త ఎవరే నీకు? నువ్వు నా తమ్ముడి కూతురువా? అన్న కూతురువా?"
    "ఈ రోజు కొత్తగా వరుసకలిపానా?" పారిజాత తెల్లబోయింది ఆవిడ ఆగ్రహం చూసి.
    "క్రొత్తగా వరుసపెట్టి పిలువలేదు. కాని, క్రొత్తగా నువ్వు చాలా నేరుస్తున్నట్టు వింటున్నాను"
    "ఏమిటత్తా అవి?"
    "నాతో వాగించకు! మర్యాదగా బయటికి వెళ్ళిపో, రేపు ఇల్లు ఖాళీచెయ్యకపోతే ఊరుకొనేది లేదు"
    "ఈ పరిస్థితిలో మేము ఇల్లు ఖాళీ చెయ్యలేము" పారిజాత ఖచ్చితంగా అంది.
    "అయితే మూడు నెలల బకాయి, మూడు నెలల అడ్వాన్స్ తెచ్చికట్టు!"
    "ఎక్కడినుండి తెచ్చి కట్టను?"
    "ఎక్కడినుండి తెచ్చి కడతావో ఏమిటో నాకేం తెలుసు?"
    "నువ్వే చెప్పత్తా!"
    "అట్లా రోడ్డు మీదకి వెళ్ళి రాత్రిపూట నిలబడు డబ్బు కుప్పలు రాలుతుంది. నాకు అద్దె డబ్బు ఏం కర్మ? మీ నాన్నకు మంచి మందులు కూడా ఇప్పించుకోవచ్చు."
    "అత్తా? ఇది అనుభవంతో చెబుతున్న మాట అనుకోవచ్చా? మనూ పుట్టినప్పుడు నీకేం లేదని. చిన్న పూరి కొంపలో ఉండేదానివనీ అంటారు, ఈ రెండంతస్తుల మేడ లేపడానికి ఆ అనుభవమే కారణమా? చెప్పత్తా, నేను ట్రైనింగ్ అవుతాను"
    "ఏం కూశావే?" కోమలమ్మ పళ్ళు కొరుకుతూ లేచి పారిజాత చెంపలు వాయించింది.
    పారిజాత నిశ్చలంగా "నువ్వు కూసిన కూతే నీ కప్పజెప్పాను, నేను క్రొత్తగా కూసింది ఏం లేదు" అని చివ్వున వెను దిరిగి వచ్చింది.
    అవమానంతో? దుఃఖంతో ఆ పిల్లగుండెలు మండసాగాయి. కోమలమ్మ అహంభావానికి తనెలా బుద్ది చెప్పగలదు? ముందు ఈ డబ్బు యెక్కడినుండి తెచ్చికట్టాలి! ఏదోఒక పని చూచుకోకపోతే తనూ, తన తండ్రీ బ్రతికేదెలా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS