Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 20


    "నువ్వు చెప్పినవై ఐహిక బంధనాలుగా పేర్కొంటూ మాయగా నిరూపిస్తూ వాటిని తమ జీవితం నుండి బహిష్కరించిన విరాగులు కూడా కనిపించకపోదు. దేవదాసీ!"

    "కావచ్చు నీకు తోచిన విధంగా చెయ్యి బావా!" దేవదాసి పరధ్యాస ప్రపంచంలో పడిపోయింది.

    చాలాసేపు మౌనంగా ఉండిపోయి నెమ్మదిగా అడిగింది. "నిజం చెప్పు బావా! ప్రపంచమంటే బొత్తిగా మనసు లేదా? అన్నివిషయాలలోనూ నిర్వికారంగా ఉండిపోతుందా మనసు? ఆనందాలు, అనుభూతులు ఏవీ అనుభవం కావా?

    "అలా అయితే నేను సిద్ధపురుషుడినన్నమాటే. పుట్టుకతోనే పూర్ణ సత్వంతో ప్రకాశించేది కారణ జన్ములేనేమో? మనసులో రోత పుట్టినంత మాత్రాన చిత్తవృత్తులంత తొందరగా నశింపుకావు. అనుక్షణం మనసుకూ, చిత్త వృత్తులకూ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఇంతకాలమూ నెగ్గుకు వచ్చినా ఇక సాధ్యం కాదేమోననిపిస్తూంది. వాటికి నేను లొంగిపోయి నేను వాటికి ఊడిగం చేస్తూ శాంతిగా ఉండలేను.

    ఆ జీవితమూ నాకు దుర్భరమే దేవదాసీ!

    "అనిశ్చితమైన మనసు కలవాడిని వ్యర్థుడిగా పేర్కొన్నాడు గీతలో కృష్ణపరమాత్మ" చిన్నగా నవ్వింది. "రామకృష్ణ పరమహంస ముఖ్యశిష్యులలో ఒకరై బ్రహ్మానందస్వామికి కూడా ఇటువంటి పరిస్థితే ఎదురైంది. విషయవాంఛలయందు ఆసక్తి అతడి అంతరాంతరాలలో ఉన్నదని కనిపెట్టిన రామకృష్ణులు, అతడు బ్రహ్మచర్య దీక్ష పుచ్చుకొంటానన్నా వినకుండా, భార్య దగ్గరికి పంపాడు అతడి చాంచల్యం అణగడానికి అదే సరైన మార్గమని! అటువంటి చిట్కా నీకూ పనికివస్తుందేమో చూడు, బావా!"

    లేచింది దేవదాసి.

    "నువ్వు వెళ్ళిపోవడం స్థిరమేనా?" లేచి, దేవదాసిని అనుసరిస్తూన్న భార్గవరామ్ దీనంగా ప్రశ్నించాడు.

    'స్థిరమే' అందామె స్థిరంగా.

    "నువ్వు ఇంత తొందరగా వెళ్ళిపోకు, దేవీ! కనీసం అమ్మవచ్చే వరకైనా ఉండు. దయుంచి నాకేదైనా మార్గం చూపు! నేనెంతటి వాడినైనా నాకు కావలసిందేమిటో నేను నిర్ణయించుకోలేకుండా ఉన్నాను. అంతా అయోమయం!"

    అతడి స్వరం వణుకుతుండడం గుర్తించి చటుక్కున తలెత్తి అతడివంక చూచింది దేవదాసి. సజలాలైన అతడి నేత్రాలు నీటిమీదికి ఎగిరిపడే చేపపిల్లల్లా మెరుస్తున్నాయి. తీవ్రంగా చలించిపోతూ అనుకొన్నది -  "ఉన్నమార్గం చెరపకుంటే మేలే! నేనా నీకు మార్గం చూపించేది? నీ ఈ సంఘర్ణణకు కారణం నేను కానూ, ఆదిశక్తిని!" అని.

    తను అతడి నుండి పారిపోవడమే అతడి సంఘర్షణకు పరిష్కారం కాగలదన్న ఊహతో అన్నది.  'ఉహూఁ నేను వెళ్లాలి, బావా! ఇది నా ఇల్లా? ఎన్నాళ్ళని ఒకరింట్లో ఉంటాను చెప్పు!'

    "ఉహుఁ.వద్దు. దేవదాసీ ఇప్పుడే వెళ్ళకు నువ్వు కొన్నాళ్ళు ఇక్కడే వుండు." ఆవేశంగా ఆమెచేతులు పట్టుకొన్నాడు భార్గవరామ్. "అంతగా అయితే మామయ్యకు నేను చెప్పి పంపుతానులే, దేవత కొన్నాళ్ళు ఇక్కడే ఉంటుందని ఏం?"

    మౌనం వహించింది దేవదాసి. 'పాపం అమాయకుడు! మాయా మర్మం తెలియని మల్లెవంటి మనసు. ఇతడిని నేను ప్రేమించకుండా ఎలా వుండేది? స్వార్ధచింతనతో అతడిని సంసార సాగరంలోకి త్రోయడానికి మనసురాదే? భగవాన్ మంచిగా బ్రతకడానికి నాకు శక్తినివ్వు!' లోలోన దైవాన్ని మొరపెట్టుకొంది.
   


                                  6


    అరుదైన అపూర్వ దృశ్యం!

    పడమటి కొండల్లోకి పరుగు పరుగున వెడుతూనే పసిడి కిరణాలను జగతిపై వెదజల్లుతున్నాడు భాస్కరుడు. అతడి పసిడి కిరణాలలో జలకాలాడాలన్న చిలిపికోరిక కలిగిందేమీ వరుణుడికి! వర్షధారలు పసిడి కిరణాలలో జలతారు పోగుల్లా క్రిందికి జారుతున్నాయి పలుచ పలుచగా.

    డాబా పిట్టగోడ దగ్గర నిల్చున్న దేవదాసి కొద్దికొద్దిగా ఒళ్ళు తడుస్తూంటే పులకిస్తున్న హృదయంతో చిలిపిగా, మురిపెంగా అన్నది. తన గదికిటికీ చెంత నిలబడి ఈ దృశ్యమే తిలకిస్తున్నట్లున్న భార్గవరామ్ లో, "ఎక్కడో పిచ్చుక జంట పెళ్లి జరుగుతున్నది, బావా!"

    భార్గవరామ్ లోనుండి వచ్చాడు, ఆమె దగ్గరికి.

    బావా మరదళ్ళు వారుణికభిముఖమై కూర్చొన్నారు పిట్టగోడమీద.

    కొద్దిసేపు మాత్రమే కూర్చొన్నాడు భార్గవరామ్. చివాలున లేచి, "అలా వెడదాం, పద, దేవీ!" అన్నాడు, ఆమె చెయ్యి అందుకొని లేస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS