"నువ్వు చచ్చినా, బ్రతికినా వాళ్లకక్కరలేకపోయింది. కానీ నీకు అన్నయ్య సంగతులు ఎప్పటికప్పుడు కావాలి. అన్నయ్యనుచూస్తే జాలేస్తూంది. నేనే ఇన్ని మాటలు పడితే చచ్చినా ఇహ వాళ్ల ముఖం చూడను."
"ఆడపిల్లవయి పుడితే పుట్టిల్లంటే ఏమిటో తెలిసేదిరా!"
"అమ్మంటే సహనానికి మారు పేరని మరోసారి తెలిసిందమ్మా" నవీన్ కళ్లు తల్లని ఆరాధనా పూర్వకంగా చూశాయి. "మీ వదిన అన్నన్ని మాటలంటూంటే నా రక్తం ఎలా మరిగిపోయిందో తెలుసా?" గూబ గుయ్యిమనిపించాలనిపించింది."
* * * *
రెండు రోజులతరువాత -
రుక్మిణమ్మ ఆ సాయంత్రం గబగబా వచ్చింది జయలక్ష్మి దగ్గరికి. "ఒసే జయలక్ష్మీ మొన్న నువ్వేం చెప్పావు శంకరి గురించి? తన నత్తికొడుకుతో వట్టి దరిద్రపు మొహం వేసుకువ్చిచంది. అలాంటి నీతిమాలిన వాళ్లకి ఆ గతిపట్టక ఇంకేం పడుతుంది అన్నావా. దానికాగతి పట్టలేదే దశ పట్టింది. అబ్బ దాని ఐశ్వర్యం చూస్తే కళ్లు తిరిగిపోతాయి. అది కట్టినచీరె పదివేల రూపాయలకు తక్కువ చేయదు. దాని నగలలో వజ్రవైడూర్యాలుతప్ప మామూలు రాళ్లు లేవు. మన వూరి రావుగారులేరూ? ఆయన ఈమధ్య ఏవో చెడ్డ అళవాట్లరకు లోనై దివాళా తీసి బంగళా, పొలాలు బేరం పెట్టాడట. శంకరి మగడు కొనేశాడు. ఆ ఇంట్లోకి అడుగుపెడితే బంగారం వాసన వచ్చినట్టుగా అయిందనుకో! శంకరికి నువ్వు చెప్పిన నత్తికొడుకు లెవరూ లేరు. ముగ్గురూ ముత్యాల్లా వున్నారు. పెద్ద కొడుకు డాక్టర్. మన ఊరికి డాక్టరుగా వచ్చాడు. రెండో కొడుకు ఇంజనీరు చేస్తున్నాడట. మూడోది ఆడపిల్ల. డాక్టరు చేస్తూందట! శంకరిమగడు ఈ ఊళ్లో పొలాలు కొనేసి ద్రాక్షతోటలు పెంచే ఆలోచనలో వున్నాడట. పిలకజుట్టుతో పీరుకట్టెలా ఎలా వుండేవాడో అచ్యుతం యిప్పుడు ఓ జమిందారులా వున్నాడనుకో...."
"మధ్యాహ్నం పడుకొన్నా వేమో, కలగాని పడిందా పిన్నీ?" జయలక్ష్మి నవ్వులాటగా అడిగింది.
"కలకాదు! నేనిప్పుడు శంకరి ఇంటినుండే వస్తున్నాను. ముచ్చటైన దానిపిల్లల్నీ, లక్షణమైనదాని సంసారాన్నీ ఈ కళ్లతో చూసి వస్తున్నాను."
జయలక్ష్మి ఆలోచనలో పడింది. "మొన్న చిరుగుల చీర కట్టుకు వచ్చిందే!"
"మిమ్మల్ని తమాషా చేద్దామని, మీరింకా మారారో లేదో పరీక్షచేద్దామని! మచ్చలేని మనుషులమని మరీ అంత విర్రవీగకూడదు. ఎవరికే గతిపడుతుందో ఎవరికి తెలుసు? శంకరి చేసినపనిని మీరు చూసిచూడనట్టుగా వుంటే ఇప్పుడొక ఆడపిల్ల సమస్య తప్పేదిమీకు! ఐశ్వర్యవంతుల ఇంటికి నీ కూతురు కోడలుగా వెళ్లేది. నీకు వియ్యపురాలి హోదా వచ్చేది. ఇప్పుడేముంది!చేసుకొనన వాళ్లకి చేసుకున్నంత మహదేవా!" ఆవిడ సూదుల్లా మాటలువిడుస్తూ వెళ్లిపోయింది.
తను విన్నది కలానిజమా అని ఒళ్ళు గిల్లుకుచూచింది జయలక్ష్మి.
రుక్మిణమ్మ చెప్పిందంతా తల్లితోపాటు విన్న కాత్యాయని నాలిక్కరుచుకుంది.
"వచ్చింది నత్తిబావకాదు! డాక్టరు బావా? ఎంత పొరపాటు జరిగిపోయింది! అయ్యో!"
* * * *
నెల రోజులు గడిచిపోయాయి.
పాతికేళ్లుగా శంకరి ఏమయిందో తెలియదు జయలక్ష్మి వాళ్లకు. తెలుసుకొనే ఆసక్తి లేకపోయింది. ఈ నెల రోజుల్లో మాత్రం శంకరి వాళ్ల సంగతులు ఎప్పటి కప్పుడు చేరుతున్నాయి జయలక్ష్మి వాళ్లకు. శంకరి ఈ రోజు ఏం చీరకట్టిందీ, అది ఎంత ఖరీదుంటుందీ, వాళ్ళమ్మాయి ఇవాళ ఏం డ్రెస్ వేసిందీ, ఇవాళ భోజనంలోకి ఏం చేశారు - అన్నీ తెలుస్తున్నాయి. శంకరి మగడి సంపాదన రోజూ వేలలలో వుంటుందనికూడా తెలిసింది.
తనభర్త దగ్గరికి చదువుకోసమని వచ్చిన ఆ అమాయకపు చక్రవర్తి ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడాఅని ఆశ్చర్యంగా వుంది జయలక్ష్మికి.
"ఇంకా పట్టింపులూ, పంతాలూ ఏమిటయ్యా? ఇంతకాలం ఆవిడెక్కడో వుండేది. ఇప్పుడు డాక్టరుగారి తల్లిగా ఈ ఊరొచ్చింది. అన్నా, చెల్లెలిబంధం తప్పుతుందా? ఆడపిల్లలున్న వాడివి. మూర్కం వదిలిపెట్టి సంబంధం కలుపుకోడానికి ప్రయత్నించు. అయినా ఆవిడేం అంత కానిపనేం చేసిందని? ఇరవయ్యేళ్లకే భర్తపోతే ఎన్నాళ్ళు నిగ్రహంగా వుంటుంది? నిగ్రహంలేక పాడుపనులు చేసేకంటే చక్కగా పెళ్లిచేసుకొంది. మ్రోడును చివురింపజేసుకొంది. ప్రపంచం ఎంతో మారిపోతూందయ్యా, నువ్వు మాత్రం మారనని బిగుసుకుపోయి కూర్చొంటే ఎలా?"
శంకరి లేచిపోయినరోజున "ఛీ! ఎంత పాడుపని చేసింది? ఆచారికి ఎంత తలవంపులు తెచ్చింది" అన్నవాళ్లె ఈరోజు ఆచారికి హితవు చెబుతున్నారు. రెండు కుటుంబాలు కలిసి పోవాలని చెబుతున్నారు! ఆనాడు శంకరి చేసినపనిని ఈవాళ స్త్గీ సాహసంగా అభివర్ణిస్తున్నారు!
* * * *
